వేద-వేదాంగములు ఉద్భవించి జ్ఞాన పరిమళాలు నలు దిక్కులా వెదజల్లిన పుణ్యభూమి మన భరతభూమి.

అందుకనే భారత భూమిని వేదభూమి అని కర్మభూమి అని అంటారు.

ఋషుల తమ ఉపాసనా బలముతో దివ్య దృష్తితో అనంత విశ్వము నుంచి గ్రహించిన మహిమాన్విత నిత్యసత్యాల సమాహారమే మన వేదములు.

అందువల్లనే ఋషులను వేద ద్రష్టలు అని అంటారు.

భూమి మీద నివసిస్తున్న మానవులకు నాగరికతను, జీవన విధానాన్ని, మానవుని లేక జీవుని అత్యున్నత మైన పరమావధి ఏమిటి అని నేర్పిన తొలి విజ్ఞాన శాస్త్రాము మన వేదములు. జిజ్ఞాసువులకు, ముముక్షులకు సులభగ్రాహ్యంగా నుండుటకు సాక్షాత్ విష్ణుస్వరూపుడయిన బాదరాయణుడు (వ్యాస భగవానుడు) వీటిని నాలుగు భాగాలుగా విభజించారు.

అందువల్లనే వీరికి వేదవ్యాసుడు అని పేరు కూడా వొచ్చింది.

 ప్రకృతిలో భాగమైన మన విద్యుక్త కర్తవ్యాన్ని ధర్మాన్ని ప్రబోధించి, జీవన్ముక్తుని పొందే మార్గమును తెలియ పరచినవి యీ వేదములు.

అనేక జన్మల పాప పరిహారమును పరిహరించుకొనే మార్గము చూపి.

 వర్ణాశ్రమాల యొక్క ఔచిత్యాన్ని మనకు బోధించి, ఒక వర్గము వేరొక వర్గము పై ఆధారపడి పరస్పర సహాయ సహకారములు అందిచేవి అని విశ్లేషించినవి.

 చిత్రమైన ఆత్మజ్ఞానమును మానవాళికి పరిచయం చేసి. లౌకిక చింతన ఒకవైపు చేస్తూ పరమాత్మను చేరుకునే విధానాలను విశదీకరించి మనకు అందించే ప్రయత్నము చేసాయి వేదములు.

ఆత్మచింతన చేస్తూనే మానవశ్రేయస్సు కొరకు చేయవలసిన కర్మలను నిర్దేశించి. నైతిక ధార్మిక జీవన విధానమును ప్రోత్సహించి. పర బ్రహ్మమే శుద్ధ చైతన్య పదార్థమని దాని నుండే ఈ విశ్వమంతయు ఆవిర్భవించినది అని గొప్ప వైజ్ఞానిక అంశాన్ని ఏనాడో మనకు చాటి చెప్పాయి.

ఈ శుద్ధ చైతన్య పదార్థమునకు దేశ, కాల, వస్తు పరిస్చ్చేదములు ఉండవని ఏనాడో నిర్ధారించి మనకు జ్ఞాన బోధ చేసాయి వేదములు.

ఆత్మజ్ఞాన బోధనలో భాగంగా ప్రతి వేదము యొక్క సారాంశాన్ని ఆయా వేదముల అంతములో వేదాంతములు అనే పేరుతొ ఉపనిషత్తుల ద్వారా మనకు అందించాయి.

 ఉన్న అన్ని ఉపనిషత్ ల సారాంశాన్ని జిజ్ఞాసువులకు, ముముక్షులకు సులభంగా ఆర్థం అగుటకు కేవలం నాలుగు మహా వాక్యములు గా జేసి మనకు తెలియ జేస్తున్నాయి.


మహా వాక్యములు
~~~~~~~~~~~

హిందూమతం లోని ఆధ్యాత్మిక , ఉపనిషత్తుల సారమే ఈ నాలుగు మహా వాక్యాలు. ఒక్కొక్క వేదం యొక్క సారమే ఒక మహావాక్యంగా ఈ మహావాక్యాలు చెబుతాయి.


మహా వాక్యముల వివరణ
  ((((((((((0)))))))))))



ప్రజ్ఞానం బ్రహ్మ. 

ఋగ్వేద మహావాక్యముగా ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ ప్రసిద్ధికెక్కినది.
అతి ప్రాచీనమైన ఋగ్వేదములో సృష్టిమూలమును తెలియజేస్తూ ఈ బ్రహ్మాండము పరబ్రహ్మము నుండి జనించినదని, ఈ చరాచర సృష్టికి శుద్ధ చైతన్యము బ్రహ్మమేనని తీర్మానించినది. బ్రహ్మమే సర్వజ్ఞతను కలిగియున్నది. ఎనుబది నాలుగు లక్షల జీవరాశులను నడిపించే చైతన్యము బ్రహ్మము. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడు తన పరిధిలోని గ్రహములను తన చుట్టూ భ్రమింపచేసుకొనే శక్తియే ఈ శుద్ధ చైతన్యము. ఆద్యంతములు కానరాని ఈ అనంత సూర్య మండలములను వ్యక్తావ్యక్తమైన ఈ ఆకాశములో పయనింపచేసే శక్తి కూడా ఈ బ్రహ్మయొక్కశుద్ధ చైతన్యమేనని వివరించినది. సృష్టికి ముందు తరువాత ఉండేది ఆత్మ ఒక్కటేనని తెలియజేసింది.



అహం బ్రహ్మస్మి

యజుర్వేద మహావాక్యము ‘అహం బ్రహ్మస్మి’.

అనగా నేనే పరబ్రహ్మమని జీవుడు భావించడం. అనేక జన్మలలో జీవుడు పరిభ్రమిస్తున్నాడు. కాని అన్ని జన్మలలోను స్వరూపము ఆత్మగా వెలుగొందుతున్నది. తనకు లభించిన దేహమనే ఉపాధిలో జ్ఞానమును ప్రోది చేసుకొని ‘నేనే ఆత్మస్వరూపుడను’ అనే సత్యాన్ని దర్శించి ముక్తిని పొందుతాడని ఈ యజుర్వేద మహావాక్యము విశదపరచింది. ఉత్కృష్టమైన మానవ జన్మలో ఆత్మశోధన ధర్మాచరణతోనే సాధించగలమని తెలియజేసింది. ధర్మబద్ధమైన కోరికలతో జీవించి తాను తరించి సమస్త ప్రకృతిని తరింపజేయాలని నొక్కి చెప్పింది.



తత్త్వమసి

సామవేద మహావాక్యము ‘తత్త్వమసి’.
చరాచరమంతా వ్యాపించియున్న శుద్ధచైతన్యము ఎక్కడో లేదు, నీలోనే వుండి, నీవైయున్నదని నిర్వచించడం చాలా ఆశ్చార్యాన్ని, తృప్తిని కలిగిస్తుంది. శంకర భగవత్పాదులు చాటి చెప్పిన అద్వైతము ఈ మహావాక్యమునుండే ఆవిర్భవించినది అని భావించడం మనం వినియున్నాము. ‘ఏక మేవ అద్వితీయం’, ఉన్నది ఒక్కటే! అదే పరబ్రహ్మము. అది నీలోన, అంతటా వ్యాపించి ఉన్నదనే ఒక గొప్ప సత్యాన్ని అద్వైతము ఆవిష్కరించినది. ఆత్మ పరమాణు ప్రమాణమైనది. అటువంటి పరమాణువునుండే ఈ బ్రహ్మాండము ఆవిర్భవించినది. కావున ఈ బ్రహ్మాండములో భాగమైన నీవే ఆత్మవు అని వర్ణించింది.


అయమాత్మాబ్రహ్మ

నాల్గవ వేదమైన అథర్వణ మహావాక్యము ‘అయమాత్మాబ్రహ్మ’.
ఈ వాక్యము కూడా ఆత్మయే బ్రహ్మమని తెలియజేస్తోంది. జీవాత్మ పరమాత్మలు ఒక్కటేనని విచారించింది. ఈ వేదములోనే ప్రణవ సంకేతమైన ఓంకార శబ్దమును మానవాళికి అందించినది. లౌకిక వస్తు సమదాయములన్నీ వివిధ నామములతో సూచించబడినట్లే అనంత విశ్వమును ఓంకారమనే శబ్ద సంకేతముతో సూచించినది. గ్రహముల భ్రమణ శబ్దము ఓంకారమేనని ఇటీవల విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు భావిస్తున్నాయి.