యే నామ కేచిదిహ న: ప్రథయం త్యవఙ్ఞాం
జానంతి తే కిమపి తాన్ర్పతి నైష యత్న:
ఉత్పత్స్యతే మమ తు కో2పి సమాన ధర్మా
కాలో హ్యయం నిరవధి ర్విపులాచ పృధ్వీ

నా రచన చదివి, దాని మీద ఆదరం లేని వారికి ఒక్క మాట చెబుతున్నాను. ఈ రచన మీ కోసం చేసినది కాదు. కాలం అనంతమయినది. నేల తల్లి చాల విశాలమైనది. నా కావ్య గుణ ధర్మాలను వెల కట్ట గల రసికుడు ఎక్కడయినా ,ఎప్పుడయినా పుట్టక పోడు సుమా !

మంచి కవిత్వాన్ని ఆదరించ లేని కొందరు సమ కాలికుల గురించి మన కవులు ఈ విధంగా వాపోవడం జరిగింది.

చేమకూర వేంకట కవి ఏ గతి రచియించి రేని సమ కాలము వారలు మెచ్చరే గదా ? అని రవంత బాధ పడిన సంగతి తెలిసినదే కదా.

అరసికేషు కవిత్వ నివేదనమ్ మాలిఖ మాలిఖ మాలిఖ అని ఓ కవి ఓ బ్రహ్మ దేవుడా, రసికులు కాని వారికి నా కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యం నాకు ముమ్మాటికీ కలిగింకయ్యా. నా నుదుటున అలాంటి రాత రాయకయ్యా అని వాపోయేడు.

గురజాడ కూడా,
కొత్త పాతల మేలు కలయిక
క్రొమ్మెఱుంగులు చిమ్మగా
మెచ్చనంటావీవు నీవిక
మెచ్చకుంటే మించి పాయెను ...

అని ఊరుకోకుండా,
కొయ్య బొమ్మలు మెచ్చు కళ్ళకు
కోమలులు సౌరెక్కునా ?
అని ఓ చురక కూడా వేసాడు.

కవితా మాధురి సంగ్రహించి, ‘‘ యిది శ్లాఘ్యంబిద్ది శ్లాఘ్యంబు గా
దు, విశేషంబిట, నిర్విశేషమిట, మాధుర్యంబిటన్ , వహ్వరే !
కవిరాజా !’’ యని మెచ్చి యిచ్చు నృపుఁడొక్కండైనఁగర్వైనచో
కవియై పుట్టుట కన్నఁబాప పరిపాకంబుండునే భూవరా !

ఈ విధంగా తిరుపతి కవులు అరసికులయిన ప్రభు వులున్న లోకంలో కవిగా పుట్టడం కన్నా దౌర్భాగ్యం మరొకటి లేదని బాధ పడిన సందర్భమూ లేక పో లేదు.

శ్రీనాధుడు కూడ, భీమేశ్వర పురాణంలో ఇలాంటి వారి గురించే కుకవి నింద చేసాడు ...

బోధమల్పంబు గర్వ మభ్యున్నతంబు,
శాంతి నిప్పచ్చరము మచ్చరము ఘనము
కూప మండూకములఁబోలె కొంచెమెఱిఁగి
పండితమ్మన్యులైన వైపండితులకు

తెలిసింది తక్కువా, గర్వమా, ఎక్కువా. . నిదానం లేదు. మాత్సర్యమా, జాస్తి. నూతిలో కప్పల్లాంటి
వారు ఈ పండితమ్మన్యులు.

ఎందుకయ్యా ఏడుస్తున్నావు ? అంటే, ఎదుటి వాడు గొప్పోడైపోతున్నడ్రోయ్ బాబోయ్ ... అని ఏడిచే మగానుబావులు అన్ని కాలాల లోనూ ఉంటారని చెప్పడానికి మచ్చుకి రెండు మూడు ఉదాహరణలివి.


గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...

Blog            : Ram Karri


-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -

మన టెలిగ్రామ్ సమూహాలలో చేరాలి అనుకుంటే క్రింద ఉన్న లింక్ ను నొక్కి నేరుగా సమూహం లో చేరండి...

https://t.me/joinchat/CJ_JKkHtaUSprY6qLuY5vg

https://t.me/RamKarri