స్వామి వివేకానంద - జీవిత చరిత్రబాల్యం :

                                 బాల్యంలో వివేకానంద స్వామిని నరేంద్రనాథ్ దత్త అని, ముద్దుగా నరేన్ అని పిలిచేవారు. ఆయన కలకత్తానగరంలో విశ్వనాథ్ దత్త, భువనేశ్వరి దేవి దంపతులకు 1863 సంవత్సరం జనవరి 12 వ తేదీ సోమవారం జన్మించారు. దత్త కుటుంబీకులు ధనికులే గాక సంఘంలో మంచిపేరున్నవారు. దాతృత్వానికీ, విద్యాధికతకూ, స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను కాంక్షించే వారుగానూ పేరెన్నికగన్నారు. నరేంద్రుడి తాత అయిన దుర్గాచరణ్ దత్త పర్షియన్, సంస్కృతభాషలలో గొప్ప పాండిత్యాన్ని కలిగిన న్యాయవాది. కానీ విశ్వనాథ్ జన్మించిన తర్వాత ఆయన సన్యసించారు. అప్పుడాయనకు 25 సంవత్సరాల వయస్సు మాత్రమే.

                                 కలకత్తా హైకోర్టులో విశ్వనాథ్ దత్త ఒక న్యాయవాది. అతడు ఆంగ్ల, పర్షియన్ భాషలలో గొప్ప పండితుడు. పర్షియన్ కవి అయిన హఫీజ్ రచించిన కవితలను చదివి తన కుటుంబానికి వినిపించేవాడు. బైబిల్ గ్రంథాన్ని చదవడంలోనూ, సంస్కృతంలోని హిందూశాస్త్రాలను చదవడంలోనూ గొప్పగా ఆనందించేవాడు. మితిమీరిన దాతృత్వాన్ని, పేదలపట్ల జాలిని కలిగివున్నా మత సాంఘిక విషయాలలో హేతుబద్దమైన, అభ్యుదయ భావాలను కలిగివుండేవాడు. బహుశా పాశ్చాత్య సంస్కృతీ ప్రభావంవల్ల ఆయనకు ఆ గుణాలు కలిగివుండవచ్చు. భువనేశ్వరీదేవి ఏ పనినైనా సమర్థంగా నిర్వహించగలిగిన రాజకుటుంబీకురాలు. నరేంద్రుడు పుట్టకముందు కొందరు కుమార్తెలు పుట్టినా కొడుకు కావాలన్న కోరికతో ఆమె వారణాసిలోని వీరేశ్వర శివునికి పూజలు జరిపించమని తన బందువులలో ఒకరిని కోరారు. తరువాత శివుడు ఆమెకు కలలో కనిపించి, ’నీకు కొడుకుగా పుడతాన’ని మాట ఇచ్చినట్టు చెప్పుకుంటారు. ఆ తర్వాత కొంతకాలానికి నరేంద్రనాథ్ జన్మించాడు.

చిన్నతనంలో నరేంద్రనాథ్ ఎంతో ఉల్లాసంగా, అల్లరివాడుగా ఉండేవాడు. కానీ అదే సమయంలో అతనికి ఆధ్యాత్మిక విషయాలమీద గొప్ప ఆసక్తి ఉండేది. రాముడు, సీత, శివుడు మొదలైన దేవుళ్ళ బొమ్మల్ని పూజిస్తూ, ధ్యానిస్తూ ఆడుకునేవాడు. తన తల్లి చెప్పిన రామాయణ, మహాభారత కథలు అతని మనస్సు మీద చెరగని ముద్ర వేసాయి. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు, ధైర్యం, పేదలపట్ల జాలి, దేశద్రిమ్మరులై వచ్చే సన్న్యాసులపట్ల ఆకర్షణ మొదలైన గుణాలు అతనిలో పసితనంలోనే కనిపించాయి. చిన్నతనంలోనే ఎవరేదిచెప్పినా దాన్ని నిరూపించి చూపమని నరేంథ్రనాథ్ సవాలు చేసేవాడు. మదికీ, హృదికీ తలమానికమైనటువంటి ఈ సద్గుణాలతో అతడు ఒక శక్తిమంతుడైన యువకునిగా ఎదిగాడు.

శ్రీ రామకృష్ణుల చరణకమలాల వద్ద :

                                యువకునిగా, నరేంథ్రనాథ్ తన సింహంలాంటి రూపానికి సరితూగే ధైర్యాన్ని కలిగివుండేవాడు. మంచి వస్తాదు వంటి శరీరనిర్మాణాన్ని, సుస్వరమైన గొంతును, ప్రకాశమానమైన బుద్ధిని కలిగివుండేవాడు. సాముగరిడీలలోనూ, తత్త్వశాస్త్రంలోనూ, సంగీతం లోనూ తన తోటివారి మధ్య తిరుగులేని నాయకుడిగా పేరెన్నికగన్నాడు. కళాశాలలో పాశ్చాత్య తత్త్వాన్ని అధ్యయనం చేసి ఒంటపట్టించుకున్నాడు. తద్వారా అతని మనస్సులో విషయాలను సూక్ష్మంగా పరిశీలించే శక్తి నాటుకుపోయింది. పుట్టుకతో అలవడిన లక్షణాలయిన ఆధ్యాత్మికతపై మక్కువ, సనాతన మతసాంప్రదాయాల మీద, నమ్మకాల మీద గౌరవం ఒకప్రక్క, మరొకప్రక్క పదునైన బుద్దితో జతగూడిన అతని విమర్శనాత్మక స్వభావం ఇప్పుడు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఇటువంటి సందిగ్ధసమయంలో, ఆ కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న మత-సాంఘిక ఉద్యమమైన భ్రహ్మసమాజంలో చేరి కొంత ఊరట పొందటనికి ప్రయత్నించాడు. భ్రహ్మ సమాజం నిరాకారదైవాన్ని నమ్మి, విగ్రహారాధనను తూలనాడి, అనేక విధాలయిన సంస్కరణలను చెయ్యడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. నరేంద్రనాథ్ అనేకమంది పెరెన్నికగన్న మతనాయకులను కలుసు కున్నాడు. కానీ వారెవ్వరూ, ’దేవుడు ఉన్నాడా’, లేడా?’ అన్న అతని ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలెకపోయారు. ఇది అతని ఆధ్యాత్మిక అశాంతిని మరింతగా పెంచింది.

                                ఇటువంటి చిక్కుపరిస్థితిలో, కలకత్తాకు కొద్ది దూరంలో, దక్షిణేశ్వరంలో ఒక సాధువు ఉన్నాడని తన ఆచార్యుడైన విలియం హేస్టీ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. వర్డ్స్ వర్త్ తన ’విహారము’ అన్న కవితలో వర్ణించిన పారవశ్యస్థితిని ఆ ’సాధువు అనుభూతి చెందాడని హేస్టీ వివరించాడు. అతడి గ్నాతి అయిన రామచంద్ర దత్త కూడా ఆ సాధువును దర్శించమని నరేంద్రుణ్ణి ప్రోత్సహించాడు. ఆ విధంగా 1881 లో ఆధునిక భారతదేశపు దివ్యద్రష్ట అయిన శ్రీరామక్రుష్ణునికి, అతని సందేశప్రచారకుడైన నరేంద్రునికి పరిచయం కలిగింది. "అయ్యా! మీరు దేవుణ్ణి చూశారా?" అని నరేంద్రనాథ్ ప్రశ్నించాడు. "ఔను! నేను భగవంతుణ్ణి చూశాను! నిన్నిప్పుడు చూస్తున్నదానికన్నా స్పష్టంగా చూశాను!" అని శ్రీరామకృష్ణులు సమాధానమిచ్చారు. ఎట్టకేలకు తన సొంత అనుభూతి ద్వారా దేవుణ్ణి దర్శించిన ఒక మనిషి నరేంద్రుడికి లభించాడు. అతని అనుమానం తొలగిపోయింది. శిష్యునిగా శిక్షణ ప్రారంభమయింది.

                                శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి అనేకరకాలుగా పరీక్షించారు. దానికి ప్రతిగా, శ్రీరామకృష్ణులు తాను అనుభూతి చెందినట్టు వర్ణించిన ఆధ్యాత్మికస్థితులలో నిజం ఎంతవరకూ ఉందో తెలుసుకోవడానికి ఆయనను అనేకవిధాలుగా నరేంద్రుడు పరీక్షించి చూశాడు. తన తండ్రి 1884 లో గతించిన తర్వాత నరేంద్రుడి కుటుంబం అనేకవిధాలుగా ఇక్కట్లపాలైంది. గురుదేవుల సలహామీద దక్షిణేశ్వరంలోని కాళికాదేవిని తన కుటుంబ బాధలు తీర్చమనై ప్రార్థించడానికి వెళ్ళాడు. అయినప్పటికి, తనకు డబ్బు అవసరం ఉందని తెలిసికూడా భక్తిగ్నానాల కోసం మాత్రమే ప్రార్థించగలిగాడు.

                                 క్రమక్రమంగా నరేంద్రుడు గురుదేవులకు శరణాగతుడయ్యాడు. తన అంతులేని ఓరిమితో శ్రీరామకృష్ణులు తన యువశిష్యుని యొక్క సంప్రదాయ వ్యతిరేకధోరణిని అణగార్చి, సంశయస్థితిలోనుంచి దృఢనిశ్చయానికి, ఆవేదన నుండి ఆధ్యాత్మిక ఆనందానికి అతనిని తీసుకొనిపోయారు. కానీ శ్రీరామకృష్ణులందించిన మార్గదర్శకత్వంకన్నా ఆయన ప్రేమయే ఆ యువశిష్యుని మనస్సును మరింతగా చూరగొన్నది. ఆ ప్రేమను అంతే నిండుదనంతో ఆ శిష్యుడు తిరిగి గురువుకు అందించాడు.

                                శ్రీరామకృష్ణులు జబ్బుపడినప్పుడు చికిత్సకోసం ఆయనను కలకత్తా పొలిమేర్లలోని కాశీపూర్ కు తరలించారు. అక్కడ తన గురువు ఆధ్వర్యంలో నరేంద్రుడి చివరి విడత శిక్షణాకార్యక్రమం మొదలైంది. ఆ సమయంలో నరేంద్రుడు తీవ్రమైన తపస్సాధనలను చేశాడు. శ్రీరామకృష్ణులు తమ యువ శిష్యులందరిని నరేంద్రుడి నాయకత్వంలోకి తేవడానికి కృషి చేశారు. నరేంద్రుడు తనకు సర్వోత్కృష్ట పారమార్థికస్థితి అయిన నిర్వికల్ప సమాధిని ఇవ్వమని శ్రీరామకృష్ణులను కోరినప్పుడు ఆయన, "సిగ్గులేదా! నువ్వొక పెద్దమర్రిచెట్టులాగా పెరిగి, ఈ ప్రపంచపు బాధలలో మాడిపోతున్న వేలమందికి నీడనిస్తావని నేననుకుంటున్నాను. కానీ ఇప్పుడు చూస్తే నువ్వు నీ మోక్షాన్నే కోరు కుంటున్నావు" అని మందలించారు. అయినప్పటికీ నరేంద్రుడికి ఆ అనన్యసామన్యమైన అనుభూతి సిద్దించింది. కానీ, "నువ్వు జన్మించిన కార్యం సిద్దించేవరకూ ఈ అనుభూతికి తాళంచెవి నా దగ్గరే ఉంటుంద"ని గురుదేవులు అతనికి చెప్పారు. తన మహాసమాధికి మూడునాలుగురోజుల ముందు గురుదేవులు తన ఆధ్యాత్మికశక్తినంతా నరేంద్రుడికి ధారపోసి, "ఇప్పుడు నీకిచ్చిన శక్తితో మహాత్కార్యాలు సాధించబడతాయి. దాని తర్వాతే నువ్వు నీ ధామానికి చేరుకుంటావ"ని చెప్పారు.

                                 గురుదేవులు 1886 వ సంవత్సరం ఆగస్టునెలలో మహాసమాధి చెందిన తర్వాత నరేంద్రుడి నాయకత్వంలో యువశిష్యులందరూ బారానగర్ లో ఒక పాడుబడిన అద్దెకొంపలో చేరారు. ఇక్కడే, తీవ్రమైన తప్పసాధనల మధ్య "శ్రీరామకృష్ణ సోదరబృందా"నికి పునాది పడింది. ఇక్కడ ఉంటున్న రోజులలోనే నరేంద్రనాథ్ పలువురు సోదరశిష్యులతో కలిసి అంత్ పూర్క్ కు వెళ్ళారు. అక్కడ ’క్రిస్టమస్ ఈవ్’ పర్వదినాన (1886) వాళ్ళందరూ ఒక పెద్దమంటవేసి దానిచుట్టూ కూర్చుని సన్న్యాసదీక్ష తీసుకున్నారు. భారానగర్ లో గడిపిన దినాలు అధ్యయనంలోనూ, ఆధ్యాత్మికసాధనలతోనూ, మహదానందంగా గడిచాయి. కానీ దేశద్రిమ్మరులుగా పరివ్రాజక జీవితం గడపాలన్న కోరిక వారిలో పలువురిని ఆకర్షించసాగింది. నరేంద్రుడు కూడా 1888 చివరిభాగం నుంచి అనేకసార్లు మఠం విడిచి యాత్రలకు పోసాగాడు.


పరివ్రాజక సన్యాసి :

                                 తాత్కాలికమైన యాత్రలు ప్రారంభించిన 1888 చివరిభాగం నుంచి 1890 లో తన సోదరబృందాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఊరూపేరూలేని బైరాగిగా పర్యటించడం ప్రారంభించినంతవరకూ జరిగిన కాలంలో నరేంద్రనాథుడి దృక్పథంలో గొప్పమార్పు వచ్చింది. భారతదేశపు జనసామాన్యంలో కలిసి పోవడానికి, ఎవరూ తనను గుర్తుపట్టాకుండా ఉండడానికి, రకరకాలపెర్లు పెట్టుకుంటూ ఆయన పర్యటించసాగారు.

                                ఈ సమయంలో ఒక భారతీయ సన్న్యాసిలాగా ఏకాంతజీవనం గడపాలనే సహజమైన కోరిక చెదిరిపోయి తానొక గొప్ప బాధ్యతను నెరవేర్చడానికి పుట్టానన్న భవిష్యత్ గ్నానం ఆయనలో కలుగసాగింది. తనఒక్కడిసొంత ముక్తి కోసం వెంపర్లాడే మామూలు సాధువును కాదని ఆయనకు తేటతెల్లమైంది. భారతదేశాన్ని మరింత బాగా తెలుసుకోవాలన్న కోరిక రగులుతుండగా, అణగద్రొక్కబడిన భరతమాత మౌనరోదనల విన్నపాలు తనచుట్టూ పెల్లుబుకుతుండగా హిందువులకు పరమపవిత్రమైన వారణాసిని ముందుగా చేరుకున్నారు. అక్కడనుంచి లక్నో, ఆగ్రా, బృందావనం, హత్రాస్, రిషి కేశ్ లకు పర్యటించి తిరిగి కొంతకాలంపాటు బారానగర్ కు వచ్చారు. హత్రాస్ లో తనకు ప్రథమ శిష్యుడై, స్వామి సదానందగా పెరొందిన శరత్ చంద్ర గుప్తాను కలుసుకున్నారు. ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా పునరుజ్జీవింపజెయ్యాలనే బృహత్ పథకాన్ని తనకు తన గురుదేవులు అప్పగించారని అతనికి తెలిపారు. హత్రాస్ లోని రైల్వేస్టేషనులో ఉద్యోగస్థుడైన శరత్ తన ఉద్యోగానికి రాజీనామాచేసి తన ’గురువు’యొక్క మహాత్కార్యంలో సహాయ పడటానికి ఆయనను అనుసరించాడు.

                                స్వామీజీ జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటన 1890 వ సంవత్సరంలో ఆయన ఘాజీపూర్ లోని పవహారిబాబాను కలిసినప్పుడు జరిగింది. ఆయనయొక్క సాధుత్వానికి స్వామీజీ తన జీవిత పర్యంతం గొప్ప ఆదరాన్ని చూపించారు. ఈ సమయంలో ఆయన అద్వైతపు అనంతనిశ్శబ్దంలో మునిగిపోవాలన్న కోరికకూ, మరొకప్రక్క తన గురుదేవుల మహాత్కార్యానికి పరిపూర్ణతకలిగించాలన్న సంకల్పానికి మధ్య మథనపడసాగాడు. సర్వోత్కృష్టమైన సమాధిలో ఆ భగవంతుడిలో లీనమైపోవాలని తన హృదయంలో తొలుస్తున్న తపనను పవహారిబాబా ఉపశమింప జేయగలుగుతారని ఆయన భావించారు. ఈ ప్రబలమైన కోరిక తన గురుదేవులు తనకప్పగించిన బాధ్యతనుండి ఆయనను దూరంగా లాగివేయసాగింది. ఇరవైయొక్క రోజులపాటు ఆ ఆకర్షణకు లొంగిపోయే స్థితికి చేరినా ప్రతిసారీ గురుదేవులు తన దర్శనం ద్వారా ఆయనను తిరిగి తన పనివైపు మరలించారు.

                                 గురుదేవులు గతించిన తర్వాత యువసన్యాసులకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా ఉన్న శ్రీశారదాదేవివద్ద స్వామీజి సెలవు తీసుకున్నారు. అన్నిరకాల బంధాలనూ త్రెంచివేసి హిమాలయపర్వతాల గంభీర ఏకాంతంలోకి పోవాలని తన సోదరసన్న్యాసులవద్ద కూడా సెలవు తీసుకున్నారు. ఇప్పుడు కొంతకాలం ఏకాంతంగా ఉండడం అత్యవసరంగా ఆయనకు తోచింది. రోమారోలా ఇలా వర్ణించాడు: "ఇది ఒక మహాప్రస్థానం. ఒక గజఈతగానిలాగా ఆయన భారతదేశ మహాసాగరంలోకి దుమికారు. ఆ మహాసాగరం ఆయన కాలిబాటల్ని కప్పివేసింది. దాని అలలలో తేలుతూ, అటూఇటూ కొట్టుకుపోతున్న జనసామాన్యంలోనూ, వేలమంది. సన్న్యాసుల్లో తానూ ఒక అనామక సన్న్యాసిగానూ కలిసిపోయారు. కానీ ప్రజ్వరిల్లుతున్న మేధస్సు ఆయన కళ్ళల్లో కొట్టొచ్చినట్టు కనపడేది. ఎంత మారువేషం వేసినా రాజు రాజే!"

                                 ఆయన పరివ్రాజక జీవితం ఆయనను చారిత్రాత్మకంగానూ, తీర్థయాత్రాస్థలాలుగానూ పేరొందిన రకరకాలచోట్లకు తీసుకుపోయింది. ఆయన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మైసూర్, కేరళ, మద్రాసు, హైదరబాదులకు పర్యటించారు. ప్రతిచోటా రాజకీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాలలో ప్రాచీనభారతదేశ ఔన్నత్యం ఆయనకు స్పష్టంగా గోచరించింది. ఈ మహాసంస్కృతికి మధ్య భారతదేశ జనసామాన్యం యొక్క కష్టాలు, కడగండ్లు ఆయన మనస్సును ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఆయన ఒక రాజసంస్థానం నుండి మరొక రాజసంస్థానానికి తిరిగి, వారి కష్టాలను కడతేర్చే మార్గాలను అన్వేషించారు. ఆ విధంగా ఆయన పలు రాజసంస్థానాల పరిపాలకుల్ని, ప్రముఖవ్యక్తుల్ని కలుసుకున్నారు. వారిలో ఖేత్రీ మహారాజయిన అజిత్ సింగ్ ఆయనకు ప్రాణస్నేహితుడు, శిష్యుడు అయాడు. ఆల్వారులో స్వామీజీ ’పతంజలి మహాభాష్యాన్ని’ అధ్యయనం చేశారు. పూనాలో గొప్ప జాతీయనాయకుడైన బాలగంగాధర్ తిలక్ వద్ద అతిథిగా ఉన్నారు. మొదట తిలక్ స్వామిజీతో ఒకింత చులకనగా మాట్లాడినా, స్వామీజీ గ్నానగంభీరతను, ఆలోచనా పరిపుష్టిని మెచ్చుకుని తన ఆతిధ్యాన్ని స్వీకరించవలిసిందిగా ఆహ్వానించారు. అక్కడనుంచి బయలుదేరి, కొంతకాలం బెల్ గాంలోవున్న తరువాత స్వామీజీ బెంగుళూరు, మైసూరులను దర్శించారు. పాశ్చాత్యదేశాలలో మన సనాతనధర్మాన్ని బోధించి, భారతదేశానికి కావలసిన ఆర్థికసహాయాన్ని కోరడానికి అవసరమైన ధనసహాయాన్ని తాను అందిస్తానని మైసూరు మహారాజు స్వామీజీకి వాగ్దానం చేశారు. మైసూరునుంచి స్వామీజీ త్రివేండ్రం, కన్యాకుమారి దర్శించారు.

                                స్వామీజీ ఎక్కడికి వెళ్ళినా, అక్కడి ప్రముఖప్రదేశాలు, వ్యక్తులు ఆయనను ఎక్కువగా ప్రభావితం చెయ్యలేదు. సామాన్య ప్రజానీకపు దుర్భరదారిద్ర్యం, బాధలు ఆయన హృదయాన్ని కలచివేశాయి. ఇంచుమించు మూడేళ్ళపాటు, తరచుగా కాలినడకన ప్రయాణించి, స్వామీజీ భారతదేశాన్ని తనకుతానుగా చూసి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన ఒక విధంగా తన ప్రయాణపు ముగింపుకు చేరుకున్నారు. గొప్ప ఉద్వేగంతో ఆయన కన్యాకుమారిలోని కుమారీదేవి విగ్రహం ముందు సాగిలపడ్డారు. ఆ తర్వాత సముద్రాన్ని ఈది, దక్షిణతీరంలో కొద్దిదూరంలో నీటిమధ్యవున్న ఒక కొండరాయిని చేరుకుని అక్కడ ఆ రాత్రంతా తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయారు. తన ప్రయాణాలలో పొందిన అనుభూతులన్నీ ఒక సుదీర్ఘచిత్రంగా ఆయన మనోనేత్రం ముందు కదలాడాయి. భరతమాతయొక్క భూత, భవిష్యత్, వర్తమానాల గురించి, ఆమె అథ:పతనానికిగల కారణాలనుగురించి, ఆమెను తిరిగి ఉద్ధరించేందుకు తగిన పద్ధతుల గిరించి ఆయన ధ్యానం చేశారు. భారతదేశ పేదప్రజానీకానికి కావలసిన సహాయాన్ని కోరడానికి, తద్వారా తన జీవితపు మహాత్కార్యానికి ఒక రూపునివ్వడానికి, పాశ్చాత్యదేశాలకు ప్రయాణించాలన్న అతిముఖ్యమైన నిర్ణయాన్ని ఆయన ఇక్కడే తీసుకున్నారు.

                               ఈ నిర్ణయంతో ఆయన రామేశ్వరం, మదురైలకు ప్రయాణమయ్యారు. అక్కడనుంచి ఆయన మద్రాసు వెళ్ళారు. అక్కడ అలసింగ పెరుమాళ్ నాయకత్వంలో ఒక యువబృందం ఆయన రాకకోసం ఆతృతగా ఎదురుచూస్తున్నది. వారికి ఆయన, అమెరికావెళ్ళి అక్కడ చికాగోలో జరుగుతున్న సర్వమతమహాసభలో పాల్గొనాలన్న కోరికను బయటపెట్టారు. ఆ యువశిష్యులు ఆయన ప్రయాణ ఖర్చులకు అవసరమైన సొమ్మును పోగు చేశారు. కానీ ఆ జగన్నాత తన ప్రయాణానికి ఇచ్చగించిందో లేదో తెలియదన్న నెపంతో స్వామీజీ ఆధనాన్ని పేదలకు పంచిపెట్టమని చెప్పారు. ఈ తరుణంలో స్వామీజీ తన మనసులొమాట సరైనదేనన్నదానికి సంకేతంగా ఒక కలలో శ్రీరామకృష్ణులు సముద్రం మీదకు నడుస్తూ తనను కూడా రమ్మని సౌంగ్న చేస్తున్నట్టు ఆయనకు కనిపించింది. దీనికితోడు శ్రీశారదాదేవి కూడా తన దీవెనలను, అంగీకారాన్ని తెలిపారు. శ్రీ శారదాదేవి కూడా ఒక కలలో శ్రీరామకృష్ణుల అంగీకారాన్ని పొందారు. దీనితో స్వామీజీ సందేహాలన్నీ తీరిపోయాయి. ఆయన ప్రయాణానికి అవసరమైన నిధులను సేకరించడానికి స్వామీజీ యువ మిత్రులు మరలా ఉద్యమించారు.

                                 ఆ తర్వాత అయన కొద్దిరోజులు హైద్రాబాదుకు వెళ్ళారు. అమెరికా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు ఆవిధంగా జరుగుతుండగా, అకస్మాత్తుగా ఖేత్రీమహారాజుకు కొడుకు పుట్టిన సందర్భంగా జరుగుతున్న వేడుకలకు రావలసిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. స్వామీజీ తన శిష్యుడినుంచి అందిన ఈ ఆహ్వానాన్ని కాదనలేకపోయారు. మాహారాజుగారు స్వామీజీని సాదరంగా ఆహ్వానించి ఆయన ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లనూ చేయిస్తానని మాటయిచ్చారు. ఇక్కడే, మహారాజుగారి సలహామేరకు "వివేకానంద" అన్న పేరును పెట్టుకున్నారు. తాను మాట ఇచ్చినట్టుగానే మహారాజుగారు తన వ్యక్తిగత కార్యదర్శిని స్వామీజీతోపాటు పంపి, బొంబాయినుండి ఆయన ప్రయాణానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేయించారు. అమెరికాకు స్వామీజీ 1893 మే 31 వ తేదీన బయలుదేరారు.


ప్రపంచవేదిక మీద :

                                 స్వామి వివేకానందులు చైనా, జపాన్, కెనడాల మీదుగా ప్రయాణించి చికాగో నగరానికి జులై మధ్యభాగంలో చేరుకున్నారు. కాంటన్ లో ఆయన కొన్ని బౌద్ధవిహారాలను దర్శించారు. జపాన్ ప్రజల పారిశ్రామికప్రగతిని, పరిశుభ్రతను ఎంతగానో మెచ్చుకునారు. చికాగోలో ప్రజల కళ్ళు చెదిరే భోగభాగ్యాలను, కొత్తవిషయాలను కనిపెట్టే మేధాశక్తిని చూసి ఒక చిన్నపిల్లవాడిలాగా దిగ్బ్రమ చెందారు. విశ్వమత మహాసభ సెప్టెంబరు వరకూ ప్రారంభం కాదని, తగిన పరిచయపత్రాలు లేనిదే ఎవ్వరినీ అందులో పాల్గొనడానికి అనుమతించరనీ తెలుసుకుని నిరాశ చెందారు.

                                 దారితప్పిపోయినట్టు తోచినా దేవుడిమీద భారంవేసి చికాగోకన్నా చౌకగా ఉండే బోస్టన్ నగరానికి వెళ్ళారు. తాను ప్రయాణించే రైలులో ఆయనకు మిస్ కాథరిన్ సాన్ బర్న్ తో పరిచయమయింది. ఆమె తన అతిథిగా ఉండమని స్వామీజీని ఆహ్వానించింది. ఆమె ద్వారా స్వామీజీకి హార్ వార్డ్ విశ్వవిద్యాలయ ఆచార్యుడైన జాన్ హెన్రీ రైట్ మహాశయునితో పరిచయం కలిగింది. సర్వమత మహాసభ అధ్యక్షునికి స్వామీజీని గురించి ఒక పరిచయపత్రాన్ని డా.రైట్ ఇచ్చారు. అందులో ఒక వాక్యంగా, "విద్యాధికులైన మన ఆచార్యులందరినీ ఏకం చేసిన దానికన్నా ఎక్కువ గ్నానవంతుడైన మనిషి ఇక్కడ ఉన్నాడు", అని వ్రాశాడు.

                                సర్వమత మహాసభ ప్రారంభానికి ఒకటి రెండురోజుల ముందు స్వామీజీ చికాగోకు తిరిగి వచ్చారు. కానీ ఆయన దిగులుకుతోడు ప్రాచ్యమతప్రతినిధులకు ఆతిధ్యాన్ని అందజేసే కమిటీ చిరునామాను పోగొట్టుకున్నారు. ఆ రాత్రి అక్కడి రైల్వేస్టేషనులో ఒక పెద్దపెట్టెలో తల దాచుకుని, మరునాటి ఉదయం తనకు సహాయం చెయ్యగల మనిషి దొరుకుతాడేమోనని బయలుదేరారు. కానీ శ్వేతజాతీయులుకానివారికి సహాయం అంతత్వరగా లభించదు. నిష్పలంగా చాలాసేపు అన్వేషించిన మిదట అలసిపోయున, అంతా దైవసంకల్పంమీద వదిలి రొడ్డుప్రక్కన చతికిలబడ్డారు. అకస్మాత్తుగా ఆయన ఎదురుగా ఉన్న ఇంటిలోంచి ఒక స్త్రీ ఆయన వద్దకు నడిచి వచ్చి ఆయనకు ఏ సహాయం కావాలని అడీగారు. ఆమెయే శ్రీమతి జార్జ్ డబ్ల్యూ హేల్. వారింటి చిరునామాయే అమెరికాలో స్వామీజీ శాశ్వత విలాసంగా నిలిచిపోయింది. హేల్ కుటుంబీకులు స్వామీజీ భక్తులుగా మారిపోయారు.

                                  సర్వమత మహాసభ 1893 సెప్టెంబరు 11 వ తేదీన ప్రారంభమయింది. కళాసంస్థ (Art Institute) సభాప్రాంగణం సుమారు 7000 మంది జనంతో కిటకిటలాడిపోయింది. వారు ఆదేశపు ఉత్కృష్ట సంస్కృతికి ప్రతినిధులు. వేదికమీద ప్రపంచం నలుమూలల నుంచి విచ్చేసిన అన్నిమతాల ప్రతినిధులూ ఆశీనులయ్యారు. స్వామీజీ అటువంటి బ్రహ్మాండమయిన, విశ్వవిఖ్యాతులయిన వారితో నిండిన సభను ఉద్దేశించి ఎన్నడూ ప్రసంగించలేదు. ఆయన చాలా భయపడ్డారు. ఆయన తరుణం వచ్చినప్పుడు, మనస్సులో సరస్వతీదేవికి నమస్కరించి, "అమెరికాదేశపు సోదర సోదరీమణూలారా!" అని సంబోధించారు. వెనువెంటనే ఆ బ్రహ్మాండమైన సభలో కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. పూర్తిగా రెండునుముషాలపాటు ఆ కరతాళాలు ఆగలేదు. "ఏడువేలమంది జనం లేచి నిలబడి, తమకు అంతుబట్టనిదేదో ఒకదానికి నివాళులర్పించారు." ప్రజ్వరిల్లే చిత్తశుద్ధితో ఆయన పలికిన పలుకులు, తేజస్సుతో నిండిన ఆయన ముఖవర్చస్సు, కాషాయవస్త్రాలు వారిని ఎంతగా ఆకట్టుకున్నాయంటే మరుసటిరోజు వార్తాపత్రికలు స్వామీజీని సర్వమతమహాసభలో పాల్గొన్న ప్రతినిధులలో అత్యుత్తముడిగా కీర్తించాయి. భిక్షాపాత్రతో బయలుదేరిన ఒక సాధారణ సాధువు అందరి మనస్సులనూ దోచుకున్నవాడిగా ఎదిగిపోయాడు.

                                 స్వామీజీ అటుపై ఆ మహాసభలో చేసిన ప్రసంగాలన్నింటినీ సభికులు గొప్ప గౌరవంతోనూ, ఆసక్తితోనూ విన్నారు. వాటన్నింటిలో విషయమూ సార్వజనీనతే! సభలో మిగిలిన ప్రతినిధులు తమ మతాల గొప్పను గురించి మాట్లాడితే స్వామీజీ, ఆకాశమంత విశాలమైనదీ, సముద్రమంత లోతైనదీ అయిన మతాన్ని గురించి మాట్లాడారు. మహాసభ ముగియడంతో స్వామీజీ అనామకజీవితం ముగిసిపోయింది. అటుపైన క్షణం తీరిక లేకుండా సంయుక్తరాష్ట్రాలలోని అన్ని ప్రదేశాలలోనూ ఆయన ఉపన్యసించవలసి వచ్చింది. ఒక ఉపన్యాససంస్థతో ఒక ఉపన్యాస పర్యటన నిమిత్తం ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. దానివల్ల స్వామీజీ నిరంతరం ప్రయాణిస్తూ అన్నిరకాల శ్రోతలనూ ఉద్దేశించి ప్రసంగించవలసి వచ్చింది. ఈ పర్యటన ఆయనకు పాశ్చాత్యజీవనంలోని వేర్వేరు అంశాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే అవకాశాన్ని కలిగించినా, ఆ సంస్థ స్వలాభానికి ఆయనను వాడుకుని, అవమానాల పాలు జేసింది. ఆయనకు వారి ప్రవర్తనతో రోతపుట్టి ఆ సంస్థతో తెగతెంపులు చేసుకున్నారు. అటుపై నిజమైన ఆసక్తి ఉన్న కొద్దిమంది అమెరికన్ భక్తులకు తరగతులు నిర్వహించారు. వారి నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయలేదు. ఆయన 1896 డిసెంబరు వరకూ పాశ్చాత్యదేశాలలో ఉన్నారు. ఆ కాలమంతా విపరీతమైన పని వత్తిడితో గడిచింది. లెక్కలేనన్ని ఉపన్యాసాలు, తరగతులూ నిర్వహించడంతోపాటు అయన న్యూయార్కు నగరంలో ఒక వేదాంత సమాజాన్ని స్థాపించారు. సహస్రద్వీపవనంలో ఆయన కొద్దిమంది శిష్యులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. రాజయోగాన్ని రచించారు. రెండుసార్లు ఇంగ్లండుకు విజయవంతంగా పర్యటించి, ఇప్పుడు గ్నానయోగంగా ప్రసిద్ధిపొందిన ఉపన్యాసాలను అక్కడే అందించారు. అక్కడ కొందరిని శిష్యులుగా చేసుకున్నారు. వారిలో ముఖ్యులు కెప్టెన్ సేవియర్ దంపతులు, సోదరి నివేదిత, ఇ.టి.స్టర్డీ మొదలైనవారు. అంతకుముందు జె.జె.గుడ్విన్ అనే సంక్షిప్త లేఖకుడు (Stenographer) శిష్యుడయ్యాడు. ఈ పర్యటనలోనే ఆయన మాక్స్ ముల్లర్ మహాశయుణ్ణి కలుసుకున్నారు. ఆయన యూరపుఖండాన్ని పర్యటిస్తున్నప్పుడు ప్రఖ్యాతజర్మన్ ప్రాచ్యతత్త్వవేత్త అయిన పాల్ డుస్సెన్ ను కలుసుకునారు.

                                అన్నిమతాలకూ మూలమయిన సార్వజనీన సూత్రంగా వేదాంతాన్ని పాశ్చాత్యదేశాలలో బోధించడానికి ఆయన అమితమైన కృషిచేశారు. ఆయన ప్రయత్నాలవల్ల వేదాంత ఉద్యమం సంయుక్తరాష్ట్రాలలో ఒక శాశ్వతప్రాతిపదికన వేళ్ళూనుకుంది. లండనులో కూడా ఆయన పని కొంత పురోగతి సాధించింది. ఇక ఆయన జన్మభూమి అయనను ఎలుగెత్తి పిలువసాగింది. ఆయన సందేశాన్ని అందుకోవడానికి గొప్ప ఆతృతతో ఎదురుచూస్తోంది. అందువల్ల 1896 ఆఖరులో ఆయన లండన్ నుండి భారతదేశానికి బయలుదేరారు. తన పనిని కొనసాగించడానికి అమెరికా, ఇంగ్లండులలోని శిష్యులే కాకుండా తన సోదర సన్యాసులైన శారదానంద, అభేదానంద స్వాములను కూడా వినియోగించారు.


విజయుడై తిరిగి మాతృభూమికి :

                                వివేకానంద స్వామి సేవియర్ దంపతులతో కలిసి 1896 డిసెంబర్ 16 తేదీన లండన్ నగరాన్ని వదలి బయలుదేరారు. ఇటలీలోని రోమ్ తదితర ప్రదేశాలను సందర్శించిన తరువాత డిసెంబరు 30 న నేపుల్స్ లో భారతదేశానికి వెళ్ళే ఓడను ఎక్కారు. నేపుల్స్ లో జె.జె.గుడ్విన్ వారితో కలిశాడు. వారు 1897 జనవరి 15 న కొలంబో చేరుకునారు. స్వామీజీ వస్తున్నారన్న వార్త అప్పుడే భారతదేశమంతా పాకిపోయింది. దేశమంతటా అన్నిచోట్లా జనం స్వామీజీని ఆహ్వానించాలని ఆతృతతో ఎదురుచూడసాగారు. ఆయన ఇప్పుడు ఒక "అనామక సన్యాసి" ఎంతమాత్రం కాదు. ప్రతి చిన్నాపెద్దా పట్టణంలోనూ ఆయన విజయానికి తగిన ఎదుర్కోలు పలకడానికి ఆహ్వానసంఘాలు ఏర్పాటయ్యాయి. రోమారోలా ఇలా వర్ణించాడు: "అత్యుత్సాహంతో ఎదురుతెన్నులు చూస్తున్న జనబాహుళ్యానికి తన ’భాతరదేశానికి సందేశంతో, రాముడు, కృష్ణుడు, శివుడు పుట్టినగడ్డను పునరుజ్జీవింపజేసే శంఖారావంతో, ఆ జనుల ధీరశక్తినీ, అమర ఆత్మశక్తినీ ఎలుగెత్తి పిలుస్తూ, యుద్ధరంగానికి కదనుత్రొక్కమన్నారు. ఆయన ఒక సేనాధిపతి. తన ’ఉద్యమ ప్రణాలికను’ వివరించి తన దేశప్రజలను ఒక్కుమ్మడిగా లేచిరమ్మని పిలుస్తూ, ’ఓ, నా భారత దేశమా! నీ ప్రాణశక్తి ఎక్కడుందో తెలుసా? మరణ మెరుగని నీ ’ఆత్మ’లోనే!" అని ఉద్భోధించారు. మద్రాసులో ఆయన ఐదు ఉపన్యాసాలను ఇచ్చారు. బలహీనతలనూ, పిచ్చినమ్మకాలనూ పారద్రోలి ఒక కొత్త భారతాన్ని నిర్మించమని బోధించే తూర్యనాదాలు అవి. " ఏ దేశ జాతీయజీవన సంగీతానికంతటికీ మతమే జీవస్వరమని" ఆయన బోధించారు. ఆ మతం, ’ఈ విశ్వమంతా ఆ ఆత్మస్వరూపమే’ అని బోధిస్తున్నదనీ, ఆ మతాన్ని బలోపేతం చేస్తే, మిగిలినవన్నీ వాటికవే చక్కబడతాయనీ బోధించారు. అయితే తన దేశప్రజల బలహీనతలను ఆయన విమర్శించకుండా ఉండలేదు. దేశప్రజలు గుడ్డిగా పాశ్చాత్య పద్ధతులను అనుకరించడాన్ని, పాతకాలపు పిచ్చిపిచ్చి నమ్మకాలని, కుల విభేదాలను ఆయన తూర్పారబట్టారు.

                                మద్రాసు నుంచి కలకత్తాకు ప్రయాణమై ఫిబ్రవరి 20 కి అక్కడకు చేరుకున్నారు. సొంతవూరు ఆయనకు బ్రహ్మాండంగా స్వాగతంపలికింది. ఇక్కడే స్వామీజీ తన గురుదేవులకు ఘనంగా నివాళులర్పించారు: "ఆలోచనలలో, మాటలలో, చేతలలో నేను సాధించినదేమైనా ఉంటే, ఈ ప్రపంచంలో ఏ వొక్కరికైనా మేలుచేసే ఒక్కమాటైనా నా పెదవులమీంచి రాలివుంటే దానిలో నా గొప్పతనమేమీలేదు. అది ఆయనదే! నా మాటగా గుర్తుంచుకోండి! ఈ దేశం బాగుపడదలుచుకుంటే ఆయన పేరును ఆశ్రయించవలసిందే!"

                                తన మహాత్కార్యాన్ని ఒక గట్టి పునాదిపైన స్థిరపరచడానికి స్వామీజీ సన్యాస, గృహస్థ శిష్యులందరినీ శ్రీబలరాంబోసుగారి ఇంటిలో ఏర్పాటుచేయబడ్డ సమావేశానికి రమ్మని కబురు పెట్టారు. ఆ విధంగా రామకృష్ణ మిషన్ మే, 1897 లో ఏర్పాటయింది. స్వామీజీ మిషన్ కోసం ప్రతిపాదించిన లక్ష్యాలు, ఆదర్శాలు పూర్తిగా ఆధ్యాత్మికమైనవి, మానవసేవకు ఉద్దేశించినవి. ఆయన తన భావాలకు కార్యరూపాన్ని ఇవ్వడానికి ఆ విధంగా ఒక యంత్రాంగాన్ని ప్రారంభించారు.

                                కలకత్తా నగరంలో 1898 వ సంవత్సరంలో ప్లేగువ్యాధి ప్రబలినప్పుడు సన్న్యాసుల, గృహస్థ భక్తుల సహాయంతో స్వామీజీ సహాయకార్యక్రమాలను ప్రారంభించారు. ప్లేగువ్యాధి అదుపులోకి వచ్చిన తర్వాత స్వామీజీ తమ పాశ్చాత్యశిష్యులతో కలిసి నైనిటాల్, ఆల్మోరలను దర్శించడానికి వెళ్ళారు. ఆ పాశ్చాత్య శిష్యులకు ముఖ్యంగా సోదరి నివేదితకు, ఈ కాలంలో మంచి శిక్షణ లభించింది. జూన్ 16 న స్వామీజీ వీరిలో కొందరు శిష్యులతో కాశ్మీరు వెళ్ళారు. ఈ కాశ్మీరు పర్యటన స్వామీజీకి, వారి శిష్యులకు ఒక మరుపురాని అనుభూతి. జులై చివరలో స్వామీజీ, సోదరి వివేదితతో కలిసి ’అమరనాథ్’కు వెళ్ళారు. సాంప్రదాయబద్దంగా అనుసరించాల్సిన ప్రతిచిన్న విషయాన్నీ తుచ తప్పక అనుసరిస్తూ, వంటికి బూడిద పులుముకుని, గోచీ మాత్రమే ధరించి ఆగస్టు 2 న అమరనాథ్ గుహకు చేరుకున్నారు. ఆయన శరీరంమొత్తం దివ్యావేశంతో కంపించపోసాగింది. ఒక గొప్ప యోగానుభూతి ఆయనకు కలిగింది.

                                   శివుడే తనకు స్వయంగా దర్శనమిచ్చాడన్న దానికన్నా ఆ అనుభూతి గురించి స్వామీజీ ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. దీని తర్వాత శ్రీనగర్ కు కొంతదూరంలో ఉన్న క్షీరబవాని మాత మందిరానికి స్వామీజీ ఒంటరిగా వెళ్ళారు. అదికూడా స్వామీజీకి ఒక మరువలేని అనుభూతి. ఆయన ఆ జగన్మాతలో పూర్తిగా లీనమైపోయారు. తాను వ్రాసిన కవితనే ఉదహరిస్తూ ఆయన ఇలా వర్ణించారు: "అదంతా నిజమే అందులో ప్రతి పదమూ సత్యమే. నేనే దాన్ని నిరూపించాను. ఎందుకంటే ఆ మృత్యురూపాన్ని ప్రత్యక్షంగా ఆలింగనం చేసుకున్నాను గనుక".

                                అక్టోబరు 18 కి ఆయన కలకత్తా చేరుకునే సరికి ఆయన పాలిపోయి, బాగా బలహీనపడి రకరకాల వ్యాధులతో బాధపడుతునారు. అయినప్పటికీ ఆయన అనేకపనులలో నిమగ్నమయ్యారు. గంగానది పడమరగట్టుమీద కలకత్తా నుండి ఐదు మైళ్ళ దూరంలో బేలూరు అనేచోట కొంతభూమిని కొని అక్కడ మఠనిర్మాణం ప్రారంభించారు. 1899 జనవరిలో సన్యాసులు ఆ కొత్త మఠంలోకి మారారు. ఇప్పుడది బేలూరుమఠంగా ప్రసిద్ధి పొందింది. అంతకు కొంతకాలం మునుపే ’నివేదిత బాలికల పాఠశాల’ ప్రారంభోత్సవం జరిగింది. ఇదేసమయంలో బెంగాలీ మాసపత్రిక ’ఉద్భోధన్’ను ప్రారంభించారు. హిమాలయాలలో ఒక మఠాన్ని ప్రారంభించాలన్న స్వామీజీ చిరకాల స్వప్నాన్ని సేవియర్ దంపతులు మాయావతి (ఆల్మోరా)లో అద్వైత ఆశ్రమాన్ని నిర్మించడం ద్వారా సఫలీకృతం చేశారు. ఆంగ్లమాసపత్రిక అయిన ప్రబుద్ధభారత అంతకుముందే మద్రాసులో ప్రారంభమయింది. కానీ దాని సంపాదకులు 1898 లో అకాలమృత్యువు పాలవడంతో ఒకనెల దాని ప్రచురణ ఆగిపోయింది. ఆ మాసపత్రికను స్వామీజీ శిష్యులయిన స్వరూపానంద స్వామి సంపాదకత్వంలో అల్మోరాలో మళ్ళీ ప్రారంభించారు. 1899 లో దాన్ని మాయావతి లోని అద్వైత ఆశ్రమానికి మార్చారు.

                                 ఈ కాలంలో అక్కడి సన్న్యాసులనూ, బ్రహ్మచారులనూ నిరంతరం ఉత్తేజపరుస్తూ, తీవ్రమైన ఆధ్యాత్మికతతోనూ, సేవతోనూ నిండిన జీవనంవైపు వారిని పురికొల్పారు. ఆయన మాటలలోనే చెప్పినట్టుగా , ’ఆత్మనోమోక్షార్థం జగద్ధితాయచ’ - ’తన స్వంత మోక్షానికి - జగతికి సేవచెయ్యడానికి’ - అన్న జీవితాదర్శాన్ని వారి ముందుంచారు.

                                 కానీ స్వామీజీ ఆరోగ్యం రోజు రోజుకీ దిగజారుతున్నది. ఇంకొకసారి పాశ్చాత్య దేశాలకు పర్యటించాలని ఆయన అనుకున్నారు. దానివల్లనైనా ఆయన ఆరోగ్యం బాగుపడవచ్చునన్న ఆశతో సోదర సన్న్యాసులు ఆయన నిర్ణయాన్ని సమర్థించారు.ప్రపంచాన్ని చుట్టి మరొకసారి :

                                తురీయానందస్వామిని, సోదరి నివేదితను వెంట తీసుకుని 1899 జూన్ 20 న వివేకానందస్వామి భారతదేశాన్ని వదిలి ప్రయాణమయ్యారు. స్వామీజీతో ప్రయాణం వారిరువురికీ గొప్ప శిక్షణా కార్యక్రమంగా రూపొందించింది. సోదరి నివేదిత వారి ప్రయాణాన్ని ఇలా వర్ణించారు: "మొదటి నుంచీ చివరివరకూ రకరకాల కథల సజీవస్రవంతి ప్రవహించింది. ఏ క్షణంలో ఆయనలోని అంతర్ గ్నానజ్యోతి మెరిసి, ఏ కొత్త సత్యాన్ని ఖంగుమనే ఆయన కంఠస్వరంలో వినిపిస్తోందో అన్నది ఎవరికీ తెలియదు." మార్గమధ్యంలో మద్రాసు, కొలంబో, ఆడెన్, మార్సెల్స్ మొదలైన ప్రదేశాలను తాకి, వారి ఓడ జులై 31 కి లండన్ చేరింది. ఈ ప్రయాణంవల్ల స్వామీజీ ఆరోగ్యం మెరుగుపడింది.

                                రెండువారాలు లండన్ లో గడిపి, స్వామిజీ న్యూయార్కుకు ఓడలో ప్రయాణమయ్యారు. అక్కడ శ్రీ లెగ్గెట్ దంపతులతో కలిసి హడ్సన్ నదీతీరంలో, రిడ్జిలీమానర్ అనే సుందరప్రదేశంలో ఉన్న వారి గ్రామీణకుటీరానికి వెళ్ళారు. నవంబర్ 5 వ తేదీ వరకు స్వామీజీ ఆ ఏకాంత ప్రదేశంలో గడిపారు. ఆ తర్వాత పశ్చిమతీరానికి పయనమయ్యారు. లాస్ ఏంజిల్స్, ఓక్ లాండ్, శాన్ ఫ్రాన్సిస్కోలకు వెళ్ళారు. మధ్యలో కొద్దిరోజులు చికాగో, డెట్రాయిట్ లకు కూడా పర్యటించారు. తూర్పుపశ్చిమాలు పరస్పరం సహకారం అందించుకోవడం ద్వారా మాత్రమే మరింత శక్తిమంతంగా ఎదగగలవన్న నమ్మకం ఇప్పుడు స్వామీజీకి దృఢపడింది. పాశ్చాత్యదేశాల భోగభాగ్యాల వెలుగుజిలుగులు ఆయన కళ్ళకు మిరుమిట్లుగొల్పలేదు. అదే విధంగా భారతదేశంలో ఆధ్యాత్మికతకు ఇచ్చే ప్రాధాన్యత, అక్కడి సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనాన్ని ఆయనకు కనబడకుండా దాచలేక పోయింది.

                                స్వామీజీ నివేదితతో ఇలా చెప్పారు: "పడమటి దేశాలలో సామాజికజీవనం పైపైన నవ్వుల పువ్వుల్ని పూయిస్తుంది కానీ వాటి క్రింద అది ఏడ్పులతో మొదలై వెక్కిళ్ళతో అంతమౌతుంది........ కానీ ఇక్కడ భారతదేశంలో పైపొర చీకట్లు కమ్ముకుని, చింతలతో నిండినట్టు కనిపించినా దాని క్రింద నిర్లక్ష్యం, ఉల్లాసం నిండివుంటాయి". పాశ్చాత్యసమాజం బయటి ప్రకృతిని జయించడానికి ప్రయత్నిస్తే, ప్రాచ్యసమాజం లోపలిప్రకృతిని జయించడానికి ప్రయత్నించింది. ఇప్పుడు, వారివారి ప్రత్యేకతలను నాశనం చేసుకోకుండా, చేయిచేయి కలిపి, ఒండొరుల మంచి కోసం ప్రాక్పశ్చిమాలు పనిచేసితీరవలసిన సమయం ఆసన్నమైంది. పడమరదేశాలు తూర్పునుంచి నేర్చుకోవలసినది ఎంతో ఉంది; అదే విధంగా, తూర్పు పడమర నుంచి నేర్చుకోవలసినది ఎంతో ఉంది; నిజానికి ఈ రెండింటి ఆదర్శాలనూ కలబోయడం ద్వారా మాత్రమే ఉజ్జ్వలభవిష్యత్తుకు రూపుదిద్దహలం. అప్పుడు తూర్పు పడమరలు మిగలవు - మానవజాతి ఒక్కటే మిగులుతుంది.

                                 ఈ కాలంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన ఉత్తర కాలిఫోర్నియాలో శాంతి ఆశ్రమ ప్రారంభం. తురీయానంద స్వామిని దానికి నాయకుణ్ణి చేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఒక వేదాంత కేంద్రం ప్రారంభించబడింది. ఈ మధ్య కాలంలోనే స్వామీజీ పశ్చిమ అమెరికా నగరాలలో అనేక ఉపన్యాసాలిచ్చారు. కానీ స్వామిజీకి దగ్గరపడుతున్న తమ అంత్యకాలం మరింత స్పష్టంగా కనపడసాగింది. ఆయన మిస్ మాక్లౌడ్ కు ఇలా వ్రాశారు: "ఆ ప్రశాంతతీరానికి నా నావ చేరుతున్నది. అక్కడ నుంచీ మళ్ళీ అది బయలుదేరదు!"

                                  అంతర్జాతీయ సదస్సు సందర్భంగా పారిస్ లో జరుగుతున్న మతచరిత్ర సభలలో పాల్గొనడానికి స్వామీజీ 1900 ఆగస్టు 1 న విచ్చేశారు. కొందరు స్నేహితులు కలిసి ఆయన అక్టోబరులో పారిస్ వదిలి హంగేరీ, రుమేనియా, సెర్బియా, బల్గేరియాలను దర్శించి చివరిగా కాన్ స్టాంటినోపుల్ చేరుకున్నారు. అక్కడ నుండి ఏథెన్స్ మీదుగా కైరో చేరుకున్నారు. కైరోలో స్వామీజీకి అకస్మాత్తుగా భారతదేశానికి వెళ్ళిపోవాలనిపించింది. కెప్టెన్ సెవియర్ మరణించి ఉండవచ్చునని ఆయనకు మనస్సులో తోచింది. అక్కడనుంచి బయలుదేరే మొదటి ఓడలో ఎక్కి స్వామీజీ వేగంగా భారతదేశానికి చేరుకుని 1900 డిసెంబర్ 9 న బేలూరుమఠం చేరుకునారు. తన రాక గురించి వాళ్ళకి ముందుగా తెల్పలేదు. అకస్మాత్తుగా ఆయన అలా రావడం సోదర సన్యాసులకు, శిష్యులకు పట్టలేని ఆనందాన్ని కలిగించింది. 


                              
గమ్యం చేరిన పయనం :

కెప్టెన్ సెవియర్ అక్టోబరు _______ న మరణించారన్న దుర్వార్త స్వామీజీకి మఠంలో తెలిపారు. శ్రీమతి సేవియర్ ను ఓదార్చడానికి ఆయన వెంటనే మాయావతికి బయలుదేరి వెళ్ళారు. అక్కడికి _______ జనవరి ___న చేరుకుని పదిహేనురోజులపాటు అక్కడే గడిపారు. ’అద్వైతాని’కి అంకితం చెయ్యబడిన ఈ హిమాలయాశ్రమంలోని దృశ్యసౌందర్యం ఆయనను ముగ్ధుణ్ణీ చేసింది. తన ఆరోగ్యాన్ని, తీవ్రమైన చలిని లెక్కచెయ్యకుండా ఆయన అక్కడి చెట్లలోనూ, కొలనుచుట్టూ చీకుచింతా లేకుండా, ఆనందంగా విహరించారు.

బేలూరుకు తిరిగివచ్చి ఏడువారాలపాటు అక్కడే ఉన్నారు. ఆ తర్వాత తూర్పు బెంగాలుకు, అస్సాంకు ప్రయాణమయ్యారు. ఆయాచోట్ల ఉన్న తీర్థప్రదేశాలను దర్శించాలని స్వామీజీ తల్లి భువనేశ్వరీదేవి కోరారు. స్వామీజీ మిసెస్ బుల్ కు వ్రాసిన ఉత్తరంలో, "ప్రతి హిందూ వితంతువుకూ ఉండే కోరిక ఇది. నావారికి నేనన్ని విధాలా బాధల్నే తెచ్చిపెట్టాను. ఆమెకున్న ఈ ఒక్క కోరికనీ తీర్చడానికి ప్రయత్నిస్తున్నాను." నంగల్ బంధ్, కామాఖ్య, షిల్లాంగ్ మొదలైన ప్రదేశాలను సందర్శించి, ఢాకాలోనూ, షిల్లాంగ్ లోనూ కొన్ని ఉపన్యాసాలు ఇచ్చిన తర్వాత స్వామీజీ ______మే రెండవవారంలో మఠానికి తిరిగి వచ్చారు.

ఇక స్వామీజీ మఠంలో ఎటువంటి చీకుచింతా లేని జీవితం గడపడానికి ప్రయత్నించారు. కొన్నిసార్లు గోచీ మాత్రమే ధరించి మఠమైదానాల్లో విహరించేవారు; వంట పనుల మీద అజమాయిషీ చేసేవారు; సన్న్యాసులతో కలిసి భక్తి గీతాలు పాడేవారు. కొన్నిసార్లు సందర్శకులకు ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తూ, కొన్నిసార్లు తన గదిలో అధ్యయనంలో మునిగిపోయి, కొన్నిసార్లు సన్న్యాసులకు శాస్త్రాలలోని సూక్ష్మవిషయాలను బోధిస్తూ, తన భవిష్యత్ కార్యప్రణాలికలను వివరిస్తూ కనిపించేవారు. అంతవరకూ తన పేరుమీద ఉన్న బేలూరుమఠ ఆస్తులన్నింటినీ తన సోదర సన్న్యాసుల పేర బదిలీ చేసి తన బాధ్యతలను పూర్తిగా తొలగించుకున్నారు.

జపాన్ నుండి ఇద్దరు బౌద్ధభిక్షువులు ________ సంవత్సరాంతంలో వచ్చి జపాన్ లో త్వరలో జరగబోతున్న మతసభలకు విచ్చేయమని కోరారు. వారి ఆహ్వానాన్ని మన్నించలేకపోయినా, వారితోపాటు బోధగయకు, వారణాసికి వెళ్ళారు. వారణాసిలో కొద్దిమంది యువకులు తన సందేశపు స్ఫూర్తితో పేదలకు వైద్యసహాయం అందించడం చూసి అమితంగా సంతోషించారు. వారు ప్రారంభించిన పని వారణాసిలో ఏర్పడిన రామకృష్ణమిషన్ సేవాసంస్థకు విత్తనం నాటింది.

తన అంత్యకాలం సమీపించిందని స్వామీజీకి తెలుసు. తమ ఆఖరిరోజులలో స్వామీజీ చేసిన పనులన్నీ కావాలని చేసినవే. వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెద్దచెట్టు నీడలో చిన్నచిన్న మొక్కలు పెరగవని ఆయన చెప్పేవారు. ______జులై ___వ తేదీన ఆయన ఉదయం ___ నుంచి ___వరకూ ధ్యానం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రేమానందస్వామితో కలిసి వాహ్యాళిగా నడిచి, ఒక వేదపాఠశాలను ప్రారంభించాలన్న తన ఆలోచనను ఆయనకు వివరించారు. సాయంత్రం తన గదిలో ఒక గంటసేపు ధ్యానం చేశారు. కొంతసేపు విశ్రాంతిగా పడుకున్నారు. ఆతర్వాత కొంతసేపటికి రెండుసారులు నిండుగా శ్వాసతీసుకుని మహాసమాధిలోకి ప్రవేశించారు.


ఆయన తన భౌతికశరీరాన్ని త్యజించి ఉండవచ్చుగాక, కానీ ఆయన _______లో శ్రీ ఎరిక్ హామ్మండ్ తో లండన్ లో చెప్పిన మాటలు స్వామీజీ అమరుడన్న ఊరటను మనకందరికి కలిగిస్తాయి. "నా శరీరాన్ని ఒక చింకిపాతలాగా విసిరేసి బయటికిపోవడమే మంచిదని నాకు అనిపిస్తూ ఉండవచ్చు గాక! కానీ నేను పనిచెయ్యడం మానను! తానే దైవాన్నని ఈ ప్రపంచం తెలుసుకునేంతవరకూ ప్రతి ఒక్కరికీ నేను ప్రేరణ కలిగిస్తూనే ఉంటాను".
- స్వస్తి...