నిన్ను అందరూ గౌరవించాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు అందర్నీ గౌరవించడం నేర్చుకో.. very basic principle! థీరిటికల్‌గా ఇది అందరికీ తెలుసు.. కానీ ప్రాక్టికల్‌గా ఎంతమంది ఫాలో అవుతున్నారు?  ఈ సొసైటీలో ఎవరిపై ఎవరికీ గౌరవం లేకపోవడానికి కారణం.. మనం ఇతరుల్ని ట్రీట్ చేసే విధానం. మనం గౌరవంగా బిహేవ్ చేస్తే అందరూ మనల్ని తల మీద పెట్టుకుంటారు. మనం ఏదో ఆకాశం నుండి ఊడిపడినట్లు బిహేవ్ చేస్తే పక్కన పడేస్తారు.

ఒక మనిషిగా పరిపూర్ణత్వం సాధించాలంటే.. ఇలాంటి చాలా క్వాలిటీస్ తూ.చ. తప్పకుండా అడాప్ట్ చేసుకోవాలి. నువ్వు ఎదుటి మనిషిని గౌరవించకపోవడానికి నీలో ఓ రాక్షసుడు ఎప్పుడూ బుర్రలో ఉంటున్నాడు, ఫస్ట్ ఆ విషయం గ్రహించు! అదే ఇంటర్నల్ టాక్. ఓ మనిషి మాట్లాడుతుంటే... "ఆ పెద్ద చెబుతున్నాడు.. ఇంకెంతసేపు చెబుతాడు. ఇవన్నీ మాకు తెలీవా" ఇలాంటి మాటలే నీ వ్యక్తిత్వాన్ని అడ్డంగా దిగజారుస్తున్నాయి. ఎదుట ఉన్న మనిషిని ఉన్నది ఉన్నట్లు స్వీకరించు. నువ్వు ప్రతీ క్షణం లోపల అనుకునే ఇంటర్నల్ మాటలు ఒక్కసారి తీరిగ్గా పరిశీలించు. మిగతా అంతా పక్కన పడేస్తే.. నీ మీద నీకు సిగ్గేస్తుంది. అదా నీ వ్యక్తిత్వం? ఎందుకు straightగా ఆలోచించలేవు? ఎందుకు మనస్సులోనూ, బయటా ఒకేలా ఉండలేవు? నీకు మనిషి నచ్చకపోతే దూరంగా వెళ్లు. ఎవరు కాదన్నారు? కానీ ఏదో భరిస్తున్నట్లు ఫోజులెందుకు కొడతావు? అది నీ లోపం కాదా?

అవసరం అయితే పెద్దల ముందు తల వంచుకోమన్నారు.. ఇంకా గౌరవం ఉంటే కాళ్లకి నమస్కారం చేసినా తప్పు లేదన్నారు. ఏం పోతుంది? మహా అయితే నీలో ఉన్న అహం నశిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఎవరూ చెప్పరు. నువ్వు తోపూ, నువ్వు తురుమూ అంటారు. నిజమేననుకుని విర్రవీగి ఏ పనీ చెయ్యక చివరకు ఎందుకూ పనికిరాని వాళ్లుగా తయారయ్యే వాళ్ల సంగతేంటి? ఇలాంటోళ్లా తోపులూ, తురుములూ?

నాకు అర్థమైనంత వరకూ ఈ ప్రపంచంలో తోటి మనిషిని గౌరవించడానికి మించిన గొప్పదనం ఏదీ లేదు. తోటి మనిషి ఓ మంచి పనిచేస్తే అప్రిషియేట్ చేయి.. ఏం పోతుంది? నువ్వు సంపాదించిన కోట్లు పోతాయా? దైవత్వం అంటే ఇదీ! నీలో దేవుడు అప్పుడు కన్పిస్తాడు..!

ఇక్కడ నువ్వొక్కడివే శాశ్వతం కాదు. ఇవ్వాళ నువ్వుంటావు, రేపు ఇంకొకరు వస్తారు.. నువ్వు సంపాదించిన ఆస్థి వాటాలుగా పంచుకోలేక నీ వారసులు కొట్టుకు ఛస్తారు. నీ కీర్తి పదిరోజులు గుర్తుంచుకుని పెద్ద దినం నాటికి కన్వీనియెంట్‌గా మర్చిపోబడుతుంది. మహా అయితే గుర్తొచ్చినప్పుడు మంచోడు.. చెడ్డోడు అని అనుకుంటారు అంతే. నీ ఈర్ష్యనీ, నీ ఇగోనీ కధలుకధలుగా చెప్పుకుని జోకులు వేసుకుంటారు.

సో ఈ భూమ్మీద ఉన్నంత కాలమైనా అందర్నీ గౌరవిస్తూ.. అందరితో సంతోషంగా ఉంటూ.. వారి భుజం తడుతూ.. సంతృప్తిగా బ్రతుకు. చివరకు నీకు మిగిలేది ఇదే!!


-స్వస్తి