నమస్కారం అనేది మనిషి యొక్క సంస్కారం నమస్కారానికి ప్రతిగా నమస్కరించడం మానవుని సంస్కారం. మనం తోటివారికి నమస్కరించేటప్పుడు అది సంస్కారవంతంగా ఉండాలి. మనల్ని ఎదుటివారు ఎంతగా గౌరవించారో, వారిని అంతకు మించి గౌరవించని పక్షంలో ఆ నమస్కారం తిరస్కారానికి ప్రతీకగా భావం వస్తుంది.
నమస్కారానికి ఆశీర్వాదం పొందే శక్తి ఉంది. మార్కండేయుడు పదహారేళ్లకే చనిపోతాడని కొందరు జ్యోతిష పండితుల ద్వారా తెలుసుకున్న అతడి తండ్రి మృకండుడు- నారదుణ్ని వేడుకున్నాడు. తన పుత్రుడు నిండు నూరేళ్లు జీవించేలా ఏదో ఒకటి చేయాలని ప్రార్థించాడు.
అందుకు ఆయన కనిపించిన ప్రతి వ్యక్తికీ మార్కండేయుడితో పాదాభివందనం చేయించాలన్నాడు. అదే విధంగా అందరికీ పాదాభివందనం చేస్తూ సాగిపోయిన అతణ్ని వారందరూ 'దీర్ఘాయుష్మాన్ భవ' అని దీవించారు. అలా నమస్కారాలు చేయడం ద్వారా అందరి ఆశీస్సులూ పొందిన మార్కండేయుడు అంతిమంగా దీర్ఘాయుష్మంతుడైనాడు.
ఒక మహారాజు అడవి మార్గంలో వెలుతుండగా ఆ దారిలో ఒక బౌద్ధ సన్యాసి ధ్యానముద్రలో కనిపించాడు. వెంటనే ఆ రాజు శిరస్సు వంచి పాదాభివందనం చేశాడు. అది చూసిన మంత్రి 'ఈ మహాసామ్రాజ్యానికి అధిపతి, కిరీటధారులైన మీరు ఒక యాచకుడి ముందు తల వంచారేమిటి?' అని ప్రశ్నించాడు.
రాజు చిరునవ్వుతో మౌనం వహించాడు ఆ తర్వాత రోజు మహారాజు ఒక మేక తల, పులి తల, యుద్ధంలో మరణించిన ఒక సైనికుడి తలను తెప్పించాడు. వాటిని విక్రయించాలని మంత్రిని ఆజ్ఞాపించాడు. మేక తల, పులి తల అమ్ముడు పోయాయి కాని మనిషి తలను తీసుకువెళ్లేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
అప్పుడు ఆ రాజు 'మరణించిన తరవాత మనిషి తలకు ఏ విలువా (ఉండదు) ఇవ్వరు. అలాంటి తలను వంచి పాదాభివందనం చెయ్యడంలో తప్పేముంది?' అనడంతో, మంత్రికి జ్ఞానోదయమైంది.
యోగశాస్త్రంలో 'నమస్కారాసనం' ప్రసక్తి ఉంది.
నమస్కారం చేసినప్పుడు చేతులు జోడిస్తాం. అవి హృదయానికి దగ్గరగా నిలుస్తాయి. అది సమర్పణకు ప్రతీక. ఆ సమర్పణతో, గుండెపై ఒత్తిడితో పాటు అహమూ తగ్గుతుంది. అది ఒక ఆరోగ్యకరమైన చర్య.
రాముడు అరణ్యవాసానికి వెళుతూ తల్లి కౌసల్యకు పాదాభివందనం చేశాడు.
సరయూ నదిలోకి ప్రవేశించే సమయంలో, వైకుంఠానికి వెళ్లబోయే ముందు తల్లి తన పక్కన లేకున్నా ఆమెను స్మరించి నమస్కరించాడు.'ఎదిగేకొద్దీ ఒదగాలి' అంటారు పెద్దలు. ఆ విషయంలో భగవంతుడూ తనను తాను మినహాయించుకోలేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా, అందరికీ ఆదర్శంగా నిలవడం కోసం ఒదిగే కనిపించాడు.
ధర్మరాజు రాజసూయ యాగం చేసే సమయంలో బహుమతులు స్వీకరించే పనిని దుర్యోధనుడు చేపట్టాడు. అతిథుల కాళ్లు కడిగి ఆహ్వానించే బాధ్యత తీసుకునేందుకు అందరూ వెనకంజ వేస్తే శ్రీకృష్ణుడు తానే ఆ పని చేశాడు. అలా ఆయన ఒదిగే ఉండటం వామన అవతారంలోనూ సాగింది.
శ్రీకృష్ణావతారంలో విశ్వరూపం చూపించిన మహావిష్ణువే వామనావతారంలో మూడడుగుల మరుగుజ్జుగా మారిపోయాడు. త్రివిక్రముడిగా భక్తుల గుండెల్లో నిలిచాడు. వామనుడు త్రివిక్రముడిగా ఆకాశం అంతటా వ్యాపించడంతో, ఆయన పాదాన్ని బ్రహ్మ భక్తితో కడిగాడని పురాణాలు చెబుతున్నాయి.
అలా బ్రహ్మ సైతం విష్ణుమూర్తి విశ్వరూపానికి దాసోహమన్నాడు. ఎదిగేకొద్దీ ఒదగాలని, అలా ఒదిగేకొద్దీ మరింత ఎదుగుతామని, పాదాభివందనంలోని పరమార్థాన్ని, నమస్కారంలోని సంస్కారాన్ని ఎందరో ఆచరించి చూపారు.అందుకే 'అందరికీ పోషణ, రక్షణ కావాలి. అందరం వైషమ్యరహిత, శాంతియుత జీవనం వైపు నడవాలి. నీలో, నాలో,మనలో ప్రకృతిలో శాంతి వర్ధిల్లాలి.మానవుని సంస్కారం నమస్కారం కాబట్టి ఈ సమాజంలో అందరిని( పెద్దలను ) గౌరవిద్ధాం ఆదర్షంగా నిలుద్ధాం.
నమస్కారం కేవలం ఓ సాంస్కృతిక అంశమే కాదు.
దాని వెనుక ఓ సైన్స్ ఉంది. మీ అరచేతులని మీరు దగ్గరికి తెచ్చే ప్రతీసారీ, ఓ చిన్న శక్తి విస్పోటనం సంభవిస్తోంది. ఇలా చేయడం వల్ల మీలో జీవశక్తి స్థాయిలో ఒక సమర్పణం జరుగుతుంది, అంటే మిమ్మల్ని మీరు అవతలి వ్యక్తికి అర్పించుకుంటున్నారు. ఆ సమర్పణంతో మీరు అవతలి ప్రాణిని మీతో సహకరించే జీవిగా చేసుకుంటారు. మీరు ఇచ్చే స్థితిలో ఉంటేనే, మీ చుట్టూ విషయాలు మీకు అనుకూలంగా జరుగుతాయి, వ్యక్తులు అనుకూలంగా వ్యవహరిస్తారు. ఇది ప్రతీ జీవికీ వర్తిస్తుంది. ప్రతీ జీవి కూడా తనకు తన చుట్టూ ఉన్న జీవరాసుల సహకారం ఉంటేనే, వృద్ధి చెందగలగుతుంది.
ప్రేమతో...
మీ రాంకర్రి
గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...
Blog : Ram Karri
Whatsapp : http://wa.me/+918096339900
-- స్వస్తి