🌷కిటికీ🌷

మనిషి అనేవాడు ఎదుటివారి లోపాలను పట్టుకొని వేలాడితే బంధాలెప్పటికీ మెరుగు పడవు.మన మనసు విశాలం చేసుకొన్నకొద్దీ ఎదుటివారి లోపాలు చిన్నవిగా కన్పిస్తాయి.మనలో అహం తగ్గితే ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది.అప్పుడే జీవితానికి అర్థం పరమార్థం.మనం ఎదుటివారి లోపాలను ఒక వేలుతో చూపితే,నాలుగు వేళ్ళు మన వైపు కూడా తప్పులున్నాయని తెలిపే ఒక ఉదాహరణ చూద్దాం!

కొత్తగా పెళ్లి అయిన ఓ జంట ఓ కొత్త ఇంట్లోకి మారారు.మరునాడు ఉదయం టిఫిన్ తింటూ భార్య కిటికీలోంచి పక్కింటి వైపు చూసింది.పెరట్లో దండెకు ఆరవేసిన పక్కింటి వాళ్ళ బట్టలు ఆమెకు కనబడ్డాయి.పక్కింటి ఆవిడ బట్టలని చూడండి.శుభ్రంగా ఉతకలేదు.మట్టి మట్టిగా ఉన్నాయి. ఆవిడకి బట్టలు ఉతకడం రాకపోవచ్చు.లేదా సరైన బట్టల సబ్బుని వాడకపోవచ్చు?

ఆమె భర్త కూడా కిటికీలోంచి బయటకి చూశాడు.కాని ఏం మాట్లాడలేదు.ఇలా పక్కింటావిడ దండెకు ఉతికిన బట్టలని ఆరేసినప్పుడల్లా,అతని భార్య ఏదో ఒక విమర్శ చేస్తూనేవుంది.రెండు వారాల తర్వాత ఓ రోజు ఆమె పక్కింటావిడ ఆరేసిన బట్టలని చూసి ఆశ్చర్యపోయింది.

"చూడండీ!ఇవాళ ఆవిడ బట్టలని ఎంత శుభ్రంగా ఉతికిందో!ఎంత కాలానికి ఆవిడ శుభ్రతని నేర్చుకుంది." 

"నేను ఇవాళ ఉదయం నీ కన్నా ముందే లేచి ఆ కిటికీ అద్దానికి ఉన్న దుమ్ముని శుభ్రంగా తుడిచి వేశానని"నెమ్మదిగా చెప్పాడు భర్త.

కాబట్టి మిత్రులారా!ఇలాంటివి నేడు జరుగుతున్న కథలే.ప్రపంచంలోని ఇతరుల వంక మనం చూసినప్పుడల్లా వాళ్లలో మనకి కనబడేది,మనం చూసే మనసును బట్టే ఉంటుంది.ఎదుటి వారి గురించి తలచే మనసు,చేసే పని,కట్టే బట్ట,వేసే అడుగు,పెట్టే చెయ్యి మంచిదైతే మీ దగ్గర పైసా లేకపోయినా ప్రపంచం అంతా మీకు బంధువులై మీ శ్రేయస్సు కోరతారు. ఇది నిత్య జీవితంలో జరిగే పచ్చి సత్యం.

           "నమస్సులతో"