ఆచూకీ తెలిపిన వారికి బహుమతి 



చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ అందంగా ఉండే మా తెలుగుని గుర్తుతెలిసిన ఆంగ్లంతకులు ఎత్తుకుపోయారు

పేరు :             తెలుగు

రంగు:             హంసలా స్వఛ్ఛమైన తెలుపు

ఎత్తు:             హిమాలయాలంత

వయస్సు:       నిక్కచ్చిగా తెలియదు కానీ సుమారు గా ఓ
                      ఐదువేల సంవత్సరాలు

జన్మస్థలం:      ఆంధ్ర అమ్మ కడుపులో

మాతృభాష:   పొరపాటున తెలుగొక్కటే

చిరునామా:   నన్నయ, తిక్కన, పోతన,వేమన,మొల్ల,శ్రీశ్రీ   
                     తదితరుల గుండెల్లో

దుస్తులు:       చక్కటి నెమలిపింఛం లాంటి ఓణీ మరియు
                     ఇంద్రధనుస్సు లాంటి చీర తళతళ మెరిసే     
                     పట్టుపంచి

అమ్మా నువ్వు తప్పిపోయిన నాటినుండి మన కవుల కలాలు శకలాలైపోయాయి,
ఎంకి పాటలకు పెంకి గాటులు పడ్డాయి,
రచనలు రొచ్చున పడ్డాయి,
సాహిత్యం  పైత్యం పాలైంది.
నువ్వు ఎక్కడున్నా తొందరగా మళ్ళీ మా ఇళ్ళలోకి,
మా మస్తకాలలోకీ,
 మా పుస్తకాలలోకి వస్తావని ఎంతో ఆశతో బాధతో ఆతృతతో వేయి స్థంబాలగుడిలో వేయికళ్ళతో ఎదురు చూస్తున్నాము...

మా ఈ బాధని అర్థం చేసుకుని అతి తొందరగా వస్తావని ఆశిస్తూ నువ్వు మన ఇంటికి వచ్చేస్తే నిన్ను మమ్మీ డాడీ అనమనీ హలో  బాయ్ అనమని మాట ఇస్తున్నాం

ఆచూకీ తెలిసినవారు సంప్రదించవలసిన విలాసం..

ఒకటవ వీధి, తెలుగు తల్లి ఇల్లు
ఆంధ్ర రాష్ట్రం
భారతదేశం



- స్వస్తీ