అనగనగా ఒక ఊరు...  
             
ఆ ఊరులో ఒక గ్రామదేవత...

ఇందులో కొత్తేముంది... 

వింత అంతకన్నా ఏముంది...

రాష్ట్రంలో చాలా ఊళ్ళున్నాయి...

ప్రతీ ఊరుకీ ఓ గ్రామదేవత ఉంటుంది...

అనుకుంటున్నారు కదా ! 

ఆ ఊరుకీ ఏ ప్రత్యేకత లేదు... 

ఆ గ్రామదేవత కూడా అన్ని దేవతల లాంటిదే...

మరి ఇంకేంటి అనుకుంటున్నారా ? 

అదిగో అక్కడికే వచ్చేస్తున్నాం...

ఆ గ్రామదేవత జాతర జరిగే స్టయిలే వేరు... 

మూడు రోజులు పాటు జరిగే ఆ జాతరలో అన్నీ ప్రత్యేకతలే !

జాతరల యందు ఆ దేవత జాతర వేరయా అనుకోకమానరు చూసినవారు ఎవరయినా...

ఇంతకీ ఆ జాతర స్పెషాలిటీ ఏందయా అంటే --->



 మొదటి రోజు సాయంత్రం కత్త్రి కుండ దింపడంతో జాతర ఆరంభమవుతుంది.

జాతర మొత్తంలో ఈ కత్త్రి కుండదే ప్రధాన పాత్ర. 
ఈ కత్త్రి కుండలో కానుకలు వేసి మొక్కుకుని ఒకసారి కత్త్రి కుండ నెత్తిన పెట్టుకుంటే కోరిన కోరికలు తప్పక నెరవేరతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం...

ముఖ్యంగా సంతాన భాగ్యం లేనివారు మొక్కుకుంటే తరువాత జాతరకు పండంటి బిడ్డతో వస్తారని చెబుతారు. 
అదే రోజు మొక్కుబడులు కలవారు అమ్మవారికి గొర్రె పిల్లను సమర్పించుకుంటారు. అయితే వాటిని అక్కడ బలి ఇవ్వడం నిషిద్దం. ఆ రోజు వచ్చిన గొర్రెలను జాతర అనంతరం వేలం పాటలో విక్రయించేస్తారు.

ఇక జాతరలో రెండవ రోజు విశేషాల విషయానికొస్తే........

నాగదేవతను ఈ గ్రామ దేవతకు ప్రతిరూపంగా కొలుస్తారు  గ్రామస్తులు. ఉదయాన్నే గ్రామదేవతకు ప్రతి రూపంగా కొలిచే నాగదేవతకు గ్రామం గ్రామం అంతా పూజలు చేస్తారు.
నాగుల చవితికి పుట్ట దగ్గరకు వెళ్ళని వారు చాలామంది ఉంటారేమో కానీ ఆ రోజు పుట్టలో పాలు పోయని వారు ఎవరూ ఉండరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రోజు ఉదయం గ్రామం మొత్తం, పొరుగు గ్రామాలలోని ఆ గ్రామస్తుల ఆడపడచులు, బంధువులు మొత్తం పుట్ట దగ్గర ఉంటారంటే అతిశయోక్తి కాదు. 

ఈ తంతు పూర్తయిన తరువాత ఓ గమ్మత్తు మొదలవుతుంది. 

అదేంటంటే...
పుట్ట దగ్గర తతంగం పూర్తి చేసుకుని గ్రామస్తులు, పూజారి వగైరాలు ఆలయం దగ్గరకు చేరుకునే సరికే విచిత్ర వేషాలు దరించిన అనేకమంది భక్తులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షం అయిపోతారు. 
ఆ వేషాలు ధరించిన భక్తులు పూజారిని ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటారు.
ఎన్ని సార్లు ప్రయత్నించినా వారు అడ్డు తొలగకపోవడం, తమ వెకిలి చేష్టలతో పూజారిని ఆటపట్టిస్తుండడంతో చిర్రెత్తుకొచ్చిన ఆ పూజారి బడితపూజ మొదలుపెడతాడు.

తన చేతిలో ఉన్న పేక బెత్తంతో దొరికిన వాడిని దొరికినట్టు దరువేసేస్తాడు.
 వేషదారులు కూడా పూజారి చేత ఆ బెత్తం దెబ్బలు తినడానికి పోటీలు పడతారు.
 ఒకసారి ఆ బెత్తం దెబ్బ తింటే చేసిన పాపాలు పోతాయని, రాబోయే పెద్ద దెబ్బలు ఈ చిన్న దెబ్బలతో పరిహారమవుతాయని ఆ గ్రామస్తుల నమ్మకం.

ఇక జాతరలో జనమంతా ఎదురు చూసేది ఆ రోజు కోసమే ! 

అది జాతరలో ప్రధానమైనది, చివరి రోజు. 

ఆ రోజు గ్రామం అంతా ఒకటే సందడి.



ఆ రోజు గ్రామం గ్రామం అంతా ఎక్కడ చూసినా బిచ్చగాళ్ళే...

అంతో ఇంతో సమర్పించుకోనిదే ఎవరినీ అడుగు కూడా ముందుకు వేయనీయరు. అదేదో పోకిరీ సినిమాలోలా అంతా డిమాండే ! 

అయితే ఆ బిచ్చగాళ్ళు అందరూ కూడా ఈ గ్రామానికి చెందినవారు కావడమే విశేషం.

అదేమిటి ? అని ఆశ్చర్యపోతున్నారా ! అదే ఈ జాతరలో అసలు సిసలు ట్విస్ట్...

ఎక్కడైనా మొక్కుబడులు తీర్చుకోవాలంటే అమ్మవారికి లేదా అయ్యవారికి తృణమో- పణమో సమర్పించుకోవడం, తలనీలాలు ఇచ్చుకోవడం, జంతుబలులు ఇలా ఉంటాయి. కానీ ఈవిడ గారి రూటే సెపరేటు కదా...

ఇక్కడ మొక్కుబడి తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక విచిత్ర వేషం వేషం వేయాల్సిందే ! 

జోలె పట్టి బిచ్చమెత్తాల్సిందే... 

ఆ విధంగా సేకరించిన సొమ్ము, బియ్యంను అమ్మవారికి సమర్పిస్తేనే వారు మొక్కుబడి చెల్లించుకున్నట్టు. 

అందుకే చిన్నా, పెద్దా - పేద, గొప్ప తారతమ్యం లేకుండా అందరూ అడుక్కోవడానికి రెడీ అయిపోతారు. 

కోట్లు కూడబెట్టిన కోటీశ్వరుడయినా, లక్షలు సంపాదించే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయినా, ప్రభుత్వోద్యోగి అయినా చివరకు విదేశాలలో స్ధిరపడిన NRIలు అయినా అమ్మ దయ కోసం అడుక్కుంటారు.

ఓ చిన్న గ్రామంలో 500 మందికి పైగానే జనం బిచ్చగాళ్ళుగా మారిపోతారంటే ఆ తల్లి రేంజ్ ఏవిటో అర్ధం చేసుకోవచ్చు.

 ఇక అలా బిచ్చగాళ్ళ అవతారంలో భక్తులు పోగుచేసి అమ్మవారికి సమర్పించిన బియ్యం,సొమ్ములతో జాతర చూడడానికి వచ్జిన భక్తులందరికీ వండి వడ్డిస్తారు. సుమారు పది వేలమందికి పైగా జరిపే ఈ అన్న సంతర్పణతో మూడు రోజుల జాతర ముగుస్తుంది. 

ఓ సారి జాతర చూసిన వారు ఆ జ్నాపకాలను మది నిండా నింపుకుని తిరిగి రెండు సంవత్సరాల తరువాత వచ్చే జాతర కోసం ఎదురు చూపులు చూస్తుంటారు.

జాతర గురించి చాలా చాలా చెప్పుకున్నాం...

ఇంతకీ ఆ గ్రామ దేవత ఎవరు ? అది ఏ గ్రామం అన్నది చెప్పనే లేదు కదూ...

అది తూ ర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం లోని కొప్పవరం గ్రామదేవత సత్తెమ్మ తల్లి జాతర.

సత్తెమ్మతల్లి చరిత్రను ఒకసారి పరికిస్తే...

పూర్వీకుల కదనం ప్రకారం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోని ఈతకోటలో నివసించే కర్రి వంశీయులయిన ఐదుగురు సోదరులు ఆ గ్రామంలో భుక్తి కరవయి పొట్టచేతపట్టుకుని వలసబాట పట్టారట.

ఎటువెళ్ళాలో తెలియని వారికి గోదావరి సమీపంలో ఓ బాలిక కనిపించి తనతో వస్తే మీకు ఏ లోటు ఉండని ప్రాంతానికి తీసుకు వెలతానని చెప్పి, వారిని తన వెంటబెట్టుకుని కొప్పవరం తీసుకువచ్చి అంతర్దానం అయిపోయిందట ఆ బాలిక. 

అప్పటి నుండి వారికి ఆ గ్రామంలో ఏ లోటు లేకపోవడమేకాక, పొట్టచేతపట్డుకొచ్చిన వారే గ్రామంలోని మరికొందరి పొట్టనింపే స్థితికి చేరుకున్నారట. 

తమను ఇక్కడికి తీసుకువచ్చింది మామూలు బాలిక కాదని, తమను ఇక్కడికి , ఈ స్థితికి తీసుకువచ్చింది ఓ దేవతేనని నమ్మి సత్తెమ్మతల్లిగా కొలవడం ఆరంభించారట ఆ అన్నదమ్ములు.

కాలక్రమేణా సత్తెమ్మతల్లి మహిమలు ఆ నోటా ఈ నోటా విన్న గ్రామస్థులు, పొరుగు గ్రామాల ప్రజలు ఆమెను పూజించడంతో కేమలం కర్రి వంశీయులకే కాక ఆమె అందరికీ ఆరాధ్య దేవతగా మారిపోయింది.

ఇక సత్తెమ్మతల్లి మహిమల విషయానికి వస్తే..............      

1. కరవు కాటకాలతో అల్లాడే ఆ రోజులలో పొలంలో పంట పండించడం ఒక ఎత్తయితే పండిన పంట దొంగల పాలు కాకుండ కాపాడుకోవడం మరొక ఎత్తుగా ఉండేదట.

కోత కోసినప్పటి నుండి ధాన్యం ఇంటికి వచ్చే వరకు పొలంలోనే కాపలా పడుకునేవారట. 

అయితే కొప్పవరం గ్రామస్తులకు, మరీ ముఖ్యంగా కర్రి వంశీయులకు ఆ బాధ ఎప్పుడూ లేదట.  

సత్తెమ్మ తల్లి పాము రూపంలో సంచరిస్తూ వారి దాన్యం, ఇతర విలువైన సామగ్రి దొంగల పాలు కాకుండ కాపాడేదట.

ఒకవేళ ఎవరైనా పొరపాటున దొంగిలించినా యజమాని వచ్చేవరకు దొంగలు ఆ ప్రాంతం నుండి కదలలేకపోయేవారట.

2.సత్తెమ్మతల్లికి గాజులు అంటే మహా ఇష్టమట.

గ్రామంలోనికి గాజులు వ్యాపారి ఎవరు వచ్చినా బాలిక రూపంలోవచ్చి గాజులు వేయించుకుని, డబ్బులు పలాన వారు ఇస్తారని ఆ అయిదుగురు సోదరులలో ఎవరొకరి పేరు చెప్పి మాయమయ్యేదట. 

వారు ఆ సొమ్ము ఇచ్చి పంపేవారట. 

ఒకరోజు ఓ గాజుల వ్యాపారి గాజులు వేయకుండానే వేసానని చెప్పి డబ్బులు తీసుకున్నాడట. 

డబ్బులు తీసుకోగానే అతని దగ్గరున్న గాజులు మొత్తం పేలిపోయాయట. 

తప్పు చేసానని మన్నించమని ప్రాధేయపడితే సత్తెమ్మ తల్లి బాలిక రూపంలో వచ్చి ఆ గాజులను అతికించి ఇచ్చిందట.

ఇలా ఒకటా రెండా ఆ తల్లి మహత్యాలను ఇప్పటికీ గ్రామంలో కధలు కధలుగా చెప్పుకుంటుంటారు.

3. కత్త్రి కుండను దింపడంతో ప్రారంభమయ్యే ఉత్సవాలు తిరిగి కత్త్రి కుండను భూమిలో పూడ్చి పెట్టడంతో ముగుస్తాయి. 

ప్రతి జాతర అయిపోయిన వెంటనే ఆలయంలో గల వేపచెట్టు మొదలులో ఆ కుండను పూడ్చి పెడతారు.

ఇప్పటి వరకు వందకు పైగా కాల్చిన కుండలను అదే ప్రదేశంలో పూడ్చినా తరువాత జాతర కుండను పూడ్చడానికి మరల గొయ్యి తీసినపుడు ఎప్పుడూ చిన్న పెంకు ముక్క కూడా కనపడదట. 

ఇక జాతరే కాదు...

సత్తెమ్మతల్లికి ఇంకెన్నో స్పెషాలిటీలున్నాయి.

సత్తెమ్మ తల్లి గుడికి జాతర మూడు రోజులు తప్ప మిగిలిన రోజులలో పూజారి అనేవారు ఉండరు.

కర్రి వంశీయులే వంతుల వారీగా పూజా కార్యక్రమాలు , నైవేద్యం చెల్లింపు చేస్తుంటారు.

సుమారు 200 ఏళ్ళ క్రితం అయిదుగురు అన్నదమ్ములు ఒక్కొక్కరూ రెండు సంవత్సరాలు వంతున అమ్మవారి పూజాదికాలు నిర్వహించేవారట.

కాలక్రమేణా జనాభా విపరీతంగా పెరగడంతో రెండు సంవత్సరాల వాటా కాస్తా కొంతమందికి అయిదు, పది రోజులకు చేరిపోయింది.

కర్రి వంశీయులలో అన్నదమ్ములు విడిపోయి ఆస్తులు పంపకాలు చేసుకునేటపుడు కుటుంబ ఆస్తులతో పాటు సత్తెమ్మతల్లి గుడిలో వంతును కూడా పంచుకుని ఆ తల్లి సేవకు పోటీ పడతారు.

18 తరాలుగా ఆ వంశ వృక్షం నేటికీ ఆలయంలో పదిలంగా ఉంది. 

అయిదుగురుగా మొదలైన వారు వేలాదిగా మారటాన్ని ఆ వంశ వృక్షం ద్వారా మనం గమనించవచ్చు.

అన్ని తరాలకు సంబందించి మన పూర్వీకుల పేర్లు వీరికి తప్ప మరెవరికీ మరెవరికీ లభ్యంగా లేవేమో !

చెప్పుకుంటూపోతే చాలా చాలానే ఉన్నాయి....

అన్నీ చూసి ఇటువంటి జాతరను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆత్రం మీకూ కలుగుతుంది కదూ!

కొంచెం ఓపిక పట్టండి.

కేవలం ఇంకో రెండు రోజుల్లోనే సత్తెమ్మ తల్లి జాతర వచ్చేస్తుంది.

25 జనవరి 2020 సాయంత్రం 5 గంటలకు మొదలయి 27 జనవరి 2020మధ్యాహ్నం 2 గంటలు వరకు జరిగే ఈ జాతరను మీరూ తలకించి సత్తెమ్మతల్లి కృపకు పాత్రులు కండి.



- స్వస్తీ...