వేదాలను అనుసరించి యుగాలు మొత్తం నాలుగు. అవి కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. ఇలా ఒక్కో యుగానికి ఒక్కో భగవంతుడు ఉండగా జ్యోతిష్య గ్రంథం ప్రకారం ఒక్కో యుగానికి ఒక్కో గ్రహం రాజు, మంత్రి  అని చెబుతున్నారు. మరి పురాణాలూ, శాస్రాలు యుగాల గురించి ఎం చెబుతున్నాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.


1. కృతయుగం:



నాలుగు యుగాలలో మొదటిది కృతయుగం. దీనినే సత్యయుగం అని కూడా అంటారు. ఈ యుగం నందు నారాయణుడు లక్ష్మి సహితముగా భూమిని పరిపాలిస్తాడు. దీని కాల పరిమాణము పదిహేడు లక్షల ఇరవై ఏడూ వేల సంవత్సరములు. ఈ యుగం లో ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది. ఈ యుగంలో ప్రజలు ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ యుగంలో అకాలమరణాలుండవు.
ఇక ఈ కృతయుగమునకు రాజుగా సూర్యుడు అంటే రవి మంత్రిగా గురువు అంటే బృహస్పతి నియమితులయ్యారు. బంగారమునకు అధిపతి గురువు కావున ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారుమయముగా ఉండేది. ప్రభువులకు ప్రజలకు ఎటువంటి భావ విభేదము విరోధము లేక చక్కగా కాలకు నడిచినది. సూర్య ప్రభావము చేత సుక్షత్రియులు, గురు ప్రభావము చేత సద్బ్రాహ్మనులు జనించి ధర్మ మయిన పాలన నడిచినది.



ఇక సకాలమునకు వర్షం మంచి పంటలు పాడి పశువులు అభివుద్ది చెంది ప్రజలు సుఖమయిన జీవనము గడుపుతూ ధర్మమయిన పాలన సాగుతుంది.  సూర్య, గురు వులు వారికి మిత్ర గ్రహములయైన కుజ, చంద్ర, కేతువుల సహాయముతో ధర్మమయిన పాలన చేస్తూ ఉన్నారు. శని, శుక్ర, బుధ, రాహు గ్రహములు కదలక మెదలక కొంత వరకు వాగ్వివాదము కల్పించ ప్రయత్నము చేసిరి.

శని, శుక్ర, బుధ, రాహు గ్రహ కారకముల వలన కొంత అన్యాయ ప్రవర్తన కలిగి వివాదమునకు దిగు వానిని చూసి శాపానుగ్రః శక్తి గలిగిన బ్రాహ్మణులు కోపమాపలేక వీడు రాక్షసుడై పుట్టేందుకే  ఇటువంటి  అన్యాయ ప్రవర్తన ఇటువంటి మాటలు మాట్లాడు తున్నాడు అని అనడము వలన ఆ తపోశక్తి శాప రూపమున  త్రేతాయుగములో రాక్షస వంశము అధికమయ్యెను. తపస్సుచే దైవబలమును సంపాదించారు కాని కోపము ఆపలేక పలికిన పలుకులు త్రేతాయుగములో క్రూరులు, రాక్షస స్వభావులు, రాక్షసులు, కలహము పెంచేవారు అధికమయ్యారు. ఈవిధముగా కృతయుగమున  సవ్యముగా నడిచి త్రేతాయుగము ఆరంభమయినది.



2. త్రేతాయుగము :




త్రేతాయుగము లో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించాడు. ఈ యుగంలో భగవంతుడిగా అవతరించిన శ్రీరాముడు రాక్షసుడైన రావణుడిని సంహరించి ధర్మ సంస్థాపన చేసాడు. ఈ యుగం కాల పరిమాణము పన్నెండు లక్షల తొంభైఆరు వేల సంవత్సరములు. ఈ యుగంలో ధర్మము మూడు పాదములపై నడుస్తుంది.

ఇక త్రేతాయుగమునకు రాజుగా కుజుడు అంటే మంగళుడు. మంత్రిగా శుక్రుడు నియమితులైయ్యారు. కుజుడు పురుష కారకుడు యువకుడు , యుద్ధప్రియుడు, సుక్షత్రియుడు, బాహు బాల పరాక్రమ వంతుడు, సత్యము పలుకు వాడు రాజుగా ఆచారమునకు కట్టుబడి ఉండక తిరుగువాడు. రాక్షస గురువు అయిన శుక్రాచార్యుడు స్త్రీలకు కారకుడు మాయ మంత్ర తంత్రవాది కుజునకు పరమ శత్రువు అయిన శుక్రుడు మంత్రిగా కాలము పాలించవలసి వచ్చింది.

రాక్షస గురువు శుక్ర బలమున దుష్ట శక్తి, మాయా మంత్రం ప్రభావము  చేత రాక్షసులను పురిగోలిపి యజ్ఞ యాగాది క్రతువులకు, తపస్సంపన్నులకు , రూపవతులయిన స్త్రీలకూ, బ్రాహ్మణులకు విపత్తులు కల్పించి బాధించేవాడు.  రాజు మాట మంత్రికి మంత్రి మాట రాజుకు పడకపోవడం చేత మంత్రులు క్రూర స్వభావులై రాజ్య పాలనను బ్రష్టు పట్టించి స్త్రీ వ్యామోహము వలన కలహము పెంచి ప్రజలను పీడించి రూపవతులు అగు స్త్రీలచే, యువకులకు ప్రాణ హానిని కలిగించేవారు. నాలుగు హంగులలో ప్రథమ మయిన మంత్రము యజ్ఞ యాగాదులు మొదలగు దైవ కార్యములు వాటిని జరిపించు బ్రాహ్మన వంశాములను అంతరించేలా చేసేవారు. ఇలా రాక్షసుల వలన, దుర్మార్గుల వలన మంత్రి సామంతుల వలన త్రేతాయుగములో నాలుగింట ఒక భాగము దెబ్బతిన్నది. కుజ గ్రహ బలము  చేత ధనుర్ విద్యా పారంగతులు  అయిన రాజ యువకుల చేత రాక్షస సంహారము చేయించుచు, అధర్మపరులను శిక్షిస్తూ బ్రాహ్మణులను కాపాడుతూ స్త్రీలకూ రక్షణ కల్పిస్తూ ధర్మమును కొంత రక్షించెను. ఈవిధంగా త్రేతాయుగమున ధర్మము నాలిగింట ఒక పాదము తగ్గి ద్వాపరయుగం మొదలవుతుంది.



3. ద్వాపరయుగం :



ద్వాపరయుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఈ యుగం కాల పరిమాణము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరములు. ఈ యుగంలో  ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది. ద్వాపర యుగమున రాజుగా చంద్రుడు , మంత్రిగా బుధుడు నియమితులయి పాలన చేస్తున్నారు. చంద్రుడు గురు గ్రహ వర్గమునకు చెందినా వాడు బుధుడు శని వర్గమునకు చెందిన వాడు. వీరు ఒకరికి ఒకరు పడనివారు. బుధుడు చెడు విద్యలను రాక్షసులకు, దుర్మార్గులకు, దుష్టులకు ఇచ్చి సాదువుల సజ్జనుల, రూపవతుల, పతివ్రతలకు, కన్యలకు అపకారము చేయు వారిని పురిగొల్పుతాడు.

బుధుడు మాంత్రికుడు, మోసములకు నెలవు, వ్యవహార్ములకు అధిపతి ద్వాపరమున అనేక బాధలు కల్పిస్తాడు. దేవతా కార్యములు అర్థ భాగము నశింప చేసి, రాజులకు బ్రాహ్మణులకు భావ విభేదము కల్పించి బ్రాహ్మణులను సేవకులుగా కొంత వరకు మారుస్తాడు.

 ఇక ఈ యుగంలో నాలుగు హంగుల ధర్మములో రెండు హంగులు మాత్రమె నిలిచింది.

చంద్రుడు సకల విద్యా పారంగతుడు బలవంతుడు మనో కారకుడు మాతృ కారకుడు కాన రాజుల విధ్యాపారంగుతులను చేసి ధనుర్ విద్య నేర్పించి దుష్టులను ప్రబలకుండా ఈ మాంత్రికులను, వామాచారులను, మాయావులను నాశనము చేయుటకు స్వయముగా భగవానుడే కృష్ణుడిగా అవతరించి దేవతా వర్గమున కొందరిని అంటే ఇంద్రుని అంశలు  ధర్మ రాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు తోడుచేసుకొని ద్వాపరయుగ అంతమున మంత్రయుగమును మటు మాయం చేస్తాడు. ఈ విధంగా ద్వాపర యుగమున ధర్మము రెండు భాగాలు నశించి కలియుగము ప్రారంభము అవుతుంది. అంటే మంత్రం యుగము అంతరించి యంత్రయుగము ప్రారంభము అవుతుంది.


4. కలి యుగము :



మన ప్రస్తుతం ఉన్న యుగమే కలియుగం. కలియుగం అంతంలో భగవంతుడు కల్కిగా అవతరిస్తాడని చెబుతారు. కలియుగం కాల పరిమాణము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు.  సూర్య సిద్ధాంత ప్రకారము క్రీ.పూ 3102 ఫిబ్రవరి 18 అర్ధరాత్రి కలియుగం ప్రారంభం అయింది. ఇదే సమయానికి శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించాడని హిందువులు భావిస్తారు.

ఈ కలియుగమునకు రాజు శని మంత్రులు రాహు కేతువులు. రాహువు కేతువు ఇద్దరికీ ఒకరు అంటే ఒకరికి పడదు. రాహువు శనికి మిత్రుడు. కొంత కాలము రాహువు మంత్రిగా కొంత కాలము కేతువు మంత్రిగా పాలన చేయుచున్నారు. నాలుగు ధర్మ శాస్త్రములు అదృశ్యం అవ్వగా అప్పుడు కలియుగము ముందుకు నడిచేను. ధర్మమును నిలబెట్టు శాస్త్రములు ఉన్న తన పని సాగదని కలియుగము నడవదని తలంచి కలియుగ ఆరంభములోనే శాస్త్రములను వారిని రక్షించు బ్రాహ్మణులను, అగ్రహారములను, రాజులను ఒక్కొక్కటిగా నశింపు చేస్తూ వచ్చాయి.  ఇక అప్పటినుండి కూరము, కుచ్చితము, అసత్యము, అప్రమాణము, అధర్మము, అన్యాయము తలెత్తాయి. ఈ యుగంలో వావి వరుసలు తప్పి, వర్ణ సంకరములు మొదలై, దొరలే దొంగలయ్యారు.  దైవభక్తి తగ్గి, గురుభక్తి, మాతృపితృ భక్తి అపురూపము అయింది. దైవమును నమ్మి పూజించు కాలము పోయి గురువును పూజించు కాలము వచ్చింది. ఇక హింసా సిద్ధాంతము ఎక్కువ అయి, పాపము వలన దుఖము అనుభవిస్తాము అన్న భయమే లేకుండా పోయింది. పుణ్య కార్యములు కరువయ్యాయి. ఎలాగైనా ధనాన్ని, స్త్రీని పొందినవాడే గొప్పవాడని అనుకునే వారు ఎక్కువయ్యారు. దొంగలకు దారి చూపే వారు ఎక్కువయ్యారు.  ఇంకా ప్రజలు స్వధర్మమును వీడి అన్య ధర్మములను ఆచరించు కాలమునాకు పోయారు. వర్ణ ద్వేషాలు, మత ద్వేషాలు పెరిగాయి. మంచివారు దుర్మార్గులచే పీడించబడుతున్నారు. అయితే  కేతువు మంత్రిగా ఉన్న ఈ కాలములో కొంత మంది ధర్మాత్ములు పుట్టి లోకమునకు మంచి మార్గమును చూపెట్టు పనులు చేస్తున్నారు.
ఈవిధంగా కలియుగం మంచి అనేదానికి చోటు లేకుండా అధర్మానికే మొగ్గు చూపుతూ నడుస్తుంది. కలియుగం అంతంలో భగవంతుడు కల్కి గా అవతరించి తిరిగి సత్యయుగం స్థాపనకు మార్గం సుగమము చేస్తాడని చెబుతారు...



- స్వస్తి...