మకుటం కోరని మహారాజు
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. కానీ నవంబర్ 19న 'అంతర్జాతీయ పురుషుల దినోత్సవం' (International Men's Day) జరుపుకుంటారనిగానీ, జరుపుకోవచ్చని కానీ మనలో ఎంతమందికి తెలుసు?
ఐక్య
రాజ్య సమితి ఆమోదంతో మొదటగా ట్రినిడాడ్ మరియు టొబాగోలో 1999లో అంతర్జాతీయ
పురుషుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అంతకంటే ముందు రష్యా అధ్యక్షుడు
గోర్బచేవ్ ప్రారంభించారని, అయితే దాన్ని ఐరాస గుర్తించలేదని అంటారు.
కుటుంబ
సంక్షేమానికి, సమాజ శ్రేయస్సుకు, దేశ సౌభాగ్యానికి తండ్రిగా, అన్నగా,
భర్తగా, కొడుకుగా వివిధ పాత్రలలో మగవారు చేస్తున్న విస్తృత సేవలని,
త్యాగాలని, కృషినీ గుర్తిస్తూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచంలోని
వివిధ దేశాలలో ఈ కార్యక్రమాన్ని వివిధ రోజులలో నిర్వహించుకుంటున్నారు.
మన
దేశంలో మాత్రం 2007 నుంచి SFF(Save Family Foundation), దాని అనుబంధ
సంస్థలు ప్రతి ఏటా నవంబరు 19న అంతర్జాతీయ పురుష దినోత్సవాన్ని
జరుపుతున్నాయి. ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
మగ మహారాజులకు కూడా కష్టాలు:
నీకేం
నువ్వు మగాడివి... వాడంటే మగాడు... మగాడంటే వాడు... నేను మగాడ్ని నా
ఇష్టం... వాడు మగాడురా బుజ్జి... వాళ్ళకేం మగ మహారాజులు... ఇలాంటి ఎన్నో
మాటలు, డైలాగులు వింటుంటాం. అయితే ఆ మగ మహారాజులకు కూడా కష్టాలున్నాయిట.
అందుకే ఈ మగ మహా'రోజు' కావాల్సి వచ్చిందిట.
మన
దేశంలో భారతీయ శిక్షాస్మృతి 498A, గృహహింస నిరోదక చట్టం, వివాహేతర
సంబందాలకు సంబందించిన చట్టం (adultery law), మానభంగాలు, లైంగిక హింస
(sexual harassment) నిరోధానికి చేసిన చట్టాలు, విడాకుల చట్టం, భరణానికి
సంబంధించిన చట్టం, పిల్లల పోషణ మరియు సంరక్షణ కొరకు చేసిన చట్టం
(maintenance and child custody laws)... మొదలైన చట్టాల దుర్వినియోగం
కారణంగా అనేక వేలమంది మగవారు బలౌతున్నారని వీరంటారు. ఇంకా మగవారి బాధలు ఇలా
ఉన్నాయంట:
ఫ్యామిలీ కోర్టుల్లో మగాళ్ళు వివక్షకు గురవుతున్నారు
విడాకుల కోసం వెళితే మగవారు 90 శాతం వరకు తమ పిల్లలకు దూరం కావాల్సిందే
పెళ్ళయిన మగాడు భాగస్వామితో సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం గానీ, పోలీసులుగానీ పట్టించుకోరంట
మగాడిని దుర్భాషలతో వేధించిన ఆడవారికి శిక్ష పడటం అరుదంట
మగాడ్ని
సమాజం 'జీతం లేని రక్షకుడు' (UNPAID PROTECTOR)గా పరిగణిస్తోంది. ఈ
సందర్భంగా అతను చేసిన త్యాగాలను 'మగాడి బాధ్యత' అని సమాజం తేలిగ్గా
కొట్టిపారేస్తోందని వారంటున్నారు
సమాజం గురించి మగాడు ఏదైనా చేయదలిస్తే అందుకు కుటుంబ సహకారం ఉండట్లేదని అంటున్నారు
మగాళ్ళ విషయంలో జరిగే నేరాలను గణించే యంత్రాంగం ప్రభుత్వం వద్ద లేదంటున్నారు
మగాళ్ళు వారి సమస్యలపై మాట్లేందుకు సరైన వేదిక లేదంటున్నారు
ఇతరుల కోసం వారు చేసే త్యాగాలకు గుర్తింపు శూన్యమని ఆరోపిస్తున్నారు
సరే!
మగాళ్ళ ఆరోపణలు, సమస్యల సంగతి ఎలా ఉన్నా ఈ 'పురుష దినోత్సవం' నాడు మగాళ్ళ
గురించి సమాజమూ, ఆడవాళ్ళు తెలుసుకోవలసిన విషయాల గురించి ఎవరో మగ పక్షపాతి
ఆంగ్లంలో రాసిన రైటప్, వాట్సప్ సందేశంగా సర్క్యులేట్ అవుతూ నా దగ్గరకు
వస్తే, దాన్ని అనువదించి ఈ సందర్భంగా మీకు అందిస్తున్నాను.
మగవాడు...
భగవంతుని అత్యంత ఆకర్షణీయమైన సృష్టి మగవాడు
మగవాడు... చిన్నప్పుడు తన చెల్లెలి కోసం చాక్లెట్లు త్యాగం చేస్తాడు
తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి తన కలలను త్యాగం చేస్తాడు
తను ప్రేమించిన/స్నేహం చేసిన అమ్మాయి ముఖంలో చిరునవ్వు కోసం బహుమతులు కొంటాడు, పాకెట్ మనీ మొత్తం ఖర్చు చేస్తాడు
భార్యా పిల్లల కోసం అర్తరాత్రి వరకూ కష్టపడుతూ తన యవ్వనాన్నంతా ధారపోస్తాడు
వారి భవిష్యత్తు కోసం లోన్లు తీసుకుని జీవితాంతం వాటిని కట్టుకుంటూ కూర్చుంటాడు
ఇంత కష్టపడినా చిన్నప్పుడు తల్లితో, పెద్దయ్యాక పెళ్ళాంతో, ఆఫీసులో బాసుతో తిట్లు తింటూనే ఉంటాడు
ఇతరులను సంతోష పెట్టడంలోనే అతని జీవితం ముగుస్తుంది
అలాంటి మగాడి గురించి ఏమనుకుంటారో తెలుసా!
బయటికి వెళ్తే ఇంటిని పట్టించుకోడు అంటారు, ఇంట్లోనే ఉంటే సోమరిపోతు అంటారు
పిల్లల్ని తిడితే వాడొక రాక్షసుడు అంటారు, తిట్టకపోతే బాధ్యతలేని తండ్రి అంటారు
పెళ్ళాన్ని ఉద్యోగం మానిపిస్తే వాడికి అభద్రతా భావం అంటారు, సరే ఉద్యోగం చెయ్యి అంటే పెళ్ళాం సంపాదనకు ఆశపడే చవట అంటారు
అమ్మ మాట వింటే తల్లి చాటు కొడుకు అంటారు, పోనీ అని పెళ్ళాం మాట వింటే పెళ్ళానికి బానిస అంటారు
అమ్మాయిలూ అబ్బాయిలను గౌరవించండి. అతను మీకోసం ఎంత త్యాగం చేస్తున్నాడో గుర్తించండి!
అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు...
( ఎప్పటికైనా మగాడికి గుర్తింపు వస్తుందన్న ఆశతో..)
-స్వస్తి...