ఎంత చెడ్డవాని అంతరాత్మైనా మంచే చెబుతుంది తప్ప ఎప్పుడూ చెడు చెప్పదు....

మనం అప్పుడప్పుడు చేసే కొన్ని పొరపాటు పనులు అలా చెయ్య వద్దు అని మనలోని వాణి మనల్ని హెచ్చరిస్తూనే వుంటుంది.

 కాని మనం ఆ ప్రబోధాన్ని లెక్క చేయం;

మన అంతరాత్మ మాట విననందుకు ఫలితం తరువాత తెలుస్తుంది....

కాని ఏమి లాభం?.

చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం గా.... జరగ వలసిన నష్టం జరిగిపోతుంది... అంతరాత్మ మాట విననందుకు ఫలితం ఇది...

ప్రతి ప్రాణి లోను అంతరాత్మ, అంతర్వాణి , అంతః శక్తి అనేవి వుండి తీరుతాయి.

అయితే మనం మనలోని ఈ నిక్షిప్త శక్తి ని గమనించం;

ఒకవేళ గమనించినా పట్టించుకోము..

మనం చాలాసార్లు చాలా విషయాల్లో మనకు తెలియకుండానే అంతర్వాణి మాటను వింటూ ఉంటాము;

ఈ అంతర్వాణినే 'అంతరాత్మ' అని కూడా వ్యవహరిస్తాము... .

మనం చేసే లేదా చేయబోయే మంచి / చెడ్డ పనులకు మన అంతరాత్మ స్పందిస్తూ... 'అలా చెయ్యి'..' ఇలా చేయకు' అని సలహాలిస్తూ వుంటుంది..

మహా యోగులు దీనినే 'హృదయ కమలం' అని కూడా చెబుతూ వుంటారు.

మనల్ని ఒకేరోజున పదిమంది బిక్షగాళ్ళు ధర్మం అడిగారనుకోండి...అందరికీ లేదు లేదంటూనే .. ఒకరిద్దరికి ధర్మం చేస్తాం...

 ఎందు చేత?.. మన అంత రాత్మ మాటను వినడం వల్ల ఆ ఒకరిద్దరికైనా ధర్మ చేయడం జరిగిందన్న మాట...

మనం మన మిత్ర్హుని డబ్బు సహాయం లేదా బాకీ తీర్చమని అడగడానికో వెళ్ళినప్పుడు ఆ మిత్రుడు ఏదో కష్టం చెప్పుకొని బాధ పడుతుంటే... మన అంతరాత్మ ఏమని చెబుతుంది... ' ఇప్పుడు కాదు.. మరోసారి అడుగు' అని ఆ మాట ప్రకారమే మనం వెనక్కి వచ్చేస్తాం..

ఒక వ్యక్తి మీద బాగా కోపం తెచ్చుకొని ... అతని అంతం చూద్దామని భావించినప్పుడు... కొన్ని నిమిషాలు ఆలోచించుకొని..మంచి నీళ్ళు తాగి ... అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడుచుకొంటే మనం చేసేది తప్పా! ఒప్పా! అని తెలుస్తుంది...

అందుకే మన పెద్దలంటారు...

' ఏ పని చేసే ముందైనా కాస్త ఆలోచించు' అని...కాబట్టి ఏ పనైనా చేసే ముందు దాని మంచి చెడ్డలు కూలం కుషంగా అధ్యయనం చేసి అంతరాత్మ ప్రబోధం ప్రకారం నడచుకోవాలి...


-స్వస్తి...