కార్తీక పురాణము 8వ అధ్యాయము



 (శ్రీహరినామస్మరణాధన్యోపాయం)


            వశిష్ఠుడు చెప్పినదంతా విని "మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు, పుణ్యము సులభముగా కలుగుననియూ, అది - నదీస్నానము,దీపదానము, ఫలదానము,అన్నదానము,వస్త్రదానము,వలన కలుగుననియు చెప్పితిరి.

           ఇట్టి స్వల్ప ధర్మములచేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురుగదా! మరి తమరు యిది సూక్ష్మములో మోక్షముగా కనరబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది.

             దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక, వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను" యని కోరెను.

         అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, "జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే,నేను వేదవేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మమార్గాలున్నవి. అవి యేమనగా సాత్త్విక, రాజస, తాపసములు అని ధర్మము మూడురకములు.


        సాత్త్విక, మనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్త్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి, మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము.ఆ ధర్మమందు యెంతయో ఆధిక్యత కలదు. సాత్త్వికధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును.

           ఉదాహరణముగా తామ్రపర్ణినది సముద్రమున కలియ తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమగు విధముగా సాత్త్వికత వహించి, సాత్త్వికధర్మ మాచరించుచూ గంగ,యమున,గోదావరి కృష్ణనదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందూ దేవాలయ ములయందూ -

         వేదములు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్పదానము చేసిననూ, లేక ఆ నదీతీరమందున్న దేవాలయంలో జపతపాదు లొనరించినను విశేషఫలమును పొందగలరు.

             రాజస ధర్మమనగా - ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించున దగును.తామస ధర్మమనగా - శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్ధం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు.


         దేశకాల పాత్రలు సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని యే స్వల్పధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీ మన్నారాయణుని నామము, తెలిసిగాని,తెలియకగాని ఉచ్ఛరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక యితిహాసము కలదు.

అజామీళుని కథ

          పూర్వకాలమందు కన్యాకుబ్జమను నగరమున నాల్గువేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతియను భార్య కలదు. ఆ దంపతు లన్యోన్య ప్రేమకలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను.

          వారాబాబుని అతి గారాబముగా పెంచుచు, అజామీళుడని నామకరణము చేసిరి.ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతిగారాబము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు, దుష్టసావాసములు చేయుచు, విద్య నభ్యసింపక, బ్రాహ్మణధర్మములు పాటించక సంచరించు చుండెను.

           ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనమురాగా కామాంధుడై,మంచి చెడ్డలు మరచి, యజ్ఞోపవీతము త్రెంచి,మద్యం సేవించుచు, ఒక ఎరుకలజాతి స్త్రీని వలచి,నిరంతరము నామెతోనే కామక్రీడలలో తేలియాడుచూ, యింటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె యింటనే భుజించుచుండెను.  
           అతి గారాబము యెట్లు పరిణమించినదో వింటివా రాజా! తమ బిడ్డలపై యెంత అనురాగమున్ననూ పైకి తెలియపర్చక చిన్ననాటినుంచీ అదుపు ఆజ్ఞలలో నుంచకపోయినయెడల యీ విధంగానే జరుగును. కావున అజామీళుడు కులభ్రష్టుడు కాగా,వానిబంధువు లతనిని విడిచిపెట్టిరి.

           అందుకు అజామీళుడు రెచ్చిపోయి వేటవలన పక్షులను,జంతువులను చంపుతూ కిరాతవృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీళుడు ఆస్త్రీపై బడి కొంతసేపు యేడ్చి, తరువాత ఆ అడవియందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను.

           ఆ యెరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె వుండెను. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్తవయస్సు రాగా కామాంధకారముచే కన్నుమిన్ను గానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడు చుండెను. వారికి యిద్దరు కొడుకులు కూడా కలిగిరి. ఇద్దరూ పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను.

           వారిద్దరూ ఆ బాలునికి "నారాయణ" అని పేరు పెట్టి పిలుచుచు ఒక్కక్షణమైననూ ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్లినా వెంటాబెట్టుకొని వెళ్లుచూ, "నారాయణ - నారాయణ" అని ప్రేమతో సాకుచుండిరి. కాని "నారాయణ" యని స్మరించిన యెడల తమ పాపములు నశించి, మోక్షము పొందవచ్చుననిమాత్ర మాతనికి తెలియకుండెను.

        ఇట్లు కొంతకాలము జరిగిన తర్వాత అజామీళునకు శరీరపటుత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచముపట్టి చావునకు సిద్ధపడియుండెను. ఒకనాడు భయంకరాకారములతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజమీళుడు భయము చెంది కుమారునిపై నున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక "నారాయణా" యనుచునే ప్రాణములు విడిచెను.

         అజామీళుని నోట "నారాయణా" యను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదేవేళకు దివ్యమంగళాకారులు, శంఖ చక్ర గదాధరులూ యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి "ఓ యమభటులారా! వీడు మావాడు.

         మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి" యని చెప్పి,అజామీళుని విమాన మెక్కించి తీసుకొనిపోవుచుండగా యమదూతలు "అయ్యా! మీరెవ్వరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొనిపోవుటకు మేమిచ్చటకి వచ్చితిమిగాన, వానిని మాకు వదలు" డని కోరగా విష్ణుదూతలు యిట్లు చెప్పదొడంగిరి.

ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.


- స్వస్తీ...