నల్లని తారు రోడ్డు మీద, వంపులు తిరుగుతూ, వేగంగా బైక్ ని నడిపే యువతకు కిక్ వస్తుందేమో గానే, మిమ్మల్ని చూసే వ్యక్తులకు మీ పై మంచి అభిప్రాయం ఏ మాత్రం కలుగదు. 

మీరు కష్టపడి సంపాదించిన సొమ్ముతో అయితే అలా Duke ( ఎక్కువ ఖరీదు కలిగిన బైక్స్ ) బైక్స్ ని కచ్చితంగా కొనుగోలు చెయ్యరు, 

ఏ తల్లి తండ్రులూ తమ వారసులు, అలాంటి బైక్ నడపాలని కోరుకోరు. 

తామెంతో ప్రేమగా పెంచుకున్న పుత్ర రత్నాలు, డ్యూక్ బైక్ కావాలి అంటే, వద్దు అంటే వద్దు అని వారిస్తారు, 

కానీ..  మొండిపట్టు పట్టి, అన్నం తినకుండా, కడుపు మాడ్చుకుని, భీష్మించుకు కూర్చున్న బిడ్డను చూసి, తల్లడిల్లిపోయి, 

"జాగ్రత్త గా డ్రైవ్ చేస్తావ్" కదూ అంటూ 

మాటవరసకు ప్రమాణం చేయించుకుని, 

కొత్త Duke ( ఎక్కువ ఖరీదు కలిగిన బైక్స్ )  బైక్ తాళాలను, తమ బిడ్డ చేతిలో పెడతారు..  

తమ బిడ్డ ప్రాణాలను కబళించే ఒక యమపాశాన్ని వారి చేతిలోనే పెడుతున్నామని, ఎంతో మంది తల్లితండ్రులకు అప్పుడు తెలియదు. 

జరగరానిది జరిగాక, అంతా అయిపోయాక గుండెలు అదిరేలా బాదుకుని ఏడ్చి ఏం లాభం? 

మన దేశం లో, ద్విచక్ర వాహనాల ప్రమాదం లో మరణించిన వారిలో అత్యధిక శాతం డ్యూక్ బైక్స్  ( ఎక్కువ ఖరీదు కలిగిన బైక్స్ ) వలనే అనే  నిజాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉంది.

 ప్రభుత్వాలకు ఆ తయారీ సంస్థలు చెల్లించే పన్నులు కావాలి, 

యువత ఎటుపోతే వాళ్ళకేంటి నొప్పి? 

"ఇలాంటి బైక్స్ ఎందుకు తీసిస్తారు??" 

అని శ్రేయోభిలాషులు ఎవరయినా అడిగితే, 

మేము అనుభవించలేకపోయాం,
మా బిడ్డలయిన అనుభవించనీ అని పైకి సమర్ధించుకుంటూ, 

వీళ్లకు లేనిదీ నా బిడ్డకు ఉందని అసూయ అని లోలోపల ఏవేవో ఊహించేసుకునే అమాయకపు తల్లితండ్రులూ లేకపోలేదు.. 

కొట్టబోతే పాముకు (తల్లితండ్రులకు) కోపం, 
కరవబోతే కప్పకు (యువతకు) కోపం. 

రోడ్ల పై,  వెర్రెత్తిపోయి డ్రైవ్  చేస్తూ, 
ఇతరుల ప్రాణాలతో పాటు, 
తమ ప్రాణాలనూ అనంత వాయువుల్లో కలిపేసుకుంటున్న యువత ఎలా చెబితే అర్ధం చేసుకుంటారు?



- స్వస్తి