ప్రపంచ ప్రఖ్యాత పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గురించి నాలుగు ముక్కలు.. మననం చేసుకుందాం..

కరువు నేలలో పుట్టిన తేజోమూర్తి  భగవాన్ శ్రీ సత్యసాయి బాబా.

గుక్కెడు తాగునీటికి కటకటలాడుతున్న పల్లె సీమల దాహార్తి తీర్చిన కరుణామయుడు.

 ఆధ్యాత్మిక బోధనలే కాకుండా ప్రజా సంక్షేమం కోసం పరితపించిన పురుషోత్తముడు.

 జిల్లాలో సరైన వైద్య సౌకర్యాలు లేక.... ఉన్నా ... చూపించుకునే ఆర్థిక స్తోమత లేక మృత్యుకౌగిలికి చేరుతున్న బడుగుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రిని నిర్మించిన సేవా తత్పరుడు.

 ఈ ఆస్పత్రి సేవలను జిల్లా ప్రజలే కాకుండా రాష్ట్ర, దేశ ప్రజలు కూడా వినియోగించుకుంటున్నారంటే

 ఇక్కడి వైద్యం ఎంత ‘సూపర్‌ ’ గా ఉందో, వైద్య సేవలు ఎంతగా జన సామాన్యంలోకి వెళ్లాయో అర్థం చేసుకోవచ్చు.

నిరు పేదల దేవాలయం సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి..

జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటిన సేవలు..

పరీక్షలు, వైద్యం అన్నీ ఉచితం...

ప్రాణాలు నిలుపుతున్న పుట్టపర్తి సత్యసాయి వైద్యసేవలు...



  సత్యసాయిబాబా మానవాళికి విశిష్ట సేవలందించిన మహోన్నత వ్యక్తిగా అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

 సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస మార్గాలను తన దివ్య ప్రబోధనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు.

తన మాతృమూర్తి ఈశ్వరాంబ కోరిక మేరకు నిరుపేదలకు వైద్యం అందించాలని బాబా సంకల్పించారు.

ఆ దిశలో 1956 లో పుట్టపర్తిలో సత్యసాయి జనరల్‌ ఆస్పత్రి నెలకొల్పారు.

తదనంతరం పెద్ద ఎత్తున రోగులు ఆస్పత్రికి వచ్చేస్తుండడంతో వారికి మరిన్ని సేవలు అందించే దిశలో దక్షిణాసియాలోనే అతిపెద్ద సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని పుట్టపర్తి లో నిర్మించి సేవా మూర్తిగా పేరొందారు.

 ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన సేవా కార్యక్రమాలకు సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి తలమానికం.

బాబా నెలకొల్పిన ఈ ఆస్పత్రి లక్షలాదిమంది నిరుపేదలకు వైద్య సేవలందిస్తోంది.

వైద్యం పేరుతో కోట్లరూపాయలను దండుకుంటున్న తరుణంలో నయాపైసా ఖర్చు లేకుండా వైద్యసేవలు ఇక్కడ అందుతున్నాయి.

పుట్టపర్తిలో 1991, నవంబర్‌ 22న శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆస్పత్రిని బాబా స్థాపించారు.

 సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి అప్పటి ప్రధాని పీవీ.నరసింహరావు పుట్టపర్తికి విచ్చేశారు.

 సత్య సాయిబాబా వారు చేపడుతున్న సేవా కార్యక్రమాలు అమోఘమని కొనియాడారు.

బాబా నిర్మించిన ఈ ఆస్పత్రిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య సేవలు ఉచితంగా నిరుపేదలకు అందిస్తున్నారు.


ఆహ్లాదకరమైన వాతావరణం... :

సత్యసాయి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిని 110 ఎకరాల్లో రూ.300 కోట్లతో 9 నెలల్లో నిర్మిచారు.

 దేవాలయాన్ని తలపించే ఆకృతిలో ఈ ఆస్పత్రిని నెలకొల్పడం విశేషం.

 ఈ ప్రాంతానికి విచ్చేసిన సత్యసాయి భక్తులు, పర్యాటకులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది.

సువిశాలమైన ప్రదేశం, అందమైన పచ్చికబయళ్లు, కృత్రిమ జలపాతాలు విశేషంగా ఆకట్టుకుంటాయి.

పర్యాటకులు ఆస్పత్రిని సందర్శించడానికి మధ్యాహ్నం వేళల్లో లోపలికి అనుమతిస్తారు.


ఉచిత వైద్య సేవలు :

సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో అందిస్తున్న వైద్యసేవలు పూర్తిగా ఉచితం.

రిజిసే్ట్రషన్‌కు కానీ, పరీక్షలు, వైద్యసేవలకు కానీ నయాపైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.

ఆస్పత్రిలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మైకుల ద్వారా వైద్యసేవలు పూర్తిగా ఉచితం, ఎవరూ డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రకటిస్తుంటారు.

సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన రోగులకు భాషతో ఇబ్బంది పడకుండా

ఇంగ్లీష్,

హిందీ,

తెలుగు,

తమిళం,

 మలయాళం

భాషలు తెలిసిన వారిని ఏర్పాటు చేశారు.


రోగులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారి మాటలను అవసరమైన భాషల్లోకి తర్జుమా చేస్తారు.


ఆస్పత్రికి చేరుకోవడమెలా?  :

సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్‌కు 3 కిలోమీటర్ల దూరంలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఉంటుంది.

ఆటో, బస్సుల ద్వారా సులభంగా ఆస్పత్రికి చేరుకోవచ్చు.

 అనంతపురం నుంచి 80 కిలోమీటర్లు,

కదిరి నుంచి 55 కిలోమీటర్లు,

 హిందూపురం నుంచి 60 కిలోమీటర్లు,

గోరంట్ల నుంచి 26,

ముదిగుబ్బ నుంచి 42,

పెనుకొండ నుంచి 26 కిలోమీటర్ల దూరంలో

ఈ ఆస్పత్రి ఉంది.

బస్సు, రైలు ద్వారా ఇక్కడి ఆస్పత్రికి చేరుకోవచ్చు.


వైద్యసేవలివే... :

 కార్డియాలజీ

 కార్డియోథరోకిక్‌ వాసిక్కులర్‌ సర్జరీ

 యురాలజీ

 ఆప్తమాలజీ

 ప్లాస్టిక్‌ సర్జరీ

 ఆర్థోపెడిక్‌

 గ్యాస్ట్రో ఎంట్రాలజీ


తీసుకురావాల్సిన గుర్తింపు కార్డులు :

 ఆధార్‌కార్డు,

 రేషన్‌కార్డు,

 పాస్‌పోర్ట్‌,

 డ్రైవింగ్‌ లైసెన్స్‌,

 ఓటరుఐడీ.

 పాటించాల్సిన నియమాలు :

ఆస్పత్రిలో నిశ్శబ్దం పాటించాలి.

 సెల్‌ఫోన్లు వాడరాదు.

చెప్పులు బయటవదలాలి.

ఆస్పత్రి సమాచారం కావాలంటే సేవాదళ్‌ సభ్యులు, వాలంటీర్లను సంప్రదించాలి.

 తూర్పువైపున గల గేటులోనే ప్రవేశించాలి.

తెల్లవారుజామున 5 గంటలకు క్యూలో టోకెన్లు పొందాలి.


ఆస్పత్రిని సందర్శించిన వారు :

మాజీ ప్రధానులు అటల్‌బిహారీ వాజపేయి,

మన్మోహన్‌సింగ్‌,

 దేవేగౌడ,

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం ,

ముఖ్యమంత్రి హోదాలో మోదీ

ఆర్థికశాఖ మాజీ మంత్రి యశ్వంత్‌సింగ్‌,

 ప్రముఖ క్రికెటర్‌ సచిన్,

సునీల్‌ గావాస్కర్‌ ,

పారిశ్రామికవేత్త రతన్‌టాటా తదితరులు.


రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి :

సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యసేవలు పొందాలనుకునే వారు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

సూపర్‌ష్పెషాలిటీ ఆస్పత్రికి చేరుకోగానే తూర్పువైపున గల ద్వారం నుంచి ప్రవేశించాలి.

అక్కడ ఆయా విభాగాల కింద వైద్యసేవల కోసం ఏర్పాటు చేసిన క్యూలలో ప్రవేశించాలి.

అక్కడికి విచ్చేసిన రోగులకు సత్యసాయి సేవాదళ్ స్ర్కీనింగ్‌,  రిజిస్ట్రేషన్  పేరిట ప్రాథమికంగా టోకన్లను పంపిణీ చేస్తారు.

 అనంతరం నిర్ణీత  రిజిస్ట్రేషన్ విభాగంలో తమ వివరాలను రోగి అందజేయాల్సి ఉంటుంది.

 రిజిస్ట్రేషన్ సమయంలో పేర్కొన్న డాక్యుమెంట్లు ఇచ్చిన తరువాత వారి ఫొటోతో కూడిన పర్మినెంట్‌ రిజిస్ట్రేషన్‌ కార్డును ఆస్పత్రి సిబ్బంది మంజూరు చేస్తారు.


ఆన్‌లైన్‌ సంప్రదింపుల కోసం :


ఫోన్‌నెంబర్‌: 08555 287388

ట్రీట్‌మెంట్‌ ఎక్వైరీ కోసం - 08555 287388

ఎక్సెటెన్షన్‌ నెంబర్‌  : 1824

జనరల్‌ ఎక్వైరీ 08555 287388

 ఎక్సెటెన్షన్‌ 1709

ఉత్తర ప్రత్యుత్తరాలు :

శ్రీసత్యసాయి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.

ప్రశాంతి గ్రామం,
పుట్టపర్తి మండలం,
అనంతపురం జిల్లా ,
పిన్ కోడ్ : 515134 .



- స్వస్తీ...