పూర్వం అగ్గిపెట్టెలు ఉండేవి కావు. అరణి (అంటే రెండు కర్ర ముక్కలు తెచ్చి ఒక దానికి గుంత చేసి రుద్ది నిప్పు పుడుతుంది ) ద్వారా గానీ చేకుమికి రాళ్ళ ద్వారా గానీ నిప్పు తయారు చేసుకునేవారు. బ్రాహ్మణులు ఆ అగ్ని ఆరనీయకుండా అలాగే కర్రలు వేస్తూ వుండే వారు.అందుకే వాళ్లకు నిరతాగ్ని హోత్రులు అని పేరు.

ఒక వూరిలో ఒక ముసలమ్మ వుండేది ఆవిడ అడవికి వెళ్లి కట్టెలు తెచ్చుకొని చేకుముకు రాళ్ళతో చితుకులు వేసి మండించి నిప్పు చేసేది.దాన్ని అలాగే కర్రలు వేస్తూ నిప్పు ఆరనిచ్చేది కాదు.   కుంపట్లో ఎప్పుడూ నిప్పు వేసి వుంచేది. .వూళ్ళో అందరికీ అదే నిప్పు అందరూ ఆ ఆవ్వ దగ్గరకు వచ్చి అవ్వా!కాస్త నిప్పిస్తావా?అని అడిగి నిప్పుపట్టుకొనిపోయి వంట చేసుకునే వారు. ఆ అవ్వ దగ్గర ఒక కోడి కూడా వుండేది.అది రోజూ తెలావారుఝామున అవ్వ గుడిసె మీదికి ఎక్కి కొక్కొరోకో అని కూసేది.ఊరందరూ అబ్బ అవ్వ కోడి కూసింది తెల్లవారింది అని లేచి తమ పనులు చేసుకునేవారు.అవ్వ దగ్గర నిప్పుతెచ్చుకున్నందుకు బదులు ఒక్కోరోజు ఒక్కొక్కరు అవ్వకు బియ్యము,,పప్పులు కాయగూరలు యిచ్చేవారు.అలా ఆ ముసలమ్మ జీవనం సాగిస్తూ వుండేదియిలా కొన్నేళ్ళు గడిచాయి.ఆ అవ్వకు నా మూలంగానే వీళ్ళంతా బ్రతుకుతున్నారు అనే అహంభావం వచ్చింది..

ఒక రోజు అవ్వకు నా కోడి కూయకుంటే వీళ్ళంతా ఎలా నిద్ర లేస్తారు?నా కుంపటి లేకుంటే వీళ్ళెలా వంటలు వండుకుంటారు?అని తన కోడీ,కుంపటీ తీసుకొని అడవిలోకి వెళ్లి ఒక చెట్టుకింద కూచుంది.

మరుదినం కోడి కుయ్యలేదు.గ్రామస్తులంతా ఏమిటి కోడి కుయ్య లేదు అని అనుకున్నారు.అలవాటు ప్రకారం అందరూ లేచి తమ తమ పనులు చేసుకున్నారు.అవ్వ దగ్గరకు వెళ్లి నిప్పు తెచ్చుకుందామని 
వెళ్తే అక్కడ అవ్వలేదు ఈ అవ్వ కేమైంది?ఎక్కడికి వెళ్ళింది అనుకోని వాళ్ళు చెకుముకి రాళ్ళు తెచ్చుకొని 
నిప్పు తయారు చేసుకో ని వంట చేసుకున్నారు.

అవ్వ అడవిలో చెట్టుకింద కూచుని యివ్వాళ ఈ గ్రామస్తులంతా ఎలా నిద్ర లేచి వుంటారు??ఎలా వండుకుని వుంటారు?

                              అని ఆలోచిస్తూ తిండీ తిప్పలు లేకుండా వుండి పోయింది.సాయంకాలమయింది ఆవూరి అతను కట్టేలకోసం అడవికి వచ్చాడు.అతన్ని చూసి అవ్వ ఏమయ్యా! మీ ఊరిలో తెల్ల వారిందా?అందరూ నిద్ర చేచి వంటలూ అవీ చేసుకున్నారా?అని అడిగింది.వాడు నవ్వి ఓసి తిక్కవ్వా నీ కోడి లేకుంటే మాకెందుకు తెల్లవారదు?నీ కుంపటి లేకుంటే మీమెందుకు వంటలు చేసుకోము?నిప్పుచేసుకొని వంట చేసుకునే టప్పటికి కొంచెం ఆలస్య మయింది అంతే నీవే ఈ అడవిలోకి వచ్చి కూచుని పొద్దున్న నుండీ తిండీ తిప్పలు లేకుండా మాడావు.పో పో పోయి వంటచేసుకొని తినుపో.యిదిగో నా దగ్గర కాసిని కర్రలు వున్నాయి తీసుకొని పోయి వంట చేసుకొని తిను.అన్నాడు.అవ్వకు బుద్ధి వచ్చింది.యింటికి వెళ్లి నిప్పు చేసుకొని వంట చేసుకుంది.

మరుదినం నుండీ ఈ అవ్వను నమ్ముకుంటే అన్నీ ఆలస్య మవుతాయి..మనమే నిప్పు తయారు చేసుకుంటే పోయింది అనుకోని గ్రామస్తు లందరూ ఎవరికి వారే నిప్పు తయారు చేసుకున్నారు.అవ్వ ఎవ్వరూ తనదగ్గరకు నిప్పుకోసం రాకపోవటం,వాళ్ళే నిప్పు తయారు చేసుకోవటం చూసి దిగులు పడి  పడి పోయింది. వాళ్ళ దగ్గర నుండి వచ్చే బియ్యం పప్పులు కూడా లేకుండా పోయాయి.

ఎవరు కూడా నేను లేకుండా ఏదీ జరగదు అని గర్వ పడరాదు.

 అయ్యవారు రాకపోతే అమావాస్య ఆగుతుందా? అనే సామెత దీని వల్లే ఏర్పడి వుంటుంది.అలాగే ఎవరో యిస్తారు లే ఎవరో చేస్తారులేఅనుకోని ఏమీ చేయకుండా సోమరితనం తో వుండకూడదు..ఒకరిమీద సాధ్యమైనంత వరకూ ఆధార పడకుండా తమ పనులుతామే చేసుకోవడం నేర్చుకోవాలి.

మా చిన్నప్పుడు ఈ కథ మా అమ్మమ్మ చెప్పేది.