కోరిక చంపేస్తోంది
"సొంత మనుషుల్నే హత్య చేస్తున్న ఘటనలకు ప్రధానంగా రెండే కారణాలు వెల్లడవుతున్నాయి.
ఒకటి డబ్బు, రెండోది లైంగిక వాంఛ.
ఎవరికివారు తమ ఆనందమే ముఖ్యంగా భావిస్తున్నారు. అడ్డొచ్చిన వారు కుటుంబ సభ్యులైనా సరే మట్టుపెడుతున్నారు.
పెచ్చుమీరుతున్న అశ్లీలత,
విశృంఖలత్వం... స్త్రీ, పురుషులిద్దరినీ రొంపిలోకి లాగుతున్నాయి. కట్టుబాట్లను ఛేదించేలా పురిగొల్పుతున్నాయి. లైంగిక వాంఛ మానవత్వాన్ని చంపేస్తోంది.
విలాసాలకు అలవాటుపడ్డ వారు డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు"
సామాజిక మాధ్యమాలు - అపరిచిత బంధాలు :
సొంత కుటుంబ సభ్యులనే హత్యలు చేస్తారు. వావి వరుసలు కూడా మరిచి అత్యాచారాలకు తెగిస్తారు.
ఇది అనైతికత ఉప్పెన. సమాజాన్ని నెమ్మదిగా ముంచెత్తుతోంది. మనుషుల మధ్య ప్రేమానురాగాలను మింగేస్తోంది. అంతర్జాలం దీనికో కారణం. కుటుంబ సంబంధాలకు అదే పెద్ద అంతరం. అవాంతరం. రెండువైపులా పదునున్న కత్తి అది.
ఇంటర్‌నెట్ సద్వినియోగం తెలియక చాలామంది విషపు ‘సాలెగూడు’లో చిక్కి విలవిల్లాడుతున్నారు.
సామాజిక మాధ్యమాలు అపరిచిత బంధాలకు దారి తీస్తున్నాయి.
ఒకే ఇంట్లో ఉన్నా - మాటలు దూరం :
‘అన్నం పెట్టు’...; ఫీజుకు డబ్బులు కావాలి’; షాపింగ్‌కు తీసుకెళ్లు... ఇలాంటి సాధారణ అవసరాల కోసం ఆడే మాటలే తప్ప... ఆప్యాయతలను పంచుకునే పలుకులు కరువైపోయాయి.
పెద్దలు, పిల్లలదీ అదే తీరు. దీని వల్ల వారి మధ్య బంధం బీటలు వారుతోంది. తల్లీ, తండ్రి కొడుకూ, కూతురూ అందరూ ఒకే ఇంట్లో ఉన్నా మానసికంగా ఎవరి దోవ వారిది.
ఈ స్థితిలోనే వారికి వేరే వారితో కొత్త బంధాలు పుడుతున్నాయి.
చాటింగ్ పేరుతో చీటింగ్ : పిల్లలకు తల్లిదండ్రులతో సాన్నిహిత్యం ఉండదు. చిన్నప్పుడే భావోద్వేగ బంధం తెగిపోతోంది. టీవీ చూసేందుకో, సామాజిక మాధ్యమాల వైపో పెద్దలు మొగ్గు చూపుతున్నారు. పిల్లలు తమకు అడ్డు పడకుండా వారి చేతిలో ఓ ఫోన్ పెట్టేస్తారు. పిల్లలు ఫోన్లో గడిపేది ఎక్కువగా హింసాత్మకమైన వీడియో గేమ్స్‌తోనే.
వెంటాడటం, వేటాడటం, చంపడం వంటి ఆటల్లో గెలిచే ప్రయత్నంలో తెలియకుండానే వారిలో హింసా ప్రవృత్తి పెరిగిపోతోంది.
యుక్తవయసు పిల్లలైతే అశ్లీల వెబ్‌సైట్ల వలలో చిక్కుకుంటున్నారు. పెద్దలు, పిల్లలు ఎవరేం చూస్తున్నారో.. ఏం చేస్తున్నారో అంతా గోప్యం. తేలు కుట్టిన దొంగల చందం.
ఎవరి లోకం వారిది :
‘ఎవరి స్పేస్‌లో వాళ్లుండాల’న్న విచిత్ర భావనలు పెరుగుతున్నాయి. ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోకూడదన్న ధోరణి.
భార్యాభర్తల మధ్య, పెద్దలు, పిల్లల మధ్య కంటికి కనిపించనంత దూరం పెరిగిపోతోంది. పిల్లలు పెద్దయ్యేకొద్దీ మరింత ఛిద్రమవుతోంది.
యుక్తవయసుకొచ్చాక తల్లిదండ్రులను కూడా పరాయివారిలా చూస్తున్నారు.
ఎవరితోనూ మాట్లాడరు. స్మార్ట్‌ఫోన్, అంతర్జాలమే వారి నేస్తాలు. అక్కడే అపరిచితులతో చాటింగ్‌లు... ఆపై డేటింగ్‌లు. ఇలా పెద్దలూ పిల్లలూ ఒకరినొకరు మోసం చేసుకుంటూ ప్రమాదాల్లో పడుతున్నారు.
భావోద్వేగాలను అదుపు చేయగలిగితేనే
కీర్తిరెడ్డి తరహాలో కుటుంబసభ్యులనే చంపేసేంత కిరాతకాలను తరచి చూస్తే భావోద్వేగాలను అదుపు చేయడంలో నేటి తరం విఫలమవుతోందని చెప్పొచ్చు.
తాము చేస్తున్న పనిని అంగీకరించకపోతే ఎంతకైనా తెగిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ల వల్ల 90 శాతం అనర్థాలు జరుగుతున్నాయి.
ఏదో చేయాలనే ఆత్రుత, ఉత్సుకత పెడధోరణులకు కారణమవుతోంది.
పిల్లలకు నైతిక విలువలు నేర్పించే పెద్దలు లేకపోవడం విపరీతాలకు దారితీస్తోంది.
భావోద్వేగాల్ని అదుపు చేయలేకపోవడంతో పాటు కుటుంబసభ్యుల నుంచి సరైన ఓదార్పు లభించకపోవడంతో దురాగతాలకు పాల్పడుతున్నారు.
- స్వస్తీ...