అన్నం అడుగు మాడితేనే మనసు చివుక్కుమంటుంది.

 గుప్పెడు అన్నం మిగిలిపోతే పారేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం.

అదీ మన కున్న అన్నం సెంటిమెంట్.

ఆర్నెల్లు రాత్రీపగలూ

కాలం తో పరిగెత్తి,

వేలల్లో అప్పుచేసి,

బంగారంలా మెరుస్తున్న వరి పంట

తుఫాను ముంగిట్లో

ఉయ్యాలకి చుట్టుకున్న పాముని చూసిన పసిపిల్లలా భయం భయంగా చూస్తూ ఉంటే,

రైతు గుండె కారుకింద పడిన కుందేలు పిల్లలా,

ముళ్లకంపలో ఇరుక్కున్న సీతాకోకచిలుకలా విలవిల్లాడుతోంది.

కొంతమంది రాత్రికి రాత్రే కుప్ప నూర్చేస్తే,

కొంతమంది పన పచ్చి ఆరకుండానే నూర్చేస్తే,

 ఇవేమీ చెయ్యలేని రైతులు,
వారి భార్యలు,

పోయినేడు పండక్కి బట్టలకొట్టువాడిచ్చిన దేవుడి క్యాలెండర్ కి దణ్ణం పెట్టుకుంటున్నారు.

తుఫాన్లకి పేరు పెట్టడంలో ఉండే సాంకేతిక పరిజ్ఞానం రైతుకి సాయపడ్డంలో కనబడదు.

ఏలిన వారు కానీ,

 స్వచ్ఛంద సంస్థలు కానీ,

 కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రోగ్రాం లు కానీ

మేమున్నాం అన్న ఒక్క స్టేట్మెంట్ ఏ పేపర్ లోనూ కనబడదు.

ఇదేదో రైతుల సొంత వ్యాపార సమస్య అనుకుంటే...

మన కంచంలో మనం నీళ్లు పోసుకున్నట్టే...

వర్షం వల్ల క్రికెట్ మ్యాచ్ రద్దయితే ఇన్సూరెన్సు కవర్ ఉంది.

 కాజల్ కళ్ళకీ,
ఏంకర్ గొంతుకీ,
డాన్సర్ కాళ్ళకీ,
ఇన్సూరెన్సు ఉంది.

 ఇలాంటి రైతులకి,

వారి పంటకి కూడా ఉండే ఉండొచ్చు.

కానీ, లక్ష కండిషన్లు కూడా ఉండి ఉండొచ్చు.

చాలా మంది రైతులకి ఈ విషయం తెలియక పోవచ్చు.

గుళ్ళకి కోట్లు విరాళాలిచ్చే భక్తుల్లారా,

దేవుడి తరఫున అవి అందుకునే దేవాదాయ శాఖల్లారా,

  కాస్త ఇటువైపు కూడా  చూడండి.

వీళ్ళ క్యాలెండర్ల లో కూడా దేవుడున్నాడు.

ఒకటి మాత్రం నిజం.

ఆమాత్రం ఏడాదికి లక్ష రూపాయలు ఏ వాచ్ మేన్ ఉద్యోగం చేసినా వస్తుంది అని రైతు విసుగెత్తిపోయి
అనుకున్న నాడు,

జంతువుల్లా మనల్ని మనం చంపుకు తినాలి
లేదా
పాముల్లా మన గుడ్లు మనమే పెట్టుకుని తినడం నేర్చుకోవాలి.

ఈ పెథాయి రైతుకు వెతలు మిగల్చకుండా వెళ్లిపోవాలని ఆశిస్తూ...🙏 🙏 🙏