సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం. దీనినే సుబ్బరాయషష్టి అని, స్కందషష్టి అని కూడా అంటారు. సుబ్రమణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము.

 సుబ్రహ్మణేశ్వర స్వామి వారి దేవాలయాలు, కుమారస్వామివార్ల దేవాలయాలు కల ప్రతి చోటా ఈ రోజు విశేష పూజలు జరుపుతారు.

ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు జరుపుతారు. 

జన జీవనంలో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ పర్వదినం అలరారుతుంది.

 తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ, సుబ్బారాయుడు, సుబ్బి, సుబ్బారావు, సుబ్రహ్మణ్యం, బాల సుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవటం జరుగుతోంది.

 శివుడి రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామిని ఆరోజున ఆరాధిస్తారు. ఈ స్వామినే కార్తికేయుడు అని, స్కందుడు అని, షణ్ముఖుడు అని, గుహుడు, కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు.

తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించిదే.

 మహా బలిష్టుడైన తారకాసురుడిని కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవటం, తలచు కోవటం కన్పిస్తుంది.

అతి సామాన్య ప్రజల నుంచి ఉన్నత కులీనుల దాకా సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు.

సంప్రదాయకంగా పాము మంత్రాలను సాధన చేసేవారు ఈ రోజున ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని మరింతగా జపిస్తుంటారు.


సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న పేర్లు 


షణ్ముఖుడు + ఆరు ముఖాలు గలవాడు

స్కందుడు + పార్వతి పిలచిన పదాన్ని బట్టి

కార్తికేయుడు + కృత్తికా నక్ష్త్ర సమయంలో అవతరించాడు

వేలాయుధుడు + శూలము ఆయుధంగా గలవాడు

శరవణభవుడు + శరములో అవతరించినవాడు

గాంగేయుడు + గంగలోనుండి వచ్చినవాడు

సేనాపతి + దేవతల సేనానాయకుడు

స్వామినాధుడు + శివునకు ప్రణవ మం్తమ్రు అర్ధాన్ని చెప్పినవాడు

సుబ్రహ్మణ్యుడు + బ్రహ్మజ్ఞానము తెలిపినవాడు

మురుగన్‌ + తమిళంలో పిలుస్తారు


పండుగ విశేషాలు: 

        ఉదయాన్నే స్నానం చేయటం, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ అర్పిస్తుంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే.

 పురాణాలలో సుబ్రహ్మణ్యస్వామి వివాహితుడుగా కనిపిస్తాడు. వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను అందుకే ఈ షష్ఠినాడు చేయటం కనిపిస్తుంది. సుబ్బరాయుడి పెళ్లి చూచి వద్దాం రండి అన్న పాట పిల్లలు ఈ సందర్భంగానే పాడేవారు.


బ్రహ్మచారికి భోజనం: 

అయితే కొంతమంది వివాహం కాకముందు బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యస్వామి మూర్తిని ఆరాధించే పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతిలో భాగంగానే ఈ రోజున బ్రహ్మచారికి (కొన్ని ప్రాంతాల్లో ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు) పూజ చేయటం, వసా్తల్రు సమర్పించి భోజనం పెట్టి గౌరవించటం జరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో, షష్టి నాటి ఉపవాసం ఉండి మరుసటి సప్తమి నాడు బ్రహ్మచారి బ్రాహ్మణుడికి భోజనం పెట్టడం కూడా ఆనావయితీ.

తమిళనాట కావడి మొక్కులు: 

                   బితమిళ ప్రాంతాలలో ఈ రోజున కావడి మొక్కును తీర్చటం కనిపిస్తుంది.

షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకుని పోవటమే దీనిలోని ప్రధానాంశం.

ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ, పాలతోనూ నింపుతారు. కావడి పంచదారతోనూ, పాలతోనూ అనేది మొక్కును బట్టి ఉంటుంది. ఈ పండుగ బాగా ప్రసిద్ధికెక్కింది.

సుబ్రహ్మణ్య షష్ఠి వెళ్ళగానే వానలు కూడా వెనక్కు తగ్గుతాయని కొందరి నమ్మకం.

అలా వానలో తగ్గాక చేసుకోవలసిన పనులను చేసుకోవటానికి అనువైన కాలంగా రైతులు దీన్ని భావిస్తారు. సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ప్రచారంలో ఉంది.

ఉపవాసం ఉండి సర్ప మంత్రాన్ని ఈ రోజున దీక్షగా చేస్తే మళ్ళీ సంవత్సరం వరకూ గొప్ప శక్తితో అది పనిచేస్తూ ఉంటుందని కూడా ఓ నమ్మకం ఉంది.

సామాజిక అంశం: 

                  సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం వల్ల సామాజిక ప్రయోజనం ఏమిటి? అని అనేవారికి ఈ వ్రత విధిలోని దానాలే సమాధానం చెబుతుంటాయి.

మార్గశిర మాసమంటే చలి పులిగా మారి పీక్కుతినే మాసం. ఈ మాసంలో చలి బాధను తోటివారు పడకుండా చూడమని సందేశం ఇస్తుంది.

ఈ వ్రతం అందుకే ఉత్తరీయాలు, కంబళ్ళు, దుప్పట్లు లాంటివి వత్రంలో భాగంగా దానం చేయాలని పెద్దలు చెబుతుంటారు.

మార్గశిర షష్ఠినాడే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి లాంటి వ్రతాలను కూడా చెయ్యాలని వ్రత గంథాలు పేర్కొంటున్నాయి.

 సుబ్బరాయుడు బాలుడైన బాల సుబ్రహ్మణ్యంగా పెద్దవాడైన సుబ్రహ్మణ్యంగా, స్కందుడుగా, షణ్ముఖుడుగా ఇలా అనేక రకాలుగా, అనేక రూపాలలో ఈ షష్ఠినాడు పూజలందుకోవటం జరుగుతుంది.


పండుగల విశిష్టత: 

         సాంప్రదాయాలు, ఆచారాలు, శాంతిసహృద్భావాల మేలు కలయికే పండుగ.

సాధారణముగా పండుగలన్నీ ఏదైనా దేవుడు లేదా దేవతకు సంబంధించి, జాతి మతపరంగా జరుపుకుంటారు.

సంవత్సరం పొడవునా వచ్చే పండుగల్లో దేని ప్రాముఖ్యత , విశిష్టత దానికే వుంది.

భాష లేదా ప్రాంతాన్ని బట్టి పండుగలు జరుపుకొనే విధానములో స్వల్ప తేడాలు వున్నప్పటికీ వాటిలోని ఏకసూత్రత మాత్రము చెడదు.

సంవత్సరం పొడవునా చైత్ర మాసముతో మొదలిడి ఎన్నో పండుగలు వున్నాయి.

భారతీయ ఆధ్యాత్మికాచారాలలో పండుగలకున్న ప్రాధాన్యత ప్రత్యేకమైనది.

పండుగను అభిమానించని భారతీయుడు ఉండడు.

ప్రత్యేకంగా పండుగను చేసుకోని నాస్తికులు సైతం పండుగ దినాలను మాత్రం ఖచ్చితంగా సంతోషంగా అనుభవించే తీరతారు.

అది పూజతో నిమిత్తం లేనిది.

సంతోష ఉత్సాహాలకు నిలయమైనది.

కాబట్టే పండుగ అనే భావన ఎటువంటివారిలోనైనా అలౌకికానందాన్ని పంచుతుంది.

ఒక్కో పండుగ ఒక్కో ప్రత్యేకమైన శోభను చేకూరుస్తూ మానసికోల్లసాన్నిస్తూ గృహాలకు కొత్త అందాలను ఇస్తుంది.

అందుకే చిన్నా, పెద్దా అందరూ వీటికోసం ఎంతో ఆర్తిగా ఎదురుచూస్తుంటారు.

పండుగల సంబరాలు చిన్న పిల్లలవే అయినప్పటికీ ఆ ముచ్చట్లను పెద్ద్లలు కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్తారు.




- స్వస్తీ...