“మనవాళ్ళు ఉత్త వెధవాయిలోయ్”

 ఈ మాట ఎప్పుడు ఎవరు అన్నారో అప్రస్థుతం
 కానీ ఈ మాట సగటు భారతీయుని నోట నానుతూనే ఉంటుంది.
(అఫ్కోర్స్ భాషలు వేరైనా భావం ఒక్కటే. భిన్నత్వంలో ఏకత్వం ఇలాంటి చోట్ల బాగా పాటిస్తాం)...
మనోళ్ళు వెధవలు పక్కనోళ్ళు మేధావులు అనే బలమైన భావన మనందరిలో ఏదో మూల ఉండే ఉంటుంది.
"ఫారిన్ రిటర్న్డ్” అంటే ఉండే ఆ గిరాకీయే వేరు కదూ!!
 ఆ మధ్య మా ఫ్రెండు ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి
 “రేయ్ మామా ...కృష్ణుడు నిజంగా ఉండేవాడటరా ...
ప్రూవ్ అయ్యింది ....” అని తెగ చంకలు గుద్దుకుంటూ చెప్పాడు.

 ఎవరు ప్రూవ్ చేసారు? అంటే “నాసా వాడురా ...

సముద్రం కింద కొన్ని వేల ఏళ్ల కిందట ద్వారక నగరం ఉండేదట.
మన మహాభారతంలో చెప్పినట్టు చాలా పోలికలతో ఉందట ఆ నగరం” తెగ మురిసిపోయాడు.
 “ఓహో నీ గ్రంధాన్ని, నీ దేవుడ్ని నాసా వాడు ప్రూవ్ చెయ్యాలనమాట !!” మనసులోనే అనుకున్నా.
ఇలా ఉంటుంది మన యవ్వారం.

విదేశాల వారు చెప్తే గానీ మనం నమ్మం.

ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు, సైన్సు వాళ్ళ చేతిలో ఉంది మరీ.

 ఈ సైన్సు గురించి తర్వాత మాట్లాడుకుందాం కాసేపు చరిత్రని తవ్వుదాం.

అసలు మనకి ఇంత బానిస బుద్ధి ఎక్కడి నుండి వచ్చింది.

ఇంకెక్కడి నుండి మన చరిత్ర అంతా బానిసత్వమేగా!!

మన పూర్వీకులు అందరూ కట్టు బానిసలే......!!

ఏంటి మనవాళ్ళలో వీరులు లేరా .....
మనమేం అంత బానిసలం కాదు ...అంటారా???

 ఏది ఓ పది మంది వీరుల పేర్లు గబగబా చెప్పండి...!!!.

ఏంటి తడుముకుంటున్నారు.....?

 పోనీ భారత్ పై దండెత్తిన వాళ్ళ పేర్లు చెప్పండి.....

హా బాగా గుర్తొస్తాయ్..... ఎవరి కొడుకు ఎవరు?? వారి కొడుకు కొడుకు ఎవరో?? కూడా వరుసగా కంఠతా కూడా వచ్చి ఉంటుంది చాలా మందికి.

పోటి పరీక్షల్లో కూడా అవే ప్రశ్నలు అడుగుతారు మరీ వచ్చి తీరాల్సిందే..
 ఏంటి? నిజంగా మనలో వీరులు లేరా .....

ఎందరో వీరులు ఉన్నారు అమర వీరులున్నారు.....
వాళ్ళంతా “మా చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది” అనుకున్నారేమో పాపం.

 కానీ ఇప్పుడు మన తలపుల్లోనే కాదు మన పాఠ్య పుస్తకాలలో కూడా చోటు సంపాదించలేక చతికిలబడ్డారు పాపం.

ఎందుకంటారు??

మన చరిత్ర పుస్తకాలలో మన బానిసత్వ కథలు తప్ప వీరోచిత గాధలు లేనేలేవుగా.

బ్రిటిషు వారి ప్రభావంతో రాయబడిన చరిత్రకారుల రచనలే మనకు ఆధారం మరీ.

భారత దేశానికి సముద్ర మార్గం కనుగొన్నది ఎవరు?

టక్కుమని చెప్తారు? వాస్కోడి గామా.....

అతగాడు అడుగు పెట్టక ఐదారు శతాబ్దాల ముందే చోళ రాజులకు ఒక పెద్దా నావికా దళం ఉండేదట.

వాస్కో డి గామా తన జీవితంలో ఎన్నడూ చూడనంత భారీ నౌకలు ఈ తీరం లో చూసాడని అతడే రాసుకున్నాడట.

మరి అంత విజ్ఞానం ఉన్న మన దేశానికీ సముద్ర మార్గం అతడు కనుక్కోవడం ఏంటి.

అదేమైనా మనకి ఉపకారమా. పాశ్చాత్యం నుండి దోపిడీకి దారులు తెరిచినవాడు అతడు.

కానీ అతడి పేరుతొ ఊర్లు, రైళ్ళు ఉంటాయి మన దేశంలో.

అంత భక్తీ మనకి దొరలు అంటే.

అతను కొంకణి తీరంలో చేసిన దురాగతాలను ఏ పుస్తకం చెబుతుంది?

ఎవరికి పట్టింది?

వాస్కోడిగామా వాస్కోడిగామా అని పిల్లలు వల్లె వేస్తూ అతడేదో సూపర్ హీరో అనుకుంటూ ఉంటారు.

ఇపుడు ఈ చరిత్ర పాఠం ఎందుకు అంటారా ??

వస్తున్నా....అసలు ఇక్కడే మొదలైంది అసలు కథ ....

భారత దేశాన్ని, భారతీయుల మనసుల్ని రెండుగా చీల్చిన సిద్ధాంతం ...

ఆర్య ద్రవిడ సిద్ధాంతం.

సింధు లోయలో నివసిస్తున్న ఒక గొప్ప జాతిని జర్మనీ నుండి వచ్చిన ఒక జాతి, యుద్దంలో నాశనం చేసి దక్షిణానికి తరిమికొట్టారని అలా దక్షిణంలో స్థిరపడ్డ వారు ద్రవిడులు.

ఆ జర్మన్ వారు ఆర్యులు అని ఓ అతి గొప్ప సిద్దాంతం ప్రతిపాదించారు విదేశీయులు.

 ఇప్పటికి మనం నమ్మేది అదే కదూ. ఇక్కడి నుండే మన బానిసత్వపు జాడలు మొదలయ్యాయి.

మనలో అంతరాలు మొదలయ్యాయి.

భారతీయులు అందరూ ఒక జాతి వారు కాదు.

వారి చరిత్ర మొత్తం విదేశీ దండయత్రాలే, బానిస బతుకులే అని బలమైన బీజం నాటేసారు.

 ఒక్క సిద్దాంతంతో దేశాన్ని అడ్డంగా చీల్చగలిగారు. ఈ సిద్దాంతం అసలు అర్ధం పర్దం లేనిదని కొట్టి పారేసే విదేశీ చరిత్ర కారులు వందల్లో ఉన్నారు.

అయినా మన పుస్తకాలలో అదే నమ్మడం మన భావ దాస్యం అనాలో రాజకీయ కుట్ర అనాలో అర్ధం కాదు. 

అక్కడితో ప్రారంభించి చరిత్ర మొత్తం బానిసత్వపు దాఖలాలు తప్ప భారత విజ్ఞానం, వీరత్వం మచ్చుకైనా కనిపించకుండా చేసారు.

 ఈ చరిత్ర వక్రీకరణలు వారికీ కొత్తేం కాదు. చాలా ఆఫ్రికా దేశాల్లో ఇటువంటి వైషమ్యాలు సృష్టించి చాలా జాతులను కనుమరుగు చేసిన చరిత్ర వారిది. శతాబ్దాలు దాటినా చెక్కు చెదరని దేవాలయాలు, కోటలు, కట్టడాల వైభవం, విజ్ఞానం ప్రపంచ వింతల హోదాకు ఎలాగో చేరలేవు కానీ కనీసం మన పాఠ్య పుస్తకాలను కూడా చేరలేకపోవడం మన దౌర్భాగ్యం అందామా? వేరే పేరు వెతుక్కుందామా?? మొదటి నుండి దండయాత్రలో అయినా దోచుకు పోయేది సిరి సంపదలే కాదు అపార విజ్ఞానం కూడా. 

ఎన్నో తాళపత్ర గ్రంధాలు దోచుకుపోయారు,
ధ్వంసం చేసారు.
పూర్తిగా ప్రజల ఆచార వ్యవహారాలు మార్చేస్తారు. 

బ్రిటిషు వారు దేశం వదిలి పోయినా మనం మాత్రం బానిసత్వాన్ని మోస్తూనే ఉంటాం. 

ఎలా అంటే వాడు తినమన్నది తింటాం తాగమన్నది తాగుతాం. 

ఒక చిన్న ఉదాహరణతో మొదలు పెడతా ..... 

సుభిక్షంగా ఉన్న భారత రైతుల రక్తం తాగిన రెండు దయ్యాలు ఇప్పటికి మన ముందే ఉన్నాయి తెలుసా ?? ఏంటో అవి ఊహించండి. మనతోనే ఉంటాయ్ .. మన ఇంట్లోనే ఉంటాయ్ ..... మన ప్రియ నేస్తాలు .. అవి లేకపోతె రోజు గడవదు ...... 

అవే కాఫీ...టీ..... ఆహార పంటలు పండించే రైతులతో బలవంతంగా కాఫీ, టీలు పండించారు. 

వాటికోసం దేశంలో అడవులు, కొండలు చదును చేసి సర్వ నాశనం చేసారు.

 ఆహార పంటలు తగ్గి జనాల ఆకలి చావులు పెరిగాయి.

అయితేనేం వాడి వ్యాపారం వర్ధిల్లిందిగా....

మెల్లగా మనకి అంటించారు టీ ,కాఫీలని. 

వేల కోట్ల కాసులు దండుకున్నారు.

ఇప్పుడు టీ,కాఫీ లేకపోతే మనకి ప్రాణం నిలవదు. 

పొట్టలో చిల్లులు పడి జల్లెడ అయినా మనం వాటిని వదలేలము. 

అలవాటు ఐపోతే టీ లేకుండా ఉండలేం.

కొందరికైతే టైంకి టీ పడకపోతే తల పగిలి పిచ్చెక్కుతుంది.

ఏం ఇది వ్యసనం కాదా? ఓయ్ గాస్త్రిక్ పేషెంట్లు!! మిమ్మల్నే !! 

డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చెప్పాడు??

 కాఫీ,టీ మానెయ్యండి అని ... ఈ రోజుల్లో గాస్త్రిక్ సమస్యలు లేనిదెవరికి?? 

కానీ న్యూస్ పేపర్లలో ఏం చదువుతాం?

 కాఫీ తాగితే మెదడుకి మంచిది అని ఒకడు.టీ మంచిది, కాఫీ తాగితే కాన్సర్ వస్తుందని ఇంకొకడు.

ఇలా రోజుకొక రీసెర్చి సెంటర్ వాడి ప్రయోగ ఫలితాలు చెప్తూ ఉంటారు. 

వాడూ సైంటిస్టే వీడు కూడా సైంటిస్టే.....

ఏ సైన్సుని నమ్ముదాం. 

మరొకడు ఏకంగా రోజుకొక పెగ్గు మందు వేస్తే మాంచి ఆరోగ్యం అని ఇంకో రీసెర్చి.

అసలు ఏది నమ్మాలి ??

 మనం గట్టిగా నమ్మే “సైన్సు” చెప్తుందాయే.......

ఏమి సేతు రా లింగా...... ఎందుకిలా రోజుకొక మాట చెప్తారు సైంటిస్టులు?? 

ప్రతి రీసెర్చికి ఒక స్పాన్సర్ సంస్థ ఉంటుంది.

ఆ స్పాన్సర్ ప్రయోజనాల దృష్ట్యా ప్రయోగ ఫలితాలు మారుతూ ఉంటాయనమాట. 

అసలు ప్రపంచంలోనే గొప్ప యునివర్సిటిలలో కూడా ఎత్తి పోతల ( కాపీ పేస్టు) రీసెర్చ్ లే ఎక్కువగా ఉన్నాయని గగ్గోలు పెడుతున్నారు.

కాబట్టి అవకాశాన్ని బట్టి ,అవసరాన్ని బట్టి ఈ రీసెర్చి ఫలితాలు మారిపోతూ ఉంటాయి.

సైన్సు విద్యార్థులకు ఈ విషయం బాగా అర్ధం అవుతుంది. 

ఓ పక్క సైన్సు పరిస్థితి ఇలా ఉంటే అసలు సైన్సుకి ఏమాత్రం సంబంధం లేని మన మేధావులు పండగలపై, ఆచారాలపై విషం కక్కుతూ ఉంటారు. 

ఉదాహరణకు ప్రపంచంలో ఉన్న సైంటిస్టులకు ప్రతినిధిలా ఆచారాలపై విరుచుకు పడే ఒక పెద్దాయన ఉన్నాడు.

పండుగ అంటే చాలు టి.విలో ఆయనే కనిపిస్తాడు.

అర్ధం లేని వాదనలతో పండుగ అంటే అనాగరికం అనేటట్లు లెక్చర్లు దంచుతాడు .

మనం నిజమే కాబోలు అనుకుంటాం.

ఓహో తెగ ఆనందంగా చూస్తాం.

ఇతను మహాజ్ఞాని కాబోలు అనుకుంటాం.

కానీ వెతికి చూస్తే ఆయన సైన్సు జ్ఞానం కేవలం డిగ్రి వరకే పరిమితం..

 అతనేమి సైంటిస్టు కాదు కేవలం ఎవరో నేర్పిన చిలక పలుకులు ఇక్కడ వల్లిస్తాడు అంతే.

ఇలాంటి వాళ్ళ కోసం ఓ పెద్ద యంత్రాంగమే నడుస్తూ ఉంటుంది వెనుక.

అది తెలియని మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి పండగలు ఆచారాలు అంటే మూర్ఖత్వం, మూడనమ్మకం అనే భ్రమలో బతికేస్తాం. 

సరే మన టాపిక్ లోకి వస్తే .....

ఇప్పుడు ఈ కాఫీ,టీ ల మార్కెట్ ఎలాగో స్థిరపడిపోయింది .

ఇక వాట్ నెక్స్ట్??

కొత్తగా సంపద సృష్టించే వాడే మేధావి....

ఇప్పుడు పుట్టింది “గ్రీన్ టీ.....”. 

పొట్ట కరుగుతుంది అని చెప్తే పది రెట్లు ఖరీదైనా కొని తాగేయ్యమూ ?? ఆ గ్రీన్ టీ యాడ్ లో వయ్యారి భామ....” రోజు ఉదయం ఎక్సర్సైజ్ తో పాటూ తాగండి గ్రీన్ టీ అంటుంది. 

ఎక్సర్సైజ్ చేసే పాటికి గ్రీన్ టీ ఏం ఖర్మ ఏం తాగినా పొట్ట కరగక చస్తుందా!! 

మరో అత్యద్భుత ప్రోడక్ట్ .....ఓట్స్ ....ఇది ఎక్కడో విదేశాల్లో పెరిగే గడ్డి మొక్క ....డబ్బాలలో చక్కగా ప్యాకింగ్ చేసి అమ్ముతారు. 

ఉదయం లేస్తే ఇపుడంతా ఈ గడ్డి టిఫినులే. ఇందులో ఫైబర్ (పీచు) తప్ప పెద్దగా ఏ పోషక విలువలూ ఉండవు.

అంత పీచు కావాలంటే చక్కగా మొలకలు తినొచ్చు, బీర తొక్కు పచ్చడి చేసుకు తినొచ్చు, లేక మునగకాయలు నమిలి నమిలి తినొచ్చుగా.. చాలా ఉన్నాయిగా ఫైబర్ ఇచ్చేవి .... అబ్బే అవి అందమైన డబ్బాలలో అమ్మరుగా..... 

మొక్క జొన్న కంకులు తినలా ?? అదేమైనా స్నాక్సా, టిఫినా....ఎప్పుడో సరదాగా బీచ్ కి వెళ్ళినపుడో, వర్షం పడ్డప్పుడో తినాలి అంతే అంటాం కదూ !!. 

కార్న్ ఫ్లేక్స్ డబ్బాలు మాత్రం వందల వందలు పోసి తెగ తినేస్తాం....

ఆ మోజు కార్న్ ఫ్లేక్స్ దో.. లేక ఆ డబ్బాదో లేకపోతె యాడ్ లో వచ్చే మోడల్ పిల్లదో.....దేవుడికే తెలియాలి.

 “నూడుల్స్ రెండు నిమిషాల్లో రెడీ.....” అంటే ఎగబడి తింటాం.. ఆరోగ్యకర తిండి తయారు చేస్కొడానికి ఓ పావు గంట కూడా కేటాయించలేనంత బిజీ అయిపోయామా.... లేక వాళ్ళు మనల్ని అలా తయారుచేసారా ?? 

ఈ రకంగా చెప్పుకుంటే మనం అనవసరంగా సోకులకి పోయి విదేశీ కార్పోరేట్ కి డబ్బు తగలబెట్టే ప్రొడక్ట్స్ చాలానే ఉంటాయి. 

అతి పౌష్టికర నువ్వులుండలేవి? బెల్లం అరిసెలేవి? వేరుసెనగ అచ్చులేవి? చుప్పులు, సకినాలు, జంతికలు, చిమ్మిలి ఉండలు, పునుగులు, పాలకాయలు, చకోడిలు, పప్పు చెక్కలు, సున్నుండలు ...... ఏమయ్యాయి?? 

కిండర్ జాయ్ తో పోటి పడి క్లీన్ బౌల్డ్ అయ్యాయా ??

 లేస్, కుర్కురే తాకిడికి కొట్టుకుపోయాయా ?? 

మనం ఇలా చేస్తున్న మేరకు మన దేశంలో రైతుకి, కుటీర పరిశ్రమలకి నష్టం వాటిల్లదా?? అన్ని ప్రొడక్ట్స్ విదేశీ కంపెనీలవే. 

పూర్వం తాతలు తిన్న జొన్నలు, సజ్జలు, సామలు, కొర్రలు చాలా వరకు కనుమరుగు అయిపోయాయి.

ఎవరో పెద్దాయన కొత్త కొత్త డైట్ ప్లానులతో వస్తే కొన్నాళ్ళు వేలం వెర్రిగా ఫాలో అయిపోతాం.... 

మళ్ళా మామూలే. 

ఇక, ఏది పౌష్టికాహారం.

ఏది తింటే మంచిది అనే వాదనలోకి నన్ను లాగొద్దు

 ఎందుకంటే మనసులో ఏదో మూల అవన్నీ మీకు తెలిసినవే. 

కానీ సమయం లేదనో ,అవన్నీ ఈరోజుల్లో ఎవడు తింటాడు అనో, ఈ పిల్లలు మన మాట వింటారేవిటండి......!!! అనో ఏదోకటి సర్ది చెప్పుకుంటూ బతికేస్తాం. 

మంచి ఎండ పట్టున బైటకు వెళినపుడు, దాహం వేస్తె మంచి నీళ్ళు ఎంత మందికి గుర్తొస్తాయి?? అందరూ పెప్సీ, కోలా యే కదూ.... ఏదో పాపం ఆ పురుగుమందుల పుణ్యాన కొంత తగ్గించాం గానీ లేకపోతె పీపాలు పీపాలు తాగెయ్యమూ??

 ఆ గ్యాసు నింపిన రంగురంగుల విషాన్ని మనకి అంత అలవాటు చేసినది ఎవడూ??? 

వినియోగదారుని ఎంపిక బట్టి వాణిజ్యం జరగాలి కానీ మన దేశంలో వ్యాపారుల చేతిలో వినియోగదారుడు కీలుబొమ్మ... 

క్రమ క్రమంగా మన అలవాట్లు, ఆచారాలను దెబ్బ తీస్తే వాళ్ళకి కాసుల పంటే... ఎందుకంటే ఆచారం, సంస్కృతీ అంటే ఏదో పూజ పునస్కారం కాదు అది మన జీవన విధానం.

 ఐతే ఇపుడేం చేద్దాం?? 

విదేశీ వస్తు బహిష్కరణ చేద్దామా?? 

అంటే .....కాదు..వీలు పడదు కూడా...ఈ వాణిజ్య ఒప్పందాల పుణ్యమా అని మనం అలా చేయలేం. 

అన్ని విదేశీ వస్తువులను బహిష్కరించి సాధించేది ఏది లేదు. 

కాకపోతే మన ఎంపికలో సరిగ్గా వ్యవరిస్తే మన దేశానికి మన జేబుకి కూడా మేలు జరుగుతుంది. 

నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అందరం పురాతన పద్దతులు పాటించండి అని కాదు.

ఎందుకంటే ఈ వ్యాసం చదివటానికి తీస్కున్న సమయం కూడా మన బుర్రలలో ఈ విషయం నిలవదు నాకు తెలుసు.

మీ తప్పు కాదు.

మనం పరిగెత్తే చక్రంలో ఇవన్నీ భాగాలు ఐపోయాయి. 

తప్పించుకు తిరగలేము.

 కానీ ఒక్క క్షణం ....

ఒకే ఒక్క క్షణం ఈ విష వలయంలో పరిగెట్టడం ఆపి పక్కకి రండి......

 స్వచ్చమైన ఆరోగ్యకర జీవన విధానం వైపు ఒక్క అడుగు వెయ్యండి. 

ఆరోగ్యకరం అంటే కేవలం మన శారీరక ఆరోగ్యమే కాదు ఆర్ధిక పరిపుష్టత కూడా.

 మన ఆహారంలో ఒక పూట చిరు ధాన్యాలు (కొర్రలు,సామలు వగైరా) చేర్చండి.

 స్నాక్స్ మీరే తయారు చేస్కొండి లేదా లోకల్ గా తయారు చేసే భారతీయ చిరుతిళ్ళు కొనండి. 

భారతీయ కళలను ఆదరించండి.

మీ పిల్లలకు నేర్పించండి.

మీ ఊర్లో ఎక్కడైనా ప్రదర్సనలు జరిగితే హాజరు అవ్వండి. 

ఇంట్లో పెద్దలు ఉంటే వాళ్ళనైనా తీసుకెల్లండి. 

సరదాగా.... ఊరికే మీకు నచ్చకపోయినా సరే....ప్లీజ్ .... ఒక్క అరగంట... ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తుంటే కళామతల్లి గుండె ఎంత క్షోభిస్తోందో పాపం. 

మీ బామ్మ, తాతలు చెప్పే వంటింటి చిట్కాలు, ఆరోగ్య చిట్కాలు పాటించండి. 

(చిన్న చిన్న వాటికి మందు బిళ్ళలు మింగకండి).

విసుక్కోకండి తీసి పారేయకండి.

మీరు వాడే చాలా మందుల్లో ఇంగ్రేడియేంట్ మన చుట్టూ పెరిగే మొక్కల నుండే సేకరిస్తారు తెలుసుకోండి.

అంటే..... ఇప్పుడు మన చుట్టూ మొక్కలే లేవనుకోండి !!అది వేరే విషయం. 

కాస్త ఓపిక చేస్కొని ఓ పది కుటుంబాలు కలిసి మీ ఊరిలో ఒక రైతుని దత్తత తీస్కోండి.

రసాయనాలు లేని గో ఆధారిత వ్యవసాయం చేయించి ఆ పంటలనే వాడండి.

ఏం ఫ్యామిలీ డాక్టర్ ని పెట్టుకుంటారు ఫ్యామిలీ ఫార్మర్ ఎందుకు ఉండకూడదు?? 

మంచి ఫార్మర్ ఉంటే డాక్టర్ అవసరం రాదు.(ఇప్పుడు మేము తినే ఆహారంలో, తాగే పాలలో ఎంత స్వచ్చత ఉంది? లాంటి ప్రశ్నలు నన్ను అడగకండి. చెప్తే భయపడతారు. దానిపై ఇంకో వ్యాసం రాస్తానులే) 

ఈ ఫ్యామిలీ ఫార్మర్ అదీ ఇదీ అంటే అదంతా మేమెక్కడ చేస్తాం అంటారా? ఖచ్చితంగా చేస్తారు.... రాసిపెట్టుకోండి ఓ పదేళ్ళు పోయాక వ్యవసాయం కార్పొరేటు వాడి చేతికి పోయాక ఆన్లైన్లో ఇదే ప్రక్రియ చేస్తారు. 

అవును మీరే....!! కాకపోతే అప్పటికి మీ జేబులకి, ఆరోగ్యానికి తూట్లు పడి ఉంటే నన్ను అడగొద్దు. పిల్లలకు ఆ ప్రమాదకర చైనా ప్లాస్టిక్ బొమ్మలు ఇవ్వకుండా కనీసం ఒక కొండపల్లి కొయ్య బొమ్మ, ఒక ఏటికొప్పాక బొమ్మ కొనివ్వండి. ఒక్కటి....ప్లీజ్...ఒక్కటే..... 

“అవన్నీ వాళ్ళకు నచ్చవండి బాబూ!!! వాళ్ళకి అన్ని కార్టూన్ హీరోలు, బైకులు, కార్లు....కావాలి.” అదిగో అపుడే మొదలు పెట్టారా ?? ఒక్కటి చెప్పనా ... 

మీ పిల్లకి మీకంటే పెద్ద హీరో ఎవరూ లేరు.... మీరు చెప్తే వాళ్ళు వింటారు...  

మీకు కాస్త ఓపిక ఉండాలి అంతే.... పండుగకో పబ్బానికో ఒక నేత చీర, ఒక ఖాదీ చొక్కా .......కొనలేమా ?? 

ఏం సార్ ?? 
ఏం మేడం గారూ ???

 సంవత్సరానికి ఒక్కటి.....??? ఆలోచించండి. 

చేనేత పరిశ్రమ ఎంత పెద్దది ఒకప్పుడు??

 ఒకప్పుడు విదేశీయులు మన దేశంపై ఆకర్షితులు అవ్వడానికి ప్రధాన కారణం చేనేత కూడా..

మన కళని నాశనం చేసి వాళ్ళ మిల్లుల వైపు మనల్ని తిప్పుకున్నారు. 

ఒక్కసారి ఆ చీరని చూడండి!! 

ఎంత గొప్ప కళ అది!!! 

చేనేత కార్మికుల కష్టాలు చుస్తే కన్నీరు ఆగదు ఎవరికైనా... 

క్షమించాలి కార్మికులు అనడం కంటే కళాకారులు అనటం సబబు. 

అలాంటి కళకు ఓ చిన్ని సాయం చేయలేమా ?? 

ఇవన్నీ చెప్పేది కళలు, భారతీయ విజ్ఞానం అంతరించిపోతాయని కాదు.

అంత గొప్ప వాటిని అంతరించిపోనివ్వరు కార్పొరేటు వారు. 

కాకపోతే రంగు, రూపు, పేరు మార్చి పది రెట్ల ఖరీదుకి మనకే అమ్ముతారు.

 మన ఊరిలో కొందరు పెద్దమనుషులు యోగా ను బోధిస్తూ ఉంటారు ఉచితంగా.. 

భారతీయతలో ఉన్న అందమే అది. 

“ఉచితం” ఏదైనా విద్యలో లాభాపేక్ష ఉండదు.

 అది యోగా అయినా ఆయుర్వేదమైనా ఏదైనా ఉచితంగా/కనీస రుసుము తో అందించే వారు ఉన్నారు ఇంకా. 

కానీ నగరాల్లో చూస్తే పవర్ యోగా, జుంబా యోగా అని ఏవేవో పేర్లతో వేలకి వేలు ఫీజులు. 

పేరు మారితే అంతే సంగతి ఇక. 

ఇవన్నీ మేం చేయగలమా ??? అనుకుంటే సాధ్యమే అన్నీ... అటువైపు ఓ చిన్న దృష్టి ఉండాలి అంతే.

 ఏంటి సోది ఇదంతా అనుకుంటున్నారా ??? 

అంతేలే ఉదయం లేస్తూనే కెమికల్ ముద్దను ప్లాస్టిక్ పీచుపై పెట్టుకొని పరపరా పళ్ళకి రుద్ది కెమికల్స్, అరిగిన ఆ ప్లాస్టిక్ రేణువుల్ని మింగే వాళ్ళం మనం మనకి ఈ వేప పుల్ల వేదాంతం కాస్త చేదుగానే ఉంటుంది లెండి.

 సరే ఉంటా .... ఏవైనా కొన్ని నచ్చితే పాటించండి.
మరో నలుగురికి చెప్పండి.

 ఇంకేం చెయ్యొచ్చో మీ ఆలోచనలు కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి. 

ఈ వ్యాసాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరవేయండి. 

విప్లవాలు సాధించలేకపోయినా ఓ చిన్ని మార్పుని తీసుకొచ్చే సత్తా మనందరికీ ఉంది.


ఇలాంటి విషయాలను తెలుసుకోడానికి వీక్షిస్తూనే ఉండండీ మన www.ramkarri.org ని ధన్యవాదములు.