శ్రీరామ నవమి విశిష్టత :

పురాణగాధల ప్రకారం శ్రీరాముడు, అయోధ్య రాజైన దశరధుడు, రాణి కౌసల్యలు జరిపిన "పుత్ర కామేష్టి యాగ" ఫలితంగా కలిగన సంతానం శ్రీరాముడు. శ్రీరాముడు విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటని భక్తుల అచంచల విశ్వాసం. శ్రీరాముని జనన సమయంలో అప్పటికే రాక్షసుడైన రావణుడు భగవరాధకులను, మునులను, దేవతలను ముప్పతిప్పలు పెడుతూ లోకాలని అల్లకల్లోలం చేస్తున్నాడు.

దశావతారాల్లో 7అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం హిందువులు ఈరోజు శ్రీరాముడు జన్మదినాన్ని పండగగా జరుపుకుంటారు.

రావణ సంహారం పిదప శ్రీరాముడు సతీసమేతంగా చైత్రశుద్ధ నవమి నాడే అయోధ్య రాజ్య పాలకుడిగా పట్టాభిషిక్తుడైనాడు. నాటి రోజే శ్రీసీతారాముల కళ్యాణం కూడా జరిగింది.  నాటి నుండి నేటి వరకు ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు "శ్రీరామ నవమి"గా ప్రజలు ఉత్సవాలు, శ్రీ సీతారామ కళ్యాణం జరుపుకుంతుంటారు.

రామ రాజ్యం రాముని వ్యక్తిత్వానికి నిదర్శనం :

శ్రీరామ చరిత్రలో రామరావణ సంగ్రామం ఒకెత్తు అయితే రామరాజ్య పరిపాలన మరొక ఎత్తు. రామరావణ సంగ్రామం గురించి పలు సందర్భాల్లో తెలిసిన విషయమే. చిన్నప్పటి నుండి రామాయణం నుండి చెప్పుకొనే కథలు అనేకం. అయితే ప్రస్తుత కాలంలో రామరాజ్య ప్రస్తావన ఎంతో అవసరం?!

నాటి నుండి నేటి వరకు అనేకమంది పాలకులు రామరాజ్యం తెస్తాం, ఇస్తాం అంటూ ప్రకటనలు గుప్పించిన వారే. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మన జాతిపిత మహాత్మా గాంధి కూడా దేశం రామరజ్యంలా సుభిక్షంగా ఉండాలని కాంక్షించిన వారే!

అయితే నేటి పాలకుల ప్రకటనల వరకే పరిమితం చేసిన రామరాజ్యం ఎలా ఉండేది? సుభిక్షంగా, ధర్మానికి ప్రతీకగా సాగిన రామరాజ్యం సామాన్యుల స్వప్నమేనా? అంటే రాముని లక్షణాలు పునికిపుచ్చుకున్న నాయకులు వస్తారా? ఇది కోటి ఉషశ్సుల ప్రశ్న? అయితే రామరాజ్యం తెస్తామన్న పాలకులకు, కోరే ప్రజలకు  సకలగుణాభిరాముని లక్షణాలు తెలుసుకోవాలి కదా!

పితృ వాక్య పరిపాలకుడు, సకల గుణాభి రాముని 16 ఉత్తమ లక్షణాలు :
.
1.      క్రమశిక్షణ కలిగనవాడు.
2.      వీరుడు, సాహసికుడు.
3.      వేదాంతి.
4.      కృతజ్ఞుడు.
5.      సత్యవాక్కు పరిపాలకుడు.
6.      గుణవంతుడు – అన్ని గుణాల్లోను ఉత్తముడు.
7.      స్వీయ నిర్ణయాలు తీసుకోగలిగిన జ్ఞాని.
8.      సర్వ జీవుల పట్ల దయకలిగినవాడు.
9.      అన్ని శాస్త్రాల్లోనూ పండితుడు.
10. సమస్తకార్యాలలోను సమర్ధుడు.
11. మంచి లక్షణాలు కలిగిన అందగాడు.
12. అత్యంత ధైర్యవంతుడు.
13. క్రోధాన్ని జయించినవాడు. ప్రశాంతచిత్తుడు.
14. సమస్తలోకల్లోనూ తెలివైనవాడు.
15. అసూయ లేని వాడు.
16. దేవతలకు కూడా భయాన్ని కలిగించే ధీశాలి.

 శ్రీరామనవమి పూజ విధానం – పాటించాల్సిన ఆచారాలు :

సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి" గా పూజలు జరుపుకుంటాము. భారతదేశం యావత్తు పల్లె గ్రామాల్లో "రామమందిరం" ఉండనే ఉంటుంది. స్థానిక పురజనులు కమిటీలుగా ఏర్పడి ఏటేటా రాములోరి ఉత్సవాలను నవరాత్రులుగా జరుపుకొంటారు. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని పూజించి వడపప్పు, పానకం, నైవేద్యం చేసి అందరకీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద, ధనిక బేధాలు లేకుండా రాములోరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి.

భద్రాచలం రామయ్య బ్రహ్మోత్సవాల విస్తృత ఏర్పాట్లు :

           శ్రీ రామ నవమి భద్రాచలం లో అత్యంత ప్రసిద్ధమైనది. శ్రీ రామ కళ్యాణమహోత్సవము కన్నులపండుగగా జరుపుకుంటారు. ఇది దైవిక ఉత్సవం. లక్షలాది మంది భక్తులు సమావేశమయ్యి  అచంచల భక్తిపారవశ్యంతో వీక్షిస్తారు. తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ల్లో రాష్ట్రవ్యాప్తంగా లైవ్ ప్రోగ్రాంగా ఆకాశవాణి మరియు దూరదర్శన్ కవర్ చేస్తున్న ఏకైక పండుగ ఇది.ఈ 2019వ సంవత్సరానికి మిథిలా ప్రాంగణంలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రూ.5వేలు మరియు రూ.2వేలు టిక్కెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు సమాచారం.

భద్రాచలం శ్రీరాములవారి బ్రహ్మోత్సవాలు 2019 ఏప్రిల్ 6వ తారీఖున ప్రారంభమై ఏప్రిల్ 20 వరకు కొనసాగనున్నాయి.

ఏప్రిల్ 6, 2019 - ఉగాది, తిరువీధీ.
ఏప్రిల్ 10, 2019 - అంకురార్పణం, మండప వాస్తు హోమం..
ఏప్రిల్ 11, 2019 - గరుడపట లేఖనం, గరుడపట ఆదివాసం 
ఏప్రిల్ 12, 2019– అగ్ని ముఖం, అగ్ని ప్రతిష్ట , ధ్వజారోహణం, దేవతా వాహనం .
ఏప్రిల్ 13, 2019 – ఎదురుకోలు , గరుడవహానా సేవా.
ఏప్రిల్ 14, 2019 - శ్రీ రామ నవమి కళ్యాణం, శ్రీ రామ దీక్షా ప్రారంభం.
ఏప్రిల్ 15, 2019 - మహా పట్టాభిషేకం.
ఏప్రిల్ 16, 2019 – సదశ్యం.
ఏప్రిల్ 20, 2019 - ధ్వజారోహణం మరియు ఇతర ముగింపు కార్యక్రమాలు.


 ఒంటిమిట్ట శ్రీకోదండరాములవారి బ్రహ్మోత్సవాలు :

విభజిత ఆంధ్రప్రదేశ్లో శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తోంది. అయితే 2019లో శ్రీకోదండరాముని బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 12న ప్రారంభమై ఏప్రిల్ 21వరకూ కొనసాగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో సేవలు :

ఏప్రిల్ 12, 2019 - పగలు న్యాసాభిషేకం, రాత్రి అంకురార్పణ.
ఏప్రిల్ 13, 2019 - పగలు ధ్వజారోహణం , రాత్రి శేష వాహనం
ఏప్రిల్ 14, 2019 - పగలు వేణుగానలంకరణ, రాత్రి హంస వాహనం
ఏప్రిల్ 15, 2019 - పగలు వటపత్రశాయి అలంకారం , రాత్రి సింహ  వాహనం
ఏప్రిల్ 16, 2019 - పగలు నవనీత కృష్ణాలంకారం   , రాత్రి హనుమత్సేవ.
ఏప్రిల్ 17, 2019 - పగలు మోహినీసేవ  , రాత్రి గరుడ సేవ.
ఏప్రిల్ 18, 2019 - పగలు శివధనుర్భాలంకారం  , రాత్రి ఎదుర్కోలు, కల్యాణోత్సవమ, గజవాహనం.
ఏప్రిల్ 19, 2019 - పగలు రథోత్సవం  , రాత్రి వివరాలు లేవు.
ఏప్రిల్ 20, 2019 - పగలు కాళీయమర్దనాలంకారం, రాత్రి అశ్వవాహనం.
ఏప్రిల్ 21, 2019 - పగలు చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణం.



- స్వస్తి...