విలువలు అంటే ఏమిటి?
సంస్కృతంలో నైతిక విలువని 'ధర్మం' అంటారు.
మీరు ఎదుటి వారి నుంచి దేనిని ఆశిస్తారో, వాళ్ళు మీకు ఏది చేయాలని కోరుకుంటారో, అది ధర్మం అవుతుంది. ఏది వద్దనుకుంటారో, అది అధర్మం అవుతుంది. ఉదాహరణకు సత్యం, అహింస, అణకువ, దానం వగైరా ధర్మ సూత్రాలు సహజమైనవి. ధర్మం అంటే ఇరువైపులా వర్తించేది. దానిని గుర్తించడమే విలువ. వాటిని మీరు పాటించి, ఎదుటి వారు కూడా అలాగే పాటించాలని కోరుకోవడమే ధర్మం. అలా కాని పక్షంలో అది మీలో సంఘర్షణను రేపుతుంది. ఈ సంఘర్షణకు కారణం విలువలను మించినదేదో మీకు అడ్డుపడుతోందన్నమాట. మీ వ్యక్తిగత కోరికలే మీ విలువలకు అడ్డుపడుతున్నాయి. దానివల్ల ఒక సగం కోరికగా, ఇంకో సగం విలువగా మీలో ఓ విభజన మొదలైంది. 'విలువ' గొప్పదని తెలిసినప్పటికీ, కోరికల వత్తిడికి లొంగి, విలువలకు దూరమవుతున్నారు.
విలువను కోరిక ఎలా అధిగమిస్తుందో చూద్దాం..........
మీరు మీ బాల్యంలో పచ్చనోటుతో ఆడబోతే 'ఒరేయ్! అది డబ్బురా' అని మీ అమ్మ దాన్ని లాగేసుకుని ఉండవచ్చు. అప్పుడు దాని విలువేమిటో మీకు తెలియకపోయినా, తర్వాత మీ అమ్మతో దుకాణానికి వెళ్ళినప్పుడు, ఆ పచ్చనోటు ఇచ్చి చాక్లెట్లు, బెలూన్లు, బొమ్మలు తెచ్చుకోవచ్చునని అర్థమవుతుంది. ఇంకా పెద్దయ్యాక డబ్బుతో వీటినే కాక కార్లు, బంగళాలు ఏవైనా కొనవచ్చని, అన్నింటినీ సాధించ వచ్చునని మీకు అనిపిస్తుంది. దీనితో డబ్బు మీద ప్రత్యేకమైన దృష్టి కలుగుతుంది. తద్వారా ఇంతవరకు ధర్మం పట్ల చూపిన విలువ, డబ్బుపైకి మరలుతుంది.
ఇక్కడే చిన్న ప్రశ్న వేసుకోవాలి .......
అసత్యం వల్ల ఎక్కువ డబ్బు వస్తుందనుకుంటే 'డబ్బు'కి, 'సత్యా'నికి మధ్య ఘర్షణ తలెత్తుతుంది. అప్పుడు మీరు ఎటువైపు మొగ్గుతారు? సత్యం పలకాలా? అబద్ధమే చెప్పాలా? అని మీలో సంఘర్షణ మొదలౌతుంది. ఈ సంఘర్షణలో మనసు సత్యం-డబ్బు అనే ఈ రెండింటి మధ్య కొట్టుమిట్టాడుతుంది. విలువ కన్నా సుఖాలకే అవకాశం ఇచ్చినప్పుడు, ముందుగా డబ్బు విలువే ప్రదానమనిపిస్తుంది. కానీ, మీలో సన్నగా ఏదో గొంతు 'సత్యం పలుకు, సత్యం పలుకు' అని చెబుతూనే ఉంటుంది.
అబద్ధం చెప్పడం వల్ల హాయిగా ఉండగలుగుతామా?
అబద్ధం చెప్పడంవల్ల మీరు సుఖంగా ఉండరు సరికదా, దానివల్ల ముందు మీలో సంఘర్షణ చెలరేగి అపరాధ భావాన్ని కలిగిస్తుంది. అపరాధ భావన మిరపకాయ కన్నా ఎక్కువగా చికాకు పెడుతుంది. విలువని పక్కన పెట్టడం వల్ల కొంత సుఖాన్ని వెంటనే పొందుతారేమో కానీ, మీరు రెండుగా చీలుతారు. అప్పుడు మీరు తెలుసుకున్నదొకటీ, చేసేదొకటీ అవుతాయి. దాని వల్ల తెలుసుకున్న మీకూ, చేసే మీకూ మధ్య అగాథం ఏర్పడుతుంది. అలా కాకుండా పరిపూర్ణంగా ఉందగలిగితేనే మీరు హాయిగా ఉండగలరు.
డబ్బుకున్న విలువ!
డబ్బు విషయం వచ్చే సరికి ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? అబద్ధం చెప్పాల్సినంత విలువైనదా ...... డబ్బు? డబ్బుని తినలేరు. దానితో మాట్లాడలేరు. దాన్ని గొడుగుగా వాడలేరు. అంటే డబ్బు తనంతట తాను సుఖాన్నివ్వలేదు. కానీ, దానితో సుఖసాధనాలను కొనుక్కోగలరు. డబ్బుకు కొనే శక్తి ఒక్కటే ముఖ్యం కాదు. అది మీకు ఇచ్చే సుఖమే ముఖ్యం.
సుఖమంటే!
సుఖం అంటే ఏమిటి? సుఖ సాధనాలతో చుట్టుముట్టి ఉండడమా? లేక నేను సుఖంగా ఉండడమా? రెండింటికీ మధ్య చిన్న తిరకాసు ఉంది. ఒక్కోసారి మీరు కడుపు నిండా తిని, మెత్తటి సోఫాలో హాయిగా సేదతీరారు. అయినా ఏదో బాధ. అంటే, మీకు ఈ తిండి, సోఫాలు మాత్రమే కావు; ముఖ్యంగా మీ మనసు బాగుండాలి. 'నీకు సంతోషం కావాలా? దుఃఖం కావాలా' అంటే ఎవరూ రెండో దాన్ని కోరుకోరు. విలువను పాటించకపోతే, మీకు దుఃఖం కలుగుతుందని మనస్పూర్తిగా నమ్మగలిగితే, మారు ఆలోచన లేకుండా మీరు దాన్ని పాటిస్తారు. విలువ యొక్క విలువని గుర్తించినప్పుడు, దానిని మీలో ఒక భాగంగా మలచుకుంటారు. దానివల్ల మీ పట్ల మీకే గౌరవ భావం, విలువ కలుగుతాయి. బయట పదిమంది మీకు విలువనివ్వడం కన్నా, ముందు మీ పట్ల మీకు విలువ ఉందా? అని బేరీజు వేసుకోవడమే అతి ముఖ్యం. అప్పుడే 'విలువ' గొప్పదనాన్ని గుర్తించగలం. అలా కాకుండా, మనకు అవకాశం దొరికింది కదా అని మనలో విలువని కూడా మార్చుకుంటూ పోతే మన వ్యక్తిత్వంలో అగాథమేర్పడుతుంది. తద్వారా సంఘర్షణ, ఒత్తిడి పెరిగి, ఆందోళనకు గురికాక తప్పదు. దీని నుండి బయట పడాలంటే, వ్యక్తిత్వంలో అగాథం ఏర్పడకుండా, చీలిక రాకుండా చూసుకోవాలి.
ఈ విలువలను గుర్తించడం ఫలితంగా, విభజన తొలగి, పరిపూర్ణంగా ఉంటేనే మీ జీవితం సాఫీగా సాగుతుంది. అగ్గిపుల్ల వెలిగిస్తే, మంట వచ్చినంత తేలిగ్గా వేదాంత బోధన వినడం తోటే మీలో జ్ఞానం వెలుగొందుతుంది. వేదాంత జ్ఞానాన్ని సరళంగా ఆకళింపు చేసుకునేందుకు విలువలే ప్రధాన ఆలంబన అని అర్థమవుతుంది.
-స్వస్తి...
రామ్ కర్రి - నాకు తెలిసింది అల్పం తెలుసుకో వలసినది అనంతం.
బ్లాగర్ , కవి , రచయిత, సంఘ సేవకులు, పాత్రికేయులు, చలన చిత్ర దర్శకులు, టెక్ గురు, గీత రచయిత, వ్యవస్థాపకుడు, రాజకీయ వేత్త, సంరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు.