తిట్టడం ఒక యోగం..
తిట్టించడం ఒక భోగం..
తిట్టలేకపోవడం... ఒక రోగం.
అదేంటి? జనరల్‌గా ‘నవ్వు’ గురించి కదా ఇలా చెప్తారు.
ఇక్కడ నవ్వుకి.. తిట్లకి సంబంధం ఉంది.
అందుకే అలా.
ఏడుపొస్తే ఆపుకోవడం..
కోపమొస్తే తిట్టకపోవడం..
సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్ ఉండీ అవుట్‌గోయింగ్
చేయలేకపోవడం లాంటిది.
అందుకే చీవాట్లెట్టండి. ఫన్నీగా..తిట్ల గురించి కూడా ముచ్చట్లా? అని తిట్టుకోకండి.
గూట్లో దాచిపెట్టి గూగుల్‌లో వెతికే రోజులివి.
దేనికోసమో ‘యా’లో సెర్చ్ చేస్తుంటే..
What is the meaning of telugu word ne dumpa tega?
(నీ దుంప తెగ అనే తెలుగు పదానికి అర్థమేంటి?) అని ఒక ప్రశ్న కనిపించింది.
అడిగింది లండన్‌లో ఉండే మన తెలుగాయనే.
ఇండియాకి వచ్చినప్పుడు ఆయన్ని ఎవరు తిట్టారో తెలియదు కానీ.. దానికి ఇద్దరు సమాధానాలిచ్చారు.

మొదటిది

ఇది తెలుగులో వ్యవహారిక పదం. కాని లిటరల్‌గా అనువదించడానికి సరైన అర్థం లేదు. దీన్ని రకరకాల సందర్భాల్లో వాడతారు. కోపంగా ఉన్నప్పుడు, ఫ్రస్టేషన్‌లో ఇలా తిడతారు. ఆశ్చర్యమేసినప్పుడు కూడా వాడతారు. దీని అర్థం నిజంగా తెలుసుకోవాలంటే.. ఈ మాట అనేవాళ్ల టోన్, ఫేసియల్ ఎక్స్‌వూపెషన్స్ చూడాల్సిందే.

రెండోది

ఈ పదబంధం ఒక మందలింపు, హెచ్చరికని తెలుపుతుంది. కోప్పడడాన్ని, కేకలు వేయడాన్ని తెలియజేస్తుంది. సంభాషణలో ఒక వాక్యాన్ని ప్రారంభించే ముందు కొన్ని సందర్భాల్లో ఈ పదాన్ని వాడతారు. (సోర్స్ : యూనివర్సిటీ ఆఫ్ చికాగో, డిజిటల్ డిక్షనరీస్ ఆఫ్ సౌత్ ఏసియా)
దీని దుంప తెగ. ఒక తిట్టు గురించి ఇంత వివరణా? అనుకోకండి. ఇక్కడ డిస్కషన్ డెప్త్ గురించి కాదు.. సోర్స్ గురించి. చికాగో యూనివర్సిటీలో కూడా ఈ పదానికి అర్థం లభించింది. అంటే తిట్లకు భాషకు ఏదో లింక్ ఉందన్నమాటే కదా! ఇంతకీ అర్థం ఏంటి అంటారా? తిట్లను అర్థం చేసుకోవాలిగానీ.. అర్థాలు అడగకూడదు.


ఆవేశంలో ఎవరినైనా నిందించడానికి వాడే పదాలని తిట్లు అంటారు.
తిట్లలో బూతులు దొర్లడం సహజం. కాని బూతు మాటలన్నీ తిట్లు కావు.
తిట్లు పీక్స్‌కి వెళ్లిపోతే బూతులవుతాయన్నమాట.
ఇక్కడ మనం మాట్లాడుకునేది కేవలం తిట్ల గురించే.
దట్టూ.. వల్గర్‌గా కాకుండా వెరైటీగా ఉండే వాటి గురించి మాత్రమే.
మన పురాణాల్లో తిట్లు ఉన్నాయి.
‘పొగతాగని వాడు ఏదో అయి పుట్టున’ని.. కన్యాశుల్కం కూడా తిట్టింది.
కొన్ని తెలుగు సినిమా డైలాగులు.. చీవాట్లకు చిరునామాలు.
ఆ మధ్య ఒక సినిమాలో హ.. హ.. హాసిని.. ‘‘నాకు కొన్ని బూతులు నేర్పిస్తావా?’’ అని హీరోని అడగడం గుర్తుండే ఉంటుంది.
తిట్లు అడిగి మరీ నేర్చుకోవడం ఇప్పుడొక ట్రెండ్.
ఎప్పుడూ ఒకేలా తిట్టాలంటే.. తిట్టడానికి మీకు.. తిట్టించుకోవడానికి ఎదుటివాళ్లకూ బోర్ కొట్టదా? అందుకే మరి. కాస్త కొత్తగా.. ఇంకాస్త క్రియేటివ్‌గా తిట్టండి.


మేనరిజమ్ తిట్లు..

కొందరు ఎవరినైనా తిట్టాలంటే ఎప్పుడూ ఒకటే తిట్టుని వాడుతుంటారు. ఐదో తరగతి చదివేటప్పుడు మాకు ఆవు మాస్టారుండేవారు (ఆవు కథ చెప్పే టీచర్ కాదు.. వాళ్లింట్లో ఆవు ఉందన్నమాట) ఆయన వాడే ఒకే ఒక తిట్టు.. ‘ఓరి నీ పెళ్లాం మొగుడా’ అని. మొదట్లో తిట్టించుకోవడానికి బాగానే ఉండేది. రాను రాను.. బోర్ కొట్టింది. కాలేజ్‌కెళ్లాక ప్రిన్సిపాల్ కూడా ‘నీ ఫేసు’ అని ఒకే ఒక్క తిట్టు.. తిట్టి తిట్టి బోర్ కొట్టించాడు. అప్పటి నుంచే మొదలైంది ఈ అన్వేషణ.. ఆలోచన. కొత్తగా తిట్టలేమా? అని. అప్పుడే తిట్ల దండకం మొదపూట్టారు ‘హాస్య బ్రహ్మ’ జంధ్యాల. ఆయన సినిమాల్లో చాలా వెరైటీ తిట్లు ఆయన కనిపెట్టి తిడుతూనే చక్కిలిగిలి పెట్టారు. ఆ ఎఫెక్టే అనుకుంటు. ఈ మధ్య ఇంకా కొత్త తిట్లు వినిపిస్తున్నాయి.

తింగరి తిట్లు..

తిట్లలో.. ఆడాళ్ల తిట్లు.. మగాళ్ల తిట్లు ఉంటాయి. అమ్మాయిల తిట్లు.. హాట్ హాట్ పిజ్జాలా ఉంటే.. అబ్బాయిల తిట్లు.. ‘పచ్చి’ మిరపకాయ బజ్జీలా ఉంటాయి. వాటిని సెన్సార్ వారికి వినిపిస్తే ఆలోచించకుండా ‘ఎ’ సర్టిఫికెట్ ఇస్తారు. అందుకే వాటిని వదిలేద్దాం. దూకుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత.. ‘ఒబే సాలా’ అని కాస్త వెరైటీ కోసం ట్రై చేస్తోంది యూత్. ఇవి పాత తిట్లే.. అయినా ప్రొనౌన్సియేషన్‌ని కొత్తగా వాడడమే వెరైటీ. అమ్మాయిలను కామెంట్ చేయడానికి అబ్బాయిలు పెద్దగా ఆలోచించకుండానే చీవాట్లు దొరుకుతున్నాయి. తెలిసిన అమ్మాయి కాస్త మోడ్రన్‌గా కనిపిస్తే ‘‘తెల్సులేమ్మా.. తెల్సు. నువ్వు ఇంట్లో సీతామహాలక్ష్మీ.. వీధిలో షీలాకీ జవానీ..’’ అని కామెంట్ చేస్తున్నారు.


ఆడ‘బిల్లా’లు

ఈ కాలం అమ్మాయిలు.. ఆడపిల్లలు కాదు.. ఆడ‘బిల్లా’లు.
‘‘బీపీ అంటే ఇలా ఉంటుందా సిద్ధూ? దగ్గరి నుంచి చూడడం ఇదే ఫైస్ట్ టైమ్’’ అని అమాయకత్వం ఒలకబోస్తూనే..
‘‘సచ్చినోడు.. ఆడ్ని.. కోసి కారం పెట్టాలి’’ అని మాస్ పటాస్‌లా పేలిపోతున్నారు కూడా. అంటే ఇంట్లో సుబ్బులు.. వీధిలో పబ్బులు.. కాలేజ్‌లో.. కే విశ్వనాథ్.. క్యాంటిన్‌లో కే రాఘవేంవూదరావు సినిమా హీరోయిన్ల టైప్ అన్నమాట.
తెలుగు బ్లాగులో ఒకాయన కొన్ని వెరైటీ తిట్లు పోస్ట్ చేశాడు. అది చదివిన ఒక అమ్మాయి ‘‘నైట్ టైమ్ కరెంటు పోయినప్పుడు చాలా కోపం వస్తోంది. ఆ ఎలక్షిక్టిసిటీ డిపార్టుమెంటు వాళ్లని తిడదామంటే సరైన తిట్లు దొరక బాధపడుతున్న. సరైన టైమ్‌లో మంచి హింట్స్ ఇచ్చారు’’ అని కామెంట్ రాసింది.

పిసినారి తిట్లు..

అంటే.. పిసినారిని తిట్టేందుకు వాడే తిట్లు. ఈ ప్రపంచంలో వీరికి ఉన్నన్ని తిట్లు.. ఇంకెవరికీ ఉండవు. బహుశా.. జంధ్యాల ఇన్‌స్పిరేషన్‌తోనే ఇవన్నీ పుట్టుకొచ్చాయనుకుంట.
- కాకి నోట్లోంచి బ్రెడ్‌ముక్క లాక్కునే అంట్ల కాకి
- యాక్సిడెంట్ అయితే 100కి మిస్డ్ కాల్ ఇస్తావా? 108ని లిఫ్ట్ అడుగుతావా?
- బూట్ పాలిష్ కుర్రాడిని డిస్కౌంట్ అడిగావట కదా?!
- అక్షయ పాత్ర ఇచ్చినా అడుక్కుతింటావ్!
- చీపురు కూడా నీకు చీప్‌ది కావాలా?
- తుఫాన్‌లో తువాలు పోయిందని ఫీల్ అయ్యే ఫేస్ నీది.
- ఏసీ కోసం ఏటీఎమ్‌కి వెళ్లి బ్యాలెన్స్ ఎక్వయిరీ చేస్తావ్

అమాయకులకు

ఈ తిట్లు అమాయక చక్రవర్తులకు అంకితం.
- అక్వేరియమ్‌లో చేపలు పట్టే ఫేసు
- ఏటీఎమ్‌లో పాన్‌కార్డ్ పెట్టి గీకావట కదా
- విమానం ఎక్కిస్తే.. కర్చీఫ్ వేసి సీటు బుక్ చేసుకుంటావా?
- మంచు కరిగించి.. మంచి నీళ్లని అమ్మే అవతారం
- మంచుతో చేసేది మంచూరియా అనుకుంటావా?
- ఆకలికి పురుగుల మందులో చక్కెర వేసుకుని తాగేవ్
- రాగి సంకటి అంటే రాగి తీగల్తో.. చేస్తారనుకుంటాడు
- పైరసీ సీడీలు అమ్ముకోరా అని ఐడియా ఇస్తే ఆరోగ్య శ్రీ యాడ్స్‌ని పైరసీ చేస్తావా?
- యూ ట్యూబ్‌లో.. ట్యూబ్‌లతో పాటు టైర్లు కూడా దొరుకుతాయట.
- హార్డ్‌డిస్క్ క్లీన్ చేయమంటే.. సర్ఫ్ ఎక్సెల్ వేసి నానబెడతావా..
-బ్లాక్‌లో టికెట్ కొన్నానంటే.. సినిమా కలర్ కదా అంటావా?...

దివాలా.. తికమక..

ఈ తిట్ల క్రెడిట్ వ్యాపారం చేసి దివాలా తీసినవారికి దక్కుతుంది. డల్‌గా కూర్చున్నవారిని.. సరాదాగా తిట్టాలంటే ఇవే కరెక్ట్. ‘రెండో ఫ్లోర్‌లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసినవాడిలా అలా పెట్టావేంట్రా ఫేసు..’ ఇలా అన్నమాట. ‘పంజాబ్‌లో సెలూన్ షాప్ పెట్టినట్లుంది నీ వ్యవహారం..’, ‘హిమాలయాల్లో ఐస్‌క్షికీమ్‌లు అమ్ముతా నంటావేంట్రా?’ ఇవన్నీ దివాలా తిట్లన్నమాట. ‘అమావాస్య అర్థపూరాతి కరెంటు పోయినప్పుడు.. నల్ల కూలింగ్ గ్లాస్ పెట్టుకుని.. మాడిపోయిన మసాలా దోసె తినే రకం నువ్వు’ ఇదో తికమక రకం తిట్టు. ‘కుక్క వెంటపడుతుంటే పరుగెత్తకుండా.. సెల్‌ఫోన్‌లో వొడాఫోన్ సిమ్ తీసేసే అటూ ఇటూ చూస్తాడు వాడు.. ’ ఇది ఇంకోటి.

పాంచ్ పటాకా :

1 పాలకూర పప్పు..
2. బీడు బడిన బ్లేడు
3. రైమ్స్‌ని రీమిక్స్ చేసే ఫేసు
4. విగ్గుకి సెలూన్‌లో కటింగ్ చేయించే ఫేస్
5. కట్టింగ్ షాప్‌లో కత్తెర కొట్టుకొచ్చే రకం