క్షమాగుణo

మన మనసులో రెండు వైరుధ్య భావాలుంటాయి.
ఒకటి క్షమించడం.
రెండోది పగతీర్చుకోవడం.
ఈ రెంటికీ సదా సమరం జరుగుతూ ఉంటుంది. అదే 'కురుక్షేత్రం'.
క్షమ గెలిస్తే హృదయం ఆనందమయం. మనసులో అంతులేని సంతోషం. మనిషికి తృప్తి. మనలో ఉండే ప్రేమ ఎప్పుడూ 'క్షమించు క్షమించు' అని చెబుతూనే ఉంటుంది. *ప్రేమిస్తే ప్రేమను పొందుతాం. ద్వేషిస్తే ద్వేషాన్నే తిరిగి పొందుతాం.*

'గుండెలో పగ దాచుకోవడం అంటే పామున్న ఇంటిలో ఉండటమే' అంటుంది భారతం. పగవల్ల పగపోదనీ, ఏ విధంగా చూసినా పగని వడళ్లలేయడం లెస్స అనీ భారత మహేతిహాస ఉద్బోధ!

'నా కన్ను నువ్వు పొడిస్తే నీ కన్ను నేను పొడుస్తా' అని 'కన్నుకు కన్ను పన్నుకు పన్ను' సిద్ధాంతంతో అందరూ ముందుకు దూకితే- లోకం అంతా గుడ్డివాళ్లతో, బోసి నోటివాళ్లతో నిండిపోతుంది. *ఈ పగ, ప్రతీకారం అనే విషచక్రం నుంచి బయటపడాలంటే క్షమించడం ఒక్కటే ఉపాయం.*
 ఇందువల్ల రెండు లాభాలు. ఒకటి- క్షమించేవారు ఆదర్శ వ్యక్తులుగా గౌరవం పొందుతారు. రెండోది- క్షమ పొందేవారు తమ జీవితాలను సరిదిద్దుకుంటారు. క్షమాగుణం శత్రువును సైతం మిత్రుడిగా మార్చేస్తుంది.

 'పొరపాటు మానవ సహజగుణం. క్షమ దైవ విశిష్టగుణం' అని ఆంగ్ల సామెత. మహాభక్తుల జీవితాలన్నీ ప్రేమమయాలు.

ఏకనాథుడు పాండురంగడి భక్తుడు. ప్రశాంతచిత్తుడు. సదా స్వామి సేవలో, భజనలో కాలం గడిపేవాడు. ప్రజలందరూ ఆయన్ని ప్రశంసించడం చూసి కొందరు ఈర్ష్యపడ్డారు. ఎలాగైనా ఏకనాథుడికి కోపం తెప్పించాలని ప్రయత్నించసాగారు. ఒక దుష్టుడికి డబ్బు ఆశచూపి, ఆ పనికి నియోగించారు. ఏకనాథుడు రోజూ తెల్లవారుజామునే నదిలో స్నానం చేసి వచ్చేవాడు. ఆ సమయంలో ఆ దుష్టుడు ఏకనాథుడిపై ఉమ్మి వేశాడు. ఏకనాథుడు ప్రశాంత చిత్తంతో, చిరునవ్వు చెరగనీయకుండా వెనక్కి వెళ్లి నదీ స్నానం ఆచరించాడు.. ఇలా మొత్తం 107-సార్లు జరిగింది.
ఏకనాథుడు ఏమాత్రం నిగ్రహం వీడకుండా, మందస్మిత వదనంతో అన్నిసార్లూ మరల మరల స్నానం చేసి వస్తున్నాడు. దీంతో ఆ కుటిలుడి హృదయం చలించిపోయింది! ఆయన ఏకనాథుడి కాళ్లపై పడ్డాడు. 'స్వామీ, మీరు నిజంగా దైవస్వరూపులు. మీ నిగ్రహం చెడగొట్టి, ఎలాగైనా మీకు కోపం తెప్పించాలని కొందరు నన్ను పురమాయించారు. మీకు ఆగ్రహం తెప్పించగలిగితే నాకు ధనం ఇస్తామని ఆశచూపారు.
మీ క్షమాగుణం తెలియక నేనీ నీచకృత్యానికి అంగీకరించాను!' అన్నాడు ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో. ఏకనాథుడు అతడికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు.
'నాయనా, నీవు నాకెంతో మేలుచేశావు. *నాచేత 108-సార్లు పవిత్ర నదీస్నానం చేయించిన మహానుభావుడివి నువ్వు!*
నేను నీ మేలు ఎన్నటికీ మరచిపోను!'* ఏకనాథుడి పలుకులు విని అవతలి వ్యక్తి నిర్విణ్నుడయ్యాడు.
ఏకనాదుడి క్షమాగుణం ఆ ఉమ్ము వేసిన వ్యక్తి హృదయాన్ని ప్రక్షాళనం గావించింది.
పశ్చాత్తాపంతో అతడు కన్నీరు కార్చాడు.

క్షమ అంటే భూమి. భూమి ఓర్పుగల తల్లి కనుకనే మనం ఎంత బాధపెట్టినా భూమాత మనపై పగ తీర్చుకోవాలనుకోదు. క్షమించే గుణం ఉన్నది కదా అని మనం భూమాతను అదేపనిగా హింసించకూడదు. క్షమాగుణానికీ హద్దులుంటాయని గుర్తుంచుకోవాలి! క్షమాగుణం పురాణాలకు, ప్రాచీన ఇతిహాసాలకే పరిమితం కాదు. ఇటీవలి చరిత్రలో క్షమాగుణంతో చరితార్థులైన మహాపురుషులెందరో ఉన్నారు.
ఆర్యసమాజ స్థాపకులైన మహర్షి దయానంద నిష్కాపట్యం, నిర్భయత్వం సమాజంలో అనేకులకు కంటగింపైంది. ఆయన వద్ద వంటవాడికి లంచం ఇచ్చి, ఆహారంలో విషం పెట్టించారు. దయానందులు మృత్యుశయ్యపై ఉన్నారు. తన వంటవాడిని దగ్గరకు పిలిచారు. కొంత డబ్బు అతడి చేతిలో పెట్టి ఇలా అన్నారు. 'వెంటనే నువ్వు నేపాల్‌కి వెళ్లిపో! నా శిష్యులకు నువ్వు చేసిన పని తెలిస్తే నిన్ను బతకనీయరు!'

తనకు ప్రాణహాని కలిగించిన వ్యక్తిని సైతం క్షమించి, అతడికి ప్రాణదానం చేసిన మహర్షి దయానంద చరితార్థులయ్యారు.

 క్షమాగుణం మానసిక రుగ్మతలకు మంచి మందు.
 పగతీర్చుకుంటే ప్రశాంతత చిక్కుతుందనుకోవడం కేవలం భ్రాంతి మాత్రమే! నిజానికి అభద్రత మిగులుతుంది. చిత్తవికారం ఏర్పడుతుంది. చివరకు జీవితం విషాదాంతం అవుతుంది.

ఒక అరబ్బీ సామెత ఇలా చెబుతుంది-

ఇతరులుమనకు చేసిన అపకారాలను ఇసుకపై రాయాలి.
ఇతరులు మనకు చేసిన ఉపకారాలను చలువరాయిపై చెక్కుకోవాలి!'
                                                           
🌿🌼🌿🌼🌿🌼🌿


---------------------------------------------------------

૨αɱ ҡα૨૨เ

ᵇˡᵒᵍᵍᵉʳ, ᵖᵒᵉᵗ, ʷʳⁱᵗᵗᵉʳ, ˡʸʳⁱᶜⁱˢᵗ, ˢᵒᶜⁱᵃˡ ᵃᶜᵗⁱᵛⁱˢᵗ, ʲᵒᵘʳⁿᵃˡⁱˢᵗ , ᵉⁿᵗʳᵉᵖʳᵉⁿᵉᵘʳ, ᵗᵉᶜʰ ᵍᵘʳᵘ, ᵐᵒᵛⁱᵉ ᵈⁱʳᵉᶜᵗᵒʳ, ᵖᵒˡⁱᵗⁱᶜⁱᵃⁿ, ᵖʳᵉˢⁱᵈᵉⁿᵗ ᵒᶠ ᵗᵉˡᵘᵍᵘ ˢᵃᵐʳᵃᵏˢʰᵃⁿᵃ ᵛᵉᵈⁱᵏᵃ.

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- -

Whatsapp : +918096339900 ,
Phone        : +919492089900 .

--- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- ---- --- --- --- -- -


Web Sites & Blogs :

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- --- -- ---
Google Map : Ram Karri

----------------------------------------------------------- సమాప్తం -------------------------------------------------------------