సజ్జనులందరూ మనిషికి గురువులే. వారి ప్రవర్తనే మనకు పాఠం. ‘చల్లగా సవ్యంగా బతకాలంటే శ్రీరామచంద్రుణ్ని ఆదర్శంగా తీసుకొని, ఆయనలా జీవించేందుకు ప్రయత్నించు. అన్ని విధాలా బాగుపడతావు. రావణుడి లాగా జీవించకు. నాశనమైపోతావు’ అని రామాయణం లాంటి గ్రంథాలు బోధించే నీతి. ఇది, ‘నాయనా, మీ బడిలో ఫలానా మంచి కుర్రవాడున్నాడన్నావే, వాడిలా చదువు. వాడితో తిరుగు. వాడిని అనుకరించు, విద్యాబుద్ధులు అలవడతాయి!’ అని తల్లిదండ్రులు 
తరచుగా తమ పిల్లలకు ఏదో ఒక రూపంలో చెప్పటం లాంటిదే. మంచివాడిని అనుసరిస్తే మనమూ మంచి మార్గంలోనే నడుస్తాం. మన పురాణాల్లో ఇతిహాసాల్లో కనిపించే కథలన్నీ చేసే ఉపదేశం ఇదే.

సజ్జనులు గురువులంటే, దుర్జనులు కూడా గురువులే అవుతారు. రాముడు గురువైతే, రావణుడూ గురువే. ఒకరు ఎలా నడుచుకొంటే బాగుపడతావో నేర్పిస్తారు. మరొకరు ఏం చేస్తే నాశనం కొని తెచ్చుకోవచ్చో చూపిస్తారు.

ఆ మాటకొస్తే- అటు పూర్తిగా సజ్జనులు, ఇటు పూర్తిగా దుర్జనులు కాని అత్యధిక శాతం మధ్యస్థులూ గురువులే. లోకంలో లోకులెవరో చేస్తున్న పనుల్లో మంచి చెడ్డలు వేడిగా వాడిగా విశ్లేషిస్తూ మనం జరుపుకొనే తెరపిలేని చర్చల వెనక ఉద్దేశం మంచిని గుర్తించి, దాన్ని సమర్థించాలనే. మనం ఎరిగిన బంధుమిత్రులో, ఎరుగని మరెవరో చేసిన పనుల్ని చెరగటంలో, జల్లెడ పట్టడంలో అర్థవంతమైన ప్రయోజనం ఒక్కటే. రేపు మనకు అలాంటి పరిస్థితి ఎదురైతే, వాళ్లు చేసిన ‘పొరపాట్లు’ మనం చేయకుండా, వాళ్ల అనుభవం నుంచి మనకు తోచిన పాఠం మనం నేర్చుకోవటం. ఈ పాఠాలన్నీ కలిస్తే అదే లోకానుభవం, లోకజ్ఞానం, లోకజ్ఞత. ఈ జ్ఞానం కలిగించే లోకులు గురువులు కాదనలేం!

ఇతరులు నేర్పేవేకాక, మన సొంత గుణగణాలూ మనకు చాలా నేర్పుతాయి. మన సద్గుణాలు మన గురువులు. ఉదాహరణకు, కష్టపడటం అనే సుగుణం వల్ల సత్ఫలితాలను, సంతృప్తిని పొందుతున్నామంటే- ఇక్కడ కృషి అనే సద్గుణం, ‘కృషి వల్ల సంతృప్తి కలుగుతుంది’ అన్న పాఠాన్ని మనకు నేర్పిస్తున్నట్టే. పట్టుదల వల్ల కార్యసిద్ధి పొందవచ్చు అనే పాఠాన్ని పట్టుదల అనే సద్గుణమే మనకు బోధిస్తున్నది.

సద్గుణాల్లాగే దుర్గుణాలూ గురువులే! మితిమీరి తినటం వల్ల, తాగటం వల్ల వెంటనే దుష్ఫలితాలు అనుభవిస్తాం. అలాంటి బాధాకరమైన అనుభవాలు మళ్ళీ ఎదురుకాకుండా జాగ్రత్త పడమని, ‘అతి భోగం’ అనే దుర్గుణం మనకు సోదాహరణంగా నేర్పుతున్నట్టే. అతి వ్యయం వల్ల అప్పులపాలై అష్టకష్టాలు పడ్డవాడికి ‘ముందెప్పుడూ ఆదాయాన్ని మించిన వ్యయం కూడదు!’ అన్న పాఠం నేర్పేది- దుబారా ఖర్చులు చేసే దుర్గుణమే! కోపం వల్ల మనకు కలిగే అనర్థాల ద్వారా, కోపం అనే దుర్గుణం ’నన్ను వదిలిపెట్టు మిత్రమా సుఖపడతావు!’ అని గురువులా బోధ చేస్తుంటుంది.

గురువుల రూపంలోనే తారసిల్లి మార్గదర్శనం చేయించే మహనీయులు సరేసరి. వారిలో కొందరు లౌకిక విద్యలు నేర్పి పుణ్యం కట్టుకొనే ఉపాధ్యాయులు. మరి కొందరు, జ్ఞాన నేత్రాన్ని తెరిపించే సద్గురువులు. సద్గురువులు శిష్యులనుంచి ఏ ప్రతిఫలమూ ఆశించకుండా, నిస్వార్థంగా కేవలం లోకోపకార దృష్టితో తమ అనుభవాలను పంచుకొంటారు. అలాంటి సద్గురువులు దొరకటం అరుదైన మహాభాగ్యం.

కొన్ని సందర్భాల్లో అతి సామాన్యులైన సాటి మనుషులే గురువులుగా నిలుస్తారు. కొన్ని విపత్సమయాల్లో సాటివారిపట్ల సామాన్యుల ప్రవర్తనలో కనిపించే భావౌన్నత్యం లోకానికే గుణపాఠంగా నిలుస్తుంది.

ఒక్కొక్కప్పుడు, అధ్యాపక వృత్తిలో ఉండి శిష్యులకు పాఠాలు నేర్పుతూ ఉండే అయ్యవారు తమ శిష్యుల నుంచి ఎంతో నేర్చుకొంటారు. వినయంగల విద్వాంసుడికి ఒక్కోసారి శిష్యుడు కూడా గురువే!