జనులందరికీ హృదయ పూర్వక నమస్కారములు. 

ఈ ఆత్మజ్ఞానం తెలుసుకునే జనులందరి మనస్సుకు ఏకాగ్రత కుదిరి వారి వారి మనస్సులోకి ఈ ఆత్మజ్ఞానం ప్రవేశించేలా అనుగ్రహించమని ఆ విధాతను ప్రార్ధిస్తూ..!

 అందరికీ శుభం కలుగుగాక..! 




మన యొక్క గడచిన అనేక జన్మల పుణ్యం నేటికి ఫలించటం చేతనే ఈ ఆత్మజ్ఞానం పొందాలనే బుద్ధి మనలో కలిగి మనమందరం శాశ్వతమయిన మోక్షాన్ని పొందే మార్గంలోకి నేడు ప్రవేశించాం. 

ఇదెంతో శుభసూచకం. 

ఆత్మజ్ఞానం అంటే ఆత్మను తెలుసుకునే జ్ఞానం అని అర్ధం. 

ఇక ఆత్మ అంటే అది మనమే. 

మనల్ని మనం తెలుసుకునే జ్ఞానమే ఆత్మజ్ఞానం. 

మానవులు తామెవరో తెలుసుకునే ప్రయత్నం ఏమాత్రం చెయ్యకుండా రకరకాల శరీరాలతో ఎప్పటికప్పుడు “ఈ శరీరమే నేను” అనుకుంటూ లోకాల చుట్టూ అనేక జన్మల పాటు తిరుగాడుచున్నారు. 

అలా శరీరాలతో తిరిగి తిరిగి అలసిపోయిన మానవుడు ఒకనాటికి విశ్రాంతి కొరకు ఆరాటపడుతున్నాడు. 

తన మనస్సుతో తనను తనే ఇలా ప్రశ్నించుకుంటున్నాడు. 

అసలు నేనెవరు? 
ఎక్కడనుంచి ఇక్కడికి వచ్చాను.  
ఇక్కడ పుట్టడానికి ముందు నేనెక్కడ ఉన్నాను.  
ఇక్కడ మరణించాక నేనేమి కాబోతున్నాను.  
ఈ మాయ అంతా ఏంటి?  
ఈ పుట్టడం, చావడం అనేదంతా ఏంటి?  
అసలిక్కడ ఎప్పటికీ ఉండేదేంటి?  
ఎప్పటికీ ఉండనిదేంటి?  
ఈ జీవించడం అనేది అసలు దేని కొరకు?  
తినడం కొరకా?  
తాగడం కొరకా? 
లేక  
తిరగడం కొరకా?  
అలా కాక నిద్ర కొరకా?  
మరయితే ఇవన్నీ ఎందుకొరకు?  
అసలు నేను ఈ లోకంలో జన్మించడానికి కారణం ఎవరు?  
నేను జన్మించడానికి నేనే కారణమా?  
లేక నాకు మరెవరయినా జన్మనిచ్చారా?  
నా యొక్క జన్మకు వేరెవరయినా కారణం అనుకుంటే నా బుద్ది వారి బుద్ది ఒకేలా ఎందుకు ఉండటం లేదు ?  
అలాగే ఒకరి జన్మకు మరొకరు కారణం అయితే కారణం అయినవారు మరణించినప్పుడు వారినుంచి జన్మించినవారు ఎందుకు మరణించట్లేదు? 

దీనివల్ల తేలేదేమంటే లోకంలోని ఏ ఒక్కరూ మరొకరికి చెందినవారు కానే కాదని! 

లోకం అనే బ్రమలో జన్మించాల్సివున్న ప్రాణులు తల్లిదండ్రులు అనే స్త్రీ పురుషుల ద్వారా ఈ లోకంలోకి రావడం జరుగుతోంది గాని ఇక్కడ ఎవ్వరి జన్మకూ ఎవ్వరూ కారణం కాదని అర్ధం అవుతోంది. 

ఒకవేళ ప్రాణుల జన్మలకు వారి వారి తల్లిదండ్రులే కారణం అని అనుకుంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు అనబడే వారి జన్మకు కారణం ఎవరు? 

వారియొక్క తల్లిదండ్రులు వారి జన్మకు కారణం అని అనుకోవాలి. 

ఇలా ప్రాణుల జన్మలకు కారణాలను అన్వేషిస్తూ వెనక్కు వెళితే ఒకానొక దశకు సృష్టిలోని మొట్టమొదటి జన్మ వద్దకు వెళ్లి అక్కడ ఆగిపోవలసిందే గదా! 

అప్పుడు సృష్టిలోని ఆ మొట్టమొదటి జన్మకు కారణం ఎవరు అనేదానికి సమాధానం ఏంటి? 

“భగవంతుడు” అనేది సమాధానం అనుకుంటే ఆకారం లేని భగవంతునికి ఆకారాలు కలిగిన శరీరాలకు అసలు సంబంధం ఎలా కుదురుతుంది? 

ఆకారం లేని భగవంతుడు ఆకారాలు కలిగిన శరీరాలను ఎందుకు సృష్టిస్తాడు? 

అసలు నిరాకారం నుంచి ఆకారాలు ఎలా రాగలవు? 

ఇది అసంభవం అనుకోక తప్పదు. 

అలా కాకుండా భగవంతునికి కూడా ఆకారం ఉండి ఉండవచ్చు అని అనుకుంటే ఈ కదిలే ఆకారాలన్నీ పంచ భూతాలయిన ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి నుంచి తయారవుతున్నాయి.

భగవంతునికి ఆకారం ఉంది అనుకుంటే అప్పుడు భగవంతుని యొక్క ఆ ఆకారానికి కూడా పంచభూతాలే కారణం అని అనుకోవాలి. 

అప్పుడు పంచభూతాలకు కారణం ఎవరు అనేదానికి సమాదానం ఏంటి? 

పంచభూతాలకు భగవంతుడు కారణం అని అనుకుంటే భగవంతునిచే సృష్టింపబడిన పంచభూతాలు తిరిగి భగవంతుణ్ణి తయారుచెయ్యడం అనేది హాస్యం కాక ఇంకేంటి?

 భగవంతుడు సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయినప్పుడు ఆయనను తయారు చేసేదొకటి ఆయనకంటే ముందే ఎక్కడ ఏర్పడి ఉండగలదు? 

కాబట్టి ఇదంతా కూడా పసలేని వాదనే అనుకోక తప్పదు. 

ఇలా సృష్టిలోని ప్రతిదానికీ మరొకటేదో కారణం అనుకుంటూ వెళితే ఆ ప్రతి కారణానికీ కూడా మళ్ళీ ఇంకొక కారణం ఉండి ఉండాల్సిందే గదా! 

ఎందుకంటే కారణం లేకుండా కార్యం ఉండదు. 

ప్రతి కార్యానికీ కారణం ఉండాల్సిందే గదా! 

మరి దీనికి అంతెక్కడ? 

అలాగే ఇక్కడ ఇంకో సమస్య కూడా దాగి ఉంది. 

ప్రాణి జన్మకు కేవలం తల్లిదండ్రులు కారణం అనుకుంటే ఆ జన్మించినవారికి అదే మొదటి జన్మ అవుతుంది. 

అంటే పుట్టిన వారికి క్రితం జన్మ అనేది లేదనుకోవాలి. 

అలాంటప్పుడు మరణం తర్వాత మరొక జన్మ కూడా ఉండదనే భావించాల్సి ఉంటుంది. 

ఎందుకంటే ప్రాణి యొక్క జన్మకు అతడి గత జన్మలలోని పాపపుణ్యాలు, సంస్కారాలు కారణం కాకుండా జన్మలనేవి కేవలం ఒకరు ప్రసాదించేవి అయితే అవి ఆ ఒక్క జన్మతోనే మరణంతో అక్కడే ఆగిపోవలసిందే గదా ! 

తర్వాతి జన్మలకు కొనసాగడం అనేది ఇక ఎక్కడ ఉంటుంది. 

వెనుకటి జన్మ అనేది లేనప్పుడు తర్వాతి జన్మ అనేది మాత్రం ఇక ఎక్కడ ఉంటుంది? 

మరి అలాంటప్పుడు ఈ లోకంలో పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం, సత్యం పలకడం లాంటి నియమాలతో పనేముంది? 

ఒకరి వలన జన్మించి ఒకరోజు మరణంతో అన్నీ ఆగిపోయేపని అయితే ఈ లోకంలోని జీవులు అసలు దేనికీ భయపడాల్సిన పని ఉండేది కాదు. 

కానీ లోకంలోని ప్రాణుల హృదయాలలో కర్మలు చేసే సమయాలలో పాపపుణ్యాల భీతి ఏర్పడుతోంది గదా! 

ధర్మ విరుద్ధమయిన పని చెయ్యాలంటే ప్రాణుల హృదయంలో భయం కలుగుతోంది గదా. 

దీన్నిబట్టి తేలేదేమంటే మనం గత జన్మలోనూ ఉన్నాం. 

గత జన్మ మరణంతో ముగిసేటప్పటికి మనస్సులో ఏర్పడి ఉన్న అప్పటి సంస్కారాలనుంచే ఇప్పటి ఈ జన్మలోకి ప్రవేశించాం. 

ఈ జన్మలో ముక్తిని పొందలేకపోతే తర్వాత రాబోవు జన్మలోనూ ఉంటాం అని. 

కాబట్టి మరణమనే అత్యంత చేదు మిళితమైవున్న ఎంతో దుఃఖకారణమయిన ఈ జన్మలనే బ్రమలనుంచి ముక్తిని పొందటానికి అత్యంత యోగ్యమయిన మానవదేహాన్ని దానిలో ప్రాణాన్ని ప్రసాదించిన తల్లిదండ్రులకు అందరూ సదా కృతజ్ఞులై ఉండాలి. 

తల్లిదండ్రులు వృద్ధులు అయినప్పుడు వారి వద్దనే ఉండి శ్రద్ధతో వారికి కష్టం కలుగకుండా వారిని రక్షించడం అనేది వారినుంచి శరీరాన్ని పొందిన ప్రతి ప్రాణియొక్క అత్యంత ముఖ్యమయిన “కర్తవ్యం” అని సర్వులూ గుర్తుంచుకోవాలి.

ఒక రైతు ఉన్నాడు. 

అతడికి కొద్ది భూమి ఉంది. అందులో ఏ పంటా లేదు. పంట లేని ఆ భూమికి రైతు వెళ్లి రోజూ నీళ్ళు పెడతాడా? పెట్టడు.

 ఎందుకంటే బీడు భూమికి మతి స్థిమితం లేనివాడు కూడా రోజూ వెళ్లి నీళ్ళు పెట్టే పని చెయ్యడు. 

ఆ భూమిలో గనక ఏదయినా పంట ఉంటే అప్పుడు మాత్రమే ఎవరయినా ఆ భూమికి రోజూ వెళ్లి నీళ్ళు పెడతారు. 

అలా ఎందుకంటే పంట ఉన్న ఆ భూమినుంచి వారికి ఒక ఫలితం లభిస్తుంది కాబట్టి. 

దీనర్ధం మనం దేన్నయినా కాపాడుకుంటున్నాము అంటే దానినుంచి మనకు ఏదో ఒక ప్రయోజనం ఉండటం వల్లేనని ఇక్కడ అర్ధం అవుతోంది. 

మరి మానవుడు లోకంలో పగలంతా తిరిగి ఎంతో శ్రమించి కొద్దిపాటి ధనం సంపాదించి తన శరీరానికి ఆహారం తెచ్చి పెడుతూ దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు గదా! 

ఏ పలితం కొరకు? 

ఈ శరీరం నుంచి ఏ ప్రయోజనం పొందడం కొరకు శరీరాన్ని కాపాడుకుంటున్నాడు అనేదే ఇక్కడ ప్రశ్న. 

తన శరీరానికి ఆహారం అయితే పెడుతున్నాడు గాని ఎందుకు పెడుతున్నాను అనే ప్రశ్న వద్దకే మానవుడు రాలేకపోతున్నాడు. 

కొద్ది కాలం మాత్రమే తనతో ఉండి ఆ తర్వాత మట్టిలో కలిసిపోయే ఈ శరీరం నుంచి నేను పొందాల్సింది ఏమిటి అనే ఆలోచనే మానవుడు చెయ్యలేకపోతున్నాడు. 

శరీరం నుంచి ఏదో ప్రయోజనమే లేకపోతే దానికి ఆహారం పెట్టి రక్షించుకోవాల్సిన అవసరమే మానవునికి ఉండేది కాదు. 

నిజానికి ఇదంతా బహు ఆశ్చర్యకరం. 

ఇంకా ఇక్కడి విశేషాలను మరికొంత పరిశీలించి చూద్దాం! 

ఇక్కడ ప్రతిరోజూ తెల్లవారుతోంది. పగలు వెళ్ళిపోతోంది. రాత్రి మొదలవుతోంది. రాత్రి తర్వాత మళ్ళీ తిరిగి పగలు ఏర్పడుతోంది. పగలు తిరగడం, రాత్రుళ్ళు పొడుకోవడం. ఎన్నాళ్ళిలా? 

ప్రతిరోజూ తిన్నదే తింటున్నాం. 
తాగిందే తాగుతున్నాం. 
తిరిగిన వీధుల్లోనే తిరుగుతున్నాం. 
అదే మంచం ఎక్కి దుప్పటి కప్పుకుని పొడుకుంటున్నాం. రోజూ అదే తిండి. అదే నీరు. అదే మంచం. అదే నిద్ర. అయినా ఎందుకో వీటి మీద ఆశ చావడం లేదు. 
దుఃఖం తొలగడమూ లేదు. 

ఏమాత్రం అర్దంకాని ఈ పగలు, రాత్రి అనే ప్రయాణం చివరికి ఎక్కడికి? 

ఆలోచిస్తుంటే ఈ ప్రయాణం ఒకరోజు చావడం దగ్గరకు తప్ప మరొక చోటుకు కానే కాదని మాత్రం తెలుస్తోంది.

 ఇందులో అంత ఆశ్చర్యపడాల్సింది మాత్రం ఏముంది. 

ఇక్కడ పుట్టే ప్రతిదీ ఒకనాటికి తప్పక నశిస్తుంది. 

నిత్యం కొందరు జన్మించడం మరికొందరు మరణించడం అనేది లోకంలో కనిపిస్తున్నదే..! 

మరి ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి? 

ఈ ఆరాటం దేనికి? 

నాలో ఏర్పడి ఉన్న ఈ “నాది - నావి - నావాళ్ళు” అనే భ్రమంతా నాకు ఎక్కడినుంచి వచ్చింది? 

ఈ జీవితమే మూన్నాళ్ళ ముచ్చటని ఒక ప్రక్క తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను. 

చాలా డబ్బు సంపాదించాలి.. దాన్ని భద్రంగా దాచుకోవాలి.. అందరికంటే పెద్దవాణ్ణి అయిపోవాలి అని. ఇదంతా పిచ్చి కాకపోతే ఇంకేంటి.! 

నా దుష్ట తెలివితేటలతో జీవితమంతా శ్రమించి ఎంత సంపాదించినా మరణంతో అదంతా ఇక్కడ వదిలెయ్యాల్సిందే గదా.! 

ఇక్కడ వదిలెయ్యాల్సిన దానికోసం నేనెందుకు ఇంత ఆరాటపడుతూ, ఆయాసపడుతూ సంపాదిస్తున్నాను? 

అలా అని ఎందుకనుకోవాలి ఇదంతా నా వారి కోసం గదా అనుకుందామనుకుంటే! 

నా వారు అనేదానికి ముందే నేను ఉండి ఉండాలి కదా! 

నేను లేకుండా నా వారు అనేవారు ఎక్కడనుంచి వస్తారు.

 ఆ “నేను” అంటే ఎవరు? 

అసలు “నేను” అనేది నాలో దేనిని?

 ఇలా నేనెవరో నాకే అర్ధం కానప్పుడు ఇక నావారు అనేదంతా ఏంటి? 

పిచ్చి మోహం కాకపోతే! నావారు సంగతి సరే! అసలు నేనెవరివాడిని? 

నన్ను మా వాడు అనుకున్నవాళ్ళు ఇప్పుడెక్కడ ఉన్నారు? 

వారు లేరు. 
కొన్నాళ్ళ తర్వాత నేను ఉండను. 
ఇక నా వాళ్ళు అనుకునేవాళ్ళు మాత్రం ఇక్కడెన్నాళ్ళు ఉంటారు. 
ఈ నేను నాది అనుకునేదంతా ఒక నాటికి కాలం చేతిలో మింగబడబోయేదే గదా.! 

నిన్నటి వరకు పెద్ద వీరుడు, శూరుడు, ధనవంతుడు అనిపించుకున్నవాడు నేడు విగత జీవుడై పాడెమీద నిస్తేజంగా వెల్లికిలా పొడుకుని మౌనంగా స్మశానానికి పయనమయిపోతున్నాడు. 

అక్కడ గుప్పెడు బూడిదగా మారి మట్టిలో కలిసిపోవుచున్నాడు. 

ఈ శరీరాల యొక్క అంతిమ సత్యం గుప్పెడు బూడిదే కదా! 

ఈ మాత్రం దానికి ఇక్కడ ఇంతటి మోహం, ఇంతటి స్వార్ధం, ఇంతటి దుఃఖమా? 

ఇదంతా ఎంతటి బాధాకరం. 
ఇది బహు విచిత్రంగానూ, అయోమయంగానూ ఉంది. కాసేపు ఇదంతా ప్రక్కన పెడితే! 

మరి ఇక్కడ జీవించి ఉన్న కాలంలో దేన్ని పొందితే ఈ జీవితం ముగిశాక కూడా అది నాతోపాటే వస్తుంది? 

అలాంటిదేదయినా అసలు ఇక్కడ ఉందా? 

అలాంటిది ఏదో ఒకటి ఇక్కడ తప్పక ఉండే ఉండవచ్చు. 

అలా కాకపోతేగనక ఈ జన్మించడం అనే శ్రమ నాకు ఎందుకు ఉంటుంది. 

ఏదో ఒక ప్రయోజనం ఇక్కడ ఉండి ఉన్నందునే బహుశ నేను ఇక్కడ జన్మించి ఉంటాను. 

అయితే అది ఏదో సంపాదన పిచ్చిలో పడి పొర్లాడుతున్న ఇప్పటి నా దుష్ట బుద్ధికి తెలియడంలేదు. 

కానీ అది నేను తప్పక తెలుసుకోవాలి. 

ఎలా తెలుసుకోవాలి? 

బహుశ అది తెలిసిన మహాత్ములను నేను తెలుసుకోగలిగితే అప్పుడు ఆ సత్యాన్ని వారిద్వారా నేను తెలుసుకోవచ్చు. 

సర్వం ఎరిగినవారు ఈ లోకాలలో ఎక్కడో ఒకచోట తప్పక ఉండే ఉంటారు. 

ఎలాగయినా సరే అది ఎంతటి శ్రమ అయినా సరే నా ఈ జీవితం మొత్తం కరిగిపోయినా సరే ఈ శరీరం కూలిపోయేలోపల ఆ మహాత్ములను నేను తప్పక చేరుకుంటాను. 

కాబట్టి ఇప్పటినుంచి ఇక నా పని వారిని గుర్తించడమే.

 వారిని గుర్తించి వారిని ప్రార్ధించి వారినుంచి తెలుసుకోవాల్సిన ఆ సత్యాన్ని తెలుసుకుంటాను. 

ఆ తర్వాత మిగిలిన జీవితమంతా అది పొందే ప్రయత్నం చేస్తాను. 

ఒకవేళ ఈ జన్మలోనే గనక ఇది జరక్కపోతే నేను మళ్ళీ మళ్ళీ ఈ లోకాలలోకి శరీరాలతో రావలసి ఉంటుంది. 

అయితే ఇప్పటిలా ఈ మానవదేహాన్ని తర్వాత రాబోవు జన్మలలో కూడా నేను పొందగలను అనే నమ్మకం ఏముంది? 

ఏ పశు, పక్షి, కీటకం లాంటి దేహాలు గనక నేను పొందితే ఇక అప్పుడు నా పరిస్థితి ఏంటి? 

ఆ దేహాలు లోకంలో అందరికీ తిరస్కారమయినవే కదా!

 ఆ దేహాలతో నన్నెవరు దగ్గరకు రానిస్తారు? 

అప్పుడు ఇక ఆ దేహాలతో నాకు ముక్తి ఎలా లభిస్తుంది. 

కాబట్టి ఇప్పటివరకూ వృధా అయిన కాలం ఏదో వృధా అయింది. 

ఇక ఇప్పటినుంచి ఒక్క క్షణం కూడా ఆలస్యంగాని, వృధాగాని కానివ్వకుండా జ్ఞానులకొరకు తీవ్ర ప్రయత్నం చేస్తాను అనుకుంటూ తనలో ఒక దృడ సంకల్పాన్ని ఏర్పరచుకుని మహాత్ముల కొరకు లోకాన్ని జల్లెడ పడుతున్నాడు. 

శాశ్వతమయిన ఆత్మ శాంతి కొరకు లోకం అంతా అలా మాసిన బట్టలతోనే మహాత్ముల కొరకు గాలిస్తూ తిరుగుతూనే ఉన్నాడు. 

ఎక్కడయినా ఎవరయినా పెడితే అంత తింటున్నాడు. 

లేకుంటే మార్గమధ్యంలోని పంట కాలువలలోకి దిగి గుక్కెడు నీళ్ళు గొంతులో పోసుకుని శక్తిని కూడదీసుకుంటూ మళ్ళీ మహాత్ముల కొరకు అన్వేషిస్తూ తిరుగుతున్నాడు. 

మానవుడు దేనికొరకు తీవ్రమయిన ప్రయత్నం చేస్తే అతడు దాన్ని తప్పక పొందుతాడు అనేది సృష్టి ప్రారంభంలో సృష్టికర్త ఏర్పరచిన ఒక నియతి. 

అందువల్ల అతడి మహాప్రయత్నం అనే తీవ్ర అన్వేషణ ఫలించి అతడి ప్రశ్నలకు సమాదానం చెప్పగలిగే గురువు ఒకనాటికి అతడికి లభిస్తున్నాడు. 

అలా అతడికి లభించిన గురువు అతడి దుఃఖం మొత్తం తొలగించడానికి చెప్పే జ్ఞానమే ఆత్మ జ్ఞానం. 

అంతటి మహత్తరమయిన విలువగలిగిన ఆత్మజ్ఞానాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 

ఆత్మ స్వరూపులయిన తామందరూ ఈ చెప్పబోవు ఆత్మ జ్ఞానం మీదే మనస్సు పూర్తిగా పెట్టి రెండు చెవులతో వినే ప్రయత్నం చెయ్యమని ప్రార్దన.

ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు, ఈ శరీరం పోయేటప్పుడు ఏదయితే మార్పు అనేదే లేకుండా ఒకటి ఈ శరీరంలో ఉందో 

అదే ఆత్మ. 

ఆ ఆత్మే నువ్వు.

ఏదో ఒకనాటికి తప్పక పోయే ఈ శరీరం నువ్వు కాదనే ఎరుక నీ అనుభవంలోకి వచ్చిన మరుక్షణం ఈ లోకాలనే భ్రమల్లోకి నువ్వు వచ్చిన పని పూర్తయినట్లే.

ఈ సత్యాన్ని అందరి మనసుకూ అర్ధం అయ్యేలా తెలియజేసే ప్రయత్నమే ఈ పుస్తకంలోని ప్రతి అక్షరం.

“ఆత్మజ్ఞానం” అంటే “ఈ శరీరమే నేను” అని నమ్మే మానవుని యొక్క మనస్సును శరీర భ్రమ నుంచి దృష్టిని మళ్ళించి తన స్వస్వరూపమయిన ఆత్మ అనే ఆనంద సాగరంలో ఏకం చెయ్యడమే. 

మానవుని మనసులోకి చేరుతున్న లోక విషయాలే మానవుని దుఃఖానికి కారణం అవుతున్నాయి. 

మానవుని మనసులోనుంచి విషయాలు అన్నీ తొలగిపొతే అప్పుడు మానవునికి శాశ్వతంగా దుఃఖం తొలగినట్లే. 

మనస్సు అంటే విషయాలే. 

విషయాలు లేని మనస్సు లేదు. 

అలానే దుఃఖం లేని విషయాలూ లేవు. 

కాబట్టి విషయాలు లేక మనస్సు అనేవి తొలగించుకున్నట్టి స్థితిలో ఉన్న మానవునికే ఆ ఆత్మానందం లభిస్తుంది. 

అజ్ఞానాన్ని తొలగించుకుని ఒకసారి ఆ ఆత్మ స్థితిలోకి ప్రవేశించిన మానవుడు ఆ ఆనందాన్ని నిరంతరాయంగా పొందుతుంటాడు. 

అక్కడ మరణం ఉండదు. 

కాలం ఉండదు. 

శరీరం ఉండదు. 

కేవలం అనంతమయిన ఆనందం మాత్రమే ఉంటుంది. 

అందుకే మానవుడు మనస్సులో విషయాలు చింతించకుండా కోరికలు కలిగి ఉండకుండా నేను, నాది, నావి అనేదంతా వదలిపెట్టి మనస్సును నిర్విషయ స్థితిలో దీర్ఘ కాలం పాటు నిలిపి ఉంచితే ఒకానొక సమయానికి ఆ మనస్సు విషయ రహితం అయిపోయి ఆత్మ అనే ఆనందసాగరంలో ఏకమైపోతుంది. 

అప్పుడు మానవునికి అనిర్వచనీయమయిన మాటలతో చెప్పలేని అమితమయిన ఆనందం లభిస్తుంది. 

శరీరం, మనస్సుతో అనుభవించే ఆనందాలను అయితే శరీరంలో భాగమయిన నాలుక వర్ణించగలదు. 

ఆత్మానందం శరీరానికి గాని, మనస్సుకు గాని అందేది కాదు. అందుకే ఆ ఆనందాన్ని శరీరంలోని భాగమయిన నాలుక వర్ణించలేదు. 

మానవుని స్థితే అక్కడ ఆనందమయం అయిపోతుంది.

 ఈ లోకంలోకి మానవశరీరంతో వచ్చాక ఆ ఆత్మస్థితిని పొందాలని ప్రయత్నం చేసేవాడే మానవుడు అనిపించుకుంటాడు. 

ఒకసారి ఆ స్థితిని పొందాక ఆ మానవుడే భగవంతుడు అయిపోతాడు. 

కాబట్టి మానవులు తమ మనస్సులో లోక విషయాలను భావన చెయ్యకుండా ఏ వస్తువుల మీద గాని, బంధువుల మీద గాని, ఆస్తుల మీద గాని, చివరికి తన శరీరం మీద గాని ఇవి నావి, నాకు చెందినవి, నాతో ఉండవలసినవి అనే అభిమానం కలిగి ఉండకుండా వాటి అన్నింటినీ ఒక గోడ, రాయి, కొయ్య లాంటి బయటి వస్తువులను చూసినట్లుగా చూస్తూ వాటి రాక వాటి పోకలను మనసులోకి ఎక్కించుకోకుండా నిరంతరం ఒక యజ్ఞం లాగా మనస్సును కట్టడి చెయ్యాలి. 

దీనర్ధం కర్మలు చెయ్యడం మానేసి చతికిలపడి ఏ చెట్టు క్రిందో లేక మరో చోటో కూర్చొని మౌనంగా ఉండమని మాత్రం ఎవ్వరూ అనుకోకండి. 

ప్రతి మానవుడు తాను జన్మించిన కుటుంబ నేపద్యానికి తగినట్లుగా కర్మలు తప్పక చెయ్యాలి. 

అయితే ఆ కర్మల ఫలితాన్ని అతడు తన మనసులోకి రానివ్వకుండా తన కర్తవ్యంలో భాగంగానే ఆ కర్మలు చేస్తున్నట్లుగా అతడు భావించాలి. 

కర్మ ఫలాన్ని కాలానికి వదిలెయ్యాలి. 

అప్పుడు ఆ కర్మల ఫలితం అతడిలోకి ప్రవేశించదు.

 ఎవరయితే కర్మల యొక్క ఫలాన్ని పొందగోరి కర్మలు చేస్తారో అట్టి వారియొక్క మనస్సుగాని ఇంద్రియాలుగాని వారి వశంలో ఉండవు. 

ఇంకా కర్మ ఫలాన్ని నాది నాకు చెందినది అనుకునే వారి మనస్సులో కామం, క్రోదం, లోభం, మోహం, మధ మాత్సర్యాలు అనే లక్షణాలు అధికమవుతూ ఉంటాయి. 

ఎవరిలో అయితే  కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అధికంగా ఉంటాయో వారికి ముక్తి ఎలా లభిస్తుంది? 

కాబట్టి కర్మల యొక్క ఫలం మీద నాది అనే అభిమానం పెంచుకోకుండా కర్మలు చెయ్యాలి. 

ఈ సాధన వల్ల అతి త్వరలోనే ఆత్మ అని చెప్పబడే మానవుని స్వస్వరూపం మానవునికి అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మానవునికి అనంతమయిన ఆనందం కలుగుతుంది. 

ఆ ఆనందం మాటలతో వర్ణించగలిగేది కాదు. 

ఒకవేళ శిష్యులకు బోధించడానికి మాటలతోనే ఆ ఆత్మానందం గురించి చెప్పుకోవాల్సి వస్తే.! 

అప్పుడు ఆ ఆత్మానందాన్ని సప్త సముద్రాలలోని మొత్తం జలంతో గనక పోల్చుకుంటే ఈ రాజ్యాలను పరిపాలించే అధికారం సంపాదించిన ఒక చక్రవర్తి పొందే ఆనందం అందులోని ఒక నీటి చుక్కలాంటిదని ఆ ఆత్మానందాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న జ్ఞానులు మనకు చెబుతున్నారు. 

                 కాబట్టి సృష్టి అనే భ్రమలో ఉన్న ఒకే ఒక్క ఆ ఏకైక సత్యాన్ని అందరూ అర్ధం చేసుకుని ఒక దృడ సంకల్పంతో ఆ ఆత్మస్థితి కొరకు గట్టి ప్రయత్నం చేసి ఈ జన్మలోనే ఆ అనంతమయిన ఆనందసాగరంలోకి ప్రవేశించి ఈ జన్మ - మృత్యువుల నుంచి ముక్తి చెందాలని కోరుకుంటూ జ్ఞాన విచారణ లోకి ప్రవేశిద్దాం.


ప్రారంభం

అడవి మొత్తం చెట్లతో నిండి ఉంటుంది. 

చెట్లన్నీ కొమ్మలు, ఆకులతో పచ్చగా ఉంటాయి. 

కొన్ని చెట్లు ఫలాలనిస్తాయి. 

మరికొన్ని చెట్లు పుష్పాలను ఇస్తాయి. 

ఏవో కొన్ని చెట్ల ఆకుల రసం మాత్రమే విషాన్ని చంపగలిగే శక్తిని కలిగి ఉంటుంది. 

పళ్ళు, పుష్పాలు కంటికి కనిపించేవి కాబట్టి అందరూ వెళ్లి కోసుకుని అవసరం తీర్చుకుంటారు. 

కానీ శరీర గాయాలను, శరీరంలోకి ప్రవేశించిన విషాన్ని చంపగలిగే శక్తి కలిగిన ఆకులను అందరూ కనిపెట్టలేరు. 

అడవి మీద బాగా అవగాహన ఉన్న వారికి మాత్రమే ఆ ఆకుల యొక్క రహస్యం తెలుస్తుంది. 

తెలిసిన వారు తెలియనివారిని అన్నిరకాలుగా రక్షించడమే లోకంలోని అన్ని ధర్మాలలోకల్లా అత్యుత్తమ ధర్మం. 

మరి శరీర గాయాల రక్షణకయితే ఆకుల రసం సరిపోతుంది. 

మానవుడిలో కలుగుతున్న దుఃఖానికి ఏ రసాన్ని వాడాలి? 

దుఃఖానికి ఒక ఆకారం అంటూ లేదు కాబట్టి దుఃఖాన్ని తొలగించేది కూడా ఆకారం లేనిదే అయ్యుండాలి గదా! 

మరి మానవుడు ఆకారం అంటూ లేని తనలోని దుఃఖాన్ని తొలగించుకోవడానికి లోకంలోని ఏవేవో వస్తువులు, ధనం అనే ఆకారాలమీద ఆధారపడుతున్నాడు. 

ఇవన్నీ ఆకారం లేని దుఃఖం నుంచి మానవునికి శాశ్వతమయిన విముక్తిని కలిగిస్తాయా?

మానవుడు నిరంతరం తన “ఆనందం” కొరకు అనేక ప్రయత్నాలు చేస్తూ ఈ లోకంలో జీవిస్తున్నాడు. 

మానవునికి ఆనందం అనేది ఎప్పుడు లభిస్తుంది. తనలోని దుఃఖానికి కారణమయినదాన్ని అధిగమిస్తే మానవునికి ఆనందం లభిస్తుంది. 

మానవుడు తనలోని చిన్న చిన్న దుఃఖాలు తొలగించుకుంటే చిన్న చిన్న ఆనందాలు మాత్రమే అతడికి లభిస్తాయి. 

అలా కాకుండా ఎప్పటికీ కోల్పోని అతి పెద్ద ఆనందాన్ని గనక అతడు పొందాలనుకుంటే తనకు అతి పెద్ద దుఃఖమేదో అతడు తెలుసుకుని దాన్ని తొలగించుకోవాలి. 

అప్పుడు మానవునికి శాశ్వతమయిన ఆనందం లభిస్తుంది. మరి మానవుడికి అన్నింటికంటే పెద్ద దుఃఖం ఏది అని పరిశీలించినప్పుడు అతడి మరణమే అతడికి అన్నింటికంటే పెద్ద దుఃఖం అని తెలుస్తోంది. 

కాబట్టి మానవుడు ఈ మరణం అనే అతి పెద్ద దుఃఖాన్ని గనక తొలగించుకుంటే ఇక అతడి ఆనందానికి ఎట్టి అవరోధం ఉండదు. 

మరి ఈ మరణం అనేదాన్ని మానవుడు ఎలా తొలగించుకోవాలి? 

అది తెలుసుకోవాలంటే ఈ మరణం అనేది తనలో దేనికో ముందు మానవుడు తెలుసుకోవాలి. 

మరణం వల్ల మానవుడు కోల్పోయేది ఏది అని పరిశీలించినప్పుడు ఈ “శరీరం” అని తెలుస్తోంది. 

కాబట్టి మరణంతో కోల్పోయే ఈ శరీరం నేను కాదు. 

ఈ శరీరం నేను అని అనుకోవడంవల్లే ఈ శరీర మరణం నా మరణం అని దుఃఖిస్తున్నాను అనే సత్యాన్ని మానవుడు జ్ఞాన బలంతో తెలుసుకోవడమే మరణాన్ని జయించడం అంటే! 

కొందరు స్నేహితులు ఒక అడవిలోకి విహారయాత్రకు వెళ్ళారు. 

అందరూ అడవి అందాలను చూస్తున్న సమయంలో ‘పులి పులి’ అని ఎవరో అరిచారు. 

ఒక్క దెబ్బతో అందరూ భయంతో తలా ఒక దిక్కుకు పరుగులు తీసారు. 

కాసేపటికి పులి పులి అని అరచినవాడు పులీ లేదు గిలీ లేదు రండిరా అని మళ్ళీ గట్టిగా అరిచాడు. 

పారిపోయి దాక్కున్న వాళ్ళందరూ తిరిగి మళ్ళీ అదే చోటకు వచ్చి చేరారు. 

మళ్ళీ సరదా మాటలలో మునిగిపోయారు. 

కొద్దిసేపటి తర్వాత వారిలోని ఒకడి కాలు క్రింద చల్లగా అనిపిస్తే వంగి చూసాడు…. రక్తం. 

రక్తం ఎక్కడనుంచి వచ్చిందని అందరూ గమనించి చూస్తే అతడి కాలు మొత్తం కోసుకుపోయి ప్యాంటు అంతా రక్తంతో తడిచిపోయి ఉంది. 

అతడికి అప్పుడు అర్ధమయింది పులి పులి అన్న అరుపులు విని పారిపోతున్నప్పుడు ఏదో చెట్టు కొమ్మ కాలును చీల్చిందని. 

కానీ అతడి కాలుకి గాయం ఏర్పడిన సమయంలో ఆ గాయం గురించి అతడికి తెలియలేదు. 

కనీసం నొప్పి అనే అనుభవం కూడా అతడికి ఆ సమయంలో కలుగలేదు. 

చూసారా విచిత్రం. 

పులి భయం వల్ల అతడి మనస్సు యొక్క దృష్టి ఆ పరిగెత్తే సమయంలో అతడి శరీరం మీద లేదు కాబట్టి అంతపెద్ద ఆ శరీర గాయం కూడా అతడికి ఆ సమయంలో తెలియలేదు. 

మరి ఈ శరీరం గనక అతడు అయితే అతడి శరీరానికి ఏ సమయంలో, ఏ పరిస్థితిలో గాయం అయినా అతడికి తప్పక తెలియాలి గదా.! 

అలా తెలియలేదంటే అర్ధం ఏంటి? 

అర్ధం ఏంటి అంటే అన్నింటినీ తెలుసుకునేవాడు ఒకడు ఈ శరీరంలో ఉన్నాడు గాని ఈ శరీరం అతడు కాదు అని.

 అయితే ఈ శరీరం నేను అనిగనక అతడు భావిస్తే ఈ శరీరం యొక్క వృద్ధి క్షయాలు అతడికి కలుగుతున్నాయి.

 అలా కాకుండా ఈ శరీరం నేను కాదు అనిగనక అతడు భావించి శరీరాన్ని విస్మరిస్తే అప్పుడు ఈ శరీరం యొక్క వృద్ధి క్షయాలు అతడికి చెందడం లేదు. 

అంతే! 

ఈ లోకం యొక్క రహస్యం ఇంతకు మించి చెప్పడానికి ఏమీ లేదు.

కాబట్టి “నేను-నాది” అనుకున్నదే దుఃఖాన్ని కలిగిస్తుంది. 

త్యజించబడింది ఏదీ దుఃఖాన్ని కలిగించలేదు. 

మానవుడు “ఈ శరీరం నేను” అని అనుకోవడం నుంచి “ఈ శరీరం నేను కాదు” అని అనుకోవడం లోకి మారిన మరుక్షణం ఇక ఈ శరీర మరణం అతడి మరణం కాజాలదు. 

అతడికి మోక్షం లభించినట్లే.  

కాబట్టి ఇక్కడ ఏది నాది? 

ఏది నాది కాదు? 
ఏది నేను? 

ఏది నేను కాదని మానవుడు విచారణ చేసి సత్యాన్ని గ్రహించి దుఃఖాన్ని తొలగించుకోవాలి.

ఒక గ్రామంలోని ఒక మిత్రుని ఇంటికి ఒకరోజు పట్నం నుంచి అతని బాల్య స్నేహితుడు ఒకరు వచ్చారు. 

తాను ఈ చుట్టుప్రక్కల గ్రామాలలోని కొన్ని వ్యవసాయ భూములు చూసి వాటిని కొనే పనిమీద వచ్చినట్లుగా అతను తన మిత్రునికి చెబుతాడు. 

అయితే తన వద్ద ఉన్న కొన్ని బంగారు ఆభరణాలను భద్రంగా దాచమని తిరిగి పట్నం వెళ్ళేటప్పుడు తనతో తీసికెళతానని చెప్పి అతని మిత్రునికి వాటిని అప్పజెప్పి భూములు కొనే పనిమీద బయటకు వెళ్ళిపోతాడు. 

తన మిత్రుడు దాచమని ఇచ్చిన బంగారు ఆభరణాలను అతడు భద్రంగా తన గృహంలోని ఒక పెట్టెలో పెట్టి ఉంచుతాడు. 

ఇది జరిగిన ఒక రోజు తర్వాత పట్నంలో చదువుకుంటున్న ఆ గ్రామస్తుని కుమార్తె సెలవులకు ఇంటికి వస్తుంది.

 యధాలాపంగా ఏదో వస్తువు కోసం వెతుకుతూ బంగారు ఆభరణాలు ఉంచిన పెట్టె తెరుస్తుంది. 

అందులో ధగ ధగ మని మెరుస్తున్న బంగారు ఆభరణాలు కనిపిస్తాయి. 

ఇంకేముంది ఆనందం పట్టలేకపోతుంది. 

తండ్రి మీద ఉన్న భయంతో తండ్రి ఇంటిలో లేని సమయం చూసి ఆ ఆభరణాలను తన శరీరానికి పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ ఆనందిస్తూ ఉండేది. 

కొద్ది రోజుల తర్వాత బంగారు ఆభరణాలు దాచమని ఇచ్చిన పట్నం మిత్రుడు తిరిగి వస్తాడు. 

ఆ బాలిక తండ్రి ఆ ఆభరణాలను పెట్టెలోంచి తీసి పట్నం స్నేహితునికి అందిస్తాడు. 

అతడు వాటిని తీసికుని తిరిగి పట్నం వెళ్ళిపోతాడు. 

ఇదంతా అక్కడుండి చూసిన అతడి కుమార్తె అవాక్కవుతుంది. 

ఎంతో దుఃఖంతో తనలో రోధిస్తుంది. 

ఎందుకంటే ఆ బంగారు ఆభరణాలు తన తండ్రి తన కోసం కొని దాచినవి అని ఆమె అంతవరకూ భావించింది. 

కానీ అవి తమవి కావని తెలిసాక బాధ భరించలేక ఎంతో దుఃఖిస్తుంది. 

అయితే ఆమె తండ్రి ముఖంలో మాత్రం ఎలాంటి దుఃఖ ఛాయలు లేవు. 

ఎందుకంటే అతడు దుఃఖించడం లేదు. 

దానికి కారణం తనవి కాని ఆ బంగారు ఆభరణాలను ‘ఇవి నావి’ అని అతడు ఎప్పుడూ భావించలేదు. 

అందుకే అవి కోల్పోతున్నపుడు కూడా అతడు నిర్మలంగానే ఉండగలిగాడు. 

ఎవరయితే తెలిసో తెలియకో ఒకనాటికి తప్పక కోల్పోవాల్సిన వాటిని చూసుకుంటూ ‘ఇవి మావి’ అనుకుంటూ ఉంటారో ఆ అమాయక బాలిక లాగా అవి కోల్పోయే సమయంలో వారు తప్పక దుఃఖమే అనుభవిస్తారు. 

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం కాని ఈ శరీరాన్ని చూసుకుంటూ ‘ఇది మనం’ అనుకుంటున్నాం. 

ఒక నాటికి తప్పక కోల్పోయే ఈ శరీరాన్ని చూసుకుంటూ ఈ శరీరం ‘నేను’ ఈ శరీరం ‘నాది’ అని నమ్మకం పెంచుకుంటున్నాం. 

ఈ ‘నేను నాది’ అనే మనలో పెంచుకున్న భావనలే అన్ని దుఃఖాలకు కారణం అని మనం గ్రహించలేకపోతున్నాం. 

జ్ఞానులు ఈ శరీరం మీద అభిమానం పెంచుకోరు.

 ఈ శరీరాన్ని కదిలిస్తున్న ‘ఆత్మ భగవానుని’ నిరంతరం నిశ్శబ్దంగా, మౌనంగా మనస్సుతో ధ్యానిస్తూ ఉంటారు.

 దానివల్ల శరీర నాశనం అనే ‘మరణం’ వారికి దుఃఖాన్ని కలిగించలేకపోతోంది.

శరీరం కోల్పోయే సమయంలో ఎవరయితే దుఃఖించరో వారిక ఈ లోకంలో తిరిగి జన్మించరు.

ఎవరయితే శరీరం మీద అభిమానం పెంచుకుని శరీరం పొతే నేనే పోయినట్లే అని భయపడుతూ శరీరం కోల్పోయే సమయంలో దుఃఖిస్తారో వారు తిరిగి ఏదో ఒక దేహంతో మళ్ళీ జన్మిస్తారు.

శరీరం కోల్పోయే సమయంలో దుఃఖం కలగకుండా ఉండాలంటే మనస్సును ప్రతిక్షణం అంటే జీవించినంత కాలం నిర్విషయ స్థితిలో ఉంచుకోవడం సాధన చెయ్యాలి. 

అంటే మన మనస్సు ఎప్పుడూ ఎదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. 

జరిగిపోయినవాటినో లేక జరగాల్సినవాటినో మనస్సు నిత్యం మననం చేస్తూ ఉంటుంది. 

ఈ మనస్సు నిద్రలో కూడా ఖాళీగా ఉండదనేది అందరికీ నిత్యానుభవమే. 

ఎప్పుడూ ఎదో ఒకటి ఆలోచిస్తూ ఉండే ఈ మనస్సును ఏదీ ఆలోచించనివ్వకుండా ప్రతిక్షణం నిశ్చలంగా ఉంచుకోవడం మానవుడు సాధన చెయ్యాలి. 

కోరికలు మనసులోకి రానివ్వకుండా ఉన్నప్పుడే మానవునికి ఈ సాధన సాధ్యం. 

కోరికలు ఎవరిలో జనించవు అంటే “మోక్షం నా జీవిత లక్ష్యం” అనే పట్టుదల కలిగి ఉండి జీవిత పర్యంతం “బ్రహ్మచర్యం” పాటించేవారిలో ఏ కోరికలూ ఉండవు. 

ఒక్క మాటలో చెప్పాలంటే మానవునిలోని సకల భయాలు, దుర్గుణాలు, దుఃఖాలు ఒక్క దెబ్బకు తొలగిపోవాలంటే కేవలం ఒక్క “బ్రహ్మచర్యం” పాటిస్తే చాలు. 

ఇంకేం అవసరం లేదు. 

[ బ్రహ్మచర్యం అంటే శరీరంలోని వీర్యాన్ని అశాస్వతమయిన, కృత్రిమమయిన సంభోగ ఆనందం కోసం వృధాగా బయటకు వెళ్ళనివ్వకుండా జీవించినంతకాలం శరీరంలోనే నిలుపుకోవడం ]. 

బ్రహ్మచర్యం పాటించని సాధారణ మానవుడు మరణించినప్పుడు అతడి శరీరం కట్టెలా అయిపోయి తేజోహీనంగా కనిపిస్తుంది. అదే బ్రహ్మచర్యం పాటించిన ఒక యోగి మరణించినప్పుడు అతడి శరీరం కాంతివంతంగా కనిపిస్తుంది. 

మరణం తర్వాత కూడా అతడి ముఖంలో తేజస్సు ఉట్టిపడుతుంది. 

అతని శరీరంనుంచి ప్రాణశక్తి వెళ్ళిపోయినా అతడి దేహంలో తేజస్సు తగ్గదు. 

బౌతికమయిన సంపదలు, సుఖాల వలన మానవుని ముఖంలో కనిపించే తేజస్సు, ఆనందం క్షణికం, కృత్రిమం.

 బ్రహ్మచర్యం పాటిస్తూ ఆత్మ దర్శనం చేసుకున్న యోగి ముఖంలో కనిపించే తేజస్సు శాశ్వతం. 

కాబట్టి మానవులు బ్రహ్మచర్యం ఒక సంవత్సరం పాటు నిష్టగా పాటిస్తే ఆ తర్వాత ఏదో ఒక క్షణంలో ఎవరికయినా “ఆత్మ దర్శనం” తప్పక అవుతుంది అని అందరూ గ్రహించాలి. 

అలాగే అనారోగ్యంతోనో, మరేదో ఇతర కారణంతోనో మరణానికి చేరువయివుండి తమ ఆయుష్షులో ఒక సంవత్సరకాలం మిగిలి ఉండనివారు ఆందోళన చెందాల్సిన పనిలేదు. 

ఆత్మ దర్శనానికి అసలు ఆయుష్షు ఎంతుందనేది ముఖ్యం కానే కాదు. 

ఈ క్షణం నుంచి ఆత్మను భావన చేస్తూ బ్రహ్మచర్యం పాటిస్తూ మరొక పది క్షణాల తర్వాత మరణించినా తప్పక “మోక్షం” లభిస్తుంది. 

అదెలాగో వినండి.

 ఆత్మకు ఆకారం లేదు. 

ఆత్మ నిరాకారం. 

నేను ఆత్మను అని భావన చెయ్యడమంటే ఈ బౌతికమయిన ప్రపంచాన్ని త్యజించడమే. 

అదే మోక్షం. 

ప్రపంచం అనే ఆకారాన్ని నమ్మడమే బంధం. 

మనస్సనే తెరలోంచి అజ్ఞానంతో ఈ ప్రపంచాన్ని చూసే ఆత్మను జ్ఞానంతో దర్శించడమే మోక్షం.

 అంతే. ఇక దీనికి కాలంతో పనేముంది. 

కాబట్టి మానవుని లక్ష్యం మోక్షం అయితే అది ఎప్పుడయినా సాధ్యమే. 

ఇందులో సందేహించాల్సింది ఏమీ లేదు. 

భగవంతుడు శ్రీ వసిష్ఠ మహర్షి, భగవంతుడు శ్రీ వేదవ్యాసమహర్షి, భగవంతుడు శ్రీ వాల్మీకిమహర్షి చెప్పిందే మేమిక్కడ చెబుతున్నాం. 

తప్పక విశ్వసించి ప్రయత్నించి చూడండి అప్పుడు మీకే సత్యం అర్ధం ఆవుతుంది. 

భయమే మరణం – ధైర్యమే మోక్షం. 

కాబట్టి మానవుడు ముందు తన జీవిత లక్ష్యం ఏంటో నిర్ణయించుకోవాలి. 

తల వంచుకుని నించున్నవానికి భూమి కనిపిస్తుంది గాని ఆకాశం కనిపించదు. 

ఆకాశం చూడాలనుకుంటే తల ఎత్తి చూడాలి. 

ఎవరి జీవిత లక్ష్యం అయితే మోక్షమో అట్టి వారి మార్గంలో ఇక కోరికలు, భౌతిక భోగాలూ అనేవి ఉండనే ఉండవు. 

అలాగే భోగమార్గంలో వెళ్లేవారి గమ్యంలో మోక్షం ఉండదు. 

కాబట్టి ఎవరయితే తమ జీవితపర్యంతం మనస్సులో లోక విషయాలను మననం చెయ్యకుండా మనస్సును నిర్విషయస్థితిలో ఉంచుకోవడం అనేది కొనసాగిస్తారో అట్టివారికి ఏదో ఒకనాటికి పరమశాంతి స్థానమయిన “ఆత్మదర్శనం” అనుభవంలోకి వస్తుంది. 

అట్టివారు మరణాన్ని జయించినవారే అవుతారు. 

వారిక ఈలోకం లోనూ మరే లోకం లోనూ తిరిగి జన్మించరు. 

ఇదే సత్యం.

కాబట్టి అత్యంత విలువయిన మానవ శరీరాన్ని మోక్షం కొరకు ఉపయోగించడం అత్యవసరమా? 

లేక మూన్నాళ్ళ ముచ్చటయిన ఈ శరీర సుఖ భ్రమలా అనేది స్వయంగా మానవుడే తేల్చుకోవాలి. 

మనస్సు నిండా ఆశ నింపుకుని ఉండి లోకంలోని భోగాలను అనుభవిస్తూ శరీరాన్ని కోల్పోయేవారికి తిరిగి వెంటనే మానవదేహం లభించదని జ్ఞప్తిలో ఉంచుకోవాలి.

మానవుడు జ్ఞానులను కలిసి జ్ఞాన విచారణ చెయ్యడం వదలేసి ఆనందాన్ని పొందడానికి వస్తువుల కొరకు, బంధుమిత్రుల కొరకు, భార్యా పుత్రుల కొరకు, భోగ భాగ్యాల కొరకు అన్వేషిస్తున్నాడు. 

అవన్నీ లభిస్తే “ఆనందం” అనుకుంటున్నాడు. 

లభించనప్పుడు దుఃఖిస్తున్నాడు. 

అతడి ప్రయత్నంలో కొన్ని అతడికి లభించి కొద్దిగా కృత్రిమమయిన ఆనందాన్ని కలిగించినా అవన్నీ ఎప్పటికీ అతడితోనే ఉంటాయా? 

ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే ఈ పంచ లోకాలలో కాలంతో పాటు నశించని వస్తువంటూ ఏదయినా ఒక్కటయినా ఉందా? 

లేనే లేదు. అన్నీ నశించేవే. అంటే ఈ లోకంలో మానవుడు పొందినవన్నీ ఏదో ఒక నాటికి కోల్పోక తప్పదు.

 మరి పొందిన వస్తువులు కోల్పోయే సమయంలో తిరిగి దుఃఖమే మిగులుతుంది గదా! 

అసలు ‘నేను’ అనుకుంటున్న అతడి శరీరమే ఒకనాటికి అతడితో ఉండదని అతడు గ్రహించాలి.

 ఇక వస్తువుల సంగతి సరే సరి! 

కాబట్టి మానవుడికి ఈ సుఖ దుఃఖాలు అనే అనుభవాలు ఎలా కలుగుతున్నాయి అని విచారించి చూస్తే నాకు ఏదో కావాలి అనే భావన వల్ల దుఃఖం నేను కోరుకున్నది లభించింది అనే భావన వల్ల ఆనందం మానవుడికి కలుగుతున్నాయి. 

అంటే తనలోని భావనే తనయొక్క దుఃఖానికీ ఆనందానికీ రెంటికీ కూడా కారణం అవుతోంది. 

మరి అది దుఃఖమయినా కానివ్వండి లేక ఆనందం అయినా కానివ్వండి అన్ని అనుభవాలూ ఉన్నది తనలోనే అయినప్పుడు మరిక  ఆనందాన్ని పొందడానికి బయట వస్తువుల కొరకు మానవుడి ఎదురు చూపులెందుకు?

మన భావన ఏదో పొందాలి అని భావిస్తే అది పొందేంత వరకు దుఃఖం. దాన్ని పొందాక  కోరుకున్నది పొందాను అని భావించగానే ఆనందం కలుగుతున్నాయి.

 దీన్నిబట్టి మన భావనే అటు దుఃఖానికీ ఇటు ఆనందానికీ రెండింటికీ కారణమవుతోంది అని తెలుస్తోంది గదా. 

కోరుకున్నది లభించింది అని మానవుడు భావించగానే అతడికి ఆనందం కలుగుతోంది గదా! 

మరి ఆ ఆనందం వస్తువు లభించనప్పుడు ఎక్కడ దాగి ఉంది. మానవుని లోనే గదా! 

అంటే ఆనందం అనేది మానవునిలోనే అన్ని వేళలా ఉంది. 

అతడిలోనే అన్ని వేళలా వున్న ఆనందాన్ని అతడు ఏ బాహ్య వస్తువుల అవసరం లేకుండానే నేరుగా అనుభవించే అవకాశం కలిగి వుండి కూడా  అతడు తన అజ్ఞానం వల్ల బయటి వస్తువులతో తన ఆనందాన్ని ముడి పెట్టుకుని ఏదో లభిస్తేనే నాకు ఆనందం అనుకుంటూ జీవితమంతా వాటికొరకు ప్రయత్నాలు చేస్తూ  ప్రతిక్షణం దుఃఖిస్తూ ఒకరోజు మరణిస్తున్నాడు. 

ఎంతటి దయనీయ స్థితి ఇది.

ధనం లేని వాని కథ ఇలా ఉంటే సిరి సంపదలు కలిగిన ధనవంతుడి కథ మరోలా ఉంది. 

ధనవంతుడు తన ధనానికి కూడా ఏమాత్రం లొంగని ఈ మరణం అనేదాన్ని తలచుకుని గజ గజ వణుకుచున్నాడు. 

ఈ చావు ఎప్పుడు వస్తుందో ఏంటో ఈ సంపదలు అన్నీ ఇక్కడ వదలి వెళ్ళవలసిందే కదా! 

అసలు లోకంలో “మరణం” అనేది లేకుంటే ఎంత బాగుండు! 

ఈ లోకంలో ఎంత సంపాదిస్తే మాత్రం ఏముంది చావును తప్పించుకున్న వాడు ఈ ముల్లోకాలలో ఒక్కడు కూడా లేడు కదా! 

ఈ చావనేది ధనవంతుడు, పేదవాడు అనే భేదం చూడదు గదా! 

అసలు ఈ మరణం తర్వాత ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ నిత్యం తన మరణాన్నే తలచుకుంటూ దుఃఖిస్తున్నాడు. 

ఈ “శరీరమే నేను” అనే నమ్మకం కలిగి ఉన్నందున అతడికి ఈ దుస్థితి. డబ్బు లేనివాడు డబ్బు కొరకు దుఃఖిస్తుంటే డబ్బున్నవాడు మరణం గురించి భయపడుతూ దుఃఖిస్తున్నాడు. 

దుఃఖానికి కారణాలు వేరవ్వచ్చు గాని దుఃఖం మాత్రం ఇద్దరిలోనూ ఉంది.

ఇప్పుడు జ్ఞానుల దృష్టిలో ఈ మరణం అనేదాని రూపం ఏంటో పరిశీలిద్దాం. 

ఈ మరణం అనే దాని తర్వాత ఏం జగుగుతుంది అనేదానికి అసలు “మరణం” అనేది ఒకటి ఉంటేనే కదా ఏదైనా జరగటానికి అనేదే జ్ఞానుల సమాదానం. 

ఇక్కడ దేనికీ మరణమూ లేదు. 

దేనికీ జననమూ లేదు. 

ఉన్నది కేవలం ఏకైక నిరాకార “చైతన్యమే”.

 అదే అన్ని జీవులలో ఉన్న “ఆత్మ”. 

“కదిలేదీ అదే - కదిలించేదీ అదే”. 

శరీరాలు అనే ఆకారాలన్నీ ఆత్మలోనే ఆత్మకంటే వేరుగా బాహ్యంలో కనిపిస్తున్నాయి తప్ప శరీరాలు అనేవి అసలు లేనే లేవు.

 అజ్ఞానం తొలిగాక మానవుని యొక్క అంతిమ అనుభవం ఇదే. దీన్ని మించిన మరొక అనుభవమూ లేదు. 

దీన్ని మించిన మరొక సత్యమూ లేదు అని జ్ఞానులు చెబుతున్నారు. 

ఇదెంతో ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ ! 

ఇది మొత్తం చదివేటప్పటికి మనకూ ఈ లోకం యొక్క మాయా జాలమంతా స్పష్టంగా అర్ధం అవుతుంది.

ఈ లోకంలో “దుఃఖమే” మరణం. 

దుఃఖం లేని మరణం ఈ ఐదు లోకాలలో ఎక్కడా లేదు. 

మరి మానవుడు దుఃఖం తొలగించుకుంటే మరణాన్ని జయించినట్లే గదా! 

మరి ఈ దుఃఖం ఎలా తొలగుతుంది ? 

ఈ లోకంలో కాలంతో పాటు నశించే ఆశాస్వతమయిన వాటన్నింటినీ త్యజిస్తూ రాగా చివరికి ఏది త్యజించడానికి వీలుకాదో అదే దుఃఖం లేనిది. 

అది ఏదో జాగ్రత్తగా వినండి. 

లోకంలోని అన్నింటినీ ఇది అశాశ్వతం... 

ఇది అశాశ్వతం అని త్యజించే “నువ్వే” అది. 

అన్నింటినీ ఏదయితే త్యజిస్తోందో ఆ త్యజించేదే త్యజించడానికి వీలుకానిది. 

అదే మనిషిలోని “ఆత్మ”. 

ఆత్మ అంటే “నువ్వే”. 

అన్నింటినీ అశాశ్వతం.. 

అశాశ్వతం అనుకుంటూ త్యజించిన తర్వాత చివరకు అన్నింటినీ త్యజించిన నువ్వు మిగిలిపోతావు గదా. 

ఆ త్యజించడానికి వీలుకాని చివరికి మిగిలిన “నువ్వే” ఆ శాశ్వతమయిన “భగవంతుడివి”. 

అంతేగాని నువ్వు సాదారణమయిన మానవుడివి కాదని తెలుసుకోవాలి. 

నువ్వు లోకాన్ని పట్టుకుని ఉంటే మానవుడిగా మిగిలిపోతావు. 

నువ్వు లోకాన్ని త్యజిస్తే భగవంతుడివి అయిపోతావు. 

అంతే తేడా. 

ఇక్కడ త్యజించడం అంటే అర్ధం నాది, నావి అని మనసులో అనుకునే కాలంతో పాటు నశించే అశాశ్వతమయిన వాటినన్నింటినీ ఇవేవీ నావి కాదు అని వాటి మీద అభిమానాన్ని మనసులోంచి తొలగించడమే.! 

ఆసక్తి రహితంగా అభిమాన రహితంగా జీవించడం అలవాటు చేసుకుంటే నీ యొక్క ఆత్మే స్వయంగా  “ఆత్మ సాక్షాత్కారానికి” ద్వారాలు తెరుస్తుంది.

మనసులోకి లోక విషయాలను రానివ్వకుండా దేనిమీదా ఆసక్తి పెంచుకోకుండా మనసును దీర్గ కాలం పాటు నిర్విషయ స్థితిలో నిలుపుకోగలిగితే మనస్సు విషయ రహితం అయిపోయి ఆత్మలో ఏకమైపోతుంది. 

నేను ఈ శరీరాన్ని. 

ఇప్పుడు నేను పుట్టాను. 

ఇప్పుడు నేను మరణిస్తున్నాను. 

ఇది నాకు సుఖం. 

ఇది నాకు దుఃఖం అని నిరంతరం భావన చేసే మనస్సు అదృశ్యం అయిపోయాక ఇక మరణం ఎవరికి ? 

మరణాన్ని గ్రహించేది ఒకటి ఉంటేనే గదా మరణం అనే అనుభవం ఉండేది. 

గ్రహించే మనస్సే లేకపోతె ఇక మరణానుభవం ఎవరికి? 

కాబట్టి మరణానుభవం ఎక్కడ ఉండదో అక్కడ మరణం లేనట్లే. 

మరిక ఆ ఆత్మసాక్షాత్కార స్థితిని సాధించడానికి ఆలస్యం ఎందుకు? 

అలాగే మనస్సు తొలగినప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే! 

అది నిర్విషయ స్థితి. 

అంటే ఏ విషయాలూ మనిషికి జ్ఞప్తిలో లేనటువంటి స్థితి అది. మనస్సు మనిషి స్వస్వరూపమయిన “ఆత్మ”లో ఏకమైపోయినప్పుడు ఆ స్థితి లభిస్తుంది. 

మనిషి అప్పుడు ఆత్మస్థితిలో నిలిచి ఉంటాడు. 

ఆ స్థితిలో మనిషికి ఆలోచనలు ఉండవు. 

కేవలం “ఆనందం” మాత్రమే ఉంటుంది. 

ఆ ఆనందం పొందడానికి అందరూ అర్హులే. 

మరి అందరికీ ఆ స్థితి ఎందుకు లభించడంలేదు అంటే..! 

మానవుడు కదిలించేదాన్ని వదిలేసి కదిలేదాన్ని చూసుకుంటూ “ఇదే నేను” అనుకుంటున్నాడు. 

అంటే ఆలోచన వల్ల శరీరం కదులుతుంది. 

శరీరం తనంతట తానుగా ఎటూ కదలదని అందరికీ తెలిసిందే. 

మన యొక్క ఆలోచనల వల్లే ఈ శరీరం ఎటయినా కదలడం అనేది జరుగుతుంది. 

ఇక్కడ కదిలేది శరీరం. 

శరీరాన్ని కదిలించేది ఆలోచన. 

కాబట్టి కదిలే శరీరం సత్యమా? 

కదిలించే ఆలోచన సత్యమా? 

కదిలేది జడం.  

కదిలించేది చైతన్యం. 

కదిలించేది సత్యం అవుతుందిగాని కదిలేది సత్యం ఎలా అవుతుంది? 

ఇక ఈ శరీరం ఆకారం కలిగి ఉంది. 

దాన్ని కదిలించే చైతన్యం నిరాకారం. 

మరి ఆకారం లేని చైతన్యానికి మరణం ఎక్కడిది ? 

ఒక గ్రామంలో అగ్ని చెలరేగితే ఆ గ్రామంలోని ఇళ్ళన్నీ కాలి బూడిదవుతాయి. అక్కడి ఆకాశం బూడిదవుతుందా ? 

కాదు. ఎందుకంటే ఆకాశానికి ఆకారం లేదు. 

ఆకారం లేనిదాన్ని ఏదీ తాకలేదు. 

అదేవిదంగా శరీరాన్ని కదిలించే ఆత్మకు కూడా నాశనమనేదే లేదు. 

ఒక శరీరం మరణిస్తే ఆత్మ ఇంకో శరీరాన్ని ధరిస్తుంది లేదా ముక్త స్థితిలోకయినా వెళ్ళిపోతుంది. 

మరి శోకమెందుకు. 

మానవుడి దృష్టి తాను ధరించిన శరీరం మీద ఉంటే మాత్రం ‘నేను ఈ శరీరం’ అనే భావన అతడికి వుంటుంది. 

అప్పుడిక అతడి దృష్టిలో బాహ్య ప్రపంచమూ వుంటుంది. 

దుఃఖంమూ వుంటుంది. 

చివరికి మరణమూ వుంటుంది. 

తర్వాత ఇంకో శరీరాన్ని ధరించి ఈ లోకాలలోకి తిరిగి రావలసీ ఉంటుంది. 

కాబట్టి నేను ఈ శరీరం అనుకోవడం అనేది మనసులోంచి చెరిపెయ్యాలి.

అలాగే మరణం అనే మూర్చ తర్వాత ఆత్మ తిరిగి ఏ రకమయిన శరీరాన్ని ధరించి ఏ లోకంలోకి వెళ్లి సుఖ దుఃఖాలు అనే అనుభవాలను పొందుతోందో ఎవ్వరూ చెప్పగలిగేది కాదు. 

జీవించినంత కాలం మనం చేసిన పవిత్రమయిన మరియు అపవిత్రమయిన కర్మల ఆధారంగా మన మనసులో ఏర్పడి ఉన్న సంస్కారాల యొక్క అల్ప అధిక స్థాయిలను బట్టి ఒక నూతన శరీరాన్ని ఆత్మ తిరిగి ధరిస్తుంది. 

ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే ఐదు లోకాలలో ఆత్మ శరీరాలను ధరించి అనుభవాలను పొందుతోంది. 

కాబట్టి మానవులు తాము చేసే కర్మలను నిత్యం గమనించుకుంటూ ఉండాలి. 

తాము చేసేవి మంచి కర్మలా? లేక చెడ్డవా అని!

కనుక ఇప్పుడే ఇక్కడే మానవుడి దృష్టి గనక ‘జ్ఞాన మయం’ అయితే శరీర బ్రాంతిని వదలిపెట్టి కేవలం నిరాకార “ఆత్మ” ఒక్కటే సత్యమని అదే తనయొక్క స్వరూపమని తాను ఈ నశించే శరీరం కాదని అతడు గ్రహించగలడు. 

అలా గ్రహించడమే జన్మ-కర్మల నుంచీ శరీరాలనే భ్రమల నుంచీ మానవునికి ‘ముక్తి’. 

అదే మానవ శరీరాన్ని ధరించడం యొక్క పరమ ప్రయోజనం కూడా. 

మానవుడు గనక తన జీవిత పర్యంతం మనసులో లోక విషయాలను భావించక పొతే సుఖదుఃఖాలు అనే రెండూ అతడికి అనుభవానికి రావు. 

సుఖ దుఃఖాలు రెండూ మానవుని మనస్సుకు అనుభవానికి రానప్పటి ఆ స్థితినే “పరమశాంత” స్థితి అని “మోక్షం” అని “బ్రహ్మానందం” అని శాస్త్రాలు చెబుతున్నాయి. 

మానవుడు అట్టి పరమ“శాంతి” కొరకు ఎందుకు ప్రయత్నం చెయ్యకూడదు. 

అసలు దైవం, భగవంతుడు అని లోకంలోని జనులు పలికేది అట్టి శాంతస్థితి లో నిలిచి వున్న మానవున్నే. 

అట్టి భగవత్ స్థితిని పొందడం కొరకు మానవుడు చెయ్యాల్సిందల్లా మనసులో ఏదీ భావించకపోవడమే. 

ఏవేవో కల్పిత విషయాలు భావించడంలో మనసుకు కొంత శ్రమ ఉందేమోగాని అసలు ఏదీ భావించకపోవడంలో శ్రమ ఏమి ఉంది. 

ఈ మాత్రం దానికి ఏకంగా “ముక్తి” అని చెప్పబడే “బ్రహ్మానంద” స్థితి లభిస్తుంటే అది వదలిపెట్టి మాకు ఏదో లభిస్తే ఆనందం మరేదో పొందితే ఆనందం ఇంకేదో దొరికితే ఆనందం అని బిగ్గరగా పాటలు పాడుకుంటూ… చేతిలోని ద్రాక్ష పళ్ళను నేల మీద జారవిడచి 

ఆహా..! ఆ వేప చెట్టుకు వ్రేలాడుతున్న వేప పళ్ళు ఎంత రుచిగా ఉంటాయో గదా ఎక్కి కోసుకుంటాను అని వేప చెట్టు ఎక్కే వాణ్ని ఏమనాలి!

ఇక్కడొక చిత్రం చూడండి. 

ధన౦ లేని వాడు అయ్యో నాకు ధనం లేదే అని దుఃఖిస్తున్నాడు. 

ధనం వున్నవాడు అయ్యో ఆ స్త్రీని పొందలేకపోయానే ఆ పదవిని పొందలేక పోయానే అని ఏడుస్తున్నాడు. 

మనుషులంతా లేచిన మొదలుకుని “ఆనందం” కొరకు ప్రయత్నిస్తున్నారు. 

కానీ అందరూ దుఃఖిస్తున్నారు. 

భూమినంతా పరిపాలించే చక్రవర్తి కూడా ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ శత్రురాజు వచ్చి తనను  చంపి తన రాజ్యాన్ని వశం చేసుకుంటాడో అని భయపడుతూనే బ్రతుకుతుంటాడు. 

అజ్ఞానం తొలగనంతవరకు మానవుని తీరు ఇలానే ఉంటుంది.

“భగవంతుడు” గురించి ఇప్పుడు అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం. 

ఒక వ్యక్తి ఒక చర్చ్, మసీద్ లేక గుడికో వెళ్ళాడు అనుకుందాం. 

అతను తనకు పది అడుగుల దూరంలో వున్న భగవంతుని విగ్రహాన్ని చూస్తూ తన కుమార్తె మంచి మార్కులతో పరీక్ష పాసయ్యేలా చూడమని తన మనస్సులో కోరుకుంటున్నాడు. 

అతను అలా కోరుకునేది అతని ప్రక్కనే నించుని వున్న మరియొక వ్యక్తికి వినిపిస్తుందా? 

వినిపించదు. 

సరే! కోరుకునే అతని చెవులకయినా అది వినిపిస్తుందా? 

అతనికీ అది వినిపించదు. 

ఎందుకంటే అతను కోరుకునేదేదయితే ఉందో అది అతని బుద్దిలో ఉంది కాబట్టి. 

అది బయటకు వినిపించదు. 

మరి కోరుకునే వాని శరీరంలో భాగమయిన అతని చెవులకే అతను కోరుకునేది వినిపించనప్పుడు పది అడుగుల దూరంలో ఉన్న భగవంతుడు అది ఎలా వినగలడు? 

ఒక వేళ భగవంతుడు తప్పక అన్నీ వింటాడు అనుకుంటే ఆ భగవంతుడు అతడి కోరిక వినడానికి ఎక్కడ ఉండి ఉండాలి. 

కోరుకునేదంతా వుండే అతడి బుద్దిలోనే ఆ భగవంతుడు ఉండి ఉండాలి! 

అతని బుద్ది అతని కంటే వేరైనదా? 

వేరయినది కాదు. 

మరి అతని బుద్ది అతనికంటే వేరైనది కానప్పుడు అతని బుద్దిలో వున్నది కూడా అతని కంటే వేరైనది కాదు గదా! 

మరి అతని బుద్దిలో భగవంతుడు వున్నప్పుడు అతను “భగవంతుడే” అవుతాడు కదా. 

దీన్ని బట్టి మనకు అర్ధం అయ్యేదేంటి? 

భగవంతుణ్ణి మనసులో భావన చేసేవాడే భగవంతుడు. 

ఇది అజ్ఞానం తొలగించుకున్న తర్వాత ప్రతి మానవునికీ అర్ధం అవుతుంది. 

మరయితే భగవంతున్ని పూజించడం ప్రార్దించడం యొక్క పరమార్ధం ఏంటి అంటే..! 

ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేది వారి వారి శరీరాలతో కాదు గదా! 

మాట్లాడుకునేటప్పుడు ఒకరి మనోబుద్దులు మరొకరి మనోబుద్ధులతో కలుస్తూ ప్రతిస్పందిస్తుంటాయి. 

శ్రీరాముని గుడిలోకి వెళ్లి శ్రీరాముని గురించి మన మనసుతో ధ్యానిస్తూ భావన చెయ్యడం వల్ల మన మనస్సు శ్రీరాముని మనస్సుతో కలుస్తుంది. 

శ్రీ రాముడు సాక్ష్యాత్తు “భగవంతుడు” అనే భావన మన మనస్సులో ఏర్పడి ఉండి మనం భావన చెయ్యడం చేత అత్యంత శక్తి కలిగిన శ్రీ రాముని మనో బుద్ధులు మన మనస్సులోకి ప్రవేశించి ఆ భావన మనలో ఉన్న కాసేపు  మనమే శ్రీ రాముని ప్రతిబింబంగా అయిపోతాం. 

అప్పటి ఆ కొద్ది సమయంలో శ్రీరామునికీ మనకూ తేడా ఉండదు. 

శ్రీ రాముని మనస్సు మన మనస్సులోకి ప్రవేశించి ఉండటం చేత ఆ కొద్ది క్షణాలలో మన మనసుకు ఎంతో శాంతి ఎప్పుడూ మనకే కనిపించని మంచి మంచి గుణాలన్నీ మనకు తెలీకుండానే మనలో ఆ కొద్దిసేపు ఏర్పడతాయి. 

మన మనసులో ఎన్ని కష్టాలు ఉన్నా “భగవంతుని” గుడిలో ఉన్న కాసేపు మనం చాలా ప్రశాంతంగా ఉండటానికి కారణం ఇదే. 

కావాలంటే చూడండి చాలా మంచివాడయిన ఒక గుణవంతుడు ఒక చెడ్డ వాడియొక్క చెడు గురించి విని అతడి గురించి ఆలోచిస్తునప్పుడు మంచివానిలో క్రోధం పెరుగుతుంది. 

మరి మంచి వానిలో క్రోధం ఎక్కడి నుంచి వచ్చింది. ?

ఎక్కడ నుంచి వచ్చిందంటే ఎప్పుడయితే ఒక మంచి గుణవంతుడు ఒక చెడ్డ వాని చెడు గురించి తన మనస్సుతో ఆలోచిస్తున్నాడో అప్పుడు ఆ చెడ్డవాడి మనస్సులోని చెడ్డ గుణాలు మంచి వాడి లోకి ప్రవేశించి మంచివాడే ఆ కొద్దిసేపు చెడ్డవాడిగా మారిపోయి క్రోధంతో ప్రవర్తిస్తున్నాడు. 

చూసారా ఈ మనస్సు యొక్క మాయాజాలం ఎలాంటిదో.! 

లోకంలో చెడు గుణాలు కలిగిన వారితో స్నేహం చెయ్యడం వల్ల చెడు లక్షణాలు మంచి గుణాలు కలిగిన వారితో స్నేహం చెయ్యడం వలన మంచి లక్షణాలు జనులకు ఏర్పడడం అనేది అందరూ చూస్తున్నదే గదా. 

ఒక్క మాటలో చెప్పాలంటే అది గుడిలో ఉన్నప్పుడు కానివ్వండి లేదా బయట మరెక్కడయినా ఉన్నప్పుడు కానివ్వండి ఎవరయితే నిరంతరం భగవంతుడు “శ్రీరామచంద్రుని” గుణాలను తన మనస్సులో గుర్తుకు తెచ్చుకుంటూ భావన చేస్తుంటాడో అతడు కొన్నాళ్ళకు “శ్రీరాముడే” అయిపోతాడు. 

ఇదే సత్యం. 

గుడికి వెళ్లి భగవంతుని భావన చెయ్యడంలోని రహస్యం ఇదే. 

కాబట్టి మనలోని అజ్ఞానాన్ని తొలగించుకోడానికి మనం నిత్యం జ్ఞానులను, దేవుళ్ళను మనసులో భావిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. 

దేవాలయాలకు, చర్చిలకు, మసీదులకు ఇలా ఎవరి నమ్మకం ఎక్కడుంటే అక్కడకు వారు వెళ్లి  ధ్యానిస్తూ ఉండాలి. 

నేను ఎక్కడకూ వెళ్ళలేను ఉన్నచోటే ఉండి భగవంతుణ్ణి ధ్యానిస్తాను అంటే అదీ మంచిదే. 

భగవంతుణ్ణి నిరంతరం మనసులో ధ్యానిస్తూ ఉండటం ముఖ్యంగాని ఎక్కడ ఉండి ధ్యానిస్తున్నామనేది విషయమే కాదు. 

ఎందుకంటే ధ్యానించే వాడే భగవంతుడు. 

తనను తాను ధ్యానించడానికి అతడు ఎక్కడుంటే ఏముంది. 

తానే భగవంతుడు అనే సంగతి మానవుడు మరచిపోవడం వల్ల ఆ విషయం తిరిగి అతడికి అనుభవంలోకి రావడానికే ఈ భగవంతుడు, ధ్యానము అనేదంతా.

తడి గుడ్డ ఎండలో పడిందనుకో అప్పుడేమవుతుంది ? 

భగ భగమని మండే ఆ ఎండ గుడ్డలోని తడినంతా పీల్చేసి గుడ్డను పొడి పొడి చేసేస్తుంది. 

అలాగే మానవుని అజ్ఞాన మనస్సు ప్రతిక్షణం శ్రీరాముని, శ్రీ కృష్ణుని, గౌతమ బుద్ధుని, జీసస్ ని, మహమ్మద్ ను, శ్రీ వేంకటేశ్వర స్వామిని, వేదవ్యాస మహర్షిని, వసిష్ఠ మహర్షిని, వాల్మీకి మహర్షిని, రామకృష్ణ పరమహంసను, షిర్డీ సాయిబాబాను, స్వామి వివేకానందను, గురునానక్ ను, రమణ మహర్షిని, పరమశివుడు భగవంతుడగు శ్రీ శివ భగవానుని పాదాలను ఇలా ఎవరి నమ్మకానికి తగినట్లుగా వారు తమ తమ ధైవాన్ని మనసులో ధ్యానించడం జరుగుతూ ఉండాలి. 

దానివల్ల మన అజ్ఞాన మనసులోకి వారి దైవీ శక్తి కలిగిన చైతన్య శక్తి ప్రవేశించి మన అజ్ఞానాన్ని దగ్దం చేసి వారికీ మనకూ తేడా లేకుండా చేసేస్తుంది. 

అప్పుడు శాశ్వతమయిన శాంతి మనకు లభిస్తుంది.

కాబట్టి బుద్దే “భగవంతుడు” అనుకున్నాం గదా! 

సందేహం లేదు. 

మరి ఇక ఈ శరీరం సంగతేంటి? 

బుద్దీ, శరీరం ఒక్కటేనా? 

లేక వేరు వేరా? 

వేరు వేరయితే బుద్ధి యొక్క ఆజ్ఞను శరీరం పాటిస్తూ ఎలా కదులుతోంది. ?

 ఎందుకంటే బుద్ధికి ఆకారం లేదు. 

శరీరం ఆకారం కలిగి ఉంది. 

ఆకారం లేని బుద్ది  ఆకారం కలిగి వున్న శరీరాన్ని ఆజ్ఞతో కదిలించగలగడం ఏంటి? 

అదే నిజమయితే మనిషిలోని బుద్ది ఒక చెట్టువైపు చూసి ఆ చెట్టుకు వ్రేలాడుతున్న పండు ఇప్పుడు నా చేతిలోకి రావాలి అనుకుంటే ఆ పండు చేతిలోకి వచ్చెయ్యాలి కదా! 

మరి పండు ఎందుకు రావడం లేదు? 

బుద్ది అనేది కేవలం శరీరాన్ని మాత్రమే కదిలించగలుగుతోందిగాని బయటి వాటిని ఎందుకు చలింపచేయలేకపోతోంది. 

లేదు లేదూ.. 

శరీరం బుద్ది అనేవి రెండు కాదు.. 

శరీరమే బుద్ది.. బుద్దే శరీరం అని అనుకోవడానికి శరీరం ఆకారం కలిగి ఉంటే బుద్దికి ఆకారం లేదు. 

ఆకారం నిరాకారం ఒక్కటెలా అవుతాయి. 

చెట్టు ఆకాశంలోకి పెరిగి ఉన్నంతమాత్రాన ఆకాశం, చెట్టు ఒక్కటవుతాయా ? 

కాలేవు గదా! వీటికి సమాదానం ఇప్పుడు చూద్దాం.

కదిలేది సత్యమా? 

కదిలేదాన్ని కదిలించేది సత్యమా? 

కదిలేది జడం. 

కదిలించేది చైతన్యం. 

కాబట్టి కదిలించేది సత్యం. 

ఈ శరీరాన్ని కదిలించేది బుద్ధి కాబట్టి.. 

బుద్ధికి ఆకారం లేదు కాబట్టి.. 

కదిలే శరీరానికి కూడా ఆకారం లేదు అని గ్రహించడమే అంతిమ జ్ఞానం. 

“నేను” అంటే ఈ కనిపిస్తున్న శరీరం కాదు. 

ఎందుకంటే “నేను” అనే భావనకు ఆకారం లేదు. 

ఆకారం లేనిది ఆకారాన్ని ఎలా చూడగలదు. 

కాబట్టి నాచే చూడబడే ఈ శరీరానికి కూడా ఆకారం లేనట్లే అని గ్రహించాలి. 

స్వప్నంలో కూడా నేను నా శరీరాన్ని అనేక ఇతర అనేక శరీరాలను చూస్తున్నాను. 

మెలుకువ వచ్చాక అవన్నీ ఏమైనట్లు! 

అవి లేనివే అనుకోడానికి స్వప్నంలో ఉన్నట్లుగానే చూస్తూ అనుభవాలు పొందాను గదా! 

కాబట్టి నేను చూస్తున్న ఇక్కడి ఈ శరీరం కూడా ఆకారం కలిగి వున్నట్లు భ్రమ చేత పైకి కనిపిస్తున్నా వాస్తవానికి ఈ శరీరం కూడా ఆకారం లేనిదే ఎందుకంటే ఆకారం అంటూ లేని నా స్వరూపంతో లేక బుద్ధితో చూడబడేదంతా కూడా ఆకారం లేనిదే అవుతుంది గాని ఆకారాలుగా కనిపించేవన్నీ వాస్తవానికి ఉన్నవి కావు అని గ్రహించడమే జ్ఞానం.

కాబట్టి “బుద్దే భగవంతుడు” అంటే “నేనే భగవంతుడు” అని తెలుసుకున్నాం సరే! 

అంత మాత్రాన దుఃఖం తొలగి ఆనందం అనుభవంలోకి వస్తుందా? 

రాదు. 

ఎందుకంటే ఎడారిలో ఇసుకపై మండుటెండలో నడుస్తూ  దాహంతో గొంతు ఎండిపోతున్న వానికి ఒక చోట “నీరు” కనిపించగానే దాహం తీరుతుందా? 

తీరదు . 

దాహం తీరాలంటే నీటిని చూస్తే చాలదు. 

నీటిని త్రాగాలి.

“నేనే భగవంతుడు” అంటే నశించే ఆకారాలతో సంబందం లేని “ఆనందమే స్వరూపం”గా కలవాడినే నేను అని ఎరిగి ఆ ఎరిగిన దాన్ని నిరంతరం మనసులో భావన చేస్తూ ఆ స్థితిలో స్థిరంగా మన మనఃస్థితి నిలిచేంత వరకు ఆ భావనను కొనసాగించాలి.

 భావనా బలం చేత కొన్నాళ్ళకు మనిషి బ్రమను దాటి మనసును ఛేదించి “బ్రహ్మం” అని శాస్త్రాలలో చెప్పబడే మనఃస్థితిలో నిలిచిపోతాడు. 

అట్టి స్థితిలో మనస్సు ఉండదు. 

అక్కడ ఆనందం అనుభవించేవాడు ఆనందం అంటూ వేరు వేరుగా రెండు ఉండవు. 

అదియే మానవుని స్వస్వరూపం. 

మోక్ష స్థితి అని చెప్పబడే అకృత్రిమమయిన “ఆనందం” అదే. 

తెలిసినా తెలియకున్నా ప్రతి ప్రాణి ఆరాటపడేది ఆ “ఆనందం” కోసమే. 

అయితే మానవుడు తగినంత ప్రయత్నశీలుడు కాకపోవడం వల్ల ఆ స్థితి లభించడం లేదు.

మరొకసారి శ్రద్దగా గమనించండి. 

ఈ ప్రపంచం “కంటికి” కనిపిస్తోంది. 

అదే కంటికి ఈ ప్రపంచాన్ని “చూసేది” కనిపించట్లేదు. 

ఎంత విచిత్రం. “చూసేదానికేమో” ఆకారం లేదు.

 కాని చూడబడే ప్రపంచం అంతా ఆకారం కలిగి ఉంది. 

చూడబడేదాన్నంతా ఏదయితే చూస్తోందో ఆ చూసే దాన్ని చూడడమే “సర్వం” చూడడం అవుతుంది. 

అప్పుడు “చూసేదే చూడబడేది కూడా” అని అర్ధం అవుతుంది. 

అలాగే చూసేదానికంటే వేరుగా చూడబడేదనేది మరొకటి లేదు ఒకవేళ వుందంటే “చూడబడేదంతా కూడా చూసేదాని రూపమే కాబట్టి చూసే నాకు  రూపంలేదు కనుక నాచే చూడబడే సమస్తం నిరాకారమే” అనే మహత్తరమయిన అనుభవం మానవునికి కలుగుతుంది. 

అట్టి అనుభవం మనిషికి కలిగాక అతడు “జన్మ-మృత్యువు” అనే రెండు బ్రమలను దాటేస్తాడు. 

ఎందుకంటే జన్మించడం మరణించడం అనే రెండు భ్రమలు శరీరానికి చెందినవి. 

నేను శరీరం కాదు. 

జన్మ మృత్యువులు రెండూ నాకు చెందినవి కావు అని ఎవడు గ్రహిస్తాడో అతడు మరణాన్ని జయించినవాడే అవుతాడు. 

అలా గ్రహించడమే “బ్రహ్మనందం” అనీ “ముక్తి” అనీ “ఆత్మ సాక్ష్యాత్కారం” అనీ శాస్త్రాలు చెబుతున్నాయి.

జన్మించడం మరణించడం అనేది వస్తు దృష్టి. 

ఈ అయిదు లోకాల్లోని ఏ వస్తువయినా ఒకనాటికి నశించాల్సిందే. 

పుట్టే ప్రతిదీ ఆకారం కలిగి వుంటుంది. 

ఆకారం కలిగిన ప్రతిదీ నశిస్తుంది. 

మనిషి స్వరూపం నిరాకారం. 

ఆకారమే లేని మనిషికి నాశనం అనేది ఎక్కడుంటుంది.

 ఒక గ్రామంలో అగ్ని చెలరేగితే ఇళ్ళన్నీ బూడిదవుతాయి. 

ఆకాశం బూడిదవుతుందా ? 

కాదు గదా! 

కాబట్టి ఆకారాలే నశిస్తాయి. 

నిరాకారానికి నాశనం లేదు. 

అలాగే నిరాకారానికి జన్మా లేదు. 

జన్మే లేదు కాబట్టి మృత్యువు కూడా లేదు. 

నేను ఈ శరీరాన్ని అనుకున్నవాణ్ని మృత్యువు  కభళిస్తుంది. 

ఈ శరీరం నేను కాదు నేను నిరాకార చైతన్యాన్ని అనే భావనలో వున్న వానిని మృత్యువు ఏమీ చెయ్యలేదు. 

ఆకాశాన్ని అగ్ని దహించగలదా ? 

ఆకారం లేని దాన్ని మృత్యువు ముట్టుకోనైనా లేదు. 

ఈ శరీరం నేను అనుకున్నవాడికి మరణం తప్పదు. 

ఇక మరణించిన వాడు తిరిగి జన్మించక తప్పదు. 

మనస్సు మరణిస్తేనే ముక్తి. 

శరీరం మరణిస్తే మనస్సు ఇంకో శరీరమనే బ్రమను పొంది “ఇదే నేను” అని అనుకుంటూ మళ్ళీ మళ్ళీ ఈ పంచ లోకాలు అనే బ్రమల్లో తిరిగాడుతూనే వుంటుంది. 

ఈ ప్రపంచాన్ని మనస్సు నమ్మినంతకాలం ఏదో ఒక శరీర రూపంలో అది ఈ ప్రపంచంలోనే తిరుగాడుతూ ఎప్పటికప్పుడు ఈ శరీరమే నేను అనుకుంటూ సుఖదుఃఖాలనే బ్రమలను పొందుతూనే వుంటుంది. 

సత్యాన్ని ఎరగనంత వరకు మానవునికి ఎప్పటికీ శాంతి లబించదు. 

ఇంకా చెప్పాలంటే ఈ శరీరాలకు వచ్చేవి నిజమయిన వ్యాధులు కాదు. 

ఈ అనేకమైన ఆకారాలుగా కనిపిస్తున్న ఈ శరీరాలే అసలయిన వ్యాధులు. 

మానవ శరీరం ఒక వ్యాది. 

పశు శరీరం ఒక వ్యాది. 

పక్షి శరీరం మరొక వ్యాది. 

ఈ వ్యాధులన్నీ ఆత్మను వదలి మనస్సును నమ్మడం అనే అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. 

మనస్సును జయిస్తేనే ఈ శరీరాలనే వ్యాదులనుంచి ఆత్మకు ముక్తి. 

అప్పుడే జీవుని ఆనందమయ ఆత్మ స్వరూపం జీవునికి అనుభవంలోకి వస్తుంది. 

అంత వరకూ జన్మ - మృత్యువు అనే భ్రమలు ఆత్మకు తప్పవు.

ఇక ఇక్కడ ఈ కంటికి ఎదురుగ్గా ఈ ప్రపంచం, ఈ శరీరాలు ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే ఇదంతా స్వప్న మాత్రం ఆకారం ఉన్నట్లుగా కనిపించినా ఇవన్నీ ఆకారం లేనివే అని ఎలా అనుకోగలం అనే సందేహం రావచ్చు. 

తప్పక వస్తుంది కూడా. 

సందేహాలన్నీ తొలగితేనే ఆత్మ ప్రకాశిస్తుంది.

 కాబట్టి ఇదంతా ఎలా స్వప్న మాత్రమో ఇప్పుడు తెలుసుకుందాం.

స్వప్నం స్వప్న సమయంలో సత్యం. 

మెలుకువ వచ్చాక అసత్యం. 

మెలుకువ రానంత వరకు అసత్యం అని తెలీదు గదా! 

సత్యం లానే అనుభవాలు పొందుతున్నాం. 

మరి మెలుకువ వచ్చాక స్వప్న ప్రపంచమంతా ఎటు పోయినట్లు? 

ఎటయినా పోవడానికి అసలు వుంటేనే గదా! 

మెలుకువ రాగానే ఇదంతా లేనిదే అని మనకు తెలిసిపోతుంది. 

మనిషిలోని చిత్ చైతన్యమే భ్రమచేత జీవులుగా, వస్తువులుగా, ప్రపంచంగా తనే కల్పన చేసుకుని అదంతా తన ఎదురుగ్గా ఉన్నట్లుగా దర్శించింది తప్ప చిత్ చైతన్యంకంటే వేరయిన బాహ్య ప్రపంచం స్వప్నంలో ఎక్కడుంది? 

ఇదంతా భ్రమ అని స్వప్నం నుంచి మెలుకువ వచ్చాక మాత్రమే మనం అర్ధం చేసుకుంటున్నాంగాని అనుభవాలు పొందే సమయంలో మాత్రం సత్యమనే భావిస్తున్నాం కదా! 

అదేవిదంగా ఈ కంటికి కనిపించే ఈ ఎదురుగ్గా వున్న ప్రపంచం కూడా ఇప్పటి మాయా దృష్టికి ఎవరు ఎంత భోదించినా ఇదంతా ఎదురుగ్గా లేదంటే నమ్మలేం. 

కనిపించేదంతా ఉన్నదనే అనుకుంటాం. 

స్వప్న సమయంలో స్వప్న అనుభవాలు అన్నీ భ్రమ మిధ్య అని అనుభవించే సమయంలో ఎలా తెలీదో ఇప్పటి ఈ ప్రపంచం కూడా స్వప్నంలాగే మిధ్య అంటే ఇప్పుడు మనం నమ్మలేం. 

ఒకటి గమనించండి స్వప్నం స్వప్న సమయంలో సత్యం. 

మెళుకువలోకి వచ్చాక స్వప్నం యొక్క రూపం ఏంటి? 

అది కేవలం ఒక అనుభవం మాత్రమే గదా. 

జరిగిపోయిన స్వప్నాన్ని మళ్ళీ ఇంకోసారి చూడాలి ఎదురుగ్గా రా అంటే వస్తుందా? 

రాదుగదా! 

అలానే నిన్న మనం ఈ శరీరంతో ఈ లోకంలో అనుభవించినవన్నీ నేడు మన కంటి ఎదురుగ్గా రమ్మంటే తిరిగి వస్తాయా? 

మరి ఈ శరీరంతో లోకంలో అనుభవించేవన్నీ నిజంగా ఉన్నవి అయితే నిన్నటి రోజుని మనం కోరుకుంటే నేడు ప్రత్యక్షం చేసుకోగలగాలి గదా! 

అలా ఎవరయినా ఈ లోకంలో నిన్నటి జరిగిపోయిన రోజులోని సంఘటనలను తిరిగి నేడు ప్రత్యక్షం చేసుకోగలుగుతున్నారా?

 అలా చేసుకోలేనప్పుడు నిద్రలోని స్వప్నానికీ, శరీరంతో నిన్న గడిపిన రోజుయొక్క సంఘటనలకు తేడా ఎక్కడుంది. 

స్వప్నం మెలుకువలోకి వచ్చాక ఊహా మాత్రం. 

అలాగే నిన్నటి భౌతిక అనుభవాలు నేటికి ఊహామాత్రం! 

రెంటికీ భేదం ఎక్కడుంది. ఆలోచించండి.

ఇప్పటి ఈ కంటికి కనిపిచేదంతా “స్వప్న సమానమే” అనే సత్యాన్ని స్పష్టంగా అర్ధం కావడానికి మరింత వివరంగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

శ్రద్ధగా గమనించండి.

నిన్న రాత్రి ఒక స్వప్నాన్ని దర్సించాం. 

పొద్దున మెలుకువ వచ్చింది. 

మళ్ళీ నేటి రాత్రి ఇంకొక స్వప్నాన్ని దర్శించాం. 

నిన్న రాత్రి దర్శించిన స్వప్నానికి నేటి రాత్రి మొదలయ్యే స్వప్నం కొనసాగింపుగా ఉంటుందా? 

ఉండదు. 

ప్రతి రోజూ ఒక కొత్త స్వప్నం వస్తుంది గాని నిన్న రాత్రి స్వప్నం ఆగిన చోటు నుంచి నేటి రాత్రి స్వప్నం కొనసాగదు. 

కాని ప్రతి రోజు రాత్రి గడచిన తర్వాత పొద్దున మెలుకువ రాగానే అదే ఇల్లు. 

అదే మంచం. 

అవే వస్తువులు. 

తల్లి తండ్రి భార్య పిల్లలు రాత్రి పొడుకునే ముందు చూసినవే పొద్దున యధాతదంగా ప్రతిరోజూ కనిపిస్తున్నాయి. 

కాబట్టే స్వప్నం మిధ్య. 

శరీరంతో దర్శించే ఈ ప్రపంచం మాత్రం సత్యం అని మనం నమ్ముతున్నాం.

ప్రతిరోజూ స్వప్నంలోంచి మెలుకువ రాగానే మనం ఏమనుకుంటున్నాం. 

ఇదంతా అసత్యం మిధ్య అనుకుంటున్నాం గదా. 

అంటే నేను స్వప్నంలో చూసిందంతా వాస్తవానికి వున్నది కాదు అని అనుకుంటున్నాం. 

అలా అనుకోవడం వల్ల స్వప్న సంఘటనలు మనస్సులో లేకుండా అప్పటికప్పుడే తొలగిపోతున్నాయి. 

స్వప్నం అసత్యం భ్రమ అని భావించడం వల్ల స్వప్న లోకమంతా మనస్సులోంచి తొలగిపోతుంది. 

క్రిందటి రోజు స్వప్నం మన మనసులో లేకుండా పోవడం వల్ల తర్వాతి రోజు ఇంకొక కొత్త స్వప్నం మొదలవుతోంది. 

క్రితం రోజు ఆగిన చోటునుంచి స్వప్నం కొనసాగాలంటే క్రితంరోజు స్వప్నం మనసులో నిలిచి వుండాలి కదా? 

ప్రతి స్వప్నం తర్వాత మెలుకువ రాగానే ఇదంతా అసత్యం భ్రమ అని భావించడం వల్ల ముందు రోజు స్వప్నం మనస్సులో లేకుండా పోయి తర్వాతి రోజు తిరిగి మరొక కొత్త స్వప్నం మొదలవుతోంది. 

నిన్నటి స్వప్నం మనసులో లేకుండా పోవడం వల్ల కొత్త స్వప్నంలో నిన్నటి స్వప్న సంఘటనలు కొనసాగడం లేదు అలాగే గుర్తుకి కూడా రావడంలేదు.

అలాగే గత జన్మలో మరణించిన మనం మరణమనే మూర్చ తర్వాత స్వప్నంలోంచి మెలుకువలోకి వచ్చిన రీతిగానే మరొక శరీరాన్ని కలిగి వుండి అప్పటివరకూ అనుభవించిన క్రితం జన్మలోని సంఘటనలన్నీ స్వప్నం అని మనసులో భావించడం జరుగుతుంది. 

స్వప్నం అని భావించిన గతజన్మ సంఘటనలను అక్కడికక్కడే మనసులోంచి చెరిపేసి ఇక అక్కడినుంచి అప్పుడు కలిగి వున్న శరీరానికి చెందిన అప్పటి వర్తమానపు బంధాలతో కొనసాగడం జరుగుతోంది.

 అలా కొనసాగేదంతా నిజం అనుకుంటూ నా భార్య, తల్లి, పిల్లలు, సంపదలు అనుకుంటూ తిరుగాడుతున్నాం.

 ఈ జన్మలో మళ్ళీ మరణమనే మూర్చ ఎప్పుడు కలుగుతుందో అక్కడే మరియొక శరీరంలోకి ప్రవేశించి ఈ జన్మను ఇక్కడి భార్యను, పిల్లలను సుఖ దుఃఖాలనే అనుభవాలను స్వప్నం వలే భావించి అప్పుడు కలిగి వున్న అప్పటి శరీరాన్నే సత్యం అనుకుంటూ సాగిపోతున్నాం. 

ఎలా స్వప్నం అసత్యం, భ్రమ  అని మెలుకువ వచ్చాక భావించడం వల్ల తర్వాతి రోజు స్వప్నంలో క్రిందటి రోజు రాత్రి దర్శించిన స్వప్నం తెలియడంలేదో అదేవిదంగా ఒక జన్మ అనే స్వప్న సంఘటనలు మరణం అనే మూర్చ తర్వాత అసత్యం స్వప్నం అని భావించడం వల్ల తర్వాతి జన్మ అనే స్వప్నంలో క్రిందటి జన్మ అనుభవాలు జ్ఞాపకాలు కొనసాగడం లేదు. 

చూశారా ఈ మాయ! ఇది  ఏమంత సామాన్యమయినది కాదు.

గత జన్మ ఈ జన్మకు స్వప్నం. 

ఈ జన్మ రాబోవు జన్మకు స్వప్నం. 

ఎప్పటికప్పుడు ఈవిడే నా భార్య, వీరే నా పిల్లలు, ఇదే నా ఇల్లు, ఇవన్నీ నా ఆస్తులు అనుకుంటూ లక్షల కోట్ల స్వప్నాలలో తిరుగాడుతున్నాం. 

అందుకే గత జన్మ అనుభవాలు ఈ జన్మలొనూ,  ఈ జన్మ అనుభవాలు తర్వాతి జన్మలోను జ్ఞప్తికి రావడం లేదు. 

సత్యం అని నమ్మిందే మనసులో ఉండిపోతుంది. 

మనసులో ఉన్నదే ముందుకు కొనసాగుతుంది. 

మనసులో లేనిదేదీ ముందుకు కొనసాగదు. 

ఈ ప్రపంచమంతా స్వప్నమాత్రం అని అర్ధమవుతోంది గదా! 

మరి దుఃఖం దేనికి? 

దుఃఖం కేవలం విచారించకపోవడం వల్లే మానవునికి కలుగుతోందని తెలుస్తోంది.

ప్రతి జన్మలోని మరణం అనే అనుభవం తర్వాత  మనిషి పరిస్థితి ఎలా ఉంటుంది అనేదానికి ఇప్పుడు చూద్దాం!

స్వప్నం నుంచి మెలుకువ వచ్చాక మనిషి ఏమవుతున్నాడు. 

నేను స్వప్నంలో మరణించి తిరిగి మెలుకువతో జన్మించాను అని అనుకుంటున్నాడా ? 

లేదు గదా! 

ఇదీ అంతే. 

ఏదయితే మనమంతా మరణం అని ఇక్కడ అనుకుంటున్నామో ఆ మరణం తర్వాత మనిషి అక్కడికక్కడే ఇంకో శరీరం కలిగి అప్పటి వరకు తాను చూసిందంతా స్వప్నంలా భ్రమలా భావిస్తాడు. 

అప్పుడు తానున్న శరీరాన్ని వాస్తవం అనుకుంటూ ఆ శరీరానికి సంబందించిన తన బందు మిత్రులతో తిరుగాడుతూ అదే నిజమని నమ్ముతుంటాడు.

 ఒక స్వప్నం నుంచి ఇంకో స్వప్నంలోకి రావడం లాంటివే ఈ జన్మ-మృత్యువు అనే రెండు అనుభవాలు. 

అంతే తప్ప ఇక్కడ జన్మించేవాడూ లేడు. 

మరణించేవాడూ లేడు. 

రెండు అనుభవాలూ కేవలం మిధ్య మాత్రమే.

మరణం అనే భ్రమ తర్వాత మరణించినవాడి లోకం ఎలా ఉంటుంది అంటే ఇప్పటి ఈ లోకం ఎలా ఉందో మరణం తర్వాతి లోకం కూడా ఇలానే ఉంటుంది. 

జన్మ-మరణం అనేవి రెండు స్వప్నాలు. 

ఈ లోకం ఆ లోకం అనేవి ఎక్కడా లేవు. 

ఇప్పుడు చూస్తున్న ఈ లోకంలోనే గత జన్మలోనూ ఉన్నాం. 

ఈ జన్మలో ఏదో ఒక రోజు మరణించాక తర్వాతి జన్మకు ఇప్పటి ఈ జన్మ స్వప్నమే అవుతుంది. 

తర్వాతి జన్మ కొనసాగేదీ ఇప్పుడు చూసే ఈ స్వప్న ప్రపంచంలోనే. గత జన్మ, ఇప్పటి ఈ  జన్మ, రాబోవు జన్మ అనే స్వప్నాలకు వేరు వేరయిన లోకాలు అనేవి లేవు. 

అన్ని జన్మలూ జీవులు కొనసాగించేది ఈ ఎదురుగ్గా కనిపించే ఈ స్వప్న ప్రపంచంలోనే. 

కాకుంటే కొత్త కొత్త శరీరాలు, కొత్త కొత్త ప్రదేశాలు, కొత్త కొత్త అనుభవాలూ అంతే తేడా. 

ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఈ అయిదింటిలోనూ జీవరాసులు ఉన్నాయి. 

ఈ అయిదింటినే అయిదు లోకాలుగా గూడా చెప్పుకోవచ్చు.

మరి ముల్లోకాలు ఉన్నాయి. 

ఇంకా స్వర్గం, నరకం అనే పదాలు కూడా ఈ లోకంలో వాడుకలో ఉన్నాయి గదా అంటే! 

అది ఈ లోకం కానివ్వండి లేక మరొక లోకం కానివ్వండి శరీరాన్ని నమ్మి ‘ఇదే నేను’ అనుకోవడమే “నరకం”. 

శరీరాన్ని కదిలించే “ఆత్మ”ను గ్రహించి ఆ ఆత్మను అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నంలో ఉండటమే “స్వర్గం”. 

ఇవి తప్ప వేరే స్వర్గ నరకాలు ఎక్కడా లేవు. 

అసలు నరకం అంటే ఏంటి? దుఃఖమే కదా! 

దుఃఖం లేని నరకం ఎక్కడయినా ఉంటుందా? 

ఇక స్వర్గం అంటే ఆనందం. 

ఈ రెండూ కూడా ఉన్నది మనిషిలోనే కదా. 

మరి మనిషిలోనే స్వర్గం, నరకం అనేవి ఆనందం దుఃఖం అనే రూపంలో ఉన్నప్పుడు స్వర్గం అనేదానికి ఒక లోకం నరకం అనేదానికి మరొక లోకం ఎక్కడో బయట ఉండటమేంటి పిచ్చి కాకపోతే. 

దుఃఖమే నరకం. 

ఆనందమే స్వర్గం. 

నేను ఈ శరీరం అని నమ్మడమే నరకం. 

ఎందుకంటే ఈ శరీరం ఒకరోజు నశిస్తుంది. 

ఈ శరీరమే నేను అనుకోవడం వల్ల ఇది నశించే సమయంలో మానవునికి మహాదుఃఖం కలుగుతుంది. 

ఆ దుఃఖం శరీరం కోల్పోయాక కూడా ప్రాణిలో కొనసాగుతుంది. అదెలాగంటే దుఖించేది శరీరం కాదు. 

దుఖించేది నువ్వు. 

శరీరం పోతుంది.

 కానీ దుఖించే నువ్వెక్కడికీ పోవు. నువ్వు దుఃఖం అనే అనుభవంతో బాధపడి బాధపడి ఒకనాటికి మరొక శరీరాన్ని ధరిస్తావు. అది నరకమే కదా. 

మరి తప్పక నశించే ఈ శరీరాన్ని చూసుకుంటూ ఇది నేను అని ఎందుకు అనుకుంటారు. 

మరణించబోయే పసి పిల్లాడిని అతడి తల్లి మురిపెంగా ముద్దు పెట్టుకోవడం ఎలాంటిదో ఈ శరీరం నేను అనుకోవడం కూడా అలాంటిదే అని అందరూ గ్రహించాలి. 

ఇక ఈ శరీరం నేను కాదు నేను ఆత్మను అని భావన చెయ్యడం వల్ల ఆత్మకు నాశనం అనేది లేనందున నేను ఆత్మను అనుకునేవాడికి కూడా నాశనం లేనట్లే గదా. 

మరి అది ఆనందమే కదా. 

అదే అతడికి స్వర్గం కూడా. 

నేను ఆత్మను అనే భావనలో ఉన్నవారు శరీరం కోల్పోయాక కూడా ఆ ఆనందంలోనే స్థితి కలిగి ఉంటారు.

ఇక లోకాల గురించి చెప్పుకోవాలంటే బావిలో ఉన్న కప్పకు బావే దాని లోకం. 

దానికి ఇంకో లోకం తెలీదు.

 మరణం తర్వాత అది మానవ దేహాన్ని గనక పొందితే ఈ భూలోకం దానికి ఇంకో లోకమవుతుంది. 

సముద్ర గర్బంలో వున్న జీవరాసులకు అక్కడి నీళ్ళే వాటి లోకం. ఆకాశంలో తిరిగే పక్షికి ఆకాశమే దాని లోకం. 

తల వెంట్రుకల్లో వున్న పేనుకు అక్కడి వెంట్రుకలే దాని లోకం. 

రేగి పండులో ఉన్న పురుగుకు రేగి పండే తన లోకం. 

మానవ దేహంలో వున్న సూక్ష్మజీవులకు అక్కడి రక్తం, చీము, ఎముకలే వాటి లోకం. 

ఈ ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల జీవరాసుల్లో మానవ శరీరమే అత్యుత్తమం. 

అనేక వేల, లక్షల సంవత్సరాలపాటు కొన్ని కోట్ల వివేకం లేని జన్మల తర్వాత అదృష్టం కొద్దీ మానవ శరీరాన్ని పొందిన మనం వివేకంతో ఈ “భ్రమ”ను దాటి “మోక్షాన్ని” పొందక పోతే తిరిగి ఇప్పటి వరకూ మనం చెప్పుకున్న అన్ని జీవ రాసుల లోకాలూ ఇంకా అనేకానేక జీవరాసుల లోకాలలోకి తిరిగి ప్రవేశించి మన పాత బంధువుల్ని అందరినీ పలకరించాల్సి వస్తుంది.

ఇప్పుడు సృష్టి క్రమం ఒకసారి పరిశీలిద్దాం….

ఆకాశం నుంచి వాయువు పుడుతోంది.

 వాయువు నుంచి అగ్ని పుడుతోంది. 

అగ్ని నుంచి జలం పుడుతోంది. 

జలం నుంచి భూమి పుడుతోంది. 

భూమి నుంచి చెట్లు, చెట్ల నుంచి ఆహారం, ఆహారం నుంచి వీర్యం, 

వీర్యం నుంచి ప్రాణులు పుడుతున్నాయి. 

పురుషుడి నుంచి విడువబడిన వీర్యం స్త్రీ యోని మార్గం ద్వారా ఆమె గర్బంలోకి ప్రవేశించి కొద్ది నెలల తర్వాత నూతన ప్రాణి ఈ లోకంలోకి రావడం జరుగుతోంది. 

ఒక ప్రాణి జన్మకు కారణం ప్రాధమికంగా స్త్రీ పురుషులు అనుకుందాం. 

పురుషుడు తన నుంచి స్త్రీ యోనిలోకి వదలబడిన వీర్యం పురుషుడికి ఎక్కడి నుంచి లభించింది? 

నోటితో తిన్న ఆహరమే అతడి శరీరంలోకి ప్రవేశించి వీర్యంగా మారింది. 

అంటే వీర్యానికి కారణం పురుషుడు తిన్న ఆహారం అని తెలుస్తోంది. 

ఇక ఆహారానికి కారణం చెట్లు. 

చెట్లకు కారణం భూమి. 

భూమికి కారణం జలం. 

జలానికి కారణం అగ్ని. 

అగ్నికి కారణం వాయువు. 

వాయువుకి కారణం ఆకాశం.  

ఆకాశానికి కారణం...! 

ఆకాశానికి కారణం లేదు. 

కారణం లేకుండా కార్యం ఎక్కడ ఉంటుంది?

 మరి ఆకాశానికి కారణం ఏదని చెబుతాం. 

ఏదయినా చెప్పటానికి అసలు ఉంటే గదా! 

ఆకాశానికి కారణమే లభించట్లేదు..! 

కాబట్టి ఆకాశం అనేది లేనిదే అనే నిర్ణయానికి రావలసి వస్తోంది. 

ఇక ఆకాశమే లేనప్పుడు లేని దాని నుంచి

 వాయువు, 

అగ్ని, 

జలం, 

భూమి, 

ఆహారం, 

వీర్యం, 

ప్రాణులు అనే క్రమమంతా ఎక్కడిది? 

అలా కాదు ఏదో అదృశ్య శక్తి ఆకాశానికి కారణం అయి ఉండవచ్చు.. 

బహుశ అది మనకు కనిపించకపోవచ్చు అని అంటే..! 

అప్పుడు కూడా ఆ అదృశ్య శక్తికి ఇంకేదో మరొక శక్తి కారణం అయి ఉండాలి కదా..! 

ఆ మరొక శక్తికి కూడా మళ్ళీ ఇంకేదో ఇంకొకటి కారణం అయి ఉండాలి.! 

కారణం లేకుండా కార్యం అసంభవం. 

ఇలా కార్యం.. 

కార్యం యొక్క కారణం అనుకుంటూ శోధిస్తూ వెళితే ఎక్కడో ఒక చోట దీనికి కారణం దొరక్క ఆగిపోవాల్సిందే. 

ఈ విధంగా ఈ సృష్టికి అంటూ ఒక కారణం లభించట్లేదు 

కాబట్టి ఈ సృష్టి లేనిదే అని అర్ధం అవుతోంది.

మరొక రకంగా చూసినా కూడా ఈ సృష్టి లేనిదే అని తెలుస్తోంది. 

అదెలాగంటే ఆకాశం నిరాకారం. 

మరి లోకం లోని ప్రాణులన్నింటికీ మూలం ఆకాశంలో ఉన్నప్పుడు ఆకారం లేని ఆకాశం నుంచి ఆకారం కలిగిన ప్రాణులు ఎలా ఏర్పడతాయి? 

మట్టి నుంచి కుండ తయారయిందంటే నమ్ముతాము. 

ఆకాశం నుంచి కుండలు తయారవుతున్నాయి అని చెబితే మతిస్థిమితం లేనివాడు కూడా పక పకా నవ్వుకుంటాడు. 

కాబట్టి ఇక్కడ అనేక రకాల ప్రాణులుగా వస్తువులుగా ఈ అయిదు లోకాలలో కనిపిస్తున్నవన్నీ కూడా వాస్తవానికి లేనివే అని గ్రహించడమే జ్ఞానం.

ఇక్కడ ఇంకొక విచిత్రం కూడా చూడండి. 

ఆకాశానికి కదలిక లేదు. 

ఆకాశం నుంచి పుట్టిన వాయువుకు కదలిక ఉంది. 

వాయువుకు రూపం లేదు. 

వాయువు నుంచి పుట్టిన అగ్నికి రూపం ఉంది. 

అగ్నికి రుచి లేదు. 

అగ్ని నుంచి పుట్టిన జలానికి రుచి ఉంది.

 జలానికి వాసన లేదు. 

జలం నుంచి ఏర్పడ్డ భూమి వాసన కలిగి ఉంది.

 ఒక దానిలో లేని లక్షణం దాన్నుంచి పుట్టిన దానిలో కనిపిస్తోంది. 

ఇదెలా సంభవం? 

కాబట్టి ఈ సృష్టిగా కనిపించేదంతా స్వప్న మాత్రం అనేదే జ్ఞానుల అనుభవం.

పంచ భూతాలుగా చెప్పబడే ఆకాశం,  వాయువు, అగ్ని, జలం, భూమి అనేవి అనేక రకాలయిన ఆకారాలుగా కంటికి కనిపిస్తున్నా వాస్తవానికి వాటి రూపమంతా నిరాకారమే అని అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. 

ఎందుకంటే వాటన్నింటికీ మూలమయిన ఆకాశానికి ఆకారం అనేది లేదు కాబట్టి! 

ఇక ఆకాశం యొక్క రహస్యం దగ్గరకు వస్తే! 

“ఇది ఆకాశం” అని అజ్ఞానం చేత ఆకాశాన్ని ఏదయితే ఒకటి చూస్తోందో ఆ చూసేదానిలోనే ఈ ఆకాశం ఉందని అందరూ అర్ధంచేసుకోవాలి. 

ఆ చూసేదే మానవునిలోని ఆత్మ. 

ఆకాశాన్ని చూసే ఆత్మలోనే ఈ ఆకాశం అనేది ఉందిగాని ఆకాశం అనేది బయట ఉన్నది కాదు అనేది అజ్ఞానం తొలిగాక మానవునికి ఒకరు చెప్పకుండానే అర్ధం అవుతుంది. 

కాబట్టి ఆకాశంలా కనిపించేదంతా కూడా మనిషిలోని ఆత్మే. 

ఆత్మ తప్ప ఏ ఆకాశం కూడా ఎక్కడా లేనే లేదని అందరూ అర్ధం చేసుకోవాలి. 

ఎప్పుడయితే మానవుని లోని ఆత్మ చైతన్యం జ్ఞాన బలంతో నేను చూసేదంతా నేను కల్పన గావించుకున్నదే. 

చూసే నాకంటే వేరుగా చూడబడే ప్రపంచం అనేదేదీ ఇంకొకటి బయట లేదు అని గ్రహిస్తుందో అప్పటి ఆ మానవుని స్థితేనే “ఆత్మ సాక్షాత్కారం” అని అంటారు. 

అది అకృత్రిమమయిన “ఆనంద” స్థితి. 

ఆ స్థితిలో చూసే నేను చూడబడే ప్రపంచం అనేవి రెండు కాకుండా అంతా ఒక్కటే అని తెలిసిపోతుంది. 

“నేను” అనే భావన మాయమైపోతుంది.

 మనిషి యెక్క స్థితే “ఆనందమయం” అయిపోతుంది. 

అట్టి స్థితిలో ఆనందాన్ని అనుభవించేవాడు – ఆనందానికి కారణమయిన వస్తువు అంటూ రెండు ఉండవు. 

ఆ స్థితే “ఆనందమయం”. 

ఆ ఆనందమయ స్థితిలో నిలిచిన తర్వాత ఈ శరీరం ఉన్నా.. పోయినా అతడికి దుఃఖం కలుగదు. 

కాలంతో కూడా సంబంధం తెగిపోయి అనంతంగా ఆ ఆనందంలో అతడు మునిగిపోయి వుంటాడు.

ఇక్కడ సృష్టి అనేది అసలు లేనే లేదు. 

ఉన్నది కేవలం దృష్టే. 

దృష్టే సృష్టి తప్ప సృష్టి అనే మరొకటేదీ ఇక్కడ లేనే లేదని స్పష్టంగా అర్ధం కావడానికి ఇప్పుడొక ఉపమానంతో అర్ధం చేసుకుందాం. 

ఒక అందమయిన స్త్రీ ఉందనుకుందాం. 

ఒకడు ఆమెను చూసినప్పుడు ఆమె అందానికి ముగ్డుడయి ఆమెను తన ప్రియురాలిగా భావించుకుంటాడు. 

ఆ స్త్రీయొక్క తమ్ముడు ఆమెను అక్కగా భావిస్తాడు. 

ఆమె తండ్రి ఆమెను చూసినప్పుడు కుమార్తెగా భావిస్తాడు. 

ఒకవేళ ఆమె వివాహిత అయి ఉండి ఆమెకు గనక ఒక కుమారుడు ఉన్నట్లయితే అతడు ఆమెను తన తల్లిగా భావిస్తాడు. 

ఒకే స్త్రీని అనేకులు అనేక రకాలుగా చూస్తూ భిన్నమయిన అనుభవాలు పొందుతున్నారంటే ఆ అనుభవాలన్నీ వున్నది ఆ స్త్రీలో కాదు గదా! 

ఎవరికి వారు వారి వారి దృష్టిలో ఏర్పరచుకున్నదే తమలో అనుభవంగా పొందుతున్నారు తప్ప ఇందులో ఆ స్త్రీ పాత్ర ఏముంది. 

దీన్నిబట్టి మనకు తెలిసేదేంటి? 

మనలో ఉన్నదే బయట కనిపిస్తుంది. 

మనలో లేనిదేదీ బయట కనిపించదు. 

మన బుద్ధిలోని భావనే మనకు సుఖదుఃఖాలనే అనుభవాలను ప్రసాదిస్తోంది. 

ఇంత మాత్రానికి ఇక్కడ సృష్టి ఏదో ఏర్పడి ఉండటం అది మనల్ని భాధించడం అనేదంతా ఒట్టి కల్పిత మాటలు కాక మరింకేంటి?

ఇప్పుడు అనేక శరీరాలుగా కనిపిస్తున్న ప్రాణులన్నీ అనేకం కాదు ఒక్కటే దృష్టి లోపం వల్ల విచారణ చేయక పోవడం వల్ల బ్రాంతి వల్ల ప్రాణులు అనేకులుగా కనిపిస్తున్నారు తప్ప అనేక ఆకారాలు లేనే లేవు ఉన్నది ఏకైక చైతన్యమే అని తెలుసుకుందాం.

అయిదు వందల మంది జనాభా గలిగిన ఒక గ్రామంలోని గుడిలో ఒక ఉపన్యాసకుడు దైవం గురించి ఉపన్యసిస్తున్నాడు. 

ఆ గుడిలోకి  కొద్ది మంది గ్రామస్థులు వచ్చి కూర్చుని  అతను చెప్పేది శ్రద్దగా వింటున్నారు.

ఉపన్యాసకుడు ముందు వరుసలో కూర్చుని వున్న ఒక స్త్రీని ఉద్దేశించి

అమ్మా నీవెవరు? అని అడిగాడు.

ఆమె తన పేరు చెప్పింది.

నీవు ఇక్కడికి ఎలా వచ్చావు? అని అడిగాడు.

తాను తన ఇంటి నుంచి నడచి వచ్చినట్లుగా ఆమె చెప్పింది.

ఇంటి నుంచి ఇక్కడి వరకు నడచింది “ఎవరు” అని మళ్ళీ అడిగాడు.

“నేను” అని ఆమె బదులిచ్చింది.

నేను అంటున్నావు గదా! 

నేను అంటున్నది నీలో “దేనిని” అని మళ్ళీ అడిగాడు.

ఆమె తన శరీరం వైపు చూసుకుని “నేను” అంటే ఈ “శరీరమే” గదా అని అమాయకంగా బదులిచ్చింది.

ఆమెను కూర్చోమని ఆ ఉపన్యాసకుడు ఇలా చెబుతున్నాడు.

కేవలం శరీరమే తనంతట తాను ఇక్కడికి వచ్చినట్లయితే ప్రక్క వీధిలో మరణించి వున్న శవం కూడా ఇక్కడికి రాగలగాలి. 

ఎందుకంటే శవం కూడా శరీరాన్ని కలిగి ఉంది గదా. 

అలా కాదు శవంలో ప్రాణం లేదు కాబట్టి రాలేదు మేమంతా శరీరంతో పాటు ప్రాణం కలిగి వున్నాం కాబట్టి వచ్చాం అని అంటారా? 

అదే నిజమయితే ఇదే గ్రామంలో ప్రాణం, శరీరం కలిగి వున్న జనులు అనేక మంది ఉన్నారు. 

వారంతా ఇక్కడికెందుకు రాలేదు? 

ఇక్కడికి రావడానికి శరీరం, ప్రాణం కారణమయితే మొత్తం గ్రామస్తులంతా ఇక్కడే వుండి వుండాలి. 

కానీ అలా జరగలేదు. 

అంటే దీనర్దం ఇక్కడికి వచ్చింది శరీరాలూ కాదు. 

ప్రాణమూ కాదు. మరింకేంటి? మనస్సు. 

ఈ మనస్సు అనేది అన్ని శరీరాలలో ఉంటూ ఈ శరీరాలను తన ఇష్టానికి తగ్గట్లుగా కదిలిస్తోంది. 

గుడిలోకి వెళ్లి ఉపన్యాసం వినాలి అని మీరు భావించడం వల్ల మీ మీ శరీరాలు ఇక్కడకు వచ్చాయి. 

వెళ్లి నాటకం చూడాలి అని కొందరు భావించడం వల్ల వారి శరీరాలు నాటకం ప్రదర్శించే చోట ఉన్నాయి. 

రోజంతా పొలంలో పనిచేసి బాగా అలసిపోయిన వాళ్ళు పొడుకుని నిద్ర పోవాలి అని భావించడం వల్ల వారి శరీరాలు మంచాల మీదో నేల మీదో పడిపోయి నిద్రలో ఉన్నాయి.

ఈ భావన చేసే దాన్నే మనస్సు అంటున్నాం. 

కాబట్టి ఈ అన్ని శరీరాలలో కేవలం శరీరం, ప్రాణం మాత్రమే కాకుండా మనస్సనేది ఒకటి ఉంది. 

అది అత్యంత శక్తివంతమయింది. 

ఎందుకంటే అది “ఆత్మ” లోంచి ఏర్పడింది కాబట్టి. 

దాని యొక్క ఆజ్ఞతోనే ఈ శరీరాలన్నీ చలనం కలిగి ఉంటున్నాయి. అది ఏమి భావిస్తే ఈ శరీరాలు అది చెయ్యడానికి ముందుకు కదులుతాయి. 

ప్రతి మనిషి  “నేను” “నేను” అనేది ఆ మనస్సునే. 

అంటే ఈ శరీరం, ప్రాణం కాకుండా ఈ రెండింటినీ తన ఆజ్ఞతో కదిలించేది ఏదయితే ఒకటి ఉందో దాన్నే అందరూ “నేను” అంటున్నారు తప్ప ఈ జడ శరీరాన్ని కాదని గ్రహించాలి.

కాబట్టి “నేను” అంటే ఈ శరీరమో ఈ శరీరంలో వున్న ప్రాణమో కాదని అర్దమయినట్లేగదా. 

నేను అంటే ఈ శరీరాలను కదిలించే మనస్సనే చైతన్యాన్నేగాని కదిలే ఈ శరీరాన్ని నేనుకాదు. 

నాయొక్క రూపం నిరాకారం.  

నా ఎదురుగా నాకంటే వేరుగా ఉన్నట్లుగా కనిపించే అన్ని దేహాలు కూడా “చైతన్యం” అనే నిరాకారం స్వరూపంగా కలిగినవే. 

మరి అన్ని దేహాలలో వున్న ఏకైక ఆకారం లేని “చైతన్యానికి” నేనువేరు వాళ్ళువేరు అనే భేదం ఎక్కడుంటుంది. ఆకారం లేనిదంతా ఒక్కటే  అని గ్రహించడమే ముక్తి. అలా కాకుండా ఈ శరీరం ‘నేను’ తదితర శరీరాలు ‘ఇతరులు’ అని భావించేదంతా అజ్ఞానం చేత మానవుని మనసులో ఏర్పడిందే తప్ప అది సత్యం కాదని గ్రహించాలి. 

ఒక గ్రామంలోని గృహాలను చూసినప్పుడు ఇది పుల్లయ్య గృహం, ఇది ఎల్లయ్య గృహం, ఇది బలరాముడి గృహం అని చెప్పుకుంటాం. 

అంతేగాని ఆ గృహాల పైన ఉన్న ఆకాశాన్ని చూపించి ఇది పుల్లయ్య ఆకాశం, ఇది ఎల్లయ్య ఆకాశం, ఇది బలరాముని ఆకాశం అని చెప్పలేం కదా! 

ఎందుకంటే గృహాలకు ఆకారం ఉంది. 

ఆకారాల మధ్య భేదం ఉంది. 

భేద దృష్టిని అనుసరించి ఆకారాలను చూసినప్పుడు ఇది ఎల్లయ్యది, ఇది పుల్లయ్యది అని భావిస్తున్నాం. 

ఆకాశానికి ఆకారం లేదు. 

ఆకారం లేనిదానికి భేదం ఎక్కడుంటుంది? 

భేదం లేనప్పుడు ఇక ఇది అతడిది అది ఇతడిది అనే విభజన ఎలా చెయ్యగలం. 

భేదం లేనిదంతా ఒక్కటే అని గ్రహించడమే జ్ఞానం. 

మరి మనిషి అంటే ఆకారం లేని ‘ఆత్మచైతన్యం’ అయినప్పుడు మనిషికి మనిషికి మధ్య భేదం ఎక్కడుంది? 

అజ్ఞానదృష్టిచే అనేకంగా కనిపించేదంతా వాస్తవానికి అనేకం కాదు అంతా ఒక్కటే అని గ్రహించడమే జ్ఞానం.

 అట్టి దృష్టి పరమ పవిత్రం. 

మంగళకరం.       

కాబట్టి ఈ ప్రపంచమంతా అజ్ఞాన దృష్టికి అనేక శరీరాలుగాను ఆకారాలుగాను కనిపించవచ్చుగాని వాస్తవానికి అన్నింటిలో వున్నది ఏకైక నిరాకర “చైతన్యమే” అని గ్రహించడమే సత్య దృష్టి. 

అదే అజ్ఞాన విముక్తి. 

ఆత్మకు ముక్తి. 

అట్టి చైతన్య స్థితిలో స్థిరంగా నిలిచి వున్నప్పుడు కలిగేదే శాశ్వతమయిన అకృర్తిమమయిన “ఆనందం”.  

దాన్నే “బ్రహ్మానందం” అనీ “ఆత్మ సాక్షాత్కార” స్థితి అనీ శాస్త్రాలు చెబుతున్నాయి.

అజ్ఞాన దృష్టి చేత ఈ కంటికి కనిపించే భౌతిక శరీరం తల్లిదండ్రుల నుంచి లభిస్తోంది. 

తల్లి నుంచి శరీరం. తండ్రి నుంచి ప్రాణం లభిస్తున్నాయి. 

తల్లిదండ్రులు తిన్న ఆహరం రేతస్సుగా మారి దాన్నుంచి ఈ దేహలన్నీ ఏర్పడుతున్నాయి. 

అంటే ఈ శరీరం యొక్క మూలం ఆహరంలో ఉందనుకోవాలి. 

ఆహారానికి మూలం భూమి. 

భూమికి మూలం నీరు. 

నీటికి మూలం అగ్ని. 

అగ్నికి మూలం వాయువు. 

వాయువుకి మూలం ఆకాశం. 

అంటే ఈ శరీరాలన్నీ ఆకాశం నుంచే పుడుతున్నాయి. 

ఆకాశం నిరాకారం అయినప్పుడు నిరాకారం నుంచి ఆకారం కలిగిన శరీరాలు ఎలా పుడతాయి. 

పుట్టవు. 

కాబట్టి పైకి ఆకారంతో కనిపించే ఈ శరీరాలన్నీ వాస్తవానికి “లేనివే” అని జ్ఞాన దృష్టికి అర్ధం అవుతోంది.

తల్లిదండ్రులు తిన్న ఆహరం నుంచి పుట్టిన ఈ దేహంలో ఆహారానికి మూలమయిన పంచమహాభూతాల అంశ ఉంది. 

పంచ మహాభూతాలు అంటే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి.

ఈ అయిదింటి నుంచే గదా ఆహారం తయారయ్యేది. 

ఆహరం నుంచి తయారయిన దేహంలో ఈ అయిదు పంచ భూతాలు ఏ రూపంలో ఇమిడి ఉన్నాయో చూద్దాం.

ఈ శరీరంలో అయిదు జ్ఞానేంద్రియాలు, 

అయిదు కర్మేంద్రియాలు, 

మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేవి ఏర్పడి ఉన్నాయి.

జ్ఞానేంద్రియాలు అంటే చెవులు, చర్మం, కళ్ళు, నాలుక, ముక్కు

కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, నోరు, మల విసర్జన ద్వారం, మూత్ర విసర్జన ద్వారం

ఇక అంతఃకరణ చతుష్టయం అని పిలువబడే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం.

అయిదు పంచ మహాభూతాలు ఈ శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం.

చెవులు శబ్దాన్ని వింటాయి. 
శబ్దం ఆకాశంలో పుడుతుంది. 
కాబట్టి చెవులకు ఆధారం “ఆకాశం”. 
చర్మం స్పర్శను గ్రహిస్తుంది.  
స్పర్శ వాయువు వల్ల కలుగుతోంది. 
కాబట్టి చర్మానికి ఆధారం “వాయువు”. 
కళ్ళు ప్రకాశాన్ని చూస్తాయి.  
ప్రకాశానికి మూలం సూర్యుడు.  
కాబట్టి కంటికి మూలం “అగ్ని”. 
నాలుక రుచిని గ్రహిస్తుంది.  
రుచికి మూలం “జలం”. 
ముక్కు వాసనను గ్రహిస్తుంది.  
వాసనకు  ఆదారం “భూమి”.

పంచ మహా భూతాల నుంచి ఏర్పడిన ఈ శరీరంలో 

పై విధంగా పంచ మహా భూతాలు అయిదు జ్ఞానేంద్రియాల రూపంలో ఉనికి ఏర్పరచుకుని ఉన్నాయి.

ఇదంతా బాగానే ఉంది కదా! 

మరి ఈ శరీరంలోనే ఉంటూ ఈ అనుభవాలు అన్నీ పొందే “నేను” అనే ఆకారం లేని చైతన్య స్వరూపుడు  ఇందులోకి ఎక్కడి నుంచి వచ్చాడు? 

పదార్దాల నుంచి పదార్దాలు ఏర్పడడం సహజం. 

కానీ ఆహారం నుంచి తయారయిన ఈ శరీరంలోకి “నేను” అనే ఆకారం లేని “చైతన్య స్వరూపుడు” ఎక్కడి నుంచి వచ్చి ఇందులో ప్రవేశించాడు. 

ఇది తీపి, ఇది చేదు, ఇది ఇష్టం, ఇది కష్టం అని అనేకానేక అనుభవాలు పొందుతున్న ఇందులోని చైతన్య స్వరూపుడికి కారణం ఎవరు? 

ఈ ప్రశ్నకు సూటి అయిన సమాదానం ఏంటంటే! 

శరీరాలన్నీ కేవలం భ్రమ. 

ఇవి ఏ సమయంలోనూ ఉన్నవి కాదు అని. ‘చైతన్యమే’ శరీరాలను కల్పన చేసుకుని అవి తనకంటే వేరుగా ఉన్నట్లుగా భావిస్తూ తనే వాటిని బాహ్యంలో దర్సిస్తోంది తప్ప ఈ శరీరాలన్నీ వున్నవి కాదు. 

ఉన్నది ఏకైక నిరాకార చైతన్యమే. 

అయితే చైతన్యం అలా ఎందుకు చేస్తోంది అనేదానికి సమాదానం లేదు. 

జబ్బు వచ్చాక దాన్ని తొలగించుకోవడమే తక్షణ కర్తవ్యంగాని అసలు జబ్బు ఎందుకు వచ్చింది? 

ఎక్కడ వచ్చింది? 

ఏమి తింటే వచ్చింది? 

అని తర్కించుకుంటూ కూర్చుంటే ఏం ప్రయోజనం.  

రోగం తీవ్రత పెరిగి రోగి మరణిస్తాడు. 

కాబట్టి రోగం ఎలాగయినా రానీ రోగం ఉందని తెలిసాక ముందు రోగాన్ని నయం చేసుకోవడమే అత్యవసరం.

అలాగే అజ్ఞానం చేత ఆత్మ ఎలా శరీరాన్ని కల్పించుకుని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగు రూపాలుగా మారి సుఖ దుఃఖాల కల్పనలో పాల్గొంటోంది అనేది ఒకసారి పరిశీలిద్దాం.

మనస్సు మననం చేస్తుంది. 

బుద్ధి నిర్ణయం తీసికుంటుంది. 

చిత్తం ఈ తతంగాన్నంతా తనలో నిల్వ చేసుకుంటుంది. 

ఈ శరీరమే నేను అని నమ్మడమే అహం యొక్క లక్షణం.

ఒక అందమయిన స్త్రీ ని ఒక వ్యక్తి యొక్క మనస్సు కంటి చూపు ద్వారా చూసినప్పుడు ఆహా ఏమీ ఆ స్త్రీ అందం, ఎంత చక్కటి శరీరం అని భావన చేస్తుంది. 

అప్పుడు ఆ స్త్రీ తన కంటి ముందు నుంచి వెళ్ళిపోతూ కనుమరుగగుచున్నప్పుడు అతడి మనస్సు తను భావించిన తన కోరికను బుద్ధిలోకి పంపిస్తుంది. 

బుద్ధి అప్పటికప్పుడు తక్షణం ఏమి చెయ్యాలో సంకేతం ఇస్తుంది. 

అప్పుడు మనస్సు బుద్ధి చెప్పిన ప్రకారం నడిచి వెళుతున్న ఆ స్త్రీ వెనుకే తనూ నడుస్తుంది. 

కొంచెం దూరం వరకు వెళ్ళిన ఆ స్త్రీ ఒకచోట బైక్ పై కూర్చుని తనకోసం ఎదురు చూస్తున్న ఒక యువకుని వద్ద ఆగి అతడి వెనకాల అదే బైక్ మీద కూర్చుని రయ్ మని వెళ్ళిపోతుంది. 

ఆ స్త్రీని వెనుక అనుసరిస్తూ వస్తున్న వ్యక్తి మనస్సు తన ఎదురుగా జరిగిన ఆ సంఘటన మొత్తాన్ని ఉసూరుమంటూ చూసి ఇక తనేం చెయ్యాలో తెలీక మళ్ళీ బుద్ధిలోకి పంపిస్తుంది. 

బుద్ధి వెంటనే ‘వెనక్కు వచ్చేయ్’ అని సంకేతం ఇస్తుంది. 

మనస్సు ఇక చేసేదేమీలేక వెనక్కు వచ్చేస్తుంది. 

కొంచెం సమయం పాటు మనస్సు దుఃఖిస్తూ దుఃఖస్థితిలో వుంటుంది. 

ఆ తర్వాత జరిగినదంతా మరచిపోయి వేరే పనిలో తన దృష్టిని పెడుతుంది. 

అయితే ఏదయితే ఒక అనుభవం మనస్సు బుద్ధి మూలంగా లోన రూపు దిద్దుకునిందో అదంతా అతడి “చిత్తం” అనే చోటుకి వెళ్లి నిల్వ ఉండిపోతుంది. 

మనసుపెట్టి ఏదయితే చేస్తామో ఆ ప్రతిదీ చిత్తంలోకి వెళ్లి నిల్వ ఉండిపోతుంది.

ఈ చిత్తమే జన్మలు, దేహాలు, లోకాలు అనే భ్రమలకు మూల వస్తువు. 

ఈ చిత్తాన్ని నాశనం చేస్తేనే మానవునికి ముక్తి. 

శరీర నాశనంతో ఏదీ నాశనమవదు. 

చిత్త నాశనమే సర్వ దుఃఖ నాశనం. అదే ముక్తి.

మరి చిత్తాన్ని ఎలా నాశనం చెయ్యాలి అంటే మానవుడు తన మనసులో ఏ విషయాలూ భావించకూడదు. 

మనస్సులోకి విషయాలు రానివ్వకూడదు. 

మనస్సును నిశ్చలంగా నిర్విషయ స్థితిలో నిరంతరం నిలుపి ఉంచుకోవడం సాధన చెయ్యాలి. 

చిత్తంలో వున్న పాత విషయాలను ఈ మనస్సు అప్పుడప్పుడు వెనక్కు తీసికుని మననం చేస్తూ వుంటుంది. 

వీటినే జ్ఞాపకాలు అని కూడా అంటాం. 

అలా మననం చేయబడ్డ విషయాలు మరింత శక్తిని పుంజుకుని తిరిగి చిత్తంలో పై పై నే ఉంటూ మనస్సు భావించినప్పుడల్లా ఎగిరెగిరి మనస్సులోకి వచ్చి రకరకాల అనుభవాలను మనస్సుకు ఇచ్చి తిరిగి చిత్తం లోకి వెళ్లిపోతుంటాయి.

ఎప్పుడయితే మానవుడు ముక్తిని లక్ష్యంగా చేసుకుని విషయాలను మనస్సుతో స్మరించడం ఆపి వేస్తాడో అప్పుడు మనస్సు చిత్తంలోని పాత జ్ఞాపకాలను వెనక్కు తీసికుని మననం చెయ్యాలని ప్రయత్నిస్తుంటుంది. 

అట్టి స్థితిలో మానవుడు తన బుద్ధి బలంతో మనస్సును కట్టడి చేసి చిత్తంలోని పాత విషయాలలోకి మనస్సును వెళ్ళనివ్వకుండా ఆపగలగాలి. 

అప్పుడు చిత్తంలోని పాత విషయాలన్నీ కూడా కొంత కాలానికి చిత్తంలో లేకుండాపోతాయి. 

ఎప్పుడయితే చిత్తంలో విషయాలే లేకుండా పోతాయో అప్పుడు చిత్తమే లేకుండా పోతుంది. 

ఎందుకంటే విషయాలకు మరొక పేరే చిత్తం. 

విషయాలు, జ్ఞాపకాలు అంటూ లేని చిత్తం ఎక్కడా ఉండదు. 

చిత్తం లేనట్టి అట్టి స్థితిలో మనస్సు తన స్వస్థానమయిన ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతుంది. 

ఇంకా చెప్పాలంటే ఆత్మే అజ్ఞానమనే తనకంటే వేరుగాని మనస్సు అనే బ్రాంతి తనలో తొలగించుకుని “బ్రహ్మానంద” స్థితిలో ఉండిపోతుంది.

అట్టి స్థితిలో ఈ శరీరం జ్ఞప్తికి రాదు. 

ఈ శరీరాన్ని ఈ శరీరం నేను అనుకునేది ఆత్మలోనుంచి ఏర్పడ్డ ఈ మనస్సే . 

మనస్సు  ఆత్మలో లీనమైపోయాక ఇక ఈ శరీరాన్నిగాని ఈ ప్రపంచాన్నిగాని చూసేది ఏముంటుంది. 

ఆ స్తితే మరణాన్ని జయించడం-ముక్తిని పొందడం అంటే.

అలాగే ఈ ప్రపంచంలో మానవుడు వదలాలని అనుకున్నా ఎవరో పట్టుకుని లాగుతున్నట్లుగా వదలలేకపోతున్న ఈ  స్త్రీ పురుష శరీరాలలోని సుఖం ఎంతో ఒకసారి పరిశీలిద్దాం.

 ఈ లోకంలో స్త్రీ శరీరం కోసం పురుషుడు, పురుష శరీరం కోసం స్త్రీ తాపత్రయపడుతున్నారు. 

రక్తం, మాంసం, ఎముకలు, చర్మం తప్ప ఈ స్త్రీ పురుష శరీరాలలో ఏం ప్రత్యేకత ఉంది. 

అసలు ఒక పురుషుని శరీరానికి ఒక స్త్రీ శరీరానికి ఒక అడవిలో తిరిగే గాడిద శరీరానికీ భేదం ఏముంది? 

శరీరాలన్నీ రక్త మాంసాలే గదా! 

అలా అని ఎందుకనుకోవాలి మాకు వీటినుంచి సుఖానుభవం కలుగుతోంది గదా అని అంటే! 

ఇందులో వున్న సుఖానుభవం ఎంతో ఇప్పుడు చూద్దాం. 

స్త్రీ పురుషుల మద్య “సంగమం” జరిగే సమయంలో ఒకానొక దశలో పురుషుడి శరీరంలోని వీర్యం బయటకు విడవబడుతుంది. 

అట్టి క్షణాలలో అనిర్వచనీయమయిన సుఖానుభవం ఆ రతి క్రీడలో వున్న ఇరువురికీ కలుగుతుంది. 

ఆ సుఖం శరీరాల వల్లే లభిస్తుందని భావిస్తూ ఒకరి శరీరంకోసం మరొకరు తమ తమ ధన, మాన, ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.

కానీ ఇందులోని సత్యం జనులు తెలుసుకోలేకపోతున్నారు. 

స్త్రీ పురుషుల మధ్య రతి క్రీడలో సుఖానుభవం కలిగేది రెండు శరీరాల మద్య జరిగే ఘర్షణ వల్ల కాదు. 

వీర్యపాతం జరిగే సమయానికి ఇద్దరి మనసులో ఎట్టి విషయాలు అనేవి లేకుండా పోయి మనస్సు నిర్విషయ స్థితిలోకి వెళ్ళిపోతుంది. 

ఆ స్థితిని శిష్యుల అజ్ఞానం తొలగించడానికి లోకంలోని గురువులు ఆత్మ స్థితితో కూడా పోల్చి చెబుతుంటారు.

 అట్టి మనస్సు యొక్క “నిర్విషయ” స్థితి వల్లే కొద్ది క్షణాలు కృత్రిమమయిన సుఖానుభవం ఇద్దరికీ కలుగుతుంది. 

అంతేగాని వీర్యం బయటకు పోవడం వల్ల కాదని అందరూ ఇక్కడ గ్రహించాలి. 

వీర్యం వల్లే ఆనందం లబించేట్లయితే మరి వీర్యం బయటకు పోనప్పుడు కూడా శరీరంలోనే ఉంది కదా! 

శరీరంలో వున్నప్పుడు ఆనందం ఎందుకు లభించట్లేదు?

కాబట్టి ఆత్మస్థితి ఎట్టిదో ఎరిగిన ఋషులు ఇంకా అనేకమంది జీవులు తమ మనస్సులోనుంచి సర్వం త్యజించి ఏకాంతంగా ఎక్కడో హిమాలయ పర్వత ప్రాంతాల్లోనో లేక మరో పవిత్ర స్థలంలోనో వుంటూ మనస్సులోకి లోక సంఘటనలు అనే విషయాలు రానివ్వకుండా నిర్విషయ స్థితిలో

 [మనసులోకి విషయాలు రానివ్వకుండా విషయరహిత స్థితిలో మనస్సును నిరంతరం నిలిపి ఉంచుకోవడం]  

మనస్సును దీర్ఘ కాలం పాటు నిలిపి ఉంచి బయట ప్రపంచం వైపు పదే పదే వెళ్ళాలని భావించే మనస్సు యొక్క మాయాశక్తిని తమ బుద్ధి బలంతో అడ్డుకుని కొన్నాళ్ళకు మనస్సును ఆత్మ అనే తమ స్వస్వరూపంలో లయం చేసి స్త్రీపురుష సంభోగసుఖం అనే ఆనందంతో పోలిస్తే దానికి కొన్ని కోట్ల రెట్ల అధికమయిన అకృర్తిమమయిన ఆనందాన్ని క్షణక్షణం నిరంతరాయంగా అనుభవిస్తూ ఆ “బ్రహ్మానంద” స్థితిలో తేలియాడుతున్నారు.

 అట్టి స్థితిలోకి ఒకసారి వెళ్ళినవాడు తిరిగి ఈ లోకంలోకి ఎప్పటికీ రాడు. 

అదే మానవుని స్వస్వరూప మోక్ష సామ్రాజ్యం.

 దానికోసం ఈ మానవజన్మ అనే అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి.

అలాగే ఈ లోకంలో ఎన్నో ఋషి ఆశ్రమాలు ఉన్నాయి. 

ఎందరో గొప్ప ఋషులు అక్కడ  వుంటున్నారు. 

ఆశ్రమాలకు వెళ్లి ఋషులకు దణ్ణం పెట్టి మన భాధ్యత అయిపోయినట్లుగా తిరిగి వచ్చేస్తున్నాం. 

ఎన్నో దేవాలయాలు, చర్చిలు, మసీదులు ఈ లోకంలో ఉన్నాయి. 

వాటిల్లో ఎందరివో మహా పురుషుల విగ్రహాలు కొలువై ఉన్నాయి. 

మనం వెళ్లి ఆ విగ్రహాలకు దణ్ణం పెట్టుకుని ఇక మన పని అయిపోయినట్లుగా భావించి తిరిగి వచ్చేస్తున్నాం. 

అంటే మన ఉద్దేశ్యంలో భగవంతుడు అంటే ఒక వస్తువా? 

ఒక విగ్రహమా? 

లేక ఒక మానవదేహమా? 

ఇవేవీ భగవంతుడు కాదని గ్రహించండి. 

భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఇవన్నీ దారి చూపే మార్గాలు. 

మార్గాలు ఏర్పరచింది “భగవంతుడు” అనే లక్ష్యం చేరుకోవడానికి. 

అంతేగాని ప్రతిసారీ మార్గం వరకూ వెళ్లి లక్ష్యాన్ని వదిలేసి వెనక్కు మరలటానికి కాదు. 

భగవంతుడు అంటే ఎప్పటికీ నాశనం అనేది లేనివాడు అనికదా అర్ధం. 

మరి ఈ లోకంలోని సకల వస్తువులు శరీరాలు అన్నీ కాలంతో పాటు నశించేవే కదా! 

మరి నశించేవి భగవంతుడు ఎలా అవుతాయి? 

ఏది నశించదో అదే భగవంతుడు. ఏది నశించదు? 

ఏదయితే ఆకారం కాదో అది నశించదు. 

అది ఏదంటే వెలుతురును చీకటి చూడగలదా? 

చూడలేదు. 

అలాగే చీకటిని వెలుతురు చూడగలదా? 

చూడలేదు. 

ఒకటి వుంటే రెండోది ఉండదు.  

కానీ చీకటినీ వెలుతురునీ ఈ రెండింటినీ చూస్తూ ఇది చీకటి ఇది వెలుతురు అని ఏదయితే గ్రహిస్తోందో అదే ‘భగవంతుడు’. 

అదే జీవులన్నింటిలోని “ఆత్మ”. ఆత్మకు వెలుతురు కనిపిస్తుంది. 

చీకటి కనిపిస్తుంది.

 కానీ వెలుతురుకి చీకటి కనిపించదు. 

చీకటికి వెలుతురు కనిపించదు. 

చీకటీ వెలుతురు అనేవి రెండూ నశించేవి. 

వెలుతురు వస్తే చీకటి నశిస్తుంది. 

చీకటి వస్తే వెలుతురు నశిస్తుంది. 

కానీ ఈ రెండింటినీ చూసేది నశించదు. 

అదే ప్రాణులలోని “ఆత్మచైతన్యం”. 

తాను కనిపించకుండా అన్నింటినీ చూసేదే “భగవంతుడు” అంటే.

మన ఇంటి పెరటిలో ఒక చెట్టు ఉంది. 
దాని కొమ్మలు పెరిగి ఇంటి వాకిలికి అడ్డు వస్తున్నాయి. 
అప్పుడు మనమేమి చేస్తున్నాం. 
   
                    కత్తితో కొమ్మలను నరికి దారికి అడ్డు తొలగించుకుంటున్నాం. 

అలా కాకుండా ఓ వృక్షమా నీ కొమ్మలను వాకిలికి అడ్డుగా రానివ్వకు అని ఆ చెట్టు వినేటట్లు ఆజ్ఞాపించాం అనుకుందాం. 

ఆ ఆజ్ఞ వల్ల చెట్టు కొమ్మలు వాకిలికి అడ్డుగా రాకుండా మరొక వైపుగా వెళ్ళిపోతాయా? 

లేదు గదా. ఎందువల్ల? 

మన ఆజ్ఞ ఆ చెట్టు వినదు గనక. 

ఎందుకు వినదు? 

ఎందుకంటే ఆ చెట్టు మనకంటే వేరయిన మనకు సంబంధం లేని బయటి వస్తువు. 

ఏదయితే మనం కాదో ఆ మనం కానిదాని యొక్క వృద్ది క్షయం కూడా మన ఆజ్ఞకు లోబడి ఉండదు. 

ఈ సిద్దాంతం ప్రకారం ఇప్పుడు మానవ శరీరం యొక్క వ్యవహారం చూద్దాం.

మానవుడు అంటే ఈ శరీరం కాదు అని లోకంలోని ఎందరో జ్ఞానులు సత్యం చెబుతున్నా కాదు కాదు “నేను అంటే నా ఈ శరీరమే” అని మనం నమ్ముతున్నాం గదా! 

ఇప్పుడు ఈ శరీరం దగ్గరకే వద్దాం. 

ఈ శరీరంలో జుట్టు పెరిగి ముఖానికి అడ్డుగా వస్తుంటే మనం వెళ్లి కత్తిరించుకుంటున్నాం. 

చేతి వ్రేళ్ళ గోళ్ళు పెరిగితే కత్తిరించుకుంటున్నాం. 

మరి మనం ఈ శరీరమయితే ఈ శరీరంలోని  వెంట్రుకలు, గోళ్ళ పెరుగుదల తరుగుదల మన అదుపులో ఎందుకు ఉండటం లేదు? 

ఈ శరీరంలోని తల వెంట్రుకలు తెల్లబడితే అద్దంలో చూసుకుని అయ్యో నా వెంట్రుకలు అప్పుడే తెల్లగా అయిపోయాయా! 

అని భయపడుతూ రంగు వేసుకుంటున్నాం. 

అంతేగాని అవి తెల్లగా మారకుండా మనం ఆపగలుగుతున్నామా? 

పళ్ళు కదులుతుంటే అయ్యో నా పళ్ళు అప్పుడే ఊడిపోతున్నాయా అని భయపడుతున్నాం. 

ఈ శరీరం బాల్యం నుంచి యవ్వనం, యవ్వనం నుంచి వృద్దాప్యం లోకి ప్రవేశిస్తుంది. 

ప్రతి మానవుడు యవ్వనాన్ని కోరుకుంటాడు. 

వృద్దాప్యం లోకి వెళ్ళాలని ఎవ్వడూ కోరుకోడు. 

మరి ఈ శరీరం వృద్దాప్యం లోకి వెళుతుంటే ఈ శరీరాన్ని వృద్దాప్యంలోకి వెళ్ళనివ్వకుండా యవ్వనం లోనే ఎందుకు ఆపలేకపోతున్నాడు. 

నేను ఈ శరీరం అనుకునే వాడి ఇష్టా ఇష్టాల ప్రకారం ఈ శరీరంలో ఒక్కటయినా జరుగుతోందా?

 శరీరంలో జరిగే మార్పు చేర్పులను గమనిస్తూ నా కళ్ళల్లో చూపు తగ్గిపోతోందే! 

నా మోకాళ్ళు అరిగిపోతున్నాయే! 

నా చర్మం మునుపటిలా కాంతితో కనిపించడం లేదే అని ఆశ్చర్యపోతున్నాడు గాని.. 

శరీరం యొక్క పెరుగుదలను అతడు ఆపగలుగుచున్నాడా? 

ఈ శరీరం నేను అనుకోవడం తప్ప ఈ శరీరం మన మాట ఒక్కటయినా విని ఎక్కడయినా ఆగుతోందా? 

అది ఆగనే ఆగట్లేదు. ఈ శరీరం పుట్టినప్పటి నుంచి నశించేంత వరకు దాని ఇష్ట ప్రకారం అది వెళుతోందిగాని మనం దాన్ని ఎక్కడయినా ఒక్క క్షణం పాటయినా నిలువరించగలిగామా? 

ఇదంతా బహు ఆశ్చర్యకరమయిన విషయం. 

ఏ మాత్రం మన అదుపులోలేని దానంతట అది సాగిపోయే శరీరాన్ని చూసుకుని మనం అనుకుంటున్నాం. 

ఏదయితే ఈ శరీర యాత్రను బాల్యం నుంచి వృద్దాప్యం వరకూ గమనిస్తూ మనలో ఒక సాక్షి ఉందో దాన్ని మనం చూడలేకపోతున్నాం. 

ఎంతటి దుఃఖకరం ఇది. ఈ శరీరాన్ని బాల్యం నుంచి వృద్దాప్యం దాకా చివరకు దీని పతనం వరకూ గూడా దీని యొక్క అన్ని దశలను గమనిస్తూ ఒక సాక్షి ఈ శరీరంలో ఉందో అదే మానవుని రూపం. 

మనిషి ఎప్పుడయితే ఆ సాక్షిని ఎరిగి ఈ శరీరం నుంచి తనను తాను వేరు చేసుకుని చూసుకుంటాడో అప్పుడిక ఈ శరీర పతనం అతడి పతనం కాజాలదు. 

అలా కాకుండా శరీర మోహం వదల్లేక శరీరాన్నే తగులుకుని వుండి ఈ శరీరమే నేను అనుకుంటూ శరీరం యొక్క లక్షణాలు అయిన బాల్యం, యవ్వనం, వృద్దాప్యం అన్నీ తనకే అనుకుంటూ ఆ శరీర దశలన్నీ ఎవడయితే అనుభవిస్తాడో అతడు శరీరంతో పాటు కూలిపోతాడు. 

అలా కూలినవాడు తిరిగి ఇంకో దేహం ధరించి ఈ లోకంలోకి మళ్ళీ వస్తాడు. 

మానవుడు ఎప్పటివరకు ఈ శరీరంలో వున్న “ఆత్మ” దర్శనం చేసుకోడో అప్పటి వరకూ జన్మ మరణం అనే అనుభవాలను శరీరంతోపాటే పొందుతూ ఈ లోకంలోకి రాకపోకలు సాగిస్తూనే వుంటాడు.

 ఎప్పుడయితే ఏదో ఒక జన్మలో ఈ శరీరాలతో విసిగిపోయి తనలోని వివేకం నిద్ర లేచి తాను కాని ఈ శరీర భ్రమ ను వదిలేసి తన స్వస్వరూపమయిన “ఆత్మ”ను అనుభవంలోకి తెచ్చుకుంటాడో ఇక అతడికి అదే “ఆఖరి జన్మ” అనే బ్రాంతి అవుతుంది. 

అదే మోక్షం. 

అదే “బ్రహ్మానందం”. 

అట్టి మానవుని యొక్క స్థితే “భగవంతుడు” అనే శబ్దం యొక్క అర్ధం కూడా.

చివరిగా మోక్షాన్ని పొందడానికి మానవుడు ఎలా ప్రయత్నించాలి అనేది చెప్పుకుందాం. 

ఒకడికి పట్టు వస్త్రాలు లభించలేదని ఉన్న వస్త్రాలను వదులుకోడు కదా. 

పట్టు వస్త్రాలు లభించేంతవరకూ ఉన్న వస్త్రాలను కట్టుకుంటాడు. 

అలాగే మోక్షం లభించేంత వరకూ మహా మహా జ్ఞానులకే శరీర భ్రమ కొద్ది కొద్దిగా అయినా నిలిచి వుంటుంది. 

శరీర భ్రమ ఉన్నంతవరకు ఆహరం, గృహం, నీరు లాంటివి ఎవరికయినా కావలసిందే. 

వాటికొరకు మానవుడు ప్రయత్నించాల్సిందే. 

అలా కాకుండా ఏదో సుఖాన్ని పొందాలి మరేదో సాధించాలి ఇంకేదో పొందాలి  నేను అంతటి వాణ్ని కావాలి ఇంతటి వాణ్ని కావాలి గొప్ప ధనవంతుణ్ణి కావాలి అని అనుకుంటూ ధనం కొరకు ప్రయత్నించకూడదు. 

అలాంటి భావనలన్నీ మనసులోంచి తొలగించి వెయ్యాలి. 

మోక్ష్యం లక్ష్యంగా కలిగినవాడు ధనంలేని పేదవాడయితే కేవలం ఆహారం కొరకు మాత్రమే కర్మలు చెయ్యాలి. 

శరీర లక్షణాలయిన కామం, క్రోదం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే లక్షణాలను విడచిపెట్టాలి. మోక్షం లక్ష్యంగా కలిగిన వ్యక్తికి భార్యా, పిల్లలు ఉన్నారనుకుందాం. అప్పుడు వారి ఎడల అతడు ఎలా మెలగాలి అంటే! 

వాళ్ళను రక్షించడం అతడి కర్తవ్యం కనుక ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించాలి. 

నా భార్య, నా పిల్లలు అనుకుంటూ ప్రేమ, మోహం అధికం చేసుకోగూడదు. 

గొప్పలకు పోకుండా తక్కువ ఖర్చుతో పిల్లలను చదివించడం, వారికి కూడా తనకు తెలిసిన ధర్మం, మోక్షం గురించి చిన్నతనం నుంచే తెలియచేస్తూ వారిలో కూడా ప్రపంచ మోహాన్ని తగ్గిస్తూ, ఇక వారిఎడల తన కర్తవ్యాన్ని నెరవేర్చడం కొరకు మాత్రమే ధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలి. 

మనం సంపాదించే డబ్బుని పరులు నిందించకపోవడమే ధర్మమార్గం. 

ఇక అనేక లోకులు అనేక విధాలుగా ప్రదర్శించే గొప్పలను మనమూ ప్రదర్శించాలని భావిస్తూ మనకేం అవసరమో ఎంత అవసరమో తెలీని స్థితిలోకి వెళ్ళిపోతూ ఎక్కడో ఒక అగాధంలో కూలకుండా జాగ్రత్త వహించాలి. 

మనకు చలి వేస్తె అగ్ని వద్దకు వెళ్లి తగినంత దూరంలోనే నించుని చలి తీవ్రతను తగ్గించుకుంటాం. 

అంతేగాని చలి వేస్తోందని అగ్నిలోకి దూకము గదా! 

మనకు దాహం అనిపిస్తే నది వద్దకు వెళ్లి దాహం తీరడానికి మాత్రమే కొంచెం నీరు తాగుతాముగాని నదిలోకి దూకం గదా! 

ఈ విశ్వంలో ఎంతో గాలి ఉన్నా మనకు అవసరమయినంతే పీల్చుకుంటున్నాం. 

ఇన్ని విషయాల్లో మనకు ఎంతవసరమో తెలుసుకుని అంత మాత్రమే స్వీకరిస్తున్నాం. 

కానీ ఈ ధనం దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకు అది ఎంత అవసరమో తెలుసుకోలేక శరీరం యొక్క విలువయిన ఆయుష్షు అంతా డబ్బు సంపాదించే కార్యక్రమాలకే వెచ్చించి చివరి రోజుల్లో సంపాదించిందంతా చూసుకుంటూ నేను జీవితం మొత్తం కష్టించి సంపాదించిందంతా ఎవరెవరో తింటున్నారు అని లోన ఏడుస్తూ ఒక రోజు ఈ శరీరంతో పాటు పతనం అవ్వడం జరుగుతోంది. 

ఇదంతా ఎంత విచారకరం. 

డబ్బు లేనివారికి కొంత డబ్బవసరం. 

డబ్బు ఉన్నవారికి డబ్బెందుకు? 

కాలాన్నంతా మోక్షం కొరకు ఉపయోగించుకోవచ్చు గదా? 

ఈ లోకంలోని జనులు తమ జీవితకాలమంతా చెమటోడ్చి సంపాదించిన దానిలో 99% ఇక్కడే వదిలేసి మరణంతో పర లోకాలకు వెళ్ళిపోవుచున్నారు. 

విచిత్రం ఏంటంటే 99% ఇక్కడే వదిలెయ్యాల్సిన సంపదల కొరకు మానవుడు తన జీవితకాలంలోని 99% ఆయుష్షును ఖర్చు చెయ్యడమే. 

ఇదెంతటి విచారకరం. 

మానవుడి ఈ అమాయకత్వం గమనించిన జ్ఞానులు అతడికి నచ్చ చెప్పాలని ఎంతో ప్రయత్నిస్తున్నారు.

 కానీ మానవుడికేమో ఇదంతా చెవికెక్కడం లేదు. 

అతడి దారి అతడిదే. 

అలాంటి మోహంలో వున్న వారు ధనమార్గం నుంచి “ఆత్మ” మార్గంలోకి మళ్ళాలని ఆశిద్దాం.

అలానే మానవుడు కేవలం త్యాగం వల్లనే ఆత్మను చేరుకోగలడు. 

స్వార్దబుద్ధి కలిగివున్నవారు ఆత్మలోకి ప్రవేశించలేరు. 

త్యాగం అంటే అర్ధం ఇవ్వడం. 

స్వార్ధం అంటే పొందడం. 

ఇచ్చేవాడు అన్ని బంధాలనుంచి విముక్తుడవుతాడు. 

పొందేవాడు పొందబడేవాటితో బందింపబడతాడు. 

తనలోని స్వార్ధంతో తనను తాను బంధాలలో బంధించుకునేవాడికి ఇక ముక్తి ఎక్కడిది. 

అలానే రాజ్య అధికారం, వృత్తి నైపుణ్యం ఉన్నవాళ్లు వాటిని ప్రజలకు సేవ చెయ్యడానికి మాత్రమే ఉపయోగించాలి. 

ఆ నిస్వార్దసేవ అనే త్యాగం అతడిని ఆత్మ అనే బ్రహ్మానందం వద్దకు చేర్చి అందులో అతడికి శాశ్వతమయిన స్థానాన్ని ప్రసాదిస్తుంది.

 అలా కాకుండా అనారోగ్యంతోనో లేక మరేదో కష్టంతోనో సహాయాన్ని అర్ధించి వచ్చే వారి వివశతను సొమ్ముగా మార్చుకోవడానికి ఎవరయితే ప్రయత్నిస్తారో అలాంటివారు ఈ శరీరాన్ని కోల్పోయాక నీచమయిన శరీరాలను పొంది ఎంతో దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుందని అందరూ గ్రహించాలి. 

ఎందుకంటే ఎవరి కర్మలకు వారే భాద్యులు. 

కర్మలు సత్కర్మలు కానివ్వండి లేదా దుష్కర్మలు కానివ్వండి 

ఆయా కర్మల ఫలం మాత్రం తప్పక ఆ కర్మలు చేసినవాడు అనుభవించాల్సిందే. 

ఉదాహరణకు ఒక అనారోగ్యంతో వచ్చిన రోగి వివశతను ఒక వైద్యుడు ధనం సంపాదించడానికి అవకాశంగా మార్చుకుని ఆ రోగినుంచి అధిక మొత్తాన్ని పొంది ఆ డబ్బుతో ఈ లోకంలో ఏవేవో కొన్ని సుఖాలను అతడు అతడి సంబంధీకులు తాత్కాలికంగా ఇప్పటికి మాత్రం అనుభవించవచ్చేమో! 

కానీ రోగబాధతో వచ్చిన రోగికి సేవ చేసి ఆ సేవకు తగ్గ ధనం మాత్రమే తీసికోవాల్సిన వైద్యుడు అలా చెయ్యకుండా రోగి యొక్క రోగ బాధ అనే అతడి వివశతను అతడినుంచి అధిక ధనం గుంజుకోవడానికి ఒక అవకాశంగా మార్చుకుని అధిక ధనాన్ని రోగినుంచి పొందడం అనేది పరమ పాప కర్మ అవుతుంది. 

ఆ పాపకర్మ యొక్క సంస్కారం అతడి చిత్తంలోకి వెళ్లి చేరిపోతుంది. 

ఈ లోకంలో కనిపించే పశు, పక్షి, కీటకం లాంటి అనేక ఆకారాలతో కూడిన శరీరాలు, జన్మలు అనేవన్నీ ఏర్పడింది గతజన్మలలోని ప్రాణుల కర్మలనుంచి ఏర్పడిన చిత్తంలోని సంస్కారాల వల్లే. 

మితిమీరిన స్వార్ధం, లాభం కోసం మానవుడు చేసే చెడ్డ కర్మలవల్ల చెడ్డ సంస్కారాలు అతడి చిత్తంలో చేరి పశు, పక్షి, కీటకం లాంటి జన్మలకు కారణమవుతూ ఉంటాయి. 

మానవుడు తన కపట తెలివితేటలతో అసత్యాన్ని సత్యంగా మార్చి ఈ లోకం మొత్తాన్ని అయినా నమ్మించగలడేమో గాని అతడి ఆత్మను అతడు మభ్యపెట్టలేడు. 

మానవుడు చేసే ప్రతి కర్మ యొక్క సంస్కారం నేరుగా అతడి చిత్తంలోకి వెళ్ళిపోతుంది. 

అతడు తన చెడ్డ కర్మలను కపట తెలివితో మంచివిగా మార్చి లోకాన్ని నమ్మించినట్లుగా అతడియొక్క ఆత్మను నమ్మించి ఆ పాపకర్మను పుణ్యకర్మగా మార్చి తన చిత్తంలోకి పంపించలేడు. 

కాబట్టి ఒక డాక్టర్ అయినా ఒక లాయర్ అయినా ఒక అధికారి అయినా లేక రాజ్యాన్ని పాలించే ఒక చక్రవర్తి అయినా ఒక్క నిష్కామకర్మతోనే ముక్తిని పొందగలరు. 

ఏదో భరించలేని తీవ్ర కష్టంతోనో లేక తీవ్ర అనారోగ్యంతోనో వచ్చే ప్రాణులను ఎవరయితే “నేను మిమ్ములను రక్షించగలను అధైర్యపడకండి” అని ధైర్యం చెప్పి వారికి జీవితం మీద తిరిగి నమ్మకం కలిగించి వారి రోగానికి వైద్యం చేసి వారియొక్క రోగబాధను తొలగించి ధర్మ మార్గంలో వారినుంచి వృత్తి సేవకు తగిన ధనాన్ని మాత్రమే స్వీకరిస్తారో అలాంటివారు నేరుగా మోక్షాన్ని పొందుతారు.

 అలాంటి మహా పవిత్రులకు సకల దేవతల ఆశీర్వాదాలు అన్ని సమయాలలోను ఉంటాయి. 

అలాంటి వారు చేసే పవిత్ర సేవ వారికి చెందిన పది జన్మల పూర్వీకులకు మరియు వర్తమానంలోని అతడి రక్త సంబందీకులకు ఇంకా వారినుంచి రాబోవు పది జన్మల వారికి గూడా స్వర్గలోకాలకు చేరే సౌభాగ్యం ప్రసాదిస్తుంది. 

పవిత్ర సేవకు అంతటి శక్తి ఉంది. 

ఇక పది పైసల వృత్తి సేవకు తొంబై పైసలు వసూలు చేసే నీచుల యొక్క జన్మలగురించి చెప్పాల్సి వస్తే అలాంటివారి రాబోవు నీచ జన్మలకు అంతు అనేదే ఉండదని మాత్రం చెప్పగలము. 

అలాంటి వారు ఇప్పటి ఈ శరీరం ఒకరోజు కోల్పోయాక ఆ తర్వాత జరుగబోవు తీవ్ర దుఃఖ పరిణామాలను ఇప్పటికయినా గ్రహించి ముక్తిని ప్రసాదించే త్యాగ మార్గంలోకి వెంటనే రావలసిందని జ్ఞానులు ఆహ్వానం పలుకుతున్నారు. 

కాబట్టి రాజ్యాలను పాలించే నాయకులు, వైద్యులు, అధికారులు మోక్షం మాత్రమే లక్ష్యంగా కలిగివుండి పేద ప్రజలకు, రోగులకు, అన్యాయానికి గురై న్యాయం కోసమని వచ్చేవారికి త్యాగంతో కూడిన పవిత్రసేవ మాత్రమే చెయ్యాలని ఎవరికి వారు సంకల్పించుకోగలరు. 

కర్మఫల ఆపేక్ష లేకుండా ఎవరయితే కర్మలు చేస్తారో వారే ముక్తికి అర్హులు. 

భగవంతుడు అని లోకులు పిలిచేది కూడా అలాంటి వారినే. 

అలాగే ప్రజలు కూడా తమను పాలించాల్సిన నాయకులను వారి గుణగణాలను అంచనా వేసి ఎన్నుకోవాలి. 

చెడ్డవారిని ఎన్నుకుంటే వారు చేసే పాపాలలో వారిని ఎన్నుకున్నవారు కూడా భాగం పంచుకోవాల్సివస్తుందని అందరూ గ్రహించాలి. 

రాజ్యాలను పాలించడానికి అధికారం కోసం ప్రజలవద్దకు వచ్చే వారిలో చెడ్డగుణాలు లేనివారిని ప్రజలు గుర్తించి ఎన్నుకోవాలి. 

రాజ్యంలోని ప్రకృతి సంపదను, ప్రజాధనాన్ని పేద ప్రజల కష్ట నష్టాలకు వెచ్చించకుండా ప్రజలిచ్చిన అధికారం అడ్డుపెట్టుకుని చట్టాలలోని చిన్న చిన్న లొసుగులను ఆసరాగా చేసుకుని చట్టాలకు చిక్కే అవకాశం రానివ్వకుండా ప్రజా ధనాన్ని ఎవడయితే తన సొంతం చేసుకుని తానుమాత్రమే కోట్లకు అధిపతి అవుతాడో అలాంటివాడు ప్రజలను పాలించడానికి అర్హుడు కానే కాదని అందరూ గ్రహించాలి. 

అలాంటివాడు కేవలం “దొంగే” అవుతాడుగాని “రాజు” ఎన్నటికీ కాలేడు. 

అలాంటి వాడి పాలనలో ప్రజలకు మోక్షం లభించదు. 

కాబట్టి ప్రజలు తమను పాలించే నాయకుడిని ఎన్నుకోవలసిన సమయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండి పవిత్రమయిన నిర్ణయాలు తీసికోవాల్సి ఉంటుంది. 

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెడ్డవారికి మద్దతిచ్చే బుద్ది మనలో ఉందంటే మన మనస్సు అపవిత్రంగా ఉన్నట్లే గదా! 

అలాంటి అపవిత్రమయిన బుద్ది, మనస్సుతో మనకు ముక్తి ఎలా లభిస్తుంది. మోక్షాన్ని కోరుకునేవారు తాము చేసే ప్రతి కర్మను మా కులం, మా మతం, మా ప్రాంతం, మాకేంటి లాభం అనే మోహపూరిత స్వార్ధదృష్టితో కాకుండా వివేకంతో ఆలోచించి ధర్మదృష్టితో నిర్ణయం తీసికోగలగాలి. 

మోక్షం కావాలంటే మోహం వదలాల్సిందే మరో మార్గం లేనే లేదు. అలా పవిత్ర కర్మలు చేసే పవిత్రులకు మాత్రమే మోక్షం సులభతరం అవుతుంది. 

అలాంటి పవిత్రులకు మోక్షమార్గంలో సకల దేవతల అండ కోరకుండానే లభిస్తుందని తెలుసుకోవాలి.

అలాగే మన లక్ష్యం మోక్ష్యం అయినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోని ఇతర వ్యక్తులతో గాని వారి గొప్పలతో గాని మన జీవితాలను పోల్చుకోగూడదు. 

డబ్బు సంపాదిస్తే ఏవేవో సుఖాలు లభిస్తాయి అనే కామంతో డబ్బు సంపాదించడానికి అస్సలు ప్రయత్నం చెయ్యకూడదు. 

ఈ డబ్బు నాకు కాదు.

 ఇది నా కర్తవ్యపాలన కొరకు మాత్రమే. 

నాకు కావాల్సింది ఈ ముల్లోకాలలో ఏదీ లేదు. 

నన్ను నేను దర్సించుకోవడమే నా జీవిత లక్ష్యం అని నిత్యం మనసులో భావిస్తూ వుండాలి. 

జీవిత పర్యంతం ఈ శరీరానికి ఒక్క మితమయిన ఆహారం ఇవ్వడం తప్ప మరోదాని మీద ఏమాత్రం ఆసక్తి కలగకుండా చూసుకోవాలి. 

లోక విషయాలు ఏమాత్రం మనసులోకి రానివ్వకుండా వీలైనంత మౌనంగా ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ వుండాలి. 

లోకంలోని ఏ వస్తువుతోగాని జనులతోగాని ఎలాంటి అనుబంధాలు ఏర్పరచుకోగూడదు. 

మనసులోంచి ఆశను లోకం మీద ఆసక్తిని క్రమేణా తగ్గిస్తూ రావాలి.

మోక్షం లక్ష్యంగా కలిగిన వారు పెళ్లి అయినవారు కానివ్వండి లేదా పెళ్లి కానివారు కానివ్వండి ఎవరయినా సరే “బ్రహ్మచర్యం” మాత్రం తప్పక పాటించాల్సిందే. 

అయితే పెళ్లి అనే బంధాన్ని ఏర్పరచుకున్న వారు పిల్లలకు జన్మనివ్వడం అనే లోక మర్యాదను పాటించి ఇక ఆ తర్వాత నుంచి బ్రహ్మచర్యం పాటించాలి. 

ఎప్పటివరకు అంటే.. 

ఎప్పటివరకూ అయితే ఈ శరీరం నిలిచి వుంటుందో అప్పటివరకూ బ్రహ్మచర్యం పాటించాల్సిందే. 

ఎందుకంటే సంభోగం అనేది శరీరాలను ఉపయోగించి పొందే ఆనందం. 

మోక్షం అనేది నేను శరీరం అనే భావన నుంచి బయటపడ్డ వారికే లభిస్తుంది. 

ఒక ప్రక్క ఈ శరీరాలను ఉపయోగించి ఏదో కల్పిత ఆనందం పొందుతూ మరియొక ప్రక్క ‘ఈ శరీరం నేను కాదు’ నా లక్ష్యం మోక్షం అని నాలుకతో పలికితే ‘ఆత్మానుభవం’ కలగదని అందరూ అర్ధం చేసుకోవాలి. 

“బ్రహ్మచర్యం” పాటించకుండా మోక్షం అనే స్వస్వరూప స్థితిని అనుభవంలోకి తెచ్చుకోవడం సాధ్యం కాదని అందరూ గ్రహించాలి.

అలాగే మనం ఎవరినయినా ఏదయినా ఆటలో ఓడించాలంటే అందులో వారి శక్తి ఎంతటిదో ముందే తెలుసుకుని వారికంటే అధిక శక్తిని మనం కలిగిఉండి ఆటలోకి ప్రవేశించాలి. 

అప్పుడే మనం వారిని ఏ ఆటలో అయినా ఓడించగలం. 

లోకంలో బలవంతుని చేతిలో బలహీనుడు ఓడిపోవడం అనేది అందరూ ఎరిగిన సర్వసాధారణమైన విషయమే గదా! 

కాబట్టి మనం మోక్షాన్ని గనక పొందాలనుకుంటే మరణాన్ని జయించాలి. 

మరణాన్ని జయించాలంటే మరణం కంటే శక్తివంతమయిన ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి. 

మరణం కంటే శక్తివంతమయిన ఆయుధ మేదయినా మానవుని వద్ద ఉందా అంటే అతడి వద్ద అలాంటి ఆయుధం ఒకటి తప్పక ఉంది అనేదే విస్పష్టమయిన సమాధానం. 

మానవుని వద్ద ఉన్న మరణాన్ని జయించగలిగే ఆ ఒకే ఒక్క వజ్రాయుధమే బ్రహ్మచర్యం. 

శ్రీవేద వ్యాస మహర్షి రచించిన మహాభారతకథలో పాండు మహారాజు తాను ఎప్పుడయినా ఏ స్త్రీనయినా కామంతో ముట్టుకుంటే ఆ క్షణంలోనే తను అక్కడే మరణిస్తాననే ఒక ముని శాపం తనకు ఉందని తెలిసిఉన్నా ఒకరోజు తనలో చెలరేగుతున్న కామాన్ని అదుపుచెయ్యలేని వివశతకు లోనయ్యి తన భార్య అయిన మాద్రిని ముట్టుకుని ఆ క్షణంలోనే అక్కడే కుప్పకూలి చనిపోతాడు. 

భర్త ఉద్దేశ్యాన్ని ముందే పసిగట్టిన మాద్రి భయంతో జరుగబోయే చెడును ఊహించి తన భర్త అయిన పాండు మహారాజుకు వద్దని చెబుతూ అతడి నుంచి దూరం దూరం జరుగుతున్నా అతడు అదేదీ వినిపించుకోకుండా తనలోని కామాన్ని అదుపు చేసుకోలేక ఆమె మీదకు వచ్చి మరీ ఆమెను తాకి అక్కడే కుప్పకూలి మరణిస్తాడు. 

చూసారా! ఇక్కడ మనిషి మరణానికయినా సిద్దపడ్డాడు గాని కామాన్ని మాత్రం నియంత్రించుకోలేకపోయాడు. 

అత్యంత శక్తి కలిగిన కామానికి లొంగిపోయి నేరుగా వెళ్లి మృత్యువు నోట్లో పడ్డాడు. 

ఈ సంఘటన మానవునికి తెలియజేసేది ఏంటంటే మానవుడు గనక మృత్యువును జయించాలనుకుంటే దానికంటే శక్తి కలిగిన కామాన్ని “బ్రహ్మచర్యం” రూపంలో ఒక ఆయుధంగా తనలో కలిగివుండి మృత్యువుతో ఆడబోయే చివరి ఆట కోసం సిద్దమై ఉండాలి అని. 

అప్పుడిక మృత్యువు ఓటమి ఖాయం మానవుని విజయం తధ్యం.

స్త్రీ పురుష శరీరాల మద్య జరిగే సంభోగం అనే వ్యవహారం ఈ మనస్సుకు తిరిగి అనేక జన్మలు ఈ లోకంలోకి రావడానికి అవసరమయినంత శక్తిని ఇస్తోందని జనులంతా గ్రహించాలి. 

ఈ లోకంలో మత్తుపానీయాలు, మాంసాహారం, స్త్రీ పురుష సంభోగం అనే మూడింటిని పొందడం కోసం జనులలో అనేకులు ధర్మమార్గాన్ని వదలిపెట్టి మరీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇదంతా ఎంతో విచారకరం.

శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ గౌతమ బుద్ధుడు, శ్రీ స్వామి వివేకానంద, శ్రీ షిర్డీ సాయిబాబా, శ్రీ రమణ మహర్షి, శ్రీ వెంకయ్య స్వామి లాంటి మహాపురుషులు ఇంకా లోకంలోని అనేకమంది మహాపురుషులు లోకానికి తెలియజేసింది ఏమిటి? 

ఆ మహాపురుషులంతా తమ శరీరాలను మనసు కోరుకునే తాత్కాలిక సుఖ భోగాల వైపు వెళ్ళనివ్వకుండా తమ బుద్ధి బలంతో మనసును కట్టడి చేసి ప్రారబ్దం ఉన్నంత వరకూ ఈ మానవ లోకంలో శరీరంతో ఉంటూ వారి జీవిత కాలంలో వారు గడిపిన జీవితమే లోకంలోని తక్కిన ప్రాణుల ముక్తికి ఒక మార్గంగా చూపి చివరికి ఒకరోజు వారు తమ భౌతికశరీరాన్ని త్యజించి ‘అనంతమయిన ఆనందం’ లభించే ‘ఆత్మ’ అనే స్వస్వరూప స్థితిలో ఏకమైపోయారు. 

లోకం లోని జనులు “భగవంతుడు” అని పలికేది అలాంటి జీవితాన్ని గడిపిన ఆ ఆదర్శ మహాపురుషులనే. 

“ఆ మహా పురుషులకు శతకోటి హృదయపూర్వక నమస్కారాలు”.

చూసారా..! కేవలం “విచారణ చేయకపోవడం” అనే పొరపాటు వల్లే మానవుడు ఈ “మానవజన్మ” అనే మహత్తరమయిన అవకాశాన్ని చేజేతులా వ్యర్దం చేసుకుంటున్నాడని తెలుస్తోంది గదా!

జ్ఞానులు మానవ శరీరం యొక్క పరమ ప్రయోజనమయిన మోక్షం కొరకు ఎన్నో ఉపాయాలు చెబుతున్నా కొందరిలో ఇంకా సందేహాల మబ్బులు తొలగడం లేదు. 

వారిలా అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. 

మా వద్ద పుష్కలంగా డబ్బు ఉన్నప్పుడు తినాలి అనిపించినవన్నీ తినడం, తాగాలి అనిపించినవన్నీ తాగడం, కొనాలి అనిపించినవన్నీ కొనడం, చూడాలి అనిపించినవన్నీ చూడడం, అనుభవించాలి అనుకున్నవన్నీ అనుభవించడం చేస్తే అసలు తప్పేంటి? 

ఇవన్నీ చెయ్యడం వల్ల మాకు ఆనందం కలుగుతోంది కదా! 

పోయేరోజు వచ్చినప్పుడు ఎలాగూ పోతాం.

అనుభవించినా పోతాం. అనుభవించకపోయినా పోతాం. 

మరి ఎన్నో సుఖాలు అనుభవించగలిగే స్తోమత కలిగి ఉండి ఎందుకు ఊరకే కూర్చోవాలి. 

ఎందుకని మేము మా కోరికలను చంపుకుని దుఃఖంతో జీవించాలి! 

అని అడుగుతున్నారు.

వారి ప్రశ్నలకు సమాధానం చూద్దాం.

మరణంతోనే మనిషి జీవితం గనక సమాప్తం అయ్యేట్లయితే అసలు మనిషికి ఇక దిగులు ఎందుకు ఉంటుంది?

 మీరు చెప్పినట్లే అన్నీ చెయ్యవచ్చు. 

తాగి తిని మత్తుగా ఏ చెట్టు క్రిందో నడుం వాల్చి పొడుకోవచ్చు. 

అలాగే మరణమే గనక మనిషి జీవితానికి అంతిమం అయితే అప్పుడు ఇక ఈ లోకంలోని జనులకు భయం దేనికి? 

సత్యం పలకడం ఎందుకు? 

ధర్మంగా ఉండటం ఎందుకు? 

జీవించడానికి ఎన్నో నియమాలు ఆంక్షలు ఎందుకు? 

మరణమే మానవ జీవితానికి అంతిమఘట్టం అయితే కర్మలు చేసేటప్పుడు ఇది పుణ్యం ఇది పాపం అనే భావనలు మనలో ఎందుకు కలుగుతున్నాయి? 

ఈ శరీరంతో పాటు మనిషి కూడా మరణించేట్లయితే అప్పుడు అది అందరూ పండగ చేసుకోవాల్సిన విషయమే అవుతుందిగాని దుఖించాల్సిన విషయం ఎందుకు అవుతుంది? 

ఎందుకంటే మరణం తర్వాత ఇక ఏమీ లేదు అనుకుంటే ఇక అది మోక్షంతో సమానమే గదా! 

అప్పుడు ఇక్కడెవడు ఉంటాడు. 

మరణంతో దుఃఖం మొత్తం ముగిసిపోయేపని అయ్యేట్లయితే అప్పుడు అందరూ మరణం బాట పట్టేవారే గదా. 

కానీ లోకంలో అలా జరగట్లేదే! 

మరణం అంటేనే మనిషి భయపడుతున్నాడు. 

అలా భయపడుతున్నాడు అంటే అర్ధం ఏంటి? 

మరణం తర్వాత కూడా నేను ఉంటాను అనేది అతడికి అతడి హృదయాంతరాల నుంచి తెలుస్తూనే ఉంది.

 కానీ ఎలా ఉంటానో అనేది తెలియక అతడు మరణమంటే భయపడుతున్నాడు. 

సామాన్య మానవుని బుద్ధికి ఏ మాత్రం అందని మరణం తర్వాతి పరిస్థితిని స్పష్టంగా ఎరిగినవాడే ఆత్మజ్ఞాని. మరణం అనే దశను దాటి వెళ్లి చూసిన ఆ జ్ఞానులు జనులకు చెప్పేదే ఆత్మజ్ఞానం. 

మరణంతో కేవలం ఈ శరీరం మాత్రమే నశిస్తుందిగాని అందులోని జీవుడు నశించడు అని జ్ఞానులు చెబుతున్నారు. 

ఎందుకంటే మానవుడు అంటే అనుభవాలను అనుభవించేవాడేగాని ఈ జడ శరీరం మానవుడు కాదు.

 ఇక రూపం లేని అనుభవాలకు రూపం కలిగిన ఈ శరీరం ఎన్నటికీ కారణం కాజాలదు. 

అనుభవాలన్నింటినీ అనుభవించేవాడే ఆ అనుభవాలకు కారణం కూడా. 

కాబట్టి అనుభవాలకు రూపం లేనందున వాటిని అనుభవించేవాడికి కూడా రూపం లేనట్లే గదా. 

ఇక రూపం లేనివాడు మరణించడం అనేది ఎక్కడుంటుంది. 

శరీరం అనే రూపం మాత్రమే మరణిస్తుంది. 

శరీరంలో ఉన్న రూపం లేనివాడు ఎన్నటికీ మరణించడు. 

చెట్టు, ఆకాశం ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. 

అంతమాత్రాన చెట్టు నశిస్తే ఆకాశం నశిస్తుందా? 

అదేవిదంగా శరీరం, మానవుడు ఒకటే అయినట్లుగా కనిపించొచ్చు. 

కానీ రెండూ ఒకటి కాదు. 

శరీరం నశిస్తే మానవుడు నశించడు. మానవుడు తాను ధరించిన ఈ శరీరం శిధిలం కాగానే మరొక శరీరంలోకి ప్రవేశిస్తాడు. 

మరణం అనగానే ఈ లోకంలోని మానవుడి యొక్క భయం అంతా మరణం తర్వాత రాబోవు ఆ నూతన శరీరం ఏదనేది అతడికి ఇప్పటికి తెలియకపోవడంవల్లే. 

మనసు కోరుకున్నవన్నీ మనసుకి అందించి మనసును ఆనందింపజేయడం వల్ల మనసులో కామం, క్రోదం, లోభం, మోహం, మదం, మాత్సర్యం లాంటి చెడ్డ గుణాలన్నీ ఎన్నోరెట్లు పెరిగిపోతాయి. 

మనిషి ఈ శరీరం ఒకరోజు కోల్పోయాక తన మనసులో ఉన్న సంస్కారాల అల్ప అధిక స్థాయిలను బట్టి ఆ అధిక సంస్కారాలకు అనుగుణమయిన దేహంలోకి తిరిగి ప్రవేశించాల్సి ఉంటుంది. 

అందుకనే ఈ లోకంలో జనులు సుఖాలు అనుభవించగలిగే స్తోమత కలిగి ఉన్నా అలా లేకున్నా మనసులో కామ, క్రోధాదులను అధికం చేసే ఈ  భౌతికమయిన సుఖాలలోకి మనసును ప్రవేశింపజెయ్యకుండా మనసును ధ్యాన స్థితిలో నిరంతరం నిలిపి ఉంచుకోమని జ్ఞానులు తెలియజేస్తున్నారు. 

అప్పుడు మానవునికి తిరిగి మరొకసారి మానవ దేహమయినా లభించొచ్చు లేదా మోక్షం అయినా సిద్ధించొచ్చు. 

అలాకాకుండా మనసును జీవించినంతకాలం సుఖాలలో గనక తిప్పితే పై రెండూ కూడా లభించవని జ్ఞానులు మనకు తెలియజేస్తున్నారు.

ఒకటి గమనించండి. 

కోరికలు అనేవి మానవుని మనసులో అజ్ఞానం వల్ల కలుగుతున్నాయి. 

కానీ మానవుని ఆనందానికి అతడి మనసులో కలిగే కోరికలకు ఎలాంటి సంబందమే లేదు. 

కోరికలవల్లో లేక కోరుకున్నవి లభించడంవల్లో ఆనందం కలుగడం అనేది కేవలం భ్రమ మాత్రమే. 

ఎందుకంటే ఆనందం అనేది ఆనందించేవానిలోనే ఉందిగాని బయట లేదు. 

ఈ లోకంలో ఎక్కడయినా ఆనందం అనేది బయట దొరుకుతుందా? 

దొరకనే దొరకదు. 

ఎందుకంటే ఆనందం అనేది ఒక వస్తువో మిఠాయో కాదు బయటనుంచి తెచ్చుకోవడానికి. 

మానవుని బుద్ధిలోనే ఆనందం అనేది నిండి ఉంది. 

మానవుని స్వరూపమే “ఆనందం”. 

ఆ ఆనందాన్ని మీరు పొందటానికి బయటి వస్తువులు పొందాల్సిన అవసరమే మీకు లేదు. 

ఆనందానికి మరొక పేరే మీలోని “ఆత్మ”. 

మీ పేరు ఏ ఎల్లయ్యో పుల్లమ్మో అనుకోకండి. 

మీ పేరే “ఆనందం”. 

అనంతమయిన ఆనందంతో నిండి ఉన్న మీరు ఆనందమనే మిమ్మల్ని వదిలేసి మనస్సనే మరో దానితో ఆనందం కొరకు బయటకు చూస్తూ ఏదయినా లభిస్తే మాకు ఆనందం అనుకుంటూ వాటికొరకు వీటికొరకు వెతుకుతున్నారు. 

ఇక్కడ ఇంకా చిత్రం ఏంటంటే ఆనందానికి మారు పేరయిన “ఆత్మ” అనే మీలోనుంచి ఏర్పడి మీకంటే వేరుకాని ఈ మనస్సు అసలు మీరు లేనట్లుగా అంతా తానే అయినట్లుగా ఈ లోకాలలోకి శరీరాలతో ప్రవేశించి నాకు ఆనందం కొరకు అది కావాలి ఇది కావాలి అనుకుంటూ తిరుగాడుతోంది. 

సేవకుడి చేత సేవ చేయించుకోవాల్సిన యజమాని సేవకుడికే సేవ చెయ్యడం ఎలాంటిదో మీ పరిస్థితి ఇక్కడ అలాంటిది. 

ఆత్మ కించిత్ ఆదమరచడం వల్ల ఈ మనస్సు అనేది అంతా తానే అయి సుఖ దుఃఖాలు అనే అనుభవాలను ఆత్మ స్వరూపుడయిన మానవునికి కలుగజేస్తోంది. 

అలా ఈ మనస్సు అనే దాని వెంబటి లోకాల చుట్టూ కల్పిత శరీరాలతో తిరిగి తిరిగి అలసిపోయిన ఆత్మ అనే మీరు ఒకానొక రోజు మేలుకుని నేనేంటి ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. 

ఏవేవో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను. 

ఆనందమే నేను కదా! 

మరి నాకు ఈ దుఃఖం ఏంటి? 

అసలు ఈ దుఃఖం అనే దరిద్రమంతా నాకు ఎక్కడినుంచి వచ్చింది అని గుర్తెరుగుతున్నారు. 

మీరు అలా గుర్తెరిగిన మరుక్షణం మీలోనుంచి దుఃఖానికి మారుపేరయిన ఈ మనస్సనేది మాయమైపోతోంది. 

ఒక కోటీశ్వరుడు స్వప్నంలో దరిద్రుడుగా మారి ఆకలితో అలమటిస్తూ ఆ వీధిలో ఈ వీధిలో అడుక్కుంటూ ఉండగా మెలుకువ వచ్చిందనుకో అలా! 

అలా ఆనందమనే ఆత్మ తనలో ఏర్పడిన మనస్సనే భ్రమలోంచి మెలుకువలోకి వచ్చాక తనను తాను గుర్తెరిగి 

              తన స్వస్వరూపమయిన “బ్రహ్మానందం”లో లయమైపోతుంది. 

అదే మానవునికి “మోక్షం”.

ఇప్పుడు చెప్పండి ఈ మనస్సు – కోరికలు - ఆనందం అనేదాంట్లో ఉన్న సత్యం ఎంతో..! 

మనస్సును నమ్మితే అది కొన్ని లక్షల జన్మల పాటు ఈ లోకాలు అనే భ్రమల్లో రకరకాల శరీరాలతో మిమ్మల్ని తిప్పుతూనే ఉంటుంది. 

ఎప్పటికప్పుడు అప్పటికి కలిగి ఉన్న ఈ శరీరాన్ని చూసుకుంటూ “ఇదే నేను” అనుకుంటూ జన్మ మృత్యువు అనే అనుభవాలను పొందుతూ దానితో పాటు మీరు ఈ లోకాలలో తిరుగుతూనే ఉంటారు. 

ఎప్పటికీ శాశ్వతమయిన ఆనందం, శాంతి మీకు లభించదు. 

కాబట్టి మనస్సును వదలి ఆత్మ వైపు చూడండి. 

బ్రహ్మానందం లభిస్తుంది. 

మోక్షం లభిస్తుంది. 

కోరికలను వదలడమంటే అర్ధం ఆనందాన్ని వదలడం కాదని, దుఃఖాన్ని వదలడం అని గ్రహించండి. 

మనసులో కలుగుతున్న కోరికలను ఆపగలిగితే కొన్నాళ్ళకు మనస్సు మాయమైపోతుంది. 

అప్పుడు “బ్రహ్మానందం” అనుభవంలోకి వస్తుంది. 

అదే మీ స్వరూపం.

చివరిగా...

ఈ లోకంలో భౌతికమయిన ఆనందాన్ని అనుభవించాక మనిషికి దిగులు చెందడం తప్పనిసరి అవుతుంది. 

ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనిషి అనుభవించే ప్రతి ఆనందం అనే అనుభవానికీ ఒక కారణం ఉంటుంది. 

ఆ కారణం ప్రక్కకు తొలగగానే తిరిగి దుఃఖం మొదలవుతుంది. 

మనస్సు ఈ లోకంనుంచి ఏదో కోరుకోవడం, కోరుకున్నదాన్ని పొందడం, పొందినదాన్నుంచి కొద్ది క్షణాలు కల్పిత ఆనందాన్ని పొందడం. 

ఇక పొందింది తననుంచి తొలగిపోగానే తిరిగి దుఃఖించడం. 

తేరుకుని మళ్ళీ ఇంకేదో లభిస్తే ఆనందం అనుకుంటూ మరోదానికొరకు ప్రయత్నం చేస్తూ ఉండడం. 

ఈ లోకంలో మనిషి ఈ మనస్సు వెంట నడవడం వల్ల ఇంతకంటే ఒరిగేది ఏమయినా ఉందా? 

కాబట్టి ఇదంతా చివరికి దుఃఖం కొరకే అని అందరూ గ్రహించాలి. 

ఎందుకంటే ఆనందం కొరకని మనిషి కష్టపడి ఇక్కడ పొందేదేదీ అతడికి శాశ్వతమయిన ఆనందాన్ని ఇవ్వట్లేదు. 

అనుభవించే సమయంలో కొద్ది ఆనందం.. అనుభవించడం అయ్యాక తిరిగి దుఃఖం. 

అందుకే ఈ లోకంలో పొందబడేవాటితో లభించే ఆనందం అశాశ్వతం అని గ్రహించి శాశ్వతమయిన ఆనందం కొరకు ఆత్మ వైపు దృష్టి సారించమని జ్ఞానులు మనకు చెబుతున్నారు.

 ఏ ఆనందం అయితే ఒక కారణం అంటూ లేకుండానే శాశ్వతంగా మనిషిలో అన్ని సమయాలలో ఏర్పడి ఉందో అదే ఆత్మానందం. 

అక్కడ ఇక దుఃఖానికంటూ ఎటువంటి స్థానమూ ఉండదు. 

ఆ ఆనందాన్ని మనిషి పొందాలి అంటే మనసులో కలిగే కోరికలను బుద్ధితో అదుపుచెయ్యడంవల్ల కొన్నాళ్ళకు మనస్సు ఆత్మ అనే బ్రహ్మానందంలో ఏకమైపోతుంది. 

అప్పుడు మనిషికి అకృత్రిమమయిన శాశ్వతమయిన ఆ బ్రహ్మానందం లభిస్తుంది. 

ఇంతటి సత్యాన్ని చెవికి ఎక్కించుకోనివారిని ఏ దేవుడు మాత్రం కాపాడగలడు. మనసుతో ఏదీ సంకల్పించకుండా మనసును ప్రతిక్షణం నిశ్చలంగా ఉంచుకోవాలి.

 కోరికలు అన్నీ కలిగేది మనసులోంచే గదా ఆ మనసును ఆలోచించనివ్వకుండా అడ్డుకుని నిశ్చలంగా ఉంచుకోవడం సాధన చేస్తే ఇక కోరికలు అనేవి ఎందులోంచి కలుగుతాయి? 

కోరికలు ఏర్పడే మనసును విషయ రహితం చేసి కట్టడి చేస్తే ఇక కోరికలు ఆగిపోయినట్లేగదా! 

అలాగే మీవద్దకు జనులు వచ్చి చెప్పే అనవసర లోక విషయాలు విననే వినకండి.

 మీ చెవుల ద్వారా మీ మనసులోకి ఒక్క ముక్క కూడా లోకవిషయాలను వెల్లనివ్వకండి. 

మీ నాలుకతో కూడా ఒక్క ముక్క కూడా లోక విషయాలు ఇతరులతో మాట్లాడకండి. 

మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసు అదీ ఇదీ ఆలోచించకుండా ధ్యానం లాంటి స్థితిలో మీ మనసును ఆలోచనా రహితంగా నిలుపుకుని నిశ్చలంగా ఉంచండి. 

మీరు నడుస్తున్నా, నించుని ఉన్నా, పొడుకుని ఉన్నా, తింటున్నా, స్నానం చేస్తున్నా, ఒంటరిగా ఉన్నా, వ్యక్తులతో ఉన్నా అన్ని సమయాలలో కూడా మీ మనసులో ఆలోచనలు అనేవి రానివ్వకుండా నిశ్చలంగా ఒక యోగి లాగా చూపు కలిగి ఉండండి. 

ఈ శరీరం యొక్క ఆయుష్షు ఉన్నంతవరకు మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ జీవితాన్ని గడపండి. 

ఈ అత్యద్భుత సాధన ఒకనాటికి మిమ్ములను మీయొక్క స్వీయసామ్రాజ్యమయిన ఆత్మ అనే బ్రహ్మానందసాగరంలో ప్రవేసింపజేస్తుంది. 

ఇదే సత్యం ఇదే మార్గం ఇదే మానవజన్మ లక్ష్యం. 

ఇంతకు మించిన సత్యమూ లేదు మార్గమూ లేదు లక్ష్యమూ లేదు.

మనసు కోరుకునేవి మనసుకు ఇవ్వకపోవడం వల్ల మొదట్లో మన ముఖం కొంత విచారంగా వున్నట్లు జనులు గుర్తిస్తారు. 

అంత మాత్రానికే సుఖాలన్నీ కోల్పోతున్నాం అని కొందరి మాటలు విని మళ్ళీ వాటిలోకి వెళ్ళవద్దు. 

మనసును కట్టడి చెయ్యడం వల్ల మనసు పడే బాధ ముఖంలో కొంతకాలం మాత్రమే కనిపిస్తుంది. 

కానీ లోన ఎంతో ధైర్యం పెరుగుతూ వస్తుంటుంది. 

అది మీకు మాత్రమే తెలుస్తుంది.

 ఆ దశలో మనసు భౌతికమయిన సుఖాలలోకి వెళ్ళడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తుంటుంది. 

మీరు పట్టు సడలించకుండా మనసును ఆపాలి.  

మనస్సు ప్రయత్నించి ప్రయత్నించి చివరికి బలహీనమయిపోతుంది. 

బలహీనమయి పోయిన మనసు ఒకానొక క్షణంలో ఆత్మలోకి ప్రవేశించి అందులో విలీనమైపోతుంది. 

అప్పుడు మీ ముఖంలోకి “దివ్యతేజస్సు” వచ్చేస్తుంది. 

మీ ముఖ మండలం కోటి సూర్యుల కాంతితో ప్రకాశిస్తుంది. 

ఆ తేజస్సు ను చూసిన జనులు ఆశ్చర్యపోతూ ఇతడు “భగవంతుడు” అని చెప్పుకుంటూ ఉంటారు. 

జనం అంతా మీకు నమస్కరిస్తుంటారు. 

అట్టి స్థితిలో వున్న మీకు జనుల నమస్కారాలు గానీ, కానుకలు గానీ, పొగడ్తలు గానీ అంటవు. 

ఎందుకంటే అప్పుడు మీ దృష్టిలో జనులు, వస్తువులు, పొగడ్తలు, లోకాలు ఉండవు. 

మీరు ధరించిన శరీరం దాని స్వభావం ప్రకారం అది నశించేంత వరకు  ఈ లోకంలో నిలిచి వుంటుంది. 

కానీ మీ దృష్టి మీ శరీరం మీద ఉండదు. 

మీ యొక్క కన్నులు జనులను చూస్తున్నట్లుగా, పలకరిస్తున్నట్లుగా ఉంటాయి. 

కానీ మీ దృష్టి మీ కన్నులలో ఉండదు. 

మీరు మీదయిన “మోక్షానందం”లో తేలియాడుతూ ఉంటారు. 



శుభం భూయాత్.


 ఇలాంటి అద్భుతమైన విషయాల కోసం మన www.ramkarri.org ని ప్రతీ రోజూ వీక్షిస్తూనే ఉండండీ.. 
అలాగే మీ బంధువులలో కానీ, మిత్రులలో కానీ జ్ఞానాన్నీ పెంపొందించికోవాలనే  జిజ్ఞాస తో చాలా మంది ఉంటారు. 
వాళ్ళకి ఈ వెబ్సైట్ లింక్ ( www.ramkarri.org ) ని పంపండీ.

ప్రతీ రోజూ ఇలాంటి అద్భుతాలను నేరుగా మీ వాట్సాప్ లో పొందాలి అనుకుంటే ఇక్కడ నొక్కి మీ వివరాలను పంపండీ...
అలాగే 8096339900 ని మీ జాబితాలో లో భద్రపరచుకోండి.




- స్వస్తీ...