మహా ప్రాణాలతో అల్ప ప్రాణులపై మారణకాండ

(కొన్ని ఉచ్చారణా/ముద్రణా వైపరీత్యాలు)

   
◆ శాకాహారమా? శాఖాహారమా?

‘శాకము’ అంటే కూరగాయ.
‘శాఖ’ అంటే కొమ్మ.

చాలామంది రెండోదాన్నే వ్రాసేస్తుంటారు.
ఇక హొటళ్ళ బోర్డులైతే సరే సరి.
(ఒక్కోసారి పెద్దపెద్ద కొమ్మలవంటివి
ప్లేటుల్లో కనిపించినపుడు ఈ మాట సార్థకం!)

   
◆ సింధూరమా? సిందూరమా?

కమర్షియల్ రచయితలు వ్రాసేవాటిల్లో
మొదటిది సరైనదేమోగానీ,
నిజానికి రెండవదే సరైనది.

పైగా ‘సింధురము’ అంటే ఏనుగు అనే అర్థం ఉంది.
సినిమాలలో కూడా ఇది రూపాంతరం చెంది,
తరువాత మొదటిదిగా రూఢియైపోయింది!

(సినారె వ్రాసినపుడు ‘కిలకిల నవ్వులు’
అనే పాటలో స్పష్టంగా
‘నీ పాదధూళి సిందూరము కాదా?’
అని పలకబడింది.
తరవాత వచ్చిన పాటల్లోను, రచనల్లోను
ఎందుకో ‘ద’కి మహాప్రాణం వచ్చేసింది!)

     
◆ ఆనందబాష్పాలా? భాష్పాలా?

  మొదటిదే సరైనది, నమ్మలేని నిజం!   

     
◆ ఎన్ని విధాలుగా పాఠకులను, శ్రోతలను ‘బాధించవచ్చు?’

భాద
భాధ
బాధ
బాద

దురదృష్టవశాత్తు పైవాటిలో
మూడవది మాత్రమే సరైనది.
మొదటి రెండూ విపరీతప్రయోగాలే!
నాలుగోదైతే మరీను!

అయితే 1980 ప్రాంతాల్లో ఒక సహజనటి
తాను మద్రాసులో పుట్టిపెరగడంవల్ల
అదంతా తనకు అనవసరం అని చెప్పి మరీ
‘బాద’పెట్టడం మొదలుపెట్టింది,
అది కాస్తా ఒక ఒరవడి అయి కూర్చుంది!       
ఆ తరవాత రాజకీయం, సువార్తాప్రపంచం..
అదంతా ఇక్కడ అనవసరం లెండి.

     
◆ దురంధరుడా? ధురంధరుడా?

ఇక్కడ మాత్రం రెండవదే సరైనది -
(‘ధుః ధుర్’ లకు సంబంధిచినది) -
‘భారాన్ని వహించే నాయకుడు’ అని అర్థం!

     
◆ బహుమతి ప్రదానమా? ప్రధానమా?

గొప్పకు పోయి రెండవదాన్ని వాడుతూంటారు చాలామంది.
నిజానికి మొదటిదే సబబైనది.
‘దాన’ అనే మాటకు ‘ప్ర’ అనే ఉపసర్గను చేర్చితే,
ప్రకృష్టమైన (ప్ర) దానం -
గొప్పగా ఇవ్వడం అవుతుంది.

ఇక్కడ ‘ప్రధానమైనది’
‘ప్రదానమే’గాని, ‘ప్రధానం’ కాదు.


◆ ‘కచ్చితంగా’ వస్తాను -
‘ఖచ్చితంగా’ వస్తాను - వీటిలో ఏది సరైన పదం?

రెండవది సరైనదనిపిస్తుంది, కానీ మొదటిదే సరైనది.
ఎందుకంటే అది ఆచ్ఛికం (అచ్చమైన తెలుగుపదం).
అచ్చమైన తెలుగు పదాలలో పెద్ద అక్షరాలుండవు!

       
◆ ‘ఖర్మ కాలి  అక్కడికెళ్ళాను’ -
అయ్యా! ‘ఖర్మ’ అనే మాట
ఏ నిఘంటువులోనూ దొరకదు.

కానీ పరిస్థితి బాగుండనపుడు నొక్కిచెప్పడానికి (emphasis) వాడేస్తూంటాము.

ఇది ఎంతవరకూ పోయిందంటే,
గీతలోని కర్మయోగాన్ని కూడా
అదేదో తప్పులుచేసినవాళ్ళకు కలిగే శిక్షలు వగైరా
అందులో ఉంటాయని ఎందరో పామరులు అనుకునేంతవరకు!

       
◆ అన్నట్లు ‘తెలుగు భాషా? తెలుగు బాషా?”

ఏదైనా పరవాలేదంటున్నారు పండితమ్మన్యులు కూడా!

‘బాషా’ అనే మాటకు ఉర్దూలో ‘రాజు’ అనే అర్థం ఉంది.

‘ఆసు, రాజు, మదాం’ - అని
మనం అనేదానికి కొన్ని ప్రాంతాలవాళ్ళు
‘ఎక్కా, బాషా, రండీ’ అంటారు.

సంస్కృతంలో ‘భాష్’ అనే ధాతువుకు ‘మాట్లాడు’ అని అర్థం.

దాని నుండే ‘భాషా’ అనే స్త్రీలింగరూపం సంస్కృతంలోను,
దానినుండి మన పద్ధతి ప్రకారం ‘భాష’ అనే పదం
తెలుగులోను ఏర్పడ్డాయి.

     
◆ చివరిగా ఇదంతా ‘పద్ధతి’గా ఉందా?/ ‘పద్దతి’గా ఉందా?

ఈ విషయమై నాకూ ఎన్నోసార్లు అనుమానం వచ్చింది - ఎందుకంటే
హైదరాబాద్ లో ఏ డీటీపీ చేసే వ్యక్తికి ఇచ్చినా
ఒత్తులేని ‘ద’నే కొట్టగా చూచాను గానీ
‘ద్ధ’ ఎవడి చేతి మీదుగానూ పడలేదు!

దాంతో [బ్రాహ్మణుడు - మేక - నలుగురు దొంగలు
దాన్ని ‘కుక్క’ అని చెప్తే ఆ వెర్రిబాగులాడు దాన్ని వదిలేయడం] అనే కథ ప్రకారం
నాకూ అనుమానం రాసాగింది!   

( మీలో ‘మహాప్రాణం‘  అంటే తెలియనివారికి కూడా
అదేమిటో ఇప్పుడైనా తెలిసి ఉండాలి!
కాబట్టి దాని నిర్వచనాన్ని చెప్పి భయపెట్టదలచుకోలేదు!)..



స్వస్తీ...