అవసరం ఎంత గొప్ప పదమో అంత నీచమైన పదం కూడా...

 మనిషికి, మనిషి జీవితానికి మధ్య "అవసరం" అనుసంధానమవుతుంది.

అసలు మనిషికి.., అవసరానికి అతి దగ్గరి అవినాభావ సంబంధం ఉందంటే అతిశయోక్తి కాదేమో...!!

అవసరం ఆదిప్రస్థానం అర్థనారీశ్వరుడితో (దేవుడితో) ఆరంభమై..,

అవసరం కోసం 'ఆరాధిస్తాం' అ'వ'స'రం' లోని వరం కోసం..,

అవసరమైతే 'ఆరతీస్తాం' ఏ ఆలయంలో ఏ దేవుడు గొప్పవాడో అని

అవసరాన్నిబట్టి అర్ధాన్ని (డబ్బు) అర్పిస్తాం.

ఇక అక్కడ నుండి 'అవసరం' తన అసలు రూపాన్ని అంగడి పెడుతుంది (బయటం పెట్టటం).

అవసరం అవసరమైతే మనిషిని అధః పాతాళానికి తోసేస్తుంది.

అవసరం అవసరమైతే ఆకాశానికి నిచ్చెన వేసి నిల్చోబెడ్తుంది.

అవసరం అడుక్కుతినేవాడిని అవిటివాడిగా చేపిస్తుంది..

అవసరం అధిక ఆదాయం కోసం అవినీతి పనులు చేపిస్తుంది.

అవసరం అనురాగం పంచుతుంది అవసరం కోసం
అవసరం ఆప్యాయతను కురుపిస్తుంది అత్యవసరం కోసం...

అవసరం అవసరమైతే ఆప్తమిత్రున్ని అధోగతి చేస్తుంది...

అవసరానికి అవసరం లేదు మానం అభిమానం..,

అవసరానికి అవసరం లేదు రోషం పౌరుషం,
అవసరానికి అవసరం 'అభినయాన్ని' అప్పు తెచ్చుకునే చాతుర్యం.

అవసరం లాలిస్తుంది బుజ్జగిస్తుంది..,

అవసరం అప్పటికప్పుడు ఎప్పుడు లేని అనుభంధాల కోసం అర్రులు చాస్తుంది.

అవసరం అవసరం కోసం అబద్దం ఆడుతుంది.,

అవసరం అవసరం కోసం నిజం నిప్పులాంటిదని నీతి వ్యాక్యాలూ చెప్తుంది.

అవసరం అమ్మాయిని... అవసరం అమ్మాయిని ఒళ్ళు అమ్ముకునేలా చేస్తుంది.,

అదే అవసరం కోసం ఆ అమ్మాయి తన ఒళ్ళుని అంకితం చేసి అవసరం కోసం ఆ మాత్రం అతిక్రమణ అక్కేరే అంటూ అవసరానికి అసలైన అర్ధాన్ని ఇస్తుంది.

1940వ దశకంలో మనిషి ప్రేమాభిమానాల చుట్టూ తిరిగేవాడు...

1960వ దశకంలో మనిషి స్వార్థం, స్వాభిమానం చుట్టూ తిరిగాడు...

 1990వ దశకంలో మనిషి డబ్బు చుట్టూ తిరగటం మొదలెట్టాడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడు...

2010వ దశకంలో మనిషి అవసరం చుట్టూ పరిగెడుతున్నాడు పరిగెడుతూనే ఉన్నాడు...

ఆ పరుగెత్తే అనామకునికి అలసట లేదు.,

ఈ అవసరానికి అంతం లేదు...

అవసరానికి అవసరమే నిత్యావసరం.

ఆ అవసరం ఎంత అద్వానంగా తయారయిందంటే ఎదుటి మనిషితో నీకేంటి రా అంటే అరేయ్ నాకు వాడితో "అవసరం" రా అని నవ్వుతు చెప్తున్నాడు.

అప్పుడప్పుడు అనిపిస్తుంది మనిషి బ్రతికేది అవసరం కోసమేనా అని.