కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి 



          కార్తీక మాసంలో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి.

    ఇందులో భాగంగా మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లయితే కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహా శివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని ''త్రిపురి పూర్ణిమ'', ''దేవ దీపావళి'' అని కూడా అంటారు.

           మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానారకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. వెయ్యేళ్ళ రాక్షసుల పాలన అంతరించిన శుభసందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తున్నాయి.

            కార్తీక పౌర్ణమి అటు శివునికి, ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసీ తెలీక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక సోమవారాల్లో, కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యన్నారాయణ వ్రతం చేసుకోవడం చాలా శ్రేష్ఠం.

శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలే......స్మిన్‌ సన్నిధింకురు||

          ప్రధానంగా కార్తీక పౌర్ణమినాడు తెల్లవారు జామున సముద్రంలో లేదా నదిలో స్నానం చేయడం శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేనివారు ఉదయానే లేచి స్నాన జపాలు ముగించి ఆలయానికి వెళ్ళి దేవుని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

            రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం 365 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటిదొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేనివారు ఇంట్లోనే దేవునిముందు లేదా తులసికోట ఎదుట దీపం వెలిగిస్తారు.

         మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.

           కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. కార్తీక పౌర్ణమినాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖసౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. కార్తీక పౌర్ణమి జైనులకు, పంజాబీలకు కూడా విశిష్ట పర్వదినం. గురునానక్ జయంతి కూడా ఈరోజే. ఈ విశేష పర్వదినాన గంగా మహోత్సవం కూడా నిర్వహిస్తారు.

కేదారేశ్వర వ్రతం

            చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఈ పర్వదినాన నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రి చెట్టు ఊడలను తోరణాలుగా, మర్రిపండ్లను బూరెలుగా, మర్రి ఆకులును విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం పురాతనకాలం నుంచి సంప్రదాయంగా వస్తోంది. కేదారేశ్వర వ్రతం భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుందని శాస్త్రం.

             ఆది దంపతులకు ఇష్టమైన ఈ వ్రతాన్ని ఎలా పాటించాలంటే కేదారేశ్వర వ్రతంలో 21వ సంఖ్యకు చాలా ప్రాముఖ్యత వుంది.

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం
జగన్నాథ నాథం సదానంద భాజాం
భవద్దివ్య భూతేశ్వరం భూతనాథం
శివం శంకరం శంభుమీశానమీడే

ఓం నమః శివాయ
భక్త జన రక్షక పాహిమాం పాహిమాం-

అంటూ ముక్కంటి స్తుతించుకుని కేదారవత్రాన్ని ప్రారంభించాలి.

21 పేటల పట్టు లేక నూలుదారాన్ని తోరంగా ధరించాలి. 21 మంది ద్విజులను పూజించిన తర్వాత కలశం/ప్రతిమలోకి కేదారేశుని ఆవాహనం చేయాలి. పూజలో గోధుమపిండితో చేసిన 21 అరిసెలు పాలు, పెరుగు, నెయ్యి, పాయసాలతో పాటు 21 రకాల ఫలాలను, కూరలను నైవేద్యంగా సమర్పించాలి.

          తప్పనిసరిగా తేనె ఉండాలి. ఈ వ్రతంలో 21వ సంఖ్యకు ప్రాముఖ్యత ఎందుకంటే శిశువు పుట్టినప్పుడు ఏక విశంతి (21) దోషాలుంటాయి. కేదారుని పూజించడం వల్ల ఈ దోషాలు నశిస్తాయి. మనం సమర్పించే నైవేద్య వస్తువులలో 21 దోషాలకు ఒక్కొక్కటి చొప్పున సమర్పణ చేస్తున్నాం. అరిసెలను గోధుమలతో చేయడంలో కూడ ఒక ఆరోగ్య-జ్యోతిష్య రహస్యం ఉంది.

             గోధుమలు సూర్యునికి ప్రీతికరమైన ధాన్యం. సూర్యుడు మనకు ఆయువునిచ్చేవానిగా జ్యోతిష్యం పేర్కొంది. సూర్యుడు అగ్ని స్వరూపంలో శివుని మూడోకన్నులో కాలాగ్ని రూపంలో దాగివున్నాడు. అనగా, కేదారేశుని పూజించడం వల్ల పరోక్షంగా సూర్యునిని కూడా ఆరాధించిన వాళ్ళవుతున్నాం.

           పాలు-పెరుగుతో శుక్రుని, తేనెతో గురువును, నెయ్యితో శనీశ్వరుని, కూరలతో చంద్రుని. ఫలాలతో బుధుని, బ్రాహ్మణుల ఉపచారంతో కుజుని సేవించిన ఫలం ఈ వ్రతాన్ని చేయడం వల్ల లభిస్తుంది. కేదారేశ్వరుని పూజించడం వల్ల మొత్తం నవగ్రహాలను పూజించిన ఫలం దక్కుతుంది.

              సంఖ్యాపరంగా 21కి ఏక సంఖ్య చేసినట్లైతే (2+1=3) మూడు వస్తుంది. ఈ మూడు అనేది త్రిమూర్తి మత్వానికి సంకేతం. అందుకే ఈ వ్రతంలో 21వ సంఖ్యకు అంతటి ప్రాముఖ్యతని పురోహితులు చెబుతున్నారు. ఈ వ్రతాన్ని ఏకధాటిగా 21 సంవత్సరాల పాటు నిర్వహించి 21వ సంవత్సరపు పూజాంతంలో ఉద్యాపనం (ముగింపు) చెప్పుకోవాలి.

            మహిళలు, పురుషులనే భేదం లేకుండా ఈ రోజు ఇంటిల్లి పాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు. నోములు నోచు కుంటారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు,  అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం.

              పవిత్ర మనస్సులతో పరిశుభ్రమైన నీరు, ఆవుపాలు, చెరుకు, కొబ్బరికాయలు, తమలపాకులు, పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు. అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు.