దీపావళి అనగా దీపముల వరుస...

           మన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో పండుగలకు అధిక ప్రాధాన్యము ఉన్నది . వీటిలో దీపావళి పండుగ ఒకటి. ఈ పండుగను ఆశ్వీయుజమాస బహుళ అమావాస్య రోజున జరుపుకొంటారు . దీపావళి అనగా దీపములవరుస అని అర్ధము .ఈ జరుపుకొనుట యొక్క ప్రాముఖ్యతను పురాణాలలో అనేక విధములుగా తెలియజేసారు .


1. .విష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞను శిరసా వహించి పధ్నాలుగు (14 ) సంవత్సరములు అరణ్యవాసము చేసి తిరిగి సీతతో కలిసి రాజ్యమునకు వచ్చిన సంధర్బమున ప్రజలు ఆనందోత్సాహాలతోదీపములనలంకరించి జరుపుకొన్న పండుగ ను దీపావళి అంటారని,

2. విష్ణుమూర్తి వామన అవతరుడై రాక్షస రాజు బలిచక్రవర్తి ని మూడు అడుగుల నేలను అడిగి అతనిని పాతాళమునకు అనిచివేసినందుకు దేవతలు, నరులు అనందించి జరుపుకున్న పండుగ అని ,

3. ద్వాపరయుగమందు నరకాసురుడనే రాక్షసుని శ్రీ కృష్ణుడు తన భార్య సత్యబామతో కలిసి సంహరింఛినందుకు ప్రజలు ఆనందంతో ప్రతి యింటిని దీపములతో అలంకరించి జరుపుకున్న పండుగ అని అంటారు. దీపావళి రోజున ఇంటిలో ని పిన్నలు ,పెద్దలు తలస్నానమాచరించి ,ఇల్లు శుబ్రము చేసి ,ఇంటిని కొత్త సున్నముతో ను,రంగులతోను అలంకరించి ,ముగ్గులు పె ట్టి,నూతన వస్రములను ధరించి , ఇంటి నిండా దీపములతో అలంకరించెదరు. కొందరు లక్ష్మీ పూజను జరుపుతారు .

                 దీపావళి పండుగను దీపోత్సవము అనికూడా అంటారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దీపావళి రోజున శివ సహితముగా కాళీ పూజలు ప్రత్యేకముగా నిర్వహిస్తారు . ఈ పండుగనాడు అమావాస్య చీకట్లు తొలగిపోవుటకు కాకరపువ్వొత్తులు , టపాకాయలు ,చిచ్చుబుడ్లు ,మతాబులు ,మొదలగునవి కాల్చి పండుగగా జరిపి ఆనందిస్తారు.

                             నరకాసురుడు దేవతలను, నరులను బహు కష్టములపాలు చేసి భగవంతుడైన శ్రీక్రుష్ణునే వ్యతిరేకించుచుండెను. 16 000 మంది స్త్రీలను చెరసాలలో బంధించి ఉంచగా శ్రీకృష్ణుడు యుద్దము చేసి సత్యభామచే నరకాసురిని సంహరింపజేసెను. ఎందువల్లననగా విష్ణుమూర్తి యొక్క వరహావతార సమయమున భూదేవికి ,విష్ణువుకు జన్మించినవాడు నరకాసురుడు.ఇతనికి తల్లి చేతిలో తప్ప మరో విధముగా చావులేదనే వరమున్నది. అందువల్ల శ్రీ కృష్ణుడు సత్యభామచే ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురవధ జరిపి మాతృభూమిని ఉద్దరించాడు . ఈ దీపావళిని నరకాసురవధ జరిగిన తరువాత ప్రజలు ఆనందించి జరుపుకున్న పండుగగా చెబుతారు .ఆనాటి నరకాసురుని రాజధాని ప్రస్తుత అస్సాం రాష్ట్రంలోని ప్రాగ్జోతిషపురము. శ్రీకృష్ణుని ద్వారకానగరము ఈనాటి గుజరాత్ రాష్ట్రములోని ద్వారక

                         దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీప లక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది.

తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.

              దీపావళినాడు నూనెలో ( ముఖ్యంగా నువ్వులనూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి.

                 అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టిచెంది ఆశీర్వదిస్తారు.

             స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాంటాయి.

                       అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లుగొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.

దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగా అయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు. ఆ రోజు లక్ష్మీదేవి పూజచేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు. దీపావళి పండుగల్లాంటివే ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.

🕉       🕉         🕉        🕉       🕉         🕉       🕉       🕉        🕉       🕉         🕉