"ఏం అక్కా! ఈ రోజు ఫ్రీగా కనపడుతున్నా వూ"...అంది కాలేయం (liver) జీర్ణాశయం (stomach) తో.

"హా...కొంచెం ఫ్రీగానే ఉన్నా ఈ రోజు ఉపవాసం అనుకుంటా ఇంక ఏమి పోయలేదు." అంది జీర్ణాశయం కొంచెం నీరసంగా. 

"పోనీలే ఈ రోజయినా రెస్ట్ తీసుకో జన్మనికో శివరాత్రి" అంది కాలేయం కాస్త కన్సర్న్ చూపిస్తూ. 

దానికి జీర్ణాశయం "ఏం రె స్టో ఏమో కొద్దిగా నీళ్ళో, జూసో పోస్తే బాగుణ్ణు సరేలే ఏం చేస్తాం.

 ఇవాళ్టి సరదా అంతా రేపు తీరుస్తాడు. 

ఏదో పది రోజులు పస్తున్నట్టు ఒకటి తరవాత ఒకటి తిని గాబరా తెప్పిస్తాడు. 

అది అరగక పోతే ఏవో టాబ్లెట్లు లేకపోతే ఏదో బుస బుస పొంగుతూ వచ్చి, నా ఇల్లుఒళ్లు గందరగోళం చేస్తుంది, 

తరువాత కొంచెం ప్రశాంతంగా ఉంటుందనుకో....

కానీ వీల్లెంటో అయితే ఎక్కువ తినేయడం లేదా మానేయడం ఒక టైము పాడు లేదు. 

అక్కడికి చెపుతూనే ఉన్నా కాస్త గేస్ పంపించి రెండు వైపుల నుంచి..

ఏం లాభం బ్రేవ్ బ్రేవ్ అంటూనే ఉంటాడు మళ్లీ మామూలే" అంది.

        "నేను చెప్తూనే ఉన్నా నీళ్ళు బాగా తాగరా బాబు అని వింటేగా.... 

నిగనిగలాడుతూ ఉండవలసిన దాన్ని ముసలిదాన్ని చేసేస్తున్నాడు. 

రేపు నేను నాలుగు రాళ్ళు వెనకేసుకుంటే వాడికే ప్రాబ్లెమ్ అని తెలియట్లేదు వెధవకి. 

సరేకానీ ఊపిరితిత్తుల(lungs) మావా బాగున్నావా!" అడిగింది కిడ్నీ.

"ఏం బాగులే ఈ మధ్య ఈ పొల్యూషన్తో నా వయస్సు తీరేట్టు ఉంది. 

వీడేమో ప్రాణాయామం అయినా చేయడాయే. 

నా తిప్పలేవో నేను పడుతున్నా. 

పొట్టలో కొవ్వు పెరుగుతుంది నాకు  ఇరుకు అయిపోతుంది జాగ్రత్త అని ఈ మధ్య చిన్న వార్నింగ్ కూడా ఇచ్చా గురకతో, తట్టుకోలేక వాళ్ళావిడ చూసుకుంటుందిలే ఇక. ఉస్సురుమంది ఊపిరితిత్తి(lungs)"మీరంతా బానే ఉన్నారు నన్ను పట్టించుకునేవారే కరువయ్యారు. 

కిడ్నీ బావ కైనా పర్వాలేదు కానీ నా ట్రాన్స్ ప్లాంటేషనే మరీ ఎక్స్పెన్సివయింది" అంది క ళ్లుతుడుచుకుంటూ కిడ్నీ. 

        "మనమేమో ఈ కూపంలో కొట్టుకుంటున్నాము..
బయట కాళ్ళూ, చేతులూ, ముఖం...అన్ని చక్కగా స్వేచ్చగా బతుకుతున్నాయి. 

మంచి మంచి డ్రెస్సులు, వాచీలు, ఉంగరాలు పెట్టుకుని సోకులు చేసుకుంటున్నాయి." అంది క్లోమం కొంటెగా. 

"నీ మొహం...ఆ సోకులన్ని పైపైనే అసలు అవి కదలాలంటేనే పెద్దాయన (బ్రెయిన్) ఆర్డర్ వెయ్యాలి, ఇంకా నడవాలి, బోలెడు బరువులు మోయాలి ఇంకేం స్వేచ్ఛ 

మనం కనీసం మన పని మనం చేసుకో గలుగుతున్నాం అవైతే పెద్దాయన ఆర్డరు లేకపోతే నోరు మూసుకుని కూర్చోవలసిందే.

 ఈ మధ్య బ్రెయిన్ డెడ్ లు కూడా ఎక్కువయ్యాయి ఇక అప్పుడు అన్ని చచ్చుబడిపోతాయి సోకులూ, డాబులూ హుష్ కాకి. కానీ అప్పుడు కూడా మనం పని చేస్తాం" అంది అందరికంటే కాస్త ప్రపంచ జ్ఞానం తెలిసిన హార్ట్ చిన్నగా నవ్వుతూ. 

అమ్మో! "బయట చాలా బాగుంటుంది, మనమే వెట్టిచాకిరి చేస్తున్నాం అనుకున్నాం అలా అయితే వద్దు బాబోయ్" అన్నాయి అన్ని అవయవాలు ముక్త కంఠంతో.

        "ఇంక ఆపవే అక్కా! ఇక్కడ అంతా నిండిపోయింది, నా మెలికలు అన్నీ సాపు అయిపోయాయి" అంటూ కేకలు పెడుతున్నాయి ప్రేగులు.

"నేనేం చేసేదే! పరపర నములుతునే ఉన్నాడు నా పని అయ్యాక నీకు గాక ఇంకెవరికి పంపేది! అదిగో మళ్లీ ద్రావకం పోస్తున్నాడు మాయదారి కాఫీనో, టీనో నా ఒళ్ళంతా మరకలు పెట్టడానికి" దీర్ఘాలు తీసింది జీర్ణాశయం.

"కాసేపు ఖాళీగా వదిలేస్తే నువ్వే కదా గురగురా అంటావు" పళ్లి కిలించింది పాంక్రియాస్.

"హా...నువ్వు ఊరుకోవు కదా మరి! అయ్యో! అక్క రెస్ట్ తీసుకుంటుంది అనుకుంటావా! నీ స్రావాలు(digestive juices) నువ్వు కక్కేస్తావు, ఆ సమయానికి వాడు తినకపోతే నన్ను కరిగిచేయడనికి కూడా వెనుకాడవు. పిత్తం(spleen), ప్లీహం(gall bladder) కూడా నీకు వత్తాసు" నిస్థూర మాడింది జీర్ణాశయం.

"కోపం ఎందుకులే అక్కా! వాటి సాయమే లేకపోతే మన పని ఎంత కష్టమవుతుందో నీకు తెలియనిదా అన్నాయి ప్రేగులు పరిస్తితిని చక్కబరుస్తూ...

"అవునక్కా! మనుషుల్లా కోపం, అహంకారం ఈర్ష్యా ద్వేషాలు, గొప్ప బీద తారతమ్యాలు, కులమతాల పట్టింపులు మనకూ ఉంటే ఏమైపోతారు ఈ మనుషులు?" వాపోయింది ఆంత్రమూలం (oesophagus).

          "అవునూ ఆడాళ్ళ కడుపులో అయితే నీలానె ఇంకో సంచి ఉంటుందట కదా అక్కా! అది ఒక బిడ్డనే పెంచుతుందట... 

అది అంత పెద్దదవుతూ ఉంటే మనమెక్కడ ఉండాలి అంటూ ఏదో చెప్తూ వుండగానే...

"అమ్మో ఏదో నురగతో జరజరా నీళ్ళు వస్తున్నాయి అంటూ గగ్గోలు పెట్టడం మొదలుపెట్టాయి ప్రేగులు. 

ఇంకేముంది గబగబా ప్రేగులన్నీ ఖాళీ అయిపోయాయి. 

ఏం జరుగుతోందని అందరం ఆలోచించే లోపే సర్రుమని కత్తి వచ్చింది లోపలికి, ఎప్పుడూ చూడని వెలుగు రేఖలులోనికి  చొరబడ్డాయి. 

ఏం జరుగుతుంది బయటి ప్రపంచం   పరిచయమవుతుందా? మా రోజులు మార బోతున్నాయా? ఏమి అర్ధం కాలేదు. 

ఏవో సూదులు, గొట్టాలు, బ్లేడులు అన్నీ వచ్చేస్తున్నాయి గాల్ బ్లాడర్ దగ్గరికి. 

భయంతో కళ్ళు మూసుకున్నాం అందరం. 

తెరిచి చుద్దుము కదా గాల్ బ్లాడర్ లేదు. 

పాపం ఈమధ్య కాస్త డుల్లుగా ఉండేది, ఏవో రాళ్ళు పెరిగాయట...

పాపం ఇంతలోనే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. 

రెండు రోజులు అందరం డల్ అయిపోయాం. 

మేం పనిచేయకపోతే వాడి ప్రాణం బాగోదు....

తప్పేదేముంది అందుకే మళ్లీ పనిలో పడ్డాం.
            
ఇది మనకి వినపడని కడుపులో అవయవాల ఘోష అవి మాట్లాడితే!! అనే ఆలోచనకు అక్షర రూపం. 


౼ స్వస్తీ...