ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు పికాసో బజారులో వెళుతూ ఉన్నాడు.

పికాసోను గుర్తుపట్టిన ఒక యువతి  సంతోషంతో   ఆయన దగ్గరకు వెళ్ళి  పలకరించి ఏదైనా చిన్న పెయింటింగ్ గీసి ఇవ్వమని అభ్యర్థించింది.

బజారులో పెయింటింగ్ ఎలా చిత్రిస్తారు ? మరోసారి కలిసినపుడు తప్పక  చిత్రాన్ని వేసి ఇస్తాను అన్నా కూడా ఆ యువతి మొండిగా మారాం చేసేసరికి ఒక పేపర్ పై  అప్పటికప్పుడు చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. ఇస్తూ నవ్వుతూ అన్నాడు దీని విలువ  మిలియన్ డాలర్లు...జాగ్రత్తగా కాపాడుకో అని...ఆ యువతి  ఆశ్చర్యంగా  పెయింటింగ్  వంక చూస్తూ ఉండిపోయింది.

మరుసటి రోజు ప్రముఖ చిత్రకారుల చిత్రాలు అమ్మే వ్యక్తిని కలిసి ఈ పికాసో చిత్రాన్ని అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని వాకబు చేసింది.

ఆయన కూడా పికాసో చెప్పినట్లే చెప్పేసరికి  నోటమాట రాక మళ్ళీ పికాసో గారిని కలవడానికి   వెళ్ళింది.

పికాసోని కలిసి ఇలా  అంది ...మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి  ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు.

నాకు కూడా చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిషాలలో కాకపోయినా....పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను.

పికాసో నవ్వుతూ అన్నాడు..అమ్మాయీ...!  నీకు పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను..నిజమే..దీని వెనకాల నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది.  నువ్వూ నీ 30 సంవత్సరాలు ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే  నాలా తయారవగలవు. ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.

 ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితంలోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది.

తల్లితండ్రులు నీకు చెప్పే మాటల వెనుక కూడా నీ ఊహకు కూడా అందని  ప్రేమ, త్యాగాలు, అనుభవాలు ఉంటాయి.

అలాగే ఒక బ్రహ్మ జ్ఞాని ఎదురుగా నీవు కొన్ని నిముషాలు కూర్చుంటే నీ జీవితమే మారిపోతుంది.

ఉపాధ్యాయుల పాఠాలు, తల్లితండ్రుల మంచిమాటలు, గురువుల జ్ఞాన బోధలు కూడా పికాసో చిత్రాల్లా నీ ఊహకు కూడా అందనంత విలువైనవి

ఇవి పెద్దలు చెప్పిన మాటలు...