‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటూ మన సముద్రాల గారు ఆనాడే అన్నారు. నిజమే. పొరపాటైతే లేదు. తప్పు అంతకన్నా లేదు. కానీ ఈ జనాలున్నారే.. కొంచెం వింతండీ. దేన్ని గొప్పగా చూస్తారో, దాన్నే తక్కువ చేసి కూడా మాట్లాడతారు. నేడు (August 13th) ‘వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే (అంటే ఎడమ చేతి వాటం గాళ్ళ దినోత్సవం)’ సందర్భంగా ఈ పొరపాటు కానిదాని గురించి, దాన్ని తక్కువ చేసి చూసిన విధానం గురించి కొంచెం మాట్లాడుకుందాం.
పరిచయం :
ఇంజనీరింగ్ కొత్తలో.. ఎవ్వడూ ఇంకా కాలేజీ ముఖం కూడా చూసి ఉండని సమయంలో.. అన్ని గ్రూపులను (సివిల్‌లో నీకు నచ్చినట్టు కనిపించిన అమ్మాయితో సహా..) ఒకే క్లాస్‌లో పడేసి ఒక ఇంట్రో క్లాస్ నడిపిస్తున్న రోజు..
మ్యాథ్స్‌లో చిన్న ప్రాబ్లమ్.. బోర్డ్‌పై రాసి, సాల్వ్ చేయమని సార్ అందరినీ అడుగుతాడు. ఎప్పట్లానే అందరం బయటకు కనబడని నవ్వు ముఖాలు పెడతాం. అదిగో అప్పుడు లేస్తాడండీ వీడూ (వీడంటే నేనే). టక టకా బోర్డ్‌పై సొల్యూషన్ రాసేసి నవ్వుతూ అందరినీ ఓ చూపు చూస్తాడు. అప్పుడు అంటాడు మన సార్.. “హే నువ్వు లెఫ్ట్ హ్యాండరా? లెఫ్ట్ హ్యాండెడ్ స్టూడెంట్స్ షార్ప్ అని విన్నా. నిజమే!” అని. మనం అదే స్టైల్ నవ్వు విసిరేస్తాం.
గంట తర్వాత ఒకమ్మాయి (ఆ! ఆ! ఆ అమ్మాయే!), “హే నువ్వు లెఫ్ట్ హ్యాండరా? యూ గయ్స్ లుక్ సో స్పెషల్” అంటుంది నవ్వుతూ. మనమూ ఓ నవ్విసిరేస్తాం. ఇందాకటిలా కాదులే!
“రేయ్.. రేయ్.. నువ్వు చెప్పాల్సిందేంటి? చెబుతుందేంటి? అసలు కథ చెప్పు..”
సారీయే!
అసలు కథ :
అమ్మతో మాట్లాడే కొన్ని లక్షల మాటల్లో.. ఒకానొక సాయంత్రం..
“అమ్మా.. నేనీ ఎడం చేయ్యొన్నని ఎప్పుడు, ఎట్ల గుర్తు పట్టినవ్?”
“చిన్నప్పట్నించీ నువ్వు అన్నీ ఈ చేయితోనే చేస్తుండేటోనివి రా. స్కూల్ల గూడ అదే చేయి పట్టినవ్. మొదట్ల కొట్టిన గానీ, తర్వాత వదిలేసిన” అంటూ చాలా విషయాలు చెప్పుకుపోయింది. ఒకటి కన్‌ఫర్మ్.. నువ్వు ఏ చేయితో రాస్తావనే దాన్నిబట్టే నువ్వు లెఫ్ట్ హ్యాండరా? కాదా? అని డిసైడ్ చేస్తాం. ఇక ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం..
1. అమ్మో.. అది మహా పాపం..!
ఏదో చిన్ని జీవితం పట్ల ఓ ఊహ వచ్చిందనుకున్నాక మొదట వినిపించేవివి. ఎడమ చేత్తో డబ్బులిస్తే.. ఏయ్ ఆ చేత్తో ఇస్తావేం.. అలా చేస్తే మహా పాపం, ముందు కుడి చేత్తో ఇవ్వడం అలవాటు చేస్కో! మొదట్లో అస్సలు అర్థమయ్యేది కాదు వాళ్ళేమనేవారో! ఆ అయోమయపు ప్రశ్నల ఫలితం.. ఇప్పుడు డబ్బులు ఎడమ చేత్తో లెక్కపెట్టి కుడిచేతిలోకి నోట్లను ట్రాన్స్‌ఫర్ చేసి వెకిలి నవ్వుతో ఇవ్వడం. ఎంత రిస్కో కదా? ఇక చేత్తో తినడం విషయంలో మామూలుగా కుడి చేయి అలవాటైపోతుంది కానీ, స్పూన్ చేతికొస్తే అనుకోకుండానే ఎడమ చేయి ముందుకొచ్చేస్తుంది. అప్పుడు పక్కనున్న జనాలను చూడాలీ..!
2. స్కూల్లో.. షార్ప్‌నర్, చైర్స్ అన్నీ మీకోసమే!
పెన్సిల్ చెక్కాలి. షార్ప్‌నర్ చేతిలో ఉంది. కానీ వల్ల కావడం లేదే! రెండూ ప్యారెలల్‌గా తిప్పుతూ పోతుంటే పెన్సిల్ ఇరిగిపోవడమే తప్ప చెక్కలేనే! మళ్ళీ దీనికి ఇంకొకడిని అడగాలి. మీకు ఆరు రోజులొచ్చే పెన్సిల్ నాకు మూడో రోజు కూడా మిగలదు తెల్సా! ఇక పక్కనోడితో బెంచీ షేర్ చేసుకోవడంత ఇబ్బంది ఇంకొకటి ఉండదు. వాడి చేత్తో నీ చేతికి ఎప్పుడూ యుద్ధమే! చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాడేప్పుడూ నీ బెస్ట్ ఫ్రెండ్ అయ్యుంటాడు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఒక్కోసారి వేరే సెంటర్‌లో ఎగ్జాం రాయాలి. సెంటర్‌కి వెళ్ళి చూస్తే.. మొత్తం మీకోసం తయారు చేసిన కుర్చీలే ఉంటాయ్! అప్పుడుంటుంది చూడూ.. ఒక్కోసారి కాలేజీ మేనేజ్‌మెంట్‌తోనే గొడవ పడాల్సి వస్తుంది. ఇక ఇంక్ పెన్ (మామూలుగా అన్నీ ఇంక్ పెన్లే అనొద్దు ప్లీజ్)తో రాసినప్పుడు.. చేయి చూడాలి. కొన్ని చెప్పుకోలేమంతే!
3. అరేయ్.. డ్రాఫ్టర్ ఎవడ్రా కనిపెట్టింది?
డ్రాఫ్టర్.. ఇంజనీరింగ్ అబ్బాయి/అమ్మాయి ఫస్టియర్‌లో పోజ్ కొట్టడానికి పనికొచ్చే ఓ సెటప్‌లే! అరేయ్ ఎవడ్రా అది కనిపెట్టింది? ఇక్కడ ఎడమ చేత్తో కొంతమంది రాస్తారూ (గీస్తారూ..) వాళ్ళ గురించీ ఆలోచించాలా లేదా? మార్కెట్‌లో ఉంటాయి కదా అనొద్దు. ఇండియన్ మార్కెట్లో (ఆన్‌లైన్లో కాదు.. మామూలు ధరకు చూపించు). అక్కడ ఆయన గారేమో నేను రెండు బొమ్మలు చూపిస్తా.. మీరు ఓ నాలుగేస్కురావాలి అంటాడు. శ్రీమంతుడులో డైలాగ్.. “చేయలేనండీ.. పైగా ఆ గీసిన రెండింటినే చెరిపి చెరిపి గీసుకోవాల్సొస్తుంది” అనాలనిపిస్తుంది. ఏం చేస్తాం.. ఒక్క సంవత్సరమే కాబట్టి నెట్టుకొస్తాం.. కొంచెం మమ్మల్నీ పట్టించుకోండ్రా.. ఎనిమిది శాతం జనాభారా!!!
4. రోజువారీ కష్టాలు..
ఏటీఎం.. సరే వదిలేయ్!
బ్యాగ్ జిప్పులు.. సరే వదిలేయ్!
కంప్యూటర్ మౌస్.. సరే వదిలేయ్!
కాఫీ కప్పులు.. సరే వదిలేయ్!
కత్తెర, వాచీలు కూడా వాడలేక సచ్చిపోతున్నాం. వాచీ అంటే పర్సనల్ ఇబ్బంది అనుకుందాం. పెద్దగా టైమ్ బాలేదని వదిలేద్దాం. కత్తెర.. ఓ పదిహేను నిమిషాలు కత్తెర ఎడమ చేత్తో వాడు, లేదా కుడిచేయితో అలవాటు చేసుకొని వాడు.. దిమ్మ తిరిగిపోద్ది తలనొప్పితో! ఇవన్నీ చిన్న విషయాలే.. బ్యాంక్‌లో మూలకు పెట్టిన పెన్, నీళ్ళ గ్లాస్ దగ్గర్నుంచీ ఈ లిస్ట్‌లో చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు గుర్తుకు రావు. వాటితో పనిపడ్డప్పుడు ఇబ్బంది పెట్టకా మానవు.
5. ఏంటి.. నీది పుర్ర చెయ్యీ?
ఇంతకీ ఈ పుర్ర చెయ్యేంటో నాకు ఇప్పటికీ తెలియదు. అదలా ఉంచితే ఆ ప్రశ్న అడిగేవాళ్ళలో రెండు రకాలుంటారు. సివిల్ అమ్మాయిలా అందంగా, ఆశ్చర్యంగా అడిగేవాళ్ళతో ఎవరికీ ఇబ్బందిలేదు. చెప్పాలంటే.. కొంచెం ఇష్టం కూడా. ఈ అందం, ఆశ్చర్యం స్థానంలో అయోమయం, అసహ్యాన్ని పట్టుకొచ్చే వాళ్ళతోనే ఇబ్బందంతా! ఇంకొందరైతే ఏకంగా ఏంటి తినడం కూడా అదే చేత్తోనా అంటారు. నాకు వీళ్ళనేమనాలో అర్థం కాదు. సమాజంలో మనం చూస్తూ ఉన్న వేల కోట్ల డిస్క్రిమినేషన్‌లలో ఇదొకటి అని నవ్వుకోవడం తప్ప ఏమీ చేయలేం!
సరే.. ఇబ్బందులు, బాధలు ఎక్కువైనట్లున్నాయి.. టక్కున కొన్ని నిజాలు చెప్పుకుందాం..
1. ప్రపంచ జనాభాలో 8 శాతం మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని అంచనా.
2. లెఫ్ట్ హ్యాండర్స్ అని చెప్పడానికి 90 శాతం మంది రైటింగ్‌నే ప్రామాణికంగా తీసుకుంటారు.
3. తల్లి కడుపులో ఉన్నపుడే లెఫ్ట్ హ్యాండర్స్ లక్షణాలను గమనించవచ్చని సైన్స్ ఋజువు చేసింది.
4. లెఫ్ట్ హ్యాండర్స్ మెదడులోని కుడి భాగాన్ని ఎక్కువగా వాడటమనే కాన్సెప్ట్ వల్ల వాళ్ళు సాధారణంగానే యమా షార్ప్ (మనలాగా!!)
5. లెఫ్ట్ హ్యాండర్స్ జీవిత కాలం రైట్ హ్యండర్స్ వాళ్ళతో పోలిస్తే తక్కువ. ఇది అసలు వేరే ఆలోచన.
6. లెఫ్ట్ హ్యాండర్స్‌కి కోపమెక్కువ అని టాక్ (నా వరకు ఇది రూమర్ అనిపిస్తుంటూంది :P)
7. లెఫ్ట్ హ్యాండర్స్ బాగా తాగుతారు (ఇది కూడా రూమరెహే!)
ముగింపు :
ఇదోయ్ అసలు విషయం.
చివరగా ఒక చిన్న విషయం చెప్పుకోవాలి. అమెరికా అధ్యక్షుల్లో 80 శాతం మంది (ఒబామాతో సహా) లెఫ్ట్ హ్యాండర్స్ అన్న విషయం తెలిసినపుడూ, మన ఫేవరైట్ సచిన్ టెండూల్కర్ లెఫ్ట్ హ్యాండర్ అని తెలిసినపుడు, మన అమితాబ్ బచ్చన్ లెఫ్ట్ హ్యాండర్స్ అన్న విషయం తెలిసినపుడు.. ఇంకా ఇంకా ఈ లిస్ట్ పెరిగిపోతూ ఉన్నపుడూ.. పైన పడ్డ ఇబ్బందులన్నీ ఒక్క దెబ్బలో కొట్టుకుపోతాయ్! ఒక కొత్త ఎనర్జీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
ఫైనల్‌గా.. అందరూ అంటూంటారు. ‘మాకూ గుర్తింపు ఇవ్వండి’ అని. మేము అడగం. మేమే ఒక గుర్తింపు తెచ్చుకుంటాం. హ్యాపీ లెఫ్ట్ హ్యాండర్స్ డే!!!
(ఈ ఆర్టికల్ రాసినది వి. మల్లికార్జున్, ఒక ఎడమ చేతి వాటం గల రచయిత.)