ఒకప్పుడు సమస్య ఏదైనా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లేవారు. వారే దాదాపుగా అన్ని రకాల చికిత్సలూ అందించేవారు. 

సాధారణ వ్యాధులకు ఎంబీబీఎస్ లేదా ఎండీ డాక్టర్... 

శస్త్ర చికిత్సలు అయితే ఎంఎస్ డాక్టర్లు సేవలు అందించడమన్నది రెండు దశాబ్దాల క్రితం వరకు ఉన్న పరిస్థితి. 

వైద్య శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందింది. 

ఆధునిక విజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. 

మానవ శరీరంలో ప్రతీ అవయవం ఓ ప్రత్యేక వైద్య విభాగంగా అవతరించింది. 

వైద్య విద్యార్థులు కూడా ఎంబీబీఎస్ తర్వాత వివిధ రకాల స్పెషలైజేషన్లు చేసి ఆ విభాగానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. 

ఆయా విభాగాలు ఏంటో చూద్దాం.. 







జనరల్ ఫిజీషియన్: వీరినే సాధారణ వైద్యులు, ఫ్యామిలీ డాక్టర్ అని అంటుంటారు. మందులతో నివారించదగిన సాధారణ వ్యాధులన్నింటికీ వీరు చికిత్సలు అందిస్తారు. అవసరం అనుకుంటే స్పెషలిస్ట్ డాక్టర్ ను వారే సూచిస్తారు. 


గైనకాలజిస్ట్: మహిళలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు, గర్భధారణ, జననేంద్రియ సమస్యలకు చికిత్సల్లో వీరు నిపుణులు. 


ఆబ్సెట్రీషియన్: గైనకాలజీలోనే ఇదో ప్రత్యేక విభాగం. మహిళల పునరుత్పత్తి వ్యవస్థ అంటే సంతాన సాఫల్యత విభాగంలో వీరు స్పెషలిస్ట్.  


పెడియాట్రీషియన్: చిన్న పిల్లలకు ఎంతో శ్రద్ధ, జాగ్రత్తతో కూడిన వైద్యం అవసరం. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 16 ఏళ్ల వయసు వారికి వీరు వైద్య సేవలు అందిస్తుంటారు. 


నియోనాటాలజిస్ట్: రోజుల శిశువులు (నవజాత శిశువులు) ముందే పుట్టిన శిశువులకు కీలక వైద్య సేవలు అందించగల నిపుణులు. 


ఆప్తమాలజస్ట్: కంటి వైద్యులు.. కంటి సమస్యలకు వైద్యం చేయడంలో వీరు నిపుణులు. 


డెర్మటాలజిస్ట్: వీరినే చర్మ వైద్యులు అని కూడా అంటుంటారు. సాధారణంగా మిగతా అనారోగ్య సమస్యలకు, చర్మ వ్యాధులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఇలాంటి సమస్యలలో డెర్మటాలజిస్ట్ సేవలు తప్పనిసరి అవుతాయి. 


ఈఎన్టీ డాక్టర్: చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి వచ్చే సమస్యలకు వీరు చికిత్సలు అందిస్తుంటారు. తరచుగా ముక్కులు మూసుకుపోతుండడం, గొంతులో మంట, నొప్పి, ఆహారం మింగుడు పడకపోవడం, వినికిడి లోపాలు... ఇలా ఈ మూడు విభాగాలకు సంబంధించిన సమస్యలలో వీరు నిపుణులు. 


ఆర్థోపెడిక్: ఎముకలకు సంబంధించిన వ్యాధులు, సమస్యల వైద్యంలో వీరు నిష్ణాతులు. ఎముకలు, కీళ్ల శస్త్ర చికిత్సల నిపుణులను ఆర్థోపెడిక్ సర్జన్లుగా పేర్కొంటారు. 


రుమటాలజిస్ట్: కీళ్ల వ్యాధి నిపుణులు. కీళ్లలో వాపులు, నొప్పులు, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలకు వైద్య సేవలు అందిస్తారు. అలాగే రోగ నిరోధక వ్యవస్థ వైఫల్యం కారణంగా తలెత్తే రుమార్థరైటిస్ కు కూడా చికిత్స అందిస్తారు.   


ఇమ్యునోలజిస్ట్: రోగ నిరోధక వ్యవస్థ విఫలమైనా, బలహీన పడినా తద్వారా ఎదురయ్యే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు వీరు చికిత్సలు అందిస్తారు. 


యూరాలజిస్ట్: మూత్రాశయ వ్యాధులకు చికిత్సలు అందిస్తారు. అవసరమైతే శస్త్ర చికిత్స కూడా చేస్తారు. 


కార్డియాలజిస్ట్: అన్నింటిలోకి గుండె ఎంతో విలువైనది. గుండె సంబంధిత వ్యాధి నిపుణులుగా కార్డియాలజిస్టులను పేర్కొంటారు. 


కార్డియో వాస్క్యులర్ సర్జన్: గుండె సంబంధిత శస్త్ర చికిత్సల నిపుణులు. 


న్యూరో ఫిజీషియన్: వెన్నుపాము, నాడీ మండలానికి సంబంధించిన వ్యాధులకు మందులు సూచిస్తారు. తలనొప్పి, మెడనొప్పి, వెన్నుపాము నొప్పి, జ్ఞాపక శక్తి లోపం, బీపీ, ఫిట్స్, మెదడులో ట్యూమర్లు తదితర సమస్యలు. ఈ విభాగానికి సంబంధించి శస్త్ర చికిత్స నిపుణులను న్యూరో సర్జన్లుగా పిలుస్తారు. 


సైకియాట్రిస్ట్: మానసిక పరమైన సమస్యలకు వీరు వైద్యం చేస్తారు. 


డెంటిస్ట్: దంత వైద్య నిపుణులు. ఇందులోనూ మళ్లీ చాలా రకాల స్పెషలిస్టులు ఉంటారు. పళ్ల వరుస మార్చేందుకు, అందంగా తయారు చేసేందుకు, చిన్నారుల దంత సమస్యలకు వివిధ రకాల నిపుణులు ఉంటారు.


పేథాలజస్ట్: లేబొరేటరీ పరీక్షల ద్వారా వ్యాధులు నిర్ధారణ వీరి విధులు. 


రేడియాలజిస్ట్: యంత్రాల సాయంతో ఎక్స్ రేలు, స్కాన్ లు, ఎంఆర్ఐ తదితర పరీక్షలు నిర్వహించి సమస్యలు గుర్తించడం వీరి పని. కేన్సర్ రోగులకు రేడియాలజీ వైద్యసేవలు కూడా అందిస్తుంటారు. 


అనస్థీషియాలజస్ట్: శస్త్ర చికిత్స సమయాల్లో రోగులకు నొప్పి తెలియకుండా ఉండేందుకు వీరు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తుంటారు.  


జనరల్ సర్జన్: సాధారణ శస్త్ర చికిత్సల నిపుణులు. 



ప్లాస్టిక్ సర్జన్: చర్మమార్పిడి, శారీరక అవయవాల నిర్మాణ మార్పిడికి వీరు శస్త్రచికిత్సల సేవలు అందిస్తుంటారు. 


పల్మనాలజస్ట్: ఊపిరితిత్తుల వ్యాధులు, శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి వైద్య సేవలు అందించడం వీరి పని. వీరినే చెస్ట్ స్పెషలిస్టులు అని కూడా అంటారు. 


ఆంకాలజస్ట్: కేన్సర్ వ్యాధి నిర్ధారణ, చికిత్సల నిపుణులు. వీరిలో సర్జరీ చేసే వారిని సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటారు. 


నెఫ్రాలజిస్ట్: మూత్ర పిండాల వ్యాధులకు సంబంధించిన వైద్య సేవలు అందించే స్పెషలిస్ట్. 



ఎండ్రోక్రినాలజిస్ట్: గ్రంధులు, హార్మోన్ల సమస్యల నివారణలో వీరు నిష్ణాతులు. హార్మోన్లలో తేడాలు, థైరాయిడ్, మెనోపాజ్ (స్త్రీలలో రుతుచక్రం నిలిచిపోయే దశ), మధుమేహం, జీవక్రియల్లో తేడాలు, ఎదుగుదల లేకపోవడం తదితర సమస్యలకు వీరు వైద్య సేవలు అందిస్తుంటారు. 


హెమటాలజిస్ట్: మానవ శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం సరఫరా అవుతుంటుంది. అదే రక్తానికి ఏమైనా అయితే? అవును అలాంటప్పుడు హెమటాలజిస్ట్ సేవలు అవసరం అవుతాయి. హిమోఫిలియా (రక్తం గడ్డ కట్టని స్థితి), బ్లడ్ కేన్సర్, లింఫ్ గ్రంధుల కేన్సర్, సికిల్ సెల్ అనీమియా తదితర సమస్యలకు వీరు చికిత్స చేస్తారు. హెమటాలజీ అనేది ఇంటర్నల్ మెడిసిన్ లో ఓ విభాగం.


గ్యాస్ట్రాలజిస్ట్: జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎదురయ్యే వ్యాధులకు చికిత్సలు అందిస్తుంటారు. 


ఆండ్రాలజస్ట్: పురుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించి వచ్చే సమస్యలకు వీరు తగిన నిపుణులు. సంతాన సామర్థ్యం లేకపోవడం తదితర సమస్యలకు చికిత్సలు చేస్తారు.  


ఆడియాలజిస్ట్: వినికిడి శక్తి లోపించిన వారికి తగిన మెషిన్ల సాయంతో వినగలిగేలా చేయడం వీరి పని. 


జెనెటిస్జ్: జన్యువులలో సమస్యలు ఉన్నవారికి జెనెటిస్ట్. 


ట్రైకాలజిస్ట్: జుట్టు రాలడం, పల్చబడడం, బ్రేకేజ్ తదితర సమస్యలకు ఈ నిపుణులను సిఫారసు చేస్తుంటారు. వీరు హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చికిత్సలు కూడా అందిస్తుంటారు. 


ఇలా పలు విభాగాల్లోనూ మళ్లీ అంతర్లీనంగా మరికొన్ని స్పెషలైజేషన్లు ఉన్నాయి.

 అందుకే ఏదేనీ ఆరోగ్య సమస్య వదలకుండా వేధిస్తుంటే ముందుగా జనరల్ ఫిజీషియన్ అంటే ఎండీ వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. 

ఒకవేళ సంబంధిత సమస్యకు ప్రత్యేక వైద్యం అవసరం అనుకుంటే అప్పుడు వారే తగిన నిపుణుడిని సూచిస్తారు...


◆ ◆ ◆ ◆◆◆ ◆◆◆ ◆◆◆ ◆◆◆ ◆◆◆ ◆◆◆ ◆◆◆ ◆◆◆


గమనిక : క్రింద వాట్సాప్ అని ఉన్న లింక్ ని నొక్కి నేరుగా మీ సలహాలు, సూచనలను నాతో వాట్సాప్ ద్వారా పంచుకొని.. మరింత విలువయిన విషయాలను అందివ్వడానికి సహకరించండి...

Blog            : Ram Karri


నా గురించి :


రాంకర్రి 

బ్లాగర్ , కవి , రచయిత, సంఘ సేవకులు, పాత్రికేయులు, చలన చిత్ర దర్శకులు, టెక్ గురు, 
గీత రచయిత, వ్యవస్థాపకుడు, రాజకీయ వేత్త, సంరక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు.

-- ---- ---- ----- ---- ---- ---- --- ---- --- ---- --- --- --- --- --- --- --- --- --- --- --- ---- ---- --- ---- ---- --- -

Whatsapp : +918096339900 ,

Phone        : +919492089900 .




-------------------------------------------------- సమాప్తం --------------------------------------------