ఆనాటి రోజులు వేరు. అనుభవించిన మాలాంటి వాళ్లకు అర్థమవుతాయి. కొన్ని దశాబ్దాల క్రితం ప్రతి ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, పెదనాన్నలు, బాబాయిలు, మేనత్తలు వుండేవారు. అందరూ ప్రేమ, ఆప్యాయతలతో పాటు అప్పుడప్పుడూ చిరు కోపాన్ని ప్రదర్శిస్తూ వుండేవాళ్లు.
కారణం, పిల్లలమంతా వాళ్లకు ఏదో ఒక రకంగా కోపం తెప్పించే దుర్మార్గపు పనులు చేస్తుండే వాళ్లం. ఒకరో, ఇద్దరో కొంచెం కోపం ప్రదర్శించి కొట్టినా, ఎక్కవగా తెలుగు తిట్లను వెదజల్లి, వాళ్ల కోపాలను మరు క్షణంలో అణచుకొని మరచిపోయే వాళ్లు.
అచ్చ తెలుగు తిట్లు ఎంత బాగుంటాయో! అదరహో! అంటే, అంత అందంగా వుంటాయన్న మాట. ఎంతో ప్రేమగా కూడా వుంటాయి....ప్రేమతో అంటారు కూడా! తెలుగు తిట్లు అత్యంత మాధుర్యమే గాక, ఒక ప్రత్యేకతను సంతరించుకొని, ఒక రకంగా మరీ మరీ వినేలా వుంటాయి.
తెలుగువారి కొన్ని అచ్చ తెలుగు తిట్లు ఆగ్రహం తెప్పించవు సరికదా, సరదాగా నవ్వు తెప్పిస్తుంటాయి. కొన్ని తిట్లు ముద్దుగా, మురిపెంగా, మహా గోముగా వుంటాయి.
మచ్చుకు కొన్ని తిట్లను చూడండి:--
""శుంఠా", "అప్రాచ్యుడా", "మొద్దురాచిప్పా", "భడవా", "వెధవాయి", "చవటాయి", "సన్నాసి", "వాజమ్మ", "ముద్దపప్పు", "బడుద్ధాయి", "అవతారం", "నంగనాచి", "నాలిముచ్చు", "కుర్రకుంక", "వెర్రిమాలోకం", "చవట సన్నాసి" లాంటి అచ్చ తెనుగు తిట్లు, ఇప్పుడు కూడా దాదాపు ప్రతి రోజూ, కొన్ని తెలుగు లోగిళ్లల్లో ముద్దుముద్దుగా ప్రతిధ్వనిస్తుంటాయి.
నిజానికి అవి తిట్లు కాదు. మన పాలిట దీవెనలు. మాట వరసకి పెద్దవాళ్ళు ఆమాటలని ఎలా ఉపయోగిస్తారో గమనించండి.
"నేతి గారెలు వేడివేడిగా తింటాడనుకుంటే, ఈ సన్నాసి, వెధవాయి ఎటు వెళ్ళాడో? ఏమో!" అని బామ్మగారు దిగాలు పడి పోతూంటుంది.
"అయ్యో! అయ్యో! అయ్యో! మడికట్టుకున్నానురా! నన్ను ముట్టుకోకురా భడవా" అని అమ్మమ్మ ముద్దు ముద్దుగా కోప్పడుతూ, వాడి నుంచి, దొంగా - పోలీసు ఆటలోలా తప్పించుకుంటూ వుంటుంది. ఆమెకు అదొక సరదా!
"మా బడుద్ధాయి ఎంత బాగా పాడతాడో" అని తాతగారు అదేపనిగా నలుగురికీ చెప్పి మురిసిపోతుంటారు.
మా చిన్నప్పుడు, మా తాతగారు, కోపం వచ్చినప్పుడు మరీ మా స్నేహితుల ముందు "గాడిద" అంటే నలుగురిలో బాగుండదని, "శంఖు మూతి గుఱ్ఱమా" అని తిట్టే వారు. ఒక్కొక్క సారి "యద్భవిష్యుడా" అని తిడుతూ, వెంటనే నవ్వుతూ దగ్గరకు తీసుకునేవారు. వారి ప్రత్యేకతే వేరు. మేమెంత అదృష్టవంతులమో అనుకునే వాళ్లం.
అలా!
ఒక్కో సందర్భాన్ని బట్టి, కోపంగా, ఇంకొకసారి ప్రేమగా తిట్టిన ప్రతి తిట్టూ ఎంతో అందంగా, ఆనందంగా వుండేది. అందులో ఎంత ఆప్యాయత, అభిమానం, ఆపేక్ష దాగి వుంటుందో అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది. ఆ రకంగా, మేమంతా నిజంగా అదృష్టవంతులమే. ఏమంటారు?
చదివినందులకు ధన్యవాదములు 🙏