మన పూర్వకవులు పద్యాలతో అనేక ప్రయోగాలు చేశారు. ఒకే పద్యములో రెండు,మూడు పురాణాలను వివరించారు.'ద్వ్యర్థి' 'త్య్రర్థి' కావ్యాలంటారు. అలాగే, ఒక పద్యం లో రెండుమూడు పద్యాలు యిమిడి వుండేలాకూడా కవిత్వం చెప్పారు. దాన్ని 'గర్భ కవిత్వం'
అంటారు. అలాంటి 'గర్భకవిత్వ' పద్యమొకటి చిత్తగించండి.

ఉ: మా తెలుగే కదా వరము మాకిల తీయని భాషయన్న, యీ
మా తెలుగే సదా పలుకు మాటలు తేనెల పాలవెల్లి కా
గా, తెలుగందు మా ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ, తా
నేలపై యికన్ తెలుగునేలల మానుడి తేజరిల్లునే.

ఈ 'ఉత్పలమాల' లోనుంచి ఓ 'తేటగీతిని'విడదీస్తే

వరము మాకిల తీయని భాషయన్న
పలుకు,మాటలు తేనెల పాలవెల్లి
ఘనత కైతల కన్నియ కాంతులెన్నొ
తెలుగు నేలలమా నుడి తేజరిల్లు.

ఇంతేనా! ఆ ఉత్పలమాలలో ఓ కందమూ దాగుంది.మరి

తెలుగే కదా వరము మా
కిల తీయని భాష యన్న యీ మా తెలుగే
తెలుగందు మా ఘనత కై
తలా కన్నియ కాంతులెన్నొ, తానే తలపై.- స్వస్తి...