🌕 కార్తీక పౌర్ణమి🌕 తేదీ: 22.11.18 నాడు 
ఉదయం : 12:30 నుండి 23.11.18 తేదీ ఉదయం: 11:34 వరకు...


            కార్తీక మాసం లో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు. కార్తీక మాసం అంతా స్నాన, దాన, జప, ఉపవాసాలు చేస్తే మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలా చేయడం కుదరనివారు ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఈ నాలుగింటిలో ఏదో ఒక దాన్ని ఆచరించినా సరిపోతుందనీ... అందుకు కూడా శక్తిలేనివారు పౌర్ణమినాడు శివాలయంలో దీపం వెలిగించినా పౌండరీక యజ్ఞం చేసినంత ఫలం లభిస్తుందనీ ప్రతీతి. 

అదే ‘కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం’. 


పౌర్ణమి... ప్రతినెలా వస్తుంది. కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత. మరే పున్నమికీ ఉండదు. 

ఖగోళపరంగా చూస్తే... ఏడాది మొత్తమీదా జాబిలి ఆరోజు ఉన్నంత ప్రకాశంగా మరేరోజూ ఉండదు. 

అంతలా వెలిగిపోయే వెన్నలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలూ జలాశయాలూ కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయా రోజు. 


మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. 

ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 

వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి. 

కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. 

ఈరోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. 

కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు.

 ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం. 

ప్రధానంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. 

నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. 

రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు

రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. 

కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. 

ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. 

ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు. 

కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. 

సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. 

కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం.

గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.






కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తూ?...పటించాల్సిన శ్లోకం :

అన్ని దానాలు ఒక ఎత్తు. అయితే దీపదానం ఒక్కటీ ఒక ఎత్తు. 

దీపదానం చేసేవారు పైడి ప్రత్తితో స్వయంగా వత్తులను తయారుచేసుకుని వరిపిండి లేదా గోధుమ పిండితో గానీ ప్రమిదను చేసుకుని అందులో ఆవునెయ్యితో దీపమును వెలిగించి, దానికి నమస్కరించి....

“కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగిః
భవన్తి నిత్యాంశ్చ పచాహి విప్రాః”

 అనే శ్లోకం పఠిస్తూ దీపదానం చేయాలి.

 ఇలా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం, దీపదానం చేయడంవల్ల సకల జీవరాశులు ముక్తిపొందుతాయని  ‘పద్మ పురాణం’ చెప్తోంది.





- స్వస్తి....