ఒక చక్కని చమత్కార పద్యం చూడండి :


ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబులఁ
దేఁటి రక్కసిరాజు తెలియఁ దల్లి

ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబులఁ
శివునిల్లు వరిచేను క్షీరధార

ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబులఁ
భార్యయు ఖడ్గంబు పాదపంబు

ఆద్యంత మధ్య మాంతాది వర్ణంబులఁ
మార్వనె్న యీటె ధూమంబు దనరు

అన్నిటికిఁజూడ మూఁడేసి యక్షరములు
మొదలు తుదలును నడి తుది మొదలు నడుము
ప్రాణ రక్షను, లతలను పాదపముల
బరికరము లంద యీ పదాలమర వలయు !

ముందుగా కవి సంధిస్తున్న ప్రశ్న లేమిటో తెలుసు కుందామా ?

కవి ఇందులో మొత్తం నాలుగు ప్రశ్నలు వేస్తున్నాడు. వాటికి అన్నింటికీ జవాబులు మూడేసి అక్షరాలలో ఉంటాయి.

ఒకటి, మూడు అక్షరాలలో మొదటి దానికీ,
రెండు, మూడు అక్షరాలలో రెండవ దానికీ,
ఒకటి, రెండు అక్షరాలలో మూడవ దానికీ జవాబులు ఉండాలి.

మొదలు, తుది - నడి, తుది - తుది, మొదలు అక్షరాలను కలిపితే వరుసగా జవాబులు వస్తాయన్నమాట !

మొదటి దానికి వరుసగా తుమ్మెద. రాక్షస రాజు, అమ్మ అనే అర్ధాలు రావాలి.

రెండో దానికి వరుసగా శివ సదనం, వరి చేను, పాల ధార అనే అర్ధాలు రావాలి.

మూడో దానికి వరుసగా భార్య, కత్తి, ఒక చెట్టు అనే అర్ధాలు రావాలి.

నాలుగో దానికి వరుసగా మచ్చ, ఈటె, ధూమం అనే అర్ధాలు రావాలి.

మరింకా, జవాబులన్నీ లతలు, చెట్లు, పరికరాలు, మనుషులు మొదలయిన అర్ధాలు కలిగి ఉండాలని కొస మెఱుపుగా ఒక కండిషన్ కూడా కవిగారు పెట్టారండోయ్ !

ఇక జవాబులు చూడండి :

1. అంబలి - అలి ( తుమ్మెద) , బలి ( బలి చక్రవర్తి), అంబ ( తల్లి)

2. గుమ్మ డి - గుడి ( శివ సదనం) , మడి (వరిచేలు) , గుమ్మ ( గుమ్మ పాలు)

3. ఆవాలు - ఆలు (భార్య), వాలు (కత్తి), ఆవ ( ఒక దినుసు చెట్టు)

4. పొగడ - పొడ ( మచ్చ), గడ (ఈటె) , పొగ (ధూమం)


ఇదండీ సంగతి. ఇలాంటి తమాషాలు చెయ్యడం మన కవులకు కరతలామలకం.

ఈ పద్యం మీకు లోగడ తెలిసిందేనా ? పోనిద్దురూ , మరో సారి గుర్తు తెచ్చుకుంటే ఏం పోయింది !