శ్రీ రమణ మహర్షి..!!
ఈరోజు శ్రీరమణ మహర్షి జన్మదినోత్సవం సందర్బంగా 💐

ఈయన బోదన మౌనం ...
స్వీయ అనుభవంద్వారా జ్ఞానం ..

తమిళనాడులోని మధురైకు దగ్గరలో తిరుచ్చలి గ్రామంలో సుందరమయ్యరు, అలగమ్మ దంపతులకు క్రీ.శ.1879 డిసెంబర్‌ 30 తెల్లవారుజామున  ఒంటి గంటకు రమణులు జన్మించారు. 
పుట్టినపుడు అతనికి వేంకటేశ్వరన్‌ అనే నామం ఉండేది.

చిన్నతనంలో ఆయనను బడిలో చేర్చినపుడు అతని పేరు వెంకట్రామన్‌గా మారింది.
ముద్దుగా రమణ పేరు వాడుకలోకి వచ్చి 
అదే పేరు నిలబడింది. 
రమణుల పెదనాన్న కూడా అతని 18వ ఏటనే సన్యసించి దేశాటనం పట్టారు. 
రమణుల తండ్రి సుందరమయ్యరు తన 48వఏట చనిపోయారు.

అప్పుడు రమణులకు 12 సంవత్సరాలు.
రమణునితో పాటు మొత్తం నలుగురు సంతానం.
అతని కంటే పెద్ద అన్న నాగస్వామికి 16 సం.లు.
మూడవ కుమారుడు నాగసుందరానికి 6 సం.లు.
నాలుగవ సంతానం పసిబిడ్డ. 
తన పెదనాన్న సుబ్బయ్యరు ఇంట రమణులు పెరిగాడు. 
రమణునికి 16 ఏడు వచ్చిన తరువాత 
1896 జూలైలో ఎటువంటి గురోపదేశం లేకుండానే ఆత్మానుభూతి పొందారు. 
అప్పడు రమణులు మెట్రిక్యులేషన్‌ చదువుతున్నారు. 

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలో  1879 డిసెంబర్ 30న వెంకటరామన్‌గా జన్మించిన 
రమణ మహర్షికి పదహారు సంవత్సరాలున్నప్పుడు అంతు తెలియని జబ్బు చేసింది. 
మరణం అంచుల దాకా వెళ్లి, 
భగవత్కృపతో బతికి బయటపడ్డారు. 
ఆ సమయంలో తన మనసులో కలిగిన ప్రేరణతో ఇల్లు వదిలి ఎన్నో దివ్యస్థలాలకు నెలవైన అరుణాచల పర్వతాన్ని చేరారు. 

శివమెత్తిన పరవశం.💐

భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో 1896 సెప్టెంబర్ 
1వ తేదీ పరమ పవిత్రమైనది. 
భగవాన్ రమణ మహర్షి అరుణాచల పుణ్యక్షేత్రం చేరుకున్న రోజు. 
అప్పటికాయన వయస్సు 17 సంవత్సరాలు. అరుణాచలేశ్వరాలయంలో తనను తాను సమర్పణం చేసుకుని, 
తదనంతర కాలమంతా అక్కడే గడపటం చరిత్ర. 
ఆత్మానుభవం కలిగిన తరువాత 54 సంవత్సరాలు వారు సాగించినదంతా మహాయోగమే.

అక్కడి కొండ గుహలలో ధ్యానం చేసుకుంటూ, మౌనస్వామిగా పేరు పొందారు. 
విరూపాక్ష గుహలో ధ్యాన మగ్నుడై ఉన్న 
ఈ బాలయోగిని కావ్యకంఠ గణపతి ముని సందర్శించుకుని, 
తనను చిరకాలంగా పట్టి పీడిస్తున్న ఎన్నో సందేహాలను తీర్చుకుని, 
ఆయనకు రమణ మహర్షిగా నామకరణం చేశారు. అప్పటినుంచి దేహాన్ని చాలించే వరకు రమణ మహర్షి ఆ ప్రదేశాన్ని వీడి ఎక్కడకూ వెళ్లలేదు.

రమణులు అరుణాచలంలో 11 సంవత్సరాలు (1896-1907) మౌనదీక్షలో ధ్యానం చేసారు. రమణులు 1896-1922 మధ్య కొండపైనున్న విరుపాక్ష గుహ, స్కందాశ్రమంలో గడిపారు.
1923 నుండి కొండ కింద ప్రస్తుత ఆశ్రమంలో నిర్యాణం అయ్యే వరకు అనగా 
1950 ఏప్రిల్‌ 14వతేదీ శుక్రవారం రాత్రి 
8.47 నిముషముల వరకు అక్కడే జీవించారు.

రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది మౌనము లేదా మౌనముద్ర. 
ఆయన చాలా తక్కువగా ప్రసంగించేవారు. 
తన మౌనంతో సందేశం పొందలేనివారికి మాత్రమే ప్రసంగాల రూపంలో బోధనలు చేపట్టేవారు. 
ఈయన బోధనలలోనూ విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది. 
ఎవరైనా ఉపదేశించమని కోరితే, 
స్వీయశోధన ఉత్తమమని, 
దీనిద్వారా మాత్రమే మోక్షము సాధ్యమని బోధించేవారు. 
తన బోధన అద్వైతం, జ్ఞానయోగాలతో ముడివడియున్ననూ, భక్తిని ప్రధానంగా బోధించేవారు.

నిత్యజీవితంలో మనుష్యులు నిరంతరం ఏవో కొన్ని పథకాలు వేస్తూనే ఉంటారు. 
వాస్తవానికి భగవంతుడు ఒక పథకం ప్రకారమే 
ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. 
మనుషులు నిరంతరం పథకాలు వేయడం అనేది రైలులో ప్రయాణించే ప్రయాణికుడు తన లగేజీని నెత్తిన పెట్టకుని మోయడం లాంటిది. 
మనుష్యలు పథకాలు వేయడం మాని భగవంతుడికి పరిపూర్ణ శరాణగతి చెందడమే ఉత్తమమైన పథకం అంటారు రమణ మహర్షి.

నీవు పరిపూర్ణ శరణాగతి చెందిన నాడు నీకు ఏది మంచిదో భగవంతుడికి సరిగ్గా తెలుసు.
మీరే బాధ్యతలూ పెట్టుకోకండి. 
అఖిలాండ కోటిని కనిపెట్టే భగవంతుడు పరిపూర్ణ శరణు చెందిన మిమ్మల్ని మర్చిపోతాడా?
కష్టాలు తొలిగిపోవడానికి రోజులా, సంవత్సరాలా,జన్మలా అని మాత్రం ఎదురుచూడవద్దు. 
భగవంతుడు మిమ్మల్ని చూడడం అంటే ధనికునిగా చేయడంగా మీరు ఆలోచిస్తున్నట్లయితే మీలో అహంకారం ఇంకా బుసలు కొడుతున్నదనే అర్థం. 

భగవంతడు ప్రతి ఒక్కరిని కనిపెడుతూనే ఉన్నాడు.
నీకేది అవసరమో అది ఆయన ఇస్తూనే ఉంటాడు. శరణాగతి రెండింటిమీద ఆదారపడి ఉంటుంది. ఒకటి మీరు చేసే ప్రయత్నం,రెండు ఈశ్వరానుగ్రహం. నేను అనేది ఒక మహా మంత్రం.
ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది.
ఇది భగవంతుని మొదటి నామం.

ఈ నామం ద్వారా నేనెవరుమీద ధ్యాసపెట్టి ధ్యానం చేయండి.
ధ్యానం చేయడం మీ స్వప్రుత్నం, 
మీరెవరో తెలియడం ఈశ్వరనుగ్రహం.
మీకు ఆత్మన్వేషణకు బుద్దికలుగడమే, ఈశ్వరనుగ్రహానికి బండ గుర్తు.
ఇది మీ హృదయంలో ప్రకాశిస్తూ... 
మిమ్మల్ని లోపలికి గుంజుతుంది.
మీరు చేయాల్సిన ప్రయత్నం అంతా..
నేనెవరు అంటూ విచారించడమే,
ధ్యానం చేయడమే.

మనం భగవంతున్ని స్మరించాం అంటే అది భగవంతుని అనుగ్రహం. 
అనుగ్రహం అనేది భగవంతుడికి ఒక గుణం కాదు.
అనుగ్రహమే భగవంతుడు. 
ఆయన అందరినీ ఒకకంట కనిపెడుతూనే ఉంటాడు. 
పక్షి తన రెక్కలతో గుడ్డును రక్షించినట్లుగా,
తల్లి పాలు తాగే పాపాయిని కంటికి రెప్పలా చూసుకున్నట్లుగా అయన రక్షిస్తూనే ఉంటాడు.
మీ పాపాయిని మీరెంత శ్రద్దగా చూసుకుంటున్నారో ఆ పాపాయికి తెలియకపోవచ్చు.

అలాగే మీరు.. అయితే ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా నమ్మాలి. 
నమ్మడం అంటే భక్తితో ఉండడం కాదు.
భక్తికి శరణాగతికి మూలంలోనే తేడా ఉంది. 
భక్తిలో నేను, నీవు అనే ధ్వైత్వంతో కూడిన 
తేడా ఉంది. 
శరణాగతిలో ధ్వైత్వం లేదు. 
అని గొప్పగా బోధించారు రమణ మహర్షి.

మీకు అటువంటి నిశ్చలమైన నమ్మకం లేకుంటే భగవంతుణ్ణి అతని దారికి అతన్ని వదిలేసి నీవెవరివో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. శరణాగతి మార్గం లేదా నేనెవరు విచారణ ద్వారా... సమస్త శక్తిని అక్కడ కేంద్రీకరించి, 
నేనును తెలుసుకోవడమే జ్ఞాన మార్గం.

రమణుల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సమకాలీన భారతీయులకు తెలియజేసినవారిలో ముఖ్యులు కావ్యకంఠ గణపతి ముని కాగా పాశ్చాత్యులకు పరిచయం చేసిన వారిలో ప్రధానమైనవాడు 
పాల్ బ్రింటన్. 
రమణ మహర్షి దీర్ఘమౌనంలోని అంతరార్థాన్ని గ్రహించిన బ్రింటన్, అనంతర కాలంలో ఆయనకు శిష్యుడై, అమూల్యమైన తన పుస్తకాల ద్వారా భగవాన్ జ్ఞానసంపదను ప్రపంచానికి చేరువ చేశారు.
అద్వైత వేదాంతమే తన తత్వంగా నిరూపించుకున్న రమణ మహర్షి జంతువులు, పక్షులు, సమస్త జీవులలోనూ ఈశ్వరుణ్ణి సందర్శించారు.  
ఆయనే అనేక మంది భక్తులకు ఆరాధ్యదైవంగా దర్శనమిచ్చారు. 

ఆయన అలా అగుపించింది కేవలం హిందూమతంలోని వారికే కాదు, 
బౌద్ధులకు బుద్ధ భగవానుడిగా, 
క్రైస్తవులకు జీసస్‌గా, 
ముస్లిములకు మహమ్మద్ ప్రవక్తగా కూడా దర్శనమిచ్చినట్లు అనేకమంది చెప్పుకున్నారు. 
తన ఆశ్రమంలో యథేచ్ఛగా సంచరించే అనేకమైన ఆవులను, కోతులను, లేళ్లను, శునకాలను కూడా ఆయన అది, ఇది అనేవారు కాదు. 
అతడు, ఆమె అనే సంబోధించేవారు. 
పక్షపాతం చూపడాన్ని, ఆహార పదార్థాలను వృథా చేయడాన్ని ఆయన చాలా తీవ్రంగా పరిగణించేవారు.

అక్షరమణమాల!💐

అరుణాచలమనేది సాధారణ జీవికి ఒక కొండ. భగవాన్ రమణుల అనుభవం మాత్రం భిన్నం. కరుణాసముద్రుడైన శివుడే, 
ఘనీభవించిన కొండయై నిలిచాడన్న అనుభూతి వారిది. 
తనకు, అరుణాచలానికి తేడా ఏమీ లేదన్న అభేద, అద్వైత స్థితి. 
ద్వైత స్థితిలో అరుణాచలాన్ని రమణులు సంబోధించిన పరమాద్భుత కవితావైఖరి ఆపాతమధురం. 
మణమాల అంటే కళ్యాణమాల. 
అది నాశమెరుగని, వసివాడని జీవాత్మ పరమాత్మల బంధమైతే, అదే అక్షరమణమాల! 
ఇదొక దివ్యసాధనామార్గం. 
ద్వైతంతో ప్రారంభమై అద్వైతంగా ముగిసే అందమైన భావగీతం అక్షరమణమాల. 
లోతుగా అధ్యయనం చేసి, 
అనుభూతి చెందగలిగితే, అది సుషుమ్నా గీతం. అహం నశిస్తే తప్ప సోహం స్థితి లభించదని చెప్పే సాధనాగీతం. 
రమణుల సాలోక్య, సామీప్య, సాన్నిధ్య, సాయుజ్య స్థితులను ఆవిష్కరించే రమణీయ హృదయగానాన్ని విందాం!

అరుణాచల అంటూ నామస్మరణ చేసే వారి 
అహాన్ని నిర్మూలించు.

నా మనసనే యింట్లో దూరావు. 
నన్ను బయటకు లాగి నీ హృదయంలో బంధించావు. నీ అనుగ్రహం విచిత్రం కదా! 
ఒకసారి నన్ను నీవాణ్ణి చేసుకుని, 
నన్ను వదిలిపెడితే లోకం నిన్ను నిందించదా?

నా మనసు ప్రపంచంలో కలిసి, 
చెడిపోకుండా ఉండాలంటే..
నువ్వు నా మనసులో ఎల్లవేళలా ఉండాలి.

పంచేంద్రియాలనే దొంగలు నాలో ఉన్నారు. 
నా హృదయంలో నీవుండి, 
నన్ను వారి బారి నుండి రక్షించు.

నీవు ఓంకార సమానుడివి. 
కంటికి చూచే శక్తినిచ్చే అసలు కన్నువు. 
దేనినైనా చూడాలంటే నీకు కన్నెందుకు? 
నా దోషాలు తెంచు. గుణాలను పెంచు.

లోకభావనలు నన్ను మోసగించకుండా రక్షించు.

నీ కరుణాపూరిత జ్ఞానకిరణాలతో నా మనసును వికసింపచేసి అభయవరం దానం చెయ్.

నా హృదయాన్ని ఆనందసముద్రంగా మార్చు. మనసు మలగి, మౌనం వెలిగి, 
జ్యోతిర్మయుడవై నా యందుండు.

లోకవిద్యలన్నీ అంతరించే మార్గం చూపిస్తున్నయ్. తరించే ఆత్మవిద్యను అనుగ్రహించు.

నువు కొండవు. పలుకవు. నన్నూ మాట్లాడవద్దంటివి. ఎట్లా? విషయ వాంఛలు నశించి, 
పరమానందం నా స్వంతం చేశావు. నువు నిత్యుడివి.

కర్మానుసారం నాకు దూరం చేశావు. 
అది సంతోషమే. జ్ఞానమార్గాన్ని చూపించు.

ఏమీ చేయకుండానే ఏ సాధనా తెలియకుండానే, తత్త్వం అంటే ఏమిటో తెలిసేటట్లు చేశావు. తెలుసుకున్నది నిజమనే స్థిరబుద్ధిని అనుగ్రహించు.

సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అనే స్థితిని స్థిరపరచు.

నిన్ను అనుభూతి చెందాలంటే మౌనమనే శుద్ధవాక్కు, వినిర్మల మనసు కావాలి. 
వాటిని నాకు చెందించు. 
నువ్వెంతో నన్నంతటి వాణ్ణి చెయ్.

అభేద, అద్వైత భూమికలో, 
నన్ను నిత్యానందమయుణ్ణి చెయ్. 
పరమాత్మ రూపం నీ సహజరూపం. 
కొండవలె స్థూలంగా కనిపిస్తున్నావు. 
ఆలోచనా తరంగాలు నన్ను అడ్డుకుంటున్నయ్. స్వస్వరూపాను సంధానం చెయ్.

మాయా విషము తలకెక్కకుండా నన్ను రక్షించు.

కోరికలు నశింపచేశావు. 
నిన్ను కోరుకుంటున్న ఆ కోరికను సైతం పోగొట్టు.

ఆద్యంతరహితమైన చిజ్జడ గ్రంథిని విప్పి 
నన్ను కాపాడు. 
అజ్ఞాన భూమికలో కొట్టుమిట్టాడుతున్న నాకుజ్ఞానం ప్రసాదించు.

దేశకాలాతీతమైన ఆత్మభూమికలో మనం ఇద్దరంగా కాక ఒక్కటిగా ఉండిపోదాం.

నువు నాకు దొరకటం నేను పొందిన లాభమే. 
నీకు ఏం లాభం?

నన్ను నీ దగ్గరకు నీవు పిలిచిన క్షణమే, నా అహం, ఉనికి, అస్తిత్వం, వ్యక్తిత్వం నశించినయ్.

ప్రాణం వదిలే సమయంలో నిన్ను మరిచినట్లయితే, దుఃఖభరితమైన జన్మ వస్తుందేమో? 
మరణ క్షణంలో నీ స్మరణ మరువకుండా చెయ్.


అభేదవేద స్వరూపాన్ని నాకు అనుభవంగా అనుగ్రహించు. 
సాలెపురుగు తాను అల్లుకున్న గూటిలో చిక్కుకుని మరణించినట్లు, 
నీ కృపావలయంలో చిక్కుబడి పోయాను. 
ఎందరో భక్తులు నిన్ను కీర్తించి, 
ఎముకలు అరిగేట్లు సాధన చేయటం నీకు ఆనందం కలిగించింది. నా మాటలు కూడా విను.

అంటున్నవన్నీ అవిద్యాస్వరూపాలే. మన్నించు.

నేను సమర్పిస్తున్నది ప్రేమమాల! నీవందించవలసినది అనుగ్రహమాల!” 
భగవాన్, అక్షరమణమాలలో కూర్చిన ఈ 
అనంత భావ సంపద, 
సాధకుడి కనుగ్రహించిన సమర్పణా రీతి. 
శరణాగత భావన. 
వినయదృష్టి. భక్తి గుణం. 
భగవంతుడి అనుగ్రహం ఎప్పుడూ, ఎల్లరికీ ఉంది. సాధించుకోవలసింది అర్హత! 
అదీ గుర్వనుగ్రహం వల్లనే సాధ్యం! 
ఇంతకీ గురువంటే ఎవరు? 
ఈశ్వరుడన్నా, గురువన్నా, ఆత్మన్నా ఒకటే.

ఓం అరుణాచల నమః శివాయ..!!🙏

సర్వే జనా సుఖినోభవంతు..!!💐

                           

- స్వస్తి...