ఆశనం గరలం ఫణీ కలాపః వసనం చర్మ చ వాహనం మహోక్షః
మమ దాస్యసి కిం? కిస్తి శంభో? తవ పాదాంబుజ భక్తి మేవ దేహి’.
‘శంకరా! ఏమైనా తిండి పెడతావేమో ననుకుంటే నువ్వే విషం తిన్నావు!
 ఆభరణాలనిస్తావేమో ననుకుంటే ఒంటినిండా పాముల్నే ధరిస్తావు! 
పోనీ తిండీ ఆభరణాల మాటకేం గాని, మంచి బట్టలైనా పెట్టేస్తే వెళ్లి పోదామనుకుంటే పగలు పులిచర్మం, రాత్రి ఏనుగుచర్మం కట్టి కన్పిస్తావు! 
కనీసం మమ్మల్ని ఈ అడవి చివరి వరకైనా సాగనంపి మా ఊరికెళ్లే తోవ చూపిస్తావేమో ననుకుంటే - నీ వాహనం ఎద్దు. పైగా అది ముసలిది (మహా ఉక్షః) కూడాను. 
ఔను! ఏమీ అనుకోకు గానీ మాకేం ఇస్తావు? 
ఇవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలిగా!
 ఏముంది నీ దగ్గర? అసలుందా? (కిమస్తి?)- అని ఇంత వేళాకోళంగా ఆది శంకరులు ఆటపట్టించారు.
చివరి మాటలో ‘సరేలే! మాకు నీ పాదాంబుజాల యెడ భక్తి ప్రసాదించు చాలు’నన్నారు ఆయనే.
 ఇలా ఉన్న శంకరుణ్ణి ప్రార్థించాలి కూడానా? అన్పిస్తుంది మనకి. 
కానీ దాని అంతరార్థం ఇదీ: 
నువ్వే ఆ కాలకూట విషాన్ని స్వీకరించకుండా ఉండి ఉంటే ఆ విషాగ్ని ఈ ప్రపంచాన్నే మండించి వేసేది. 
మేం ఉండేవాళ్లమే కాదు!
 మేమున్నామంటే కారణం నీ విషపానమే. నమస్కారం శివా! 
లోకం నిండా విషబుద్ధులే ఉన్నారు. అలా విషం నిండి ఉన్న పాముల్ని చుట్టాల్లా ఒంటి నిండా తిప్పుకుంటూ విరోధుల్నీ, హాని చేసే వాళ్లనీ కూడా ఎలా లొంగ తీసుకోవాలో తెలుసుకోమంటున్నావా?
 ఎంత గొప్ప ఉపదేశం! సాష్టాంగం భవా!
 రజస్తమో గుణాలకి చిహ్నంగా వ్యాఘ్ర గజ చర్మాలని కట్టావా? అప్పుడప్పుడూ బుస్సుమంటూ ఉంటే గాని లోకవ్యవహారం సాగదంటున్నావా?
 దండాలు హరా! 
ధర్మానికి సంకేతం ‘ఎద్దు’ కాబట్టి ధర్మ బద్ధంగానే ఉండమంటున్నావా!
 దొడ్డ దేవరా వందనం! 
-శ్రీ ఆది శంకరాచార్యులు
 
