కార్తీకం వచ్చిందంటే ముందుగా గుర్తుకు వచ్చేవి గడ గడ లాడించే చన్నీళ్ళ స్నానాలు.

ఈ రోజు వ్యాస పరంపరలో మనం రెండు చక్కటి విషయాలు గుర్తు చేసుకుందాం. కార్తీక స్నానాల వైశిష్ట్యం గురించి, నదీ, సముద్ర స్నానాల ప్రాముఖ్యత

ఇంతే కాక, స్నానాల లో రకాలు, వాటిని చేసే విధానం గురించీ మరియూ స్నానాలు చేయలేని పరిస్థితిలో ఉన్నవారు ఏ విధమైన ప్రత్యామ్నాయ స్నానాలు చేసి, పూర్తి స్నాన ఫలం ఎలా?


కార్తీక స్నానాలు – పాప ప్రక్షయాలు!

కార్తీకమాసం లో ఆచరించదగ్గ పుణ్య కార్యాల్లో కార్తీక స్నానాలు ప్రధానమైనవి. ఈ మాసం చాలా పవిత్రమైనది. ఆధ్యాత్మిక సాధనకు ఈ సమయం సర్వశ్రేష్టం! ఆధ్యాత్మిక సేవకు స్నానం ప్రధానం! అందునా కార్తీక మాసంలో తలమీద స్నానం చేసినంత మాత్రాన మానవుడు తన పూర్వజన్మ పాపాలని అన్నిటిని పటాపంచలు చేసుకుని ఉత్తమ లోకాల వైపు పయనమవుతాడని పెద్దల వాక్కు. ఈ మాసంలో ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే తలమీద స్నానం చేస్తే మోక్షదాయకం అని చెపుతారు.

ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. కార్తీకస్నానికి చన్నీళ్ళు ఉపయోగించాలి. ఈ స్నానాలు చేసేటప్పుడు వంటికి నువ్వుల నూనె కానీ నలుగు కానీ పెట్టరాదు. స్నానం చేసిన తర్వాతే దీపారాధన కానీ దేవతార్చన కానీ చేసుకోవాలి. రోజూ చేయలేని వారు మొదటి రోజు, నాగుల చవితి రోజు, ఏకాదశులు , క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు కార్తీక అమావాస్యనాడు స్నానాలు చేసినా పరమేశ్వరుని అనుగ్రహం పొందుతారని పెద్దలు చెపుతారు. ఇంటి లోని నీటి తోటే స్నానం చేసే వారు, ఆ నీటినే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు నదుల పవిత్ర జలాలతో సమానమని భావించి, శ్రద్ధగా స్నానమాచరిస్తే ఆయా నదులలో స్నాన ఫలితం కలుగుతుందని పెద్దల ఉవాచ!

ఇక పొతే అదృష్టం, అవకాశం ఉన్నవారు కార్తీక మాసం లో పుణ్యనదీ స్నానం కానీ, సముద్రస్నానం కానీ చేయగలిగితే అంతకు మించిన పుణ్యకార్యం ఉండబోదు! కార్తీక మాసం లో నదీ ప్రవాహం నెమ్మదిగా, స్నానమాచారించడానికి అనువుగా ఉంటుంది. శ్రావణ బాధ్రపద మాసాల్లో వానలు, వరదలుతో స్నానం చేయడానికి వీలుగా లేక ప్రమాదకరంగా ఉంటాయి. అంతే కాకుండా శరత్కాలంలో చంద్రకాంతి లోని శక్తి నదీ జలాలపై, సముద్రజలాల పై ప్రసరించడం తో ఆ జలాలు ఆ శక్తిని గ్రహించడం వలన ఆ నీటితో స్నానం చేస్తే ఆ శక్తి మన శరీరం లోకి కూడా ప్రవేశిస్తుందని ఒక నమ్మకం. అందు వలన నదీ సముద్ర స్నానాలు మనకు పుణ్యప్రదమే కాకుండా ఆరోగ్యదాయకం కూడానూ!

మరి నదీ స్నానం చేయడం ఎలాగో తెలుసు కుందాము. ఇంట్లో ఒక సారి స్నానం చేసి, శుచిగా నదిలో అడుగు పెట్టాలి. రెండు బొటన వ్రేళ్ళతో రెండు ముక్కులను మూసుకుని, రెండు మధ్య వ్రేళ్ళతో రెండు చెవులు మూసుకుని, పూర్తిగా తలతో సహా కనీసం మూడు సార్లు మునగాలి. ఇలా నదీసముద్రస్నానాలు చేస్తున్నప్పుడు, ఎటువంటి సబ్బు కానీ షాంపూలు కానీ ఉపయోగించకూడదు. నీటిని ఏ విధం గానూ అపవిత్రం చేయకూడదు.
ఇవండీ కార్తీక స్నాన విధానాలు!

స్నానాలు – రకాలు – ప్రత్యామ్నాయాలు!

స్నానం చేసే వారు, చేయగలిగిన స్థితి లో ఉన్నవారు ఈ మూడు రకాల స్నానాలను ఆచరించవచ్చు.

1. మొదటిగా మంత్రస్నానం:
"అపోహిష్టామయే భువః, తాన వూర్జే దధాతన, మా హేరణాయ చక్షసే, యే: వశ్శివ తమేరసః ,
తస్య భాజయతే హనః ,యశతీరివ మాతరః, తస్మా అరఃగ మామవః, యస్య క్షయాయ జిన్వధ, ఆపోజన యధా చనః!"
అని మంత్రం చదువుతూ తల పై నుండి చేసే స్నానం మంత్ర స్నానం!

2. రెండవది మానస స్నానం :
శ్రీ హరినో లేక సాంబ శివునో లేక తమకిష్టమైన దైవాన్ని స్మరిస్తూ తల స్నానం చేస్తే అది ఉత్తమ [మానస]స్నానం!

3. మూడవది వారుణ స్నానం:
మంత్రాలు రాక ఏ స్నాన పద్ధతులు తెలియక కేవలం స్నానం చేయాలనే అభిప్రాయం తో తల స్నానం ముగిస్తే దానిని వారుణ స్నానం అంటారు. మనందరం నిత్యం చేసే స్నానం అటువంటిదే!

స్నాన ప్రత్యామ్నాయాలు:

ఈ మూడు స్నానాలు మాత్రమే కాక స్నానం చేయలేని అనారోగ్య స్థితిలో వుంటే ఈ క్రింది వివరించిన ఎదో స్నానం, శారీరిక పరిస్థితిని బట్టి ఆచరించి, అస్నాన దోషం రాకుండా చూసుకోవచ్చు.

1.వాయవ్య స్నానం: ఏ మంత్రాలు రాని వారు ఆవు గిట్టల క్రింద ఉన్న ధూళిని తల పైన వేసుకుంటే చాలు స్నానం అయినట్లే!

2. ఆగ్నేయ స్నానం: శివాలయం లో లభించే విభూధిని నుదుట ధరించినా, లేక తల మీద జల్లు కున్నా స్నానం చేసినట్లే!

3. కాపిల స్నానం: నాభి పై భాగం లో గాయమై దానికి నీరు తగలరాని పరిస్తితి ఉంటే నాభి క్రింద భాగాన్ని నీటి తో పూర్తిగా శుభ్ర పరిచి, పై భాగాన్ని తడి గుడ్డతో తుడిస్తే చాలు స్నానం పూర్తీ అయినట్లే! కాలకృత్యాల బాధ తరుచూ ఉన్నవారు దీనిని అనుసరించవచ్చు.

4. ఆతప స్నానం: అనారోగ్య కారణంగా లేవలేని వారు ఉదయపు ఎండలో ఒక్క క్షణం నిలబడితే చాలు ఆ రోజు స్నానం చేసినట్టే!

అయితే స్నానం చేయగలిగే స్థితి లో వున్న వారు మాత్రం ఈ మాసం లో రోజూ లేక కనీసం ప్రత్యేక రోజులలో నైనా తలస్నానం చేసి, కార్తీకస్నానాల పుణ్యం పొంది, శివకేశవుల అనుగ్రహం పొందేదరు గాక!


-స్వస్తి...