టెన్షన్లు ఒత్తిళ్లు డబ్బు సంపాదన

అతిగా ఆలోచనలు లేకుండా ఉన్నంతలో

 కుటుంబమంతా కలిసి ఆనందంగా గడిపిన

ఆ రోజులు ఎంతో బాగున్నాయి కదా

ఆదివారం వస్తే ఆటలాడుతూ అన్నాన్ని మరచిన

ఆ రోజులు ఎంతో బాగుండేవి

మినరల్ వాటర్ గోల లేకుండా

కుళాయి దగ్గర బోరింగుల దగ్గర బావుల దగ్గర

నీళ్లు తాగిన ఆ రోజులే బాగుండేవి

ఎండాకాలం చలివేంద్రాల్లోని చల్లని నీళ్ల కోసం

ఎర్రని ఎండను సైతం లెక్క చేసేవాళ్ళం కాదు

అప్పుడు వందల కొద్దీ చానెళ్లు లేకున్నా

ఉన్న ఒక్క దూరదర్శన్ లో

శుక్రవారం చిత్రలహరి

ఆదివారం సినిమా కోసం వారమంతా

ఎదురు చూసిన ఆ రోజులు బాగున్నాయి

సెలవుల్లో అమ్మమ్మ నానమ్మల ఊళ్లకు వెళ్లి

ఇంటికి రావాలనే ఆలోచన ఉండేది కాదు

ఏసీ కార్లు లేకున్నా ఎర్రబస్సుల్లో

కిటికీ పక్క సీట్లో నుండి ప్రకృతిని ఆస్వాదించిన

ఆ రోజులు నాకు హాయిగా ఉన్నాయి

మొబైల్ డేటా గురించి ఆలోచించకుండా

బర్త్ డే డేట్ గురించి మాత్రమే ఆలోచిస్తూ

 ఫ్రెండ్స్ కీ చాక్లెట్లు పంచిన ఆ రోజులు బాగున్నాయ్..!

ఎండాకాలం వచ్చిందంటే కొత్త ఆవకాయ కాయ పచ్చడితో

అందరం కలసి కడుపునిండా తృప్తిగా అన్నం తిన్న

 ఆ తీపి రోజులు బాగున్నాయి

ఇప్పుడు జేబు నిండా కార్డులున్నా

పరుసు నిండా డబ్బులున్నా మనశ్శాంతి లేదు

సెల్లు నిండా గేములున్నా అందరం ఒకే చోట కుర్చీని

 ఆడుకున్న వామనగుంటలు గవ్వ లాటలే బాగుండేవి

ఇప్పుడు బేకరీల్లో కూల్ కేకులు తింటున్నా

ఐదు పైసల ఆశా చాక్లెట్ రుచే బావుండేది

చిన్న చిన్న మాటలకే దూరం పెంచుకుంటున్న ఈ రోజుల్లో

 పిల్లలం కొట్టుకున్నా పెద్దలంతా కలసివుండే

ఆ ఉమ్మడి కుంటుంబాలే బావుండేవి

ఇప్పుడు ఇంటినిండా తినుబండారాలున్నా

నాన్న కొనుక్కొచ్చే చిరుతిళ్ళ కోసం ఎదురు చూసి

దాచుకుని తిన్న అవే ఎంతో రుచిగా ఉండేవి

ఇప్పుడు రకరకాల ఐస్ క్రీమ్ లు చల్లగా

 నోట్లో నానుతున్నా

అమ్మ చీరకొంగు పైసలతో పుల్ల ఐసు

 కొనుక్కుని తింటే వచ్చే ఆ ఆనందమే బావుండేది

ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు అప్పటి

ఆత్మీయతలు లేవు యాంత్రిక జీవితాలయిపోయాయి.


- స్వస్తి...