వినేవాళ్లు ఉండాలేగాని - చాడీలు చెప్పే సోంబేరులకు ఏమి కొదవ?

నౌషాద్‌ అహ్మద్‌ఖాన్‌ అని ఒక హక్కులరాయుడు ఉన్నాడు. ఆయన పుట్టింది మహమ్మదీయ మతంలో. ఆ మతంలో మసీదులో నమాజును మగవాళ్లు మాత్రమే చేస్తారు. ఏ వయసు ఆడవాళ్లనూ వారితో కలవనివ్వరు. స్త్రీలను అనుమతించే కొన్ని మసీదుల్లో కూడా వారికంటూ ప్రత్యేక స్థలం కేటాయిస్తారు.  మగవారితో సమానంగా కూర్చోనివ్వరు.

అందులో మహిళల పట్ల వివక్ష ఏదీ నౌషాద్‌ సాహెబ్‌కి కనపడలేదు. ఎప్పటి నుంచో వస్తున్న ఆ మతాచారంవల్ల ఆడవారి హక్కులకు పుట్టి మునిగినట్టు అతడు ఏనాడూ కంగారుపడలేదు.

కాని- తనది కాని హిందూమతంలో తనకు ఎంత మాత్రమూ సంబంధం లేని ఒకానొక అయ్యప్ప గుళ్లో కొన్ని వయసుల ఆడవాళ్లని రానివ్వటం లేదు అని తెలిసీ తెలియగానే ఆ మనిషి తెగ తల్లడిల్లిపోయాడు. హిందూ మహిళలకు జరుగుతున్న ఆ దారుణ దురన్యాయాన్ని అరికట్టి, వారికి గల రాజ్యాంగ హక్కులను రక్షించి తీరాలని కంకణం కట్టుకున్నాడు. కట్టినదే తడవుగా తన చేతిలో ఉన్న ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ అనే దుకాణం చేత పన్నెండేళ్ల కింద సుప్రీంకోర్టులో పిల్లు (పబ్లిక్‌ ఇంటరెస్టు లిటిగేషను) వేయించాడు.

ఆ వార్త తెలియగానే పనికిమాలిన ముగ్గురు జర్నలిస్టులు (అందులో ఒకరు స్త్రీలింగం- పేరు బర్ఖాదత్‌) హిందూ మతంమీద బురద చల్లేందుకు సందు దొరికింది అంతే చాలునని ఆనందపడుతూ మూడు పత్రికల్లో ఎవరిదారిన వారు వ్యాసాలు రాశారు. వాటిని ఇంకొందరు పనికి మాలినవాళ్లు చదివి, ఔరా ఇంత అన్యాయమా అని ఆవేశపడి అర్జంటుగా అటు నుంచి అటే పోయి సుప్రీంకోర్టు వ్యాజ్యంలో ఇంటర్వీనర్లుగా తలదూర్చారు.

ఈ కొత్తవాళ్లకి శబరిమల ఎక్కడుందో తెలియదు. వాళ్లది పంజాబ్‌ రాష్ట్రం. మహిళల సమాన హక్కులు అంటూ కిందామీదా పడుతూండే వీరు ఆలయాలు వాటి ఆచారాల సంగతి బొత్తిగా ఎరుగరు. కేరళలోని శబరిమల గుళ్లో 10 నుంచి 50 ఏళ్ల లోపు ఆడవాళ్లని రానివ్వటం లేదన్న సంగతి 2006 జులైలో ఆ పత్రికల్లో చదివేంతవరకూ తమకు తెలియదని సుప్రీంకోర్టు విచారణలో చెప్పారు కూడా.

ఇలా- తమకు ఏమీ తెలియని, తమకు ఎంత మాత్రం సంబంధంలేని విషయంలో ఎవరో పనిలేనివాళ్లు అర్థంపర్థంలేని దావాను వేస్తే అన్నీ తెలిసిన సర్వోన్నత న్యాయపీఠం వారి మాటలకు విలువిచ్చి అనాదిగా వస్తున్న ఒక ఆలయ ఆచారాన్ని తుంగలో తొక్కించబూనింది.

స్వతంత్రమనబడేది వచ్చాక హిందూ సమాజానికి న్యాయవ్యవస్థ చేసిన అతి పెద్ద అన్యాయమిది. ఎవరి మతాన్నివారు, ఎవరి మత విశ్వాసాలను వారు స్వేచ్ఛగా ఆచరించటానికి రాజ్యాంగం 25వ అధికరణం పౌరులందరికీ ఇచ్చిన ప్రాథమిక హక్కును కోట్లాది అయ్యప్ప భక్తులకు అకారణంగా నిరాకరించిన రాజ్యాంగ ఉపద్రవమిది.

మత హక్కులకు సంబంధించిన వివాదాల్లో న్యాయస్థానాలు కలుగజేసుకున్న ఉదంతాలు మన దేశంలో లెక్కలేనన్ని ఉన్నాయి. మత స్వాతంత్య్రం ఇమిడిన ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇంతకు ముందు సుప్రీం కోర్టే ప్రశస్తమైన తీర్పులు ఎన్నో ఇచ్చింది. అయితే - ఫలానా మతానికి, లేక ఫలానా మత శాఖ (డినామినేషను) కు చెందిన వ్యక్తులు తమకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులకు ప్రభుత్వం వల్లో మరొకరివల్లో భంగం వాటిల్లుతున్నదని మొరపెట్టుకున్న సందర్భాల్లో మాత్రమే న్యాయస్థానం ఇప్పటిదాకా కలగజేసుకుంటూ వచ్చింది. ఉదాహరణకు - సుప్రసిద్ధమైన శిరూర్‌ కేసులో సర్కారీ ఎండోమెంట్సు బోర్డు 25, 26 అధికరణాల కింద తనకున్న ప్రాథమిక హక్కులను భగ్నపరచిందని శిరూర్‌ మఠాధిపతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చరిత్రాత్మకమైన చిదంబరం కేసులో తమిళనాడు ప్రభుత్వం బారినుంచి తమ మత హక్కులను రక్షించమంటూ నటరాజాలయ దీక్షితార్లు సుప్రీంకోర్టు శరణువేడారు.

అలాగే - శబరిమల ఆలయంలో తమని అనుమతించకపోవడంవల్ల తమ మత స్వాతంత్య్రానికి భంగం వాటిల్లిందని, నిజమైన అయ్యప్పభక్తురాళ్లు ఎవరైనా మనస్తాపం చెందితే, తమకు న్యాయం చేయవలసిందంటూ ఉన్నత న్యాయస్థానాన్ని కోరటం ఎంత మాత్రం తప్పుకాదు. వారి వేడుకోలును కోర్టు ఆలకించటాన్నీ ఎవరూ ఆక్షేపించజాలరు. కాని ఇప్పటి కేసు ఆ రకమైనది కాదు, తీరి కూర్చుని సుప్రీంకోర్టుకు పితూరీ చేసిన శాల్తీలకు అయ్యప్ప పట్ల భక్తీ లేదు, విశ్వాసమూ లేదు. అవి ఉన్నాయని వారెవరూ చెప్పుకోలేదు.

నిజంగా అయ్యప్ప మీద భక్తి , విశ్వాసం ఉన్న మహిళల్లో ఏ ఒక్కరికీ ఆలయ ఆచారం పట్ల ఎటువంటి అభ్యంతరం లేదు. దానివల్ల తమ వ్యక్తిగత హక్కులు కొల్లబోయాయనిగాని, తాము అనుచిత వివక్షకు గురి అవుతున్నామనిగాని వారిలో ఏ ఒక్కరూ అనుకోవడంలేదు.

ఎందుకంటే - అది వివక్ష కానే కాదని వారికి తెలుసు.

కేవలం మహిళలన్న కారణంచేత మహిళలెవరినీ గుళ్లలోకి రానివ్వకపోతేనే అది మహిళల పట్ల వివక్ష అవుతుంది. అలాంటిదేదీ అయ్యప్ప సంప్రదాయంలో లేదు. దేశమంతటా వేల సంఖ్యలో ఉన్న అయ్యప్ప గుళ్లకు ఏ వయసు స్త్రీలైనా నిరభ్యంతరంగా వెళ్లవచ్చు. ఆంక్ష ఉన్నదల్లా ఒకే ఒక శబరిమల సన్నిధానంలో- అక్కడైనా నిషేధం స్త్రీలందరి మీద లేదు. 10 నుంచి 50 లోపు వయసున్నవారికి మాత్రమే.

అది కూడా అడ్డగోలు నిబంధనేమీ కాదు. దానికీ సబబైన కారణం ఉంది. ఆ కారణానికి హేతుబద్ధతా ఉంది. శబరిమల సన్నిధానం ఎవరు పడితేవారు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా సరదాగా వెళ్లగలిగిన పిక్నిక్‌ కేంద్రం కాదు. అది పరశురామ క్షేత్రం. అక్కడ ప్రతిష్ఠించబడిన అయ్యప్పస్వామి నైష్ఠిక బ్రహ్మచారి. ఈడేరిన స్త్రీలను చూడనే కూడదని ఆయన నియమం. దైవసన్నిధిలో దైవాజ్ఞే శిలాశాసనం. దానిని ప్రశ్నించే తాహతు భూమిమీద ఏ శక్తికీ లేదు- అత్యున్నతమైన లౌకిక న్యాయపీఠాలతో సహా!

విచిత్రమేమిటంటే - శబరిమల సన్నిధానంలోకి ఫలానా వయసుల ఆడవారిని అనుమతించక పోవటం స్త్రీల పట్ల వివక్ష; స్త్రీలకు రాజ్యాంగం ఇచ్చిన సమానత్వ హక్కుకు గొడ్డలిపెట్టు అంటూ తమ ముందుకు వచ్చిన ప్రజాహిత (లేక ప్రజ+ అహిత ?!) వ్యాజ్యాన్ని విచారించిన రాజ్యాంగ ధర్మాసనంలో ఐదుగురు న్యాయమూర్తులున్నారు. వారందరూ ఆలకించినది ఒకే  ప్రార్థనను. అందరూ పరిశీలించింది అవే డాక్యుమెంట్లను. అందరూ విన్నవి అవే సాక్ష్యాలను. అవే వాదనలను. అందరిముందూ ఉన్నవి అవే పరిశీలనాంశాలు. అందరికీ ఒకే రాజ్యాంగం ప్రమాణం.

అయినా - నలుగురు న్యాయమూర్తులకు సత్యం ఒకలా కనపడితే ఒక న్యాయమూర్తికి వేరొకలా పొడగట్టింది. అంతేకాదు- విచారణాంశం మహిళా వివక్షకు, స్త్రీల హక్కులకు సంబంధించినది. దానిని విచారించిన ఐదుగురు జడ్జిల్లో ఒకరు మహిళ. పైగా ఆమె స్త్రీలకు ఎలాంటి అన్యాయం జరిగినా సహించే రకం కాదు. తమ ముందుకు వచ్చిన అభియోగంలో ఏ మాత్రం పస ఉన్నా మిగతావారికంటే గట్టిగా మహిళా జడ్జే స్త్రీలకు అనుకూలంగా తీర్పు చెబుతారు. కాని- ఈ కేసులో బెంచిమీది నలుగురు మగ జడ్జిలు స్త్రీల పట్ల తగని వివక్ష, సహించరాని అస్పృశ్యత అంటూ ఆలయ ఆచారాన్ని తుంగలో తొక్కాలన్నారు. ఏకైక మహిళా జడ్జి ఇందూ మల్హోత్రా మాత్రం ఇందులో వివక్ష లేదు, అస్పృశ్యత లేదు, స్త్రీ హక్కులకు ముప్పు ఎంత మాత్రం లేదు- అని నిష్కర్షగా ప్రకటించారు.

సాధారణంగా మైనారిటీ తీర్పును ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కాని - శబరిమల తాజా కేసుకు సంబంధించి అందరినీ ఆకట్టుకున్నది, భక్త ప్రజానీకం నెత్తిన పెట్టుకుని కొనియాడుతున్నదీ జస్టిస్‌ ఇందు మల్హోత్రా ఇచ్చిన అక్షర లక్షలు విలువచేసే చరిత్రాత్మక తీర్పును.

మెజారిటీ తీర్పు వెలువరించిన జడ్జిలు సామాన్యులు కారు. ఒకరు సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి. మిగతా ముగ్గురూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసి, న్యాయరంగంలో తల పండిన గండర గండలు. వారితో పోల్చితే ఇందూ మల్హోత్రా అనుభవం ఎందుకూ కొరగాదు. ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితమై కొద్ది నెలలే అయింది. అంతటి హేమాహేమీల ఉమ్మడి అభిప్రాయం ముందు సత్రకాయలాంటి జూనియర్‌ మోస్టు జడ్జి వెలిబుచ్చిన అసమ్మతికి విలువేమిటి అని తక్కువ చేయటం తప్పు. బెంచిలోని మిగతా జడ్జిల తీర్పుల కంటే జస్టిస్‌ ఇందూ మల్హోత్రా తీర్పు నిడివి తక్కువే. అయితేనేమి? మిగతా పెద్దలందరి వైఖరిలోని బోలుతనాన్ని ఆమె ఏ ఒక్క పాయింటునూ వదలకుండా, తిరుగులేని కేస్‌లా ఉటంకింపులతో ఎంతో చక్కగా బయటవేశారు. మచ్చుకు కొన్ని భాగాలు చూడండి:

  The right to move the Supreme Court under Article 32 for violation of fundamental rights, must be based on a pleading that the petitioners  personal rights to worship in this temple have been violated. The petitioners do not claim to be devotees of the Sabarimala Temple.

(ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందంటూ 32వ అధికరణం కింద సుప్రీంకోర్టు ముందుకు వచ్చేటప్పుడు ఈ దేవాలయంలో పూజించేందుకు తమకున్న వ్యక్తిగత హక్కులు భగ్నమైనట్టు చూపించగలగాలి. శబరిమల ఆలయానికి తాము భక్తులమని పిటీషనర్లే క్లెయిము చేయడం లేదు.)

Permitting PILs in religious matters would open the floodgates to interlopers to question religious beliefs and practices, even if petitioner is not a believer of a particular religion, or a worshipper of a particular shrine.

(మత వ్యవహారాల్లో ప్రజాహిత వ్యాజ్యాలను అనుమతించడం వల్ల సంబంధిత మతంలోగాని, సంబంధిత పూజామందిరం మీదగాని ఎలాంటి విశ్వాసంలేని కజ్జాకొర్లకు ఆయా మత విశ్వాసాలను, విధానాలను సవాలు చేసేందుకు ఫ్లడ్‌ గేట్లను తెరిచినట్లు అవుతుంది.)

మరి భారత రాజ్యాంగం (14వ అధికరణం) పౌరులందరికీ సమానత్వ హక్కును ఇచ్చింది కదా? ఒక వర్గం మహిళలను శబరిమల గుడిలోనికి అనుమతించకపోవటం ఆ ప్రాథమిక హక్కుకు భంగకరం కాదా?

ఔను. కచ్చితంగా భంగకరమే అని మెజారిటీ తీర్పు బల్లగుద్ది చెప్పింది. జస్టిస్‌ ఇందు మల్హోత్రా అది ఎంత మాత్రం భంగకరం కాదని సహేతుకంగా వివరించారు ఇలా :

''14వ అధికరణం సమానత్వ హక్కును ఇచ్చినట్టే 25, 26 అధికరణాలు మతాన్ని స్వేచ్ఛగా ఆచరించుకునే హక్కును ఇచ్చాయి. అది కూడా ప్రాథమిక హక్కు కిందికే వస్తుంది. మత విషయాలు, మతాచరణకు సంబంధించినంతవరకూ 14వ అధికరణం కింద సమానత్వ హక్కు ఆ ఫలానా మతానికి, విశ్వాసానికి మతశాఖకు చెందినవారికి మాత్రమే ఉంటుంది. తాము అయ్యప్పస్వామి భక్తులమనిగాని, శబరిమల ఆలయంలో పాటిస్తున్న పద్ధతులవల్ల తమకు అన్యాయం జరిగిందనిగాని పిటిషనర్లు చెప్పడం లేదు. అక్కడ అనుసరిస్తున్న పద్ధతి మహిళల పట్ల వివక్ష అని పిటిషనర్లు వాదిస్తున్నారు. కాదు; మా మతవిశ్వాసాల ప్రకారం మేము నడుస్తున్నామని ప్రతివాదులు అంటున్నారు. ఆ ఆలయానికి సంబంధించినంత వరకూ అది తప్పనిసరి అయిన మతాచారం (essential religious practice) అని వారి వాదన. మతాచరణ స్వేచ్ఛ కూడా ప్రాథమిక హక్కే. కాబట్టి మత వ్యవహారాల్లో 14వ అధికరణపు సమానత్వ సూత్రాన్ని బయటివారి నిమిత్తం చొప్పించాలని చూస్తే ఇబ్బంది అవుతుంది. దాని మూలంగా మత విశ్వాసాల, మతవిధానాల మంచి చెడ్డల హేతువులను న్యాయస్థానం సమీక్షించవలసి వస్తుంది.

“It is not for the courts to determine which of these practices of a faith are to be struck down, except if they are pernicious, oppressive, or a social evil like sati... the issue of what constitutes as essential religious  practice is for the religious community to decide.’’

(సతీసహగమనం వంటి నికృష్టమైన సామాజిక దురాచారాలను మినహాయిస్తే ఒక మతానికి చెందిన ఆచారాలలో వేటిని కొట్టివేయాలన్నది నిర్ణయించటం కోర్టుల పని కాదు.... ఏది అతి ముఖ్యమైన మతాచారం అన్నది ఆ మతంవారే నిర్ణయించుకోవాలి.)

శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్లలోపు స్త్రీలను రానివ్వకపోవటం దురాచారం కాదా? పైన పేర్కొన్న మినహాయింపు దానికి వర్తించదా? ఈ సందేహానికి జస్టిస్‌ ఇందు మల్హోత్రా ఇచ్చిన జవాబు ఇది :

''ఒక్క శబరిమలలో తప్ప అయ్యప్పస్వామి దేవాలయాలు వేటిలోనూ మహిళల ప్రవేశానికి పరిమితి లేదు. అన్ని వయసుల మహిళలందరూ ఆ గుళ్లకు వెళ్లి స్వేచ్ఛగా అర్చించవచ్చు. కాబట్టి లింగపరమైన సమానత్వానికి ఢోకా లేదు.

''కేవలం లింగ ప్రాతిపదికన వివక్ష చూపటం 15వ అధికరణం కింద నేరం. శబరిమలలో మొత్తంగా స్త్రీల ప్రవేశం మీద నిషేధం లేదు. అక్కడ ప్రవేశాన్ని రిస్ట్రిక్ట్‌ చేసింది కేవలం ఒక వయోవర్గానికి చెందిన మహిళల మీదనే. అదికూడా వివక్ష చూపాలని కాదు. అక్కడ దేవుడు 'నైష్ఠిక బ్రహ్మచారి'గా ఉన్నాడన్న ప్రగాఢ విశ్వాసం వల్లనే అలాంటి పరిమితి పెట్టారు. అది కూడా రాజ్యాంగానికంటే ముందు నుంచే అమలులో ఉంది. 'భూతనాథ గీత' అనే స్థల పురాణంలో అనేక శతాబ్దాల కిందటే ఆ నిషేధం విధించబడింది.

''వయసు మళ్లిన స్త్రీలు, చిన్న అమ్మాయిలు ఈ గుడికి వెళ్లవచ్చు. కాని రజస్వల అయ్యాక ఒక వయసు వచ్చేంతవరకు మహిళల మీద నిషేధం ఉంది.'' అని  1893,1901 సంవత్సరాల్లో ప్రచురించిన ''Memoir of the Travancore and cochin states'' సర్వే రిపోర్టులో Lieuntenants ward and conner శబరిమల ఆలయ విషయంలో పేర్కొన్నారు.

''ఆచారం, వాడుక కూడా శాసనం కిందే పరిగణింపబడుతాయని  రాజ్యాంగ 13(3)(ఎ) అధికరణం నిర్దేశిస్తున్నది. చెల్లుబాటయ్యే ఆచారానికి లక్షణమేమిటంటే అది పూర్వం నుంచీ చిరకాలంగా పాటింపబడాలి. సమంజసమైనదిగా ఉండాలి. అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉండాలి. పైన ప్రస్తావించిన ఆచారాలు, వాడుకలు శబరిమలలో అనేక శతాబ్దాలుగా అమలవుతున్నాయనడానికి సాక్ష్యాలు ఉన్నాయి. దేవతామూర్తి 'నైష్ఠిక బ్రహ్మచారి' అన్న కారణంతో అక్కడ అనుమతించని ఒక వయోవర్గంవారు మినహా మిగతా, మహిళల మీద శబరిమలలో కూడా నిషేధం లేదు. దేవతామూర్తి పవిత్రతను, దేవతాతత్వాన్ని పరిరక్షించే ఉద్దేశంలో మాత్రమే ఆ పరిమితి ఆంక్షను విధించారు. దానిమీద అయ్యప్పను కొలిచే భక్తురాళ్లలో ఎవరికీ అభ్యంతరం ఉన్న దాఖలాలు లేవు. ".

8⃣0⃣9⃣6⃣3⃣3⃣9⃣9⃣0⃣0⃣


---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Google Map : Ram Karri

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------