ఫిబ్రవరి 21
నా ప్రియ మిత్రులు అయిన తెలుగు భాషాభిమానులకు
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు
ఆత్మగౌరవాన్ని ప్రసాదించే మాతృభాషను అభిమానించడం ప్రతి ఒక్కరి భాద్యత. అమ్మ భాషను గౌరవిస్తే ఆత్మ గౌరవం పెరుగుతుంది. దాంతో భాషకి పటుత్వం పెరుగుతుంది. భాష ప్రాముఖ్యతను గుర్తించినప్పుడే ఆ భాషకి ఖ్యాతి పెరుగుతుంది. ఏ జాతి అయితే మాతృభాషను కీర్తిస్తుందో ఆ జాతి మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే మనందరం మన మాతృభాషలో మాట్లాడుకుందాం! తెలుగు భాష ఔనత్యాన్ని పెంచుదాం!!
“తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స ”
------------------------శ్రీ కృష్ణదేవ రాయలు
నిండుచెరువున స్వచ్చమో నీటిభాష
పండిపకపక నవ్వెడు పైరుభాష
చెట్టుచుట్టును తిరిగెడి పిట్టభాష
తేనెపనసలతోట నా తెలుగుభాష
............. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
“జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె? ”
-------------------- వినుకొండ వల్లభరాయడు
“సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు? ”
----------------------మిరియాల రామ కృష్ణ
మాతృభాషపై మమకారం పెంచుకున్న ఎందరో మహనీయులు తేనెలూరు తెలుగును కాపాడేందుకు శ్రమించారు.
ఆంగ్లేయుల పాలన వచ్చేవరకు మనం ప్రజల భాష గురించి ఆలోచించలేదు. ఆలోచించి ఉంటే- మనది బానిసదేశమై ఉండేది కాదు. ఇంగ్లిషువాళ్లు కొత్త బడులు పెట్టారు. కొత్త చదువులు మొదలుపెట్టారు. కొత్త పుస్తకాలు రాయించారు. అన్నిటికీమించి అందరికీ చదువు అనే ఆలోచన పెంచారు. కొత్త విద్యార్థులు ఎందరో బడిబాట పట్టారు. అప్పుడు కొత్తభాష అవసరమైంది. ఈ దశలో పద్యం జోరు తగ్గింది. వచనం హోరు మొదలైంది. శతాబ్దాలుగా పుస్తకాల్లో వాడే కట్టుదిట్టమైన భాషలో రాయాలని కొందరన్నారు. వాళ్లకు చిన్నయసూరి నాయకుడయ్యాడు. చిన్నయసూరి పుట్టి రెండు వందల ఏళ్లయినా, ఇప్పటికీ భాష ఆయన కనుసన్నల్లో మెలగాలని అనుకునేవాళ్లు లేకపోలేదు.
ప్రజల భాషలో రాయడం ప్రపంచం అంతటా ఉన్న పద్ధతి. కాబట్టి మాట్లాడే భాషలోనే రాయాలని కొందరన్నారు. వాళ్లకు గిడుగు రామ్మూర్తి పంతులు నాయకుడయ్యారు. ఆయన పుట్టడానికి కొన్ని దశాబ్దాల ముందునుంచీ వాడుక భాషలో రాసిన వాళ్లున్నారు. ఏనుగుల వీరస్వామయ్య, సామినీన ముద్దు నరసింహం, గురజాడ అప్పారావు లాంటివారు వాడుక భాష విషయంలో గిడుగు కంటే ముందు అడుగువేసినవారిలో ప్రసిద్ధులు. గిడుగు కారణంగా 1906నుంచి వాడుక భాషలో రాయాలన్నది ఒక పెద్ద ఉద్యమమైంది
ఈ పోరులో దొంగదారిలో నెగ్గిన గ్రాంథిక శైలి ఏభై ఏళ్లపాటు (అ)యోగ్యతా పత్రాలనిచ్చే బడుల్లో చలామణి అయింది. అయినా, వాడుక భాష ప్రజల్లో బలంగా నాటుకుంటూ నూరేళ్లలో అత్యున్నతస్థాయికి చేరింది. అధికారం దిగివచ్చి ఆ బావుటా కింద తలవంచి నిలిచింది. ప్రజలు ఎదిగినప్పుడు పాలకులు ఒదగక తప్పదు కదా! గిడుగు లేకపోతే ఈ గెలుపు ఇంత త్వరగా మనకు కైవసమై ఉండేది కాదు.
ప్రస్తుతం తెలుగునేలపై మాతృభాష కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే మనం మాట్లాడే తెలుగుభాషలోనే పరిపాలన సాగాలని, అందుకు ప్రత్యేక రాష్ట్రం అవసరమని 1913లో బాపట్లలో జరిగిన ఆంధ్ర మహాసభ తీర్మానించింది. ఉద్యమం ప్రారంభమైన 40 ఏళ్ల అనంతరం పొట్టి శ్రీరాములు బలిదానంతో 1953లో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. వావిలాల గోపాలకృష్ణయ్య తెలుగుభాషాభివృద్ధికి చేసిన పోరాటం తెలుగు ప్రజలు మరువలేనిది. దాని ఫలితంగా తెలుగును అధికార భాషగా గుర్తిస్తూ 1964లో చట్టం చేశారు.
- స్వస్తి...