పూర్వం, చదరంగం అంటే ప్రాణం సైతం ఇచ్చే ఒక రాజు వద్దకు ఒక ఘనపాటి యైన వేద పండితుడు వచ్చి, ఒక ఘన పనసతో రాజును ఆశీర్వదించాడు. చదరంగం పిచ్చిగల రాజు " వేదం నేనైనా నేర్చుకొని చెప్పగలను, కానీ నాతో చదరంగం  కేవలం 20 ఎత్తులైనా ఆడగలవా! అలా ఆడితే నువ్వు కోరింది ఇప్పిస్తానన్నాడు. 


 "రాజా, నాకు చదరంగం వస్తుంది.  కానీ, మిమ్మల్ని సంతోష పఱచడానికి మాత్రమే ఆడతానని, రాజుతో చదరంగం ఆడి 20 ఎత్తులు విజయవంతంగా పూర్తి చేశాడు. ఎవరో ఒకరు గెలిచేదాకా ఆడమన్నాడు రాజు. కానీ అతడు, "మీతో 20 ఎత్తుల వరకు ఆడగలిగానని  గొప్పగా చెప్పుకోవచ్చని" సున్నితంగా తిరస్కరించాడు. "సరే, నీ ఇష్టం. నీకేం కావాలో కోరుకో, ఇప్పిస్తానన్నాడు" రాజు. 


దానికి ఘనపాటి, "రాజా, చదరంగంలో 64 గడులు వున్నాయి. మొదటి గడిలో ఒక గింజ, రెండవ గడిలో రెండు గింజలు, మూడవ గడిలో రెండవ గడికి రెట్టింపు అంటే 4 గింజలు ఇలా 64 గడులకు లెక్క వేసి ఆ ధాన్యాన్ని ఇప్పించి, పంపించండి చాలు" అంటూ ఒక పద్యం చెప్పాడు వేద ఘనపాటి యైన పండితవర్యుడు.


              చం. శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూ
                     ధర గగనాబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మజాస్య కుం
                     జర తుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
                     స్తర మగు రెట్టి రెట్టి కగు సంకలితంబు జగత్ప్రసిద్ధిగన్.



పద్యం అర్థంగాని రాజు, ఆ ధాన్యమేదో ఇప్పించమని మంత్రికి అప్పజెప్పాడు. మంత్రి గారు, తన ఆస్థాన పండిత గణికులు ఉభయులూ కలిసి ఎంత ధాన్యం అవుతుందో  లెక్కించమన్నాడు. లెక్కించిన గణికులు వచ్చిన సంఖ్య చూసి దిమ్మతిరిగిపోయారు.  మంత్రికి వివరించారు. మంత్రి, ఘనపాటి మేధస్సుకు మనసులోనే సాష్టాంగ పడ్డాడు.


మంత్రి రాకను గమనిస్తున్న రాజుకు, వచ్చిన పిచ్చి బ్రాహ్మడి మీద జాలి కలిగింది. పిడికెడు గింజలకు ఆశ పడ్డాడు. కనీసం ఒక మంచి అగ్రహారం కోరుకుని వుంటే బాగు పడేవాడు. అయినా, నాతో 20 ఎత్తులు ఆడాడంటే ఒక అగ్రహారం ఇచ్చినా తప్పులేదనుకున్నాడు. మంత్రి వచ్చిన తర్వాత, " ఆ బ్రాహ్మడికి ధాన్యం ఇచ్చి పంపించారా"! అని చాలా తేలిగ్గా అడిగేశాడు.


"ఆ బ్రాహ్మణుడు సామాన్యుడు కాడు మహారాజా, అతను అడిగినంత ధాన్యం మన దగ్గర లేదు కదా!, మొత్తం భూప్రపంచంలో కూడా లభ్యం కాదు. ఎన్ని ధాన్యపు గింజలో మన పండితులు మరియు గణికులు గంటల కొద్ది లెక్కించిన పిదప చెప్పిన సంఖ్యను, ఆ వేద పండితుడు వేదగణితం ద్వారా ఒకే ఒక పద్యంలో క్షణంలో చెప్పేశాడు" అని దిక్కుతోచని స్థితిలో నిలబడ్డాడు.


ఆశ్చర్యపోయిన మహారాజు ఆ పద్యంలో ఏముందో చెప్పండి అని అడిగాడు. మహారాజా! మన దేశ పండితుల మేధ, సంక్షిప్తంగా చెప్పాలంటే అల్పాక్షరములతో అనల్పార్థ విషయంతో ప్రజ్వరిల్లిన మేధాశక్తి అది. వివరణగా విన్న నాకు తల తిరిగి పోయింది. మీరూ వినండని అర్థాన్ని చెప్పడం ప్రారంభించాడు.


మన పూర్వుల సంఖ్యా గణన పద్ధతిలో, వారు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులను సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు.
శర, సాయక, మన్మథుని బాణాలు = 5 (అమరకోశం)
గగన, వియత్ = 0 (ఆకాశం గగనం శూన్యం, అమరకోశం)
శశి, చంద్ర, తుహినాంశు = 1 (భూమికి ఒకే ఒక చంద్రుడు)
షట్కము =  6 (షట్ చక్రవర్తులు), రంధ్ర = 9 (నవ రంధ్రాలు)
నగ, గిరి, భూధర = 7 (సప్త కుల పర్వతాలు)
అగ్ని = 3 (త్రేతాగ్నులు: గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని)
అబ్ధి, పయోనిధి = 4 (సముద్రాలు), వేద = 4 ((చతుర్వేదములు)
తర్క = 6 (షట్ తర్కప్రమాణాలు, ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన,శబ్ద, అర్థాపత్తి,
                                                                                              అనుపలబ్ధి)
పద్మజాస్య = 4 ( చతుర్ముఖుడు), కుంజర = 8 (అష్ట దిగ్గజములు)



పద్యంలోని అంకెల సంకేతాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఆ సంఖ్యలను ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూద్దాం.
శర శశి షట్క చంద్ర శర సాయక రంధ్ర వియత్ నగాగ్ని భూధర
5     1     6         1    5     5        9       0         7            7



గగన అబ్ధి వేద గిరి తర్క పయోనిధి పద్మజాస్య కుంజర తుహినాంశు
   0     4      4    7     6         4              4              8           1



 సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ విస్తరమగు రెట్టి రెట్టి కగు సంకలితంబు
 జగత్ప్రసిద్ధిగన్.



అంకెలు లెక్కించెటప్పుడు మనపూర్వీకుల సాంప్రదాయ సూత్రం "అంకానాం వామతో గతిః" అలా కుడి నుంచి ఎడమకు చదువుకుంటే


అలా మొత్తం చివరగా తేలిన సంఖ్య = 18 44 67 44 07 70 95 51 615.


ఇంత పెద్ద సంఖ్యను పిలవడమే కష్టం. ఇక అంత ధాన్యం నిలవచేయాలంటే, ఒక ఘనమీటరు విస్తృతి గల గాదెలో దాదాపుగా, ఒకటిన్నర కోటి గింజలు దాచవచ్చు అని అంచనా వేసుకుంటే, 4 మీటర్ల ఎత్తు 10 మీటర్ల నిడివిగల గాదెలు సుమారుగా 12,000 ఘన కిలోమీటర్ల విస్తీర్ణ స్థలం కావాలి.


అన్ని గింజలను పేర్చుకుంటూ వెళితే 300,000,000 ముప్పై కోట్ల కిలోమీటర్లు అంటే, భూమికి సూర్యునికి వున్న దూరానికి రెట్టింపు కావాలి. ఒకవేళ  సెకనుకు ఒక్కగింజగా లెక్కపెడితే అన్నీ లెక్కించడానికి 58,495 కోట్ల సంవత్సరాలు కావాలి.


ఇది అసలు విషయం మహారాజా. వేదపండితులను తక్కువ అంచనా వేయలేము.  నిజానికి అతడు చదివిన ఘనపనస కూడా లెక్కలకు, ధారణా శక్తికి సంబంధించినదే. ఎంతో సాధన, ధారణా శక్తి, పాండిత్యం వుంటే తప్ప ఘనపాటి కాలేరు. అతడు ఆశీర్వదించడానికి వస్తే అతని వేదవిద్యను కించ పరిచి అహంకరించారు. ఇప్పుడు ఏం చేయమంటారు? మాట తప్పిన దోషం మీకు సంక్రమిస్తుంది.


అది విన్న మహారాజు సిగ్గుపడ్డాడు. అతని పూర్వీకుల నుండి ఎవ్వరు కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు. ఏం చేసి, ఈ దోషం నుండి తప్పించుకోవలో ఆ పండితుడినే అడుగుదామని,  ఆ పండితుడిని మళ్లీ ఘనంగా పిలిపించి క్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏంచేయాలో చెప్పమన్నాడు.





ఆ పండితుడు రాజా! ఈ లోకంలో ఆవుకు విలువ కట్టడం ఎవరి వల్లా సాధ్యం కాదు. ధాన్యం బదులుగా అవును ఇప్పించండి చాలు! అని ఆ రాజును వాగ్దాన భంగ దోషం నుండి తప్పించాడు. అందరం ఆవులను రక్షించుకుందాం. వాటికి సేవ చేస్తూ, ఆవు పాలు త్రాగి, మేధో సంపత్తిని పెంపొందించుకుందాం....