" శరీర మాద్యంఖలు ధర్మసాధనమ్" అనే శ్లోకం . . .
మన దేహాన్ని ఆరోగ్యంగా పోషించుకుంటేనే మనకు ధర్మ సాధన సాధ్యమవుతుందనే విషయాన్ని తెలియజేస్తోంది. . .
అందుకే మన పండగలు, దైవారాధనలు పలు ఆరోగ్య సంబంధిత సూత్రాలతో ముడిపడి ఉన్నాయి. . .
మన సంస్కృతీ సంప్రదాయాల వెనుక నిగూఢంగా దాగివున్న ఆరోగ్య రహస్యాలను తెలియజేయడానికి ముందు వరుసలో ఉండే
🛕 రాంకర్రి జ్ఞాన కేంద్ర 🚩. . .
నేడు
🍃 సంజీవని ఔషధ వనం 🍂
ఆధ్వర్యంలో. . .
21 రకాల పత్రుల గుణ గుణాలను తెలిపే ప్రయత్నంజేస్తోంది. .
మానవునికి, ప్రకృతిలోని జీవజాలానికి ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పే విశిష్టమైన పండుగ వినాయక చవితి. . .
మొక్కలు చేసే మేలు అంతా ఇంతా కాదు. . .
ప్రత్రహరితంతో నిండి ఎంతో పచ్చగా కనిపించే ఆకులు
మన జీవితాన్ని ఎంతో పచ్చగా ఉంచేందుకు దోహదపడతాయి. . .
వినాయక పూజలో 21 రకాల ఆకులను పూజాపత్రిగా ఉపయోగిస్తాము. .
ఈ 21 రకాల మొక్కలు ఎంతో ఔషధ విలువలు కలిగి ఉంటాయి. . .
వీటిని మన పెద్దలు తరతరాలుగా ఆరోగ్య సంరక్షణకు వినియోగిస్తున్నారు. . .
వినాయక చవితి నాడు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి.
విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ.
ఈ విలువైన మొక్కల గుణగణాలను
గణనాధుని పండగ సందర్భంగా
మనం తెలుసుకొని ఇంటిల్లిపాటి ఉపయోగించుకుందాం. . .
1) మాచీ పత్రం
మనదేశంలో ప్రతీచోట కనిపిస్తుంది.
మన ఇళ్ళ చుట్టుపక్కల ఇది విపరీతంగా పెరుగుతుంది.
ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. ఇది నేత్ర రోగాలకు అద్భుత నివారిణి.
మాచాపత్రి ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి.
ఇది చర్మ రోగాలకు మంచిమందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి ఆ ముద్దను చర్మవ్యాధి ఉన్నచోట పైపూతగా రోజూ రాస్తూ ఉంటే వ్యాధి తొందరలో నివారణ అవుతుంది.
రక్తపు వాంతులకు, ముక్కునుండి రక్తం కారినపుడు మంచి విరుగుడు.
ఈ పత్రాన్ని గణపతికి సమర్పించి ఓం సుముఖాయ నమ:
మాచీపత్రం సమర్పయామి అని అర్చించాలి.
2 బృహతీపత్రం
భారతదేశమంతటా విస్తారంగా పెరుగుతుంది.
దీన్నే మనం వాకుడాకు, నేలమునగాకు అని కూడా పిలుస్తూ ఉంటాం.
ఇది కంఠ రోగాలను, శరీరనొప్పులను నయం చేస్తుంది.
ఎక్కిళ్ళను తగ్గిస్తుంది.
కఫ, వాత దోషాలను, ఆస్తమాను, దగ్గును, సైనసైటిస్ ను తగ్గిస్తుంది.
అరుగుదలను పెంచుతుంది.
గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
బృహతీపత్రం చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది.
బృహతీపత్రం యొక్క కషాయంతో నోటిని శుభ్రపరుచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది.
రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది.
ఇంకా అనేకానేక ఔషధీయగుణాలున్నాయి.
ఈ పత్రాన్ని ‘ఓం గణాధిపాయ నమ:
బృహతీపత్రం పూజయామి’ అంటూ గణపతికి సమర్పించాలి.
3 బిల్వ పత్రం
దీనికే మారేడు అని పేరు.
శివునికి అత్యంత ప్రీతికరం.
బిల్వ వృక్షం లక్ష్మీ స్వరూపం.
ఇది మధుమేహానికి దివ్య ఔషధం.
ఈ వ్యాధిగలవారు రోజూ రెండు ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధినుంచి ఉపశమనం లభిస్తుంది.
తాజా మారేడు ఆకుల రసం తీసి కంట్లో వేసుకోవడం వలన కండ్లకలక నుంచి త్వరిత ఉపశమనం లభిస్తుంది.
నువ్వులనూనె, మారేడుకాయలతో చేసిన ఔషధీయ రసాయనం చెవిటిరోగాన్ని పోగొడుతుంది.
మారేడు వేళ్ళతో చేసిన కషాయం టైఫాయిడ్ జ్వరానికి విరుగుడు.
పచ్చి మారేడుకాయలు విరోచనాలను తగ్గిస్తాయి.
ఆకలిని పెంచుతాయి.
మారేడు వేళ్ళు, ఆకులు జ్వరాలను తగ్గిస్తాయి.
ఇలా ఇంకా ఎన్నో ఔషధ గుణాలు బిల్వం సొంతం.
అటువంటి బిల్వపత్రాన్ని ‘ఓం ఉమాపుత్రాయ నమ:
బిల్వపత్రం పూజయామి‘ అంటూ గణపతికి అర్పించి పూజించాలి.
4.దూర్వాయుగ్మం ( గరిక )
గణపతికి అత్యంత ఇష్టమైన వస్తువు గరిక,
ఒక్క గరిక సమర్పిస్తే చాలు మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య.
తులసి తరువాత అంత పవిత్రమైనది గరిక.
దూర్వాయుగ్మం అంటే రెండు కొసలు కలిగి ఉన్న జంట గరిక.
ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది.
ఈ గరిక కూడా మహా ఔషధ మూలిక.
గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి.
మగవారికి సంతాన నిరోధకంగా కూడా పనిచేస్తుంది.
కఫ, పైత్య దోషాలను హరిస్తుంది.
చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరంచేస్తుంది.
ముక్కునుంచి రక్తంకారటం, నిరోధిస్తుంది.
గరికను రుబ్బి లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది.
హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.
ఓం గజాననాయ నమ:
దూర్వాయుగ్మం సమర్పయామి అంటూ స్వామికి గరికను సమర్పించాలి.
5 దత్తూరపత్రం
దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం.
ఉష్ణతత్వం కలిగినది. కఫ, వాత దోషాలను హరిస్తుంది.
కానీ నార్కోటిక్ లక్షణాలు కలిగినది కనుక వైద్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడదు.
మానసిక వ్యాధి నివారణకు పనిచేస్తుంది.
మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయించి ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని రెండు నెలలపాటు మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది.
దీని ఆకులు, వేళ్ళు, పువ్వులు అమితమైన ఔషధ గుణము కలవి అయినా
దీని గింజలు (విత్తనాలు) మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి.
జ్వరాలు, అల్సర్లు, చర్మరోగాలకు, చుండ్రుకు ఉమ్మెత్త ఔషధం.
ఇంకా ఎన్నో ఔషధ గుణాలున్న దత్తూర పత్రాన్ని
‘ఓం హరసూనవే నమ:
దత్తూర పత్రం పూజయామి’ అంటూ వరసిద్ధి వినాయకునికి సమర్పించాలి.
6 బదరీపత్రం
దీనినే రేగు అని పిలుస్తుంటాం.
బదరీ వృక్షం సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని స్వరూపం.
చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది.
12 ఏళ్ళ లోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు.
ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంత వరకూ తినిపించాలి.
కానీ రేగు ఆకులు ఎక్కవుగా తింటే కఫం వచ్చే ప్రమాదం ఉంది.
రేగు ఆకులు జుట్టుకు మంచి ఔషధం.
జుట్టు ఆరోగ్యంగా పెరగడనికి రేగు ఆకులు బాగా ఉపయోగపడతాయి.
అరుగుదల సమస్యలకు, గాయాలకు కూడా రేగు ఆకులు ఔషధంగా పనిచేస్తాయి.
ఓం లంబోదరాయ నమ:
బదరీపత్రం పూజయామి అంటూ
గణపతికి బదరీపత్రం సమర్పించాలి.
7 అపామార్గపత్రం
దీనికే ఉత్తరేణి అని పేరు.
దీని కొమ్మలతో పళ్ళుతోముకుంటే దంతవ్యాధులు, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులు నివారణ అవుతాయి.
దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో, హోమాల్లో వినియోగించడం వల్ల హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం వల్ల శ్యాస సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి.
స్థూలకాయానికి, వాంతులకు, పైల్స్ కు, టాక్సిన్స్ వల్ల వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి.
ఈ ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి.
నొప్పి తగ్గిపోతుంది.
రోజూ ఉత్తరేణి ఆకుల రసం గాయాల నుండి రక్తం కారడాన్ని అరికడుతుంది.
ఉత్తరేణి ఆకులతో తయారుచేసిన ఔషధ నూనె చెవుడుకు మందుగా పనిచేస్తుంది.
మూత్రసంబంధిత వ్యాధులకు పనిచేస్తుంది ఉత్తరేణి.
పిల్లలు చెడుమార్గంలో వెళ్తున్నారని, చెడ్డ అలవాట్లకు లోనవుతున్నారని బాధపడే తల్లిదండ్రులు ఉత్తరేణి మొక్కను పూజించి, దాని వేర్లను పిల్లల మెడలో కడితే బుద్ధిమంతులవుతారు.
రోజూ ఉత్తరేణి కొమ్మలతో పళ్ళు తోముకునే అలవాటు ఉన్నవారు ఎక్కడకు వెళ్ళినా, ఆహారానికి లోటు ఉండదు.
ఆహారం దొరకని ఎడారిలో కూడా ఎవరో పిలిచి భోజనం పెడతారుట.
అది ఉత్తరేణి మొక్క మహిమ.
ఇంకా ఉత్తరేణికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి.
ఇంత గొప్ప ఉత్తరేణి మనదేశంలో ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది.
‘ఓం గుహాగ్రజాయ నమ:
అపామార్గపత్రం పూజయామి’
8 తులసి
తులానాం నాస్తు ఇతి తులసి - ఎంత చెప్పుకున్నా తరిగిపోని ఔషధ గుణాలున్న మొక్క తులసి. పరమపవిత్రమైనది. విష్ణుమూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటోంది మన సాంప్రదాయం. అంత గొప్ప తులసి గురించి కొన్ని చెప్పుకుందాం. కఫ, వాత, పైత్య దోషాలను మూడింటినీ శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి. కాలుష్యాన్ని తగ్గిస్తుంది. తులసి వాసనకు దోమలు దరిచేరవు. తులసి ఆకులు, వేర్లు, కొమ్మల్లో అనేక ఔఁధ గుణాలున్నాయి. చర్మరోగాలను నయంచేస్తుంది. తులసి ఆకులు నమలడం చేత పంటి చిగురు రోగాలు నయం అవుతాయి. అరుగుదలను, ఆకలిని పెంచుతుంది. కఫం వలన వచ్చే దగ్గును, ఆస్తమాను తగ్గిస్తుంది. తులసి రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. తులసి శరీరంలో ఉన్న ఆమాన్ని (టాక్సిన్స్, విషాన్ని) విశేషంగా తీసివేస్తుంది. ఈ మధ్య పరిశోధనల ప్రకారం తులసిచెట్టు మాత్రమే రోజుకు 22 గంటలపాటు ప్రాణవాయువు(ఆక్సిజన్) ను విడుదల చేస్తుందన్న విషయం తెలిసిందే. ఇంత గొప్ప లక్షణం మరే ఇతర మొక్కకు లేదు.
సూచన: పురాణకథ ఆధారంగా గణపతిని ఈ తులసీ దళాలతో ఒక్క వినాయకచవితి నాడు తప్ప ఇంకెప్పుడూ ఆరాధించకూడదు.
’ఓం గజకర్ణాయ నమ: -తులసి పత్రం పూజయామి- అంటూ గణపతికి అర్పించాలి.
9. చూత పత్రం(మామిడి ఆకు):-నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు.
"ఏకదంతాయ నమ: చూతపత్రం సమర్పయామి"
10 కరవీరపత్రం: దీనినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా పూజకు కోసిన పువ్వులు చెట్టునుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో కింద పడితే ఫరవాలేదు కానీ, మరోచోట (అది పూజాస్థలంలో అయినా సరే) క్రిందపడితే ఇక పూజకు పనికిరావు. కానీ గన్నేరుపూలకు ఆ నిబంధన వర్తించదు. గన్నేరుపూలు మరే ఇతర ప్రదేశంలో క్రిందపడినా నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. గన్నేరుచెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి. గన్నేరుచెట్టునుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు అది అనేక రోగాలను నయం చేస్తుంది. గన్నేరు ఆకులు తెంచి పాలు కారిన తరువాత, పాలు లేకుండా తడిబట్టలో పెట్టి శరీరానికి కట్టుకుంటే జ్వరతీవ్రత తగ్గిపోతుంది. కానీ గన్నేరుపాలు ప్రమాదకరం. కనుక కాస్త జాగ్రత్తవహించాలి.
‘ఓం వికటాయ నమ:-కరవీరపత్రం పూజయామి’ అంటూ గణపతికి గన్నేరు ఆకులను సమర్పించాలి.
11.విష్ణుక్రాంతపత్రం : మనం వాడుకభాషలో అవిసె అంటాం. దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామరవ్యాధి ఉన్నచోట పూస్తే తామరవ్యాధి నశిస్తుంది. ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణ అవుతాయి. విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది.
‘ఓం భిన్నదంతాయ నమ:-విష్ణుక్రాంత పత్రం పూజయామి’
12,దాడిమీపత్రం : అంటే దానిమ్మ. భారతదేశమంతటా పెరుగుతుంది. లలితాసహస్రనామాల్లో అమ్మవారికి దాడిమికుసుమప్రభ అనే నామం కనిపిస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరంమీద రాయడం చేత అలర్జీలు, కీటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మపండు తొక్క గాయాలకు ఔషధం. వాపును అరికడుతుంది. పైత్య దోషాన్ని అదుపులో ఉంచుతుంది. దానిమ్మపండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. గొంతు రోగాలకు ఔషధం దానిమ్మ. దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్నీ ఔషధ గుణాలు కలిగినవే.
దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాంట్లో తగినంత చక్కెర కలిపి సేవించితే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. దీని ఆకులకు నూనె రాసి వాపు ఉన్నచోట కడితే కల్లవాపులు(అకస్మాత్తుగా వచ్చే వాపులు) తగ్గుతాయి.
ఓం వటవే నమ:దాడిమీ పత్రం పూజయామి అని ఈ పత్రాన్ని గణపతికి సమర్పించాలి.
13.దేవదారు పత్రం: ఇది వనములలో, అరణ్యములలో పెరిగే వృక్షం. పార్వతీదేవికి మహా ఇష్టమైనది. చల్లని ప్రదేశంలో ముఖ్యంగా హిమాలయా పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నూనెలో వేసి కాచి చల్లార్చిన తర్వాత నూనె తలకు రాసుకుంటే మెదడు, కంటి సంబంధ రోగాలు దరిచేరవు. దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్ళలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.
ఓం సర్వేశ్వరాయ నమ:-దేవదారు పత్రం పూజయామి అని సమర్పించాలి గణపతికి.
14. మరువక పత్రం : మనం దీన్ని వాడుక భాషో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్టుమెంట్లలోనూ కుండీల్లో పెంచుకోవచ్చు. ఇది మంచి సువాసన గల పత్రం. మరువం వేడినీళ్ళలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.
ఓం ఫాలచంద్రాయ నమ:-మరువక పత్రం పూజయామి.
15. సింధువార పత్రం: వావిలి ఆకు. ఇది తెలుపు, నలుపు అని రెండు రకాలు. రెండింటిలో ఏదైనా వాలివి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింత వాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. ఈ ఆకులలను దంచి దానిని తలమీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి.
ఓం హేరంభాయ నమ:-సింధువార పత్రం పూజయామి
16. జాజీపత్రం : జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అన్నిచోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగిమనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. ఈ సువాసన డిప్రెషన్ నుంచి బయట పడడంలో బాగా ఉపకరిస్తుంది. జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళుతోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. జాజి కషాయాన్ని రోజూ తీసుకోవడం వలన కాన్సర్ నివారించబడుతుంది. జాజి చర్మరోగాలకు దివ్యౌషధం. కామెర్లను, కండ్లకలకను, కడుపులో నులిపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. జాజి మొగ్గలతో నేత్రవ్యాధులు, చర్మరోగాలు నయం చేస్తారు.
ఓం శూర్పకర్ణాయ నమ:-జాజి పత్రం సమర్పయామి
17. గండకీ పత్రం : దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. ధైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీపత్రం. అరణ్యాలలో ఈ గండకీచెట్టు ఆకు మొండి, దీర్ఘవ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబులను హరిస్తుంది.
ఓం స్కంధాగ్రజాయ నమ: - గండకీ పత్రం సమర్పయామి
18. శమీపత్రం : దీని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దీనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. జమ్మి పూలను చెక్కెరతో కలిపి సేవించడం వల్ల గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.
ఓం ఇభవక్త్రాయనమ: - శమీపత్రం సమర్పయామి
19. అశ్వత్థపత్రం
రావి వృక్షం
తులసి లేని ఇల్లు, వేపలేని వీధి,
ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దల మాట.
రావి సాక్షాత్ శ్రీమహావిష్ణు స్వరూపం.
పరమాత్మయే తనను తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు.
రావి మండలను ఎండబెట్టి ఎండిన పుల్లలను నేతితో కలిపి కాల్చి భస్మం చేసి ఆ భస్మాన్ని తేనెతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశ వ్యాధులు నివారణ అవుతాయి.
అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను వాడతారు.
రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం.
దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు.
రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు.
రావి చర్మరోగాలను, ఉదరసంబంధ రోగాలను, నయం చేస్తుంది.
రక్తశుద్ధిని చేస్తుంది.
ఓం వినాయకాయ నమ:
అశ్వత్థ పత్రం సమర్పయామి
20. అర్జునపత్రం
మనం దీన్నే మద్ది అంటాం.
ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది.
మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం.
హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది.
భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాల్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లోవిరివిగా పెరుగుతుంది.
ఇది శరీరానికి చలువ చేస్తుంది.
కఫ, పైత్య దోషాలను హరిస్తుంది.
కానీ వాతాన్ని పెంచుతుంది.
పుండు నుంచి రక్తం కారుటను త్వరగా ఆపుతుంది.
మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది.
దీని బెరడును నూరి, వ్రణమున్న ప్రదేశంలో కడితే, ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి.
ఓం సురసేవితాయ నమ:
అర్జునపత్రం సమర్పయామి
21. అర్కపత్రం
జిల్లేడు ఆకు, జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం.
జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది.
కానీ జిల్లేడు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.
ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాధులకు జిల్లేడుపూలను వాడడం ఆయుర్వేద గ్రంథాల్లో కనిపిస్తుంది.
జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం.
జిల్లేడు రక్తశుద్ధిని చేస్తుంది.
ఓం కపిలాయ నమ: - అర్కపత్రం సమర్పయామి.
ఓం వరసిద్ధి వినాయక స్వామినే నమ:
ఏకవింశతి పత్రాణి సమర్పయామి.