ప్రపంచంలో ఏ ప్రాణీ తప్పించుకోలేని ఒకే ఒక భావోద్వేగం- భయం. చావుకు భయపడనివారు దేనికీ భయపడరంటారు. మరి జీవితానికి భయపడి చావును కోరి తెచ్చుకునేవారి పరిస్థితి ఏమిటి? భయం సాపేక్షం. ఎవరు, ఎప్పుడు, ఎందుకు భయపడతారో తెలీదు. కోటీశ్వరుడి నుంచి కూలి పనిచేసుకునే నిర్భాగ్యుడి వరకు, మృగరాజు సింహం నుంచి చిట్టెలుక దాకా భయానికి అతీతులు ఎవరూ లేరు.
విషయాలోచన వల్ల ఆసక్తి, దానివల్ల కోరిక, దాని నుంచి కోపం, కోపం వల్ల అజ్ఞానం, దానివల్ల బుద్ధినాశనం... చివరికి మనిషి పతనం సంభవిస్తున్నాయి. దీని నుంచి బయటపడాలంటే మనిషి సుగుణశీలుడై ఉండాలి. దీనిలోని గుణాల సంఖ్య ఇరవై ఆరు. మొదటి గుణం- నిర్భయం. భయం వల్ల సంశయం, సంకోచం కలుగుతాయి. వీటివల్ల మనిషి చంచలమనస్కుడవుతాడు. అలాంటివాడి పరిస్థితి నడిసముద్రంలో చిక్కుకున్న నావలా అవుతుంది. భయానికి మూలం ఆశ! ఉన్నది నిలుపుకోవాలని, లేనిది పొందాలని అనిపిస్తుంటుంది.

ఒక రాజు తన కుమారుడిని యువరాజుగా పట్టాభిషిక్తుణ్ని చేసి, యుద్ధరంగానికి పంపాడు. అతడు భయంతో ముందుకు కదలలేదు. అప్పుడు తన ఆస్థాన సిద్ధాంతి ద్వారా ఆయన కుమారుడి చేతికి మంత్రశక్తిగల తాయెత్తు కట్టించాడు. అది చేతికి ఉన్నంతకాలం యువరాజు విజేత అని సిద్ధాంతి చెప్పాడు. అలా యువరాజు యుద్ధానికి వెళ్లి శత్రువులను తుదముట్టించి యుద్ధంలో గెలిచాడు. అప్పుడు చూసుకుంటే చేతికి కట్టిన తాయెత్తు ఎప్పుడో పడిపోయినట్టు గమనించాడు. యువరాజును యుద్ధం చేయించింది తాయెత్తు కాదు. ఆ తాయెత్తు ద్వారా కలిగిన ధైర్యం, ఆత్మవిశ్వాసం. అవి ప్రతి మనిషిలో ఉంటాయి. వెతికి తీసుకోవడమే మనిషిపని. అన్నీతనలో ఉన్నాయి... అన్నింట్లో తాను ఉన్నాడు అని భావించే మనిషికి భయం ఉండదు. ఇది గీతాసారం. ‘ఎవరివల్ల లోకానికి భయంలేదో, లోకంవల్ల ఎవరికి భయం కలగదో వారే నాకు ఆత్మీయులు’ అన్నాడు కృష్ణుడు.

అధర్మంగా, అసత్యంగా ఏం చేసినా భయం కలుగుతుంది. తప్పు చేసినప్పుడు, చేసిన తరవాత, చేయక ముందు అదే భయం ఉంటుంది! ఆ క్రమంలో ధర్మాన్ని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది అంటుంది భారతం. వాస్తవంలో బతికేవాడు నిర్భయుడు. కలల్లో, ఊహల్లో జీవించేవాడు భయస్తుడు. భయం లేనివారికి జయం నిశ్చయం అన్నారొక కవి. మార్పును ఆహ్వానించేవారికి భయం ఉండదు. భయం- భద్రత కోసం పుట్టింది. పాతరాతి యుగంలో మానవుడి మృగభయం నుంచి శస్త్రం పుట్టింది. వాతావరణ భయం నుంచి వస్త్రం పుట్టింది. ఆకలి భయం నుంచి ఆహారం పుట్టింది. ఇలా భయానక పరిణామాల నుంచి బయటపడేసేది భయమే!

నియమబద్ధ జీవితం, సమయపాలన, ధ్యానం, సృజనాత్మక కళలు, ఆశావాద ఆలోచనలు- నిర్భయానికి సోపానాలు. ప్రహ్లాదుడు అమిత బలశాలి, పరాక్రమవంతుడు అయిన తన తండ్రి హిరణ్యకశిపుడి ముందు భయం లేకుండా నిలబడటానికి కారణం- తనలోగల అంతర్యామి పట్ల నమ్మకం, విశ్వాసం!

రాముడు అత్యంత శక్తిసంపన్నుడు. నియమ నిష్ఠలతో పూజలు చేసే రావణాసురుణ్ని ఎదుర్కోవడానికి, గెలవడానికి కారణం- అతడి సత్యసంధత వల్ల అలవడిన నిర్భీతి.

శరీరంలోని జ్ఞానేంద్రియాలన్నీ భయాన్ని గుర్తిస్తాయి. శరీరం వణుకుతుంది. చెవులు దుర్వార్తకు విముఖత చూపుతాయి. నాలుక పొడిబారుతుంది. ముక్కు ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా భయాన్ని సూచిస్తుంది. కాళ్లు భయంతో పరుగు పెట్టిస్తాయి. ఇవన్నీ మనిషి నియంత్రించుకోగలిగినవే! ఎలా? ప్రతి మనిషి జీవితం ఒక కురుక్షేత్రం. ఎవరికి వారే తమ విశ్వరూపాలను దర్శించుకోవాలి. ఆ రూపాలే తమలో ఉంటాయని గ్రహించిన మనిషి తన ఇంద్రియాలను జయిస్తాడు. అప్పుడతడు నిర్భయుడిగా మిగులుతాడు.
💪


గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...

Blog            : Ram Karri

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- --- --- --- -- -

మన టెలిగ్రామ్ సమూహాలలో చేరాలి అనుకుంటే క్రింద ఉన్న లింక్ ను నొక్కి నేరుగా సమూహం లో చేరండి...

https://t.me/joinchat/CJ_JKkHtaUSprY6qLuY5vg

https://t.me/RamKarri