మన పూర్వీకులు మనకు అందించిన అపూర్వ గ్రంథ రాజములు:

మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు?క్రింది శాస్త్రాల గురించి చదువుతుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా అని ఆశ్చర్యం కలుగక మానదు.

1. అక్షరలక్ష:
ఈ గ్రంథం ఒక సర్వసంగ్రహ గ్రంథము. రచయిత వాల్మీకి మహర్షి. రేఖాగణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక గణితశాస్త్రం మొదలైన మూడువందల ఇరువదిఐదు రకాల గణిత ప్రక్రియలు, ఖనిజశాస్త్రం, భూగర్భశాస్త్రం, జలయంత్ర శాస్త్రం, గాలి, విద్యుత్, ఉష్ణాలను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

2. శబ్దశాస్త్రం:
రచయిత ఖండిక ఋషి. సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను, ప్రతిధ్వనులను ఇది చర్చించింది. ఇందులోని ఐదు అధ్యాయాలలో కృత్రిమంగా శబ్దాలను సృష్టించడం, వాటి స్థాయి (పిచ్), వేగాలను కొలవడం వివరించారు.

3. శిల్పశాస్త్రం:
రచయిత కశ్యప ముని. ఇందులో ఇరువదిరెండు అధ్యాయాలు ఉన్నాయి. మూడువందల ఏడు రకాల శిల్పాల గురించి, నూటఒక్క రకాల విగ్రహాలతో కలిపి సంపూర్ణంగా చర్చించారు. గుళ్ళు, రాజభవనాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు వెయ్యికి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రంపై విశ్వామిత్రుడు,
మయుడు, మారుతి మొదలగు ఋషులు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చింపబడ్డాయి.

4. సూపశాస్త్రం:
రచయిత సుకేశుడు. ఇది పాకశాస్త్రం. ఊరగాయలు, పిండివంటలు
తీపిపదార్థాలు, నూటఎనిమిది రకాల వ్యంజనాలు మొదలగు అనేక రకాల వంటకాల గురించి, ప్రపంచవ్యాప్తంగా ఆ కాలంలో వాడుకలో ఉన్న మూడువేల ముప్పదిరెండు రకాల పదార్థాల తయారీ గురించి చెప్పబడింది.

5. మాలినీ శాస్త్రం:
రచయిత ఋష్యశృంగ ముని.
పూలమాలలను తయారుచేయడం, పూలగుత్తులు, పూలతో రకరకాల శిరోజాలంకరణలు, రహస్య భాషలో పూవులరేకుల పైన ప్రేమ సందేశాలు పంపడం లాంటి అనేక విషయాలు పదహారు అధ్యాయాలలో వివరింపబడ్డాయి.

6. ధాతుశాస్త్రం:
రచయిత అశ్వినీకుమార. సహజ, కృత్రిమ లోహాలను గురించి ఏడు అధ్యాయాలలో కూలంకషంగా వివరించారు. మిశ్రమ లోహాలు,లోహాలను మార్చడం, రాగిని బంగారంగా మార్చడం మొదలగునవి వివరించారు.

7. విషశాస్త్రం:
రచయిత అశ్వినీకుమార. ముప్పదిరెండు రకాల విషాలు, వాటి గుణాలు, ప్రభావాలు,
విరుగుడులు మొదలైన విషయాలు చెప్పారు.

8. చిత్రకర్మ శాస్త్రం (చిత్రలేఖనశాస్త్రం):
రచయిత భీముడు. ఇందులో పన్నెండు అధ్యాయాలు ఉన్నాయి. సుమారు రెండువందల రకాల చిత్రలేఖన ప్రక్రియల గురించి చెప్పారు. ఒక వ్యక్తి తలవెంట్రుకలను గాని, గోటిని కాని,ఎముకను కాని చూసి ఆ వ్యక్తి బొమ్మను గీసే ప్రక్రియ చెప్పబడింది.

9. మల్లశాస్త్రం:
రచయిత మల్లుడు. వ్యాయామాలు, ఆటలు, ఒట్టి చేతులతో చేసే ఇరవైనాలుగు రకాల విద్యలు చెప్పబడ్డాయి.

10. రత్నపరీక్ష:
రచయిత వాత్సాయన ఋషి. రత్నాలు కలిగి ఉన్న ఇరవైనాలుగు లక్షణాలు చెప్పబడ్డాయి. వీటి శుద్దతను పరీక్షించడానికి ముప్పదిరెండు పద్ధతులు చెప్పబడ్డాయి. రూపం, బరువు మొదలగు తరగతులుగా విభజించి తర్కించారు.

11. మహేంద్రజాల శాస్త్రం:
సుబ్రహ్మణ్యస్వామి శిష్యుడైన వీరబాహు రచయిత. నీటిపై నడవడం,గాలిలో తేలడం వంటి మొదలైన భ్రమలను కల్పించే గారడిలను ఇది నేర్పుతుంది.

12. అర్థశాస్త్రం:
రచయిత వ్యాసుడు. ఇందులో భాగాలు  మూడు. ధర్మబద్ధమైన ఎనుబదిరెండు ధన సంపాదనా విధానాలు ఇందులో వివరించారు.

13. శక్తితంత్రం:
రచయిత అగస్త్యముని. ప్రకృతి, సూర్యుడు, చంద్రుడు, గాలి, అగ్ని మొదలైన అరవైనాలుగు రకాల బాహ్య శక్తులు, వాటి ప్రత్యేక వినియోగాలు చెప్పబడ్డాయి. అణువిచ్ఛేదనం ఇందులోని భాగమే.

14. సౌధామినీకళ:
రచయిత మతంగ ఋషి. నీడల ద్వారా, ఆలోచనల ద్వారా కంటికి కనపడే అన్ని విషయాలను ఆకర్షించే విధానం చెప్పబడింది. భూమి మరియు పర్వతాల లోపలి భాగాల ఛాయాచిత్రాలను తీసే ప్రక్రియ చెప్పబడింది.

15. మేఘశాస్త్రం:
రచయిత అత్రిముని. పన్నెండు రకాల మేఘాలు, పన్నెండు రకాల వర్షాలు, అరవైనాలుగు రకాల మెరుపులు, ముప్పదిమూడు రకాల పిడుగులు వాటి లక్షణాల గురించి చెప్పబడింది.

16. స్థాపత్యవిద్య:
అధర్వణవేదం లోనిది. ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, కట్టడాలు, నగరప్రణాలిక మొదలైన సమస్త నిర్మాణ విషయాలు ఇందులో ఉన్నాయి.

ఇంకా భగవాన్ కార్తికేయ విరచిత కాలశాస్త్రం, సాముద్రిక శాస్త్రం, అగ్నివర్మ విరచిత అశ్వశాస్త్రం, కుమారస్వామి రచించిన గజశాస్త్రం, భరద్వాజ ఋషి రచించిన యంత్రశాస్త్రం మొదలగునవి,
ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వవేదం మొదలగు ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.

వీటిలో చాలా వరకు నేడు అందుబాటులో లేవు....