నాయకత్వం కొరకు స్ఫూర్తినిచ్చే ఉపన్యాసావళి


◆◆◆ 

        ఎవరైతే స్వచ్చందంగా తనుచేసే పనిని సంపూర్ణ ఏకాగ్రతతో నిజాయితీగా చేస్తారో, ఎవరైతే తన శ్రేయస్సు కోసమే కాక ఇతరుల మంచికోసం కూడా ప్రయత్నం చేస్తారో వారే నిజమైన నాయకులు. 

అంతేకానీ ఇతరులమీద అధికారము చేసేవాడు నాయకుడు కాదు. 

నాయకునికి అధికారము సహజముగా లభిస్తుంది.



◆◆◆ 

             నాయకుడికి ఉండేటటువంటి మొదటి లక్షణము తను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉండటము దృడ నిశ్చయంతో ముందుకు కదలటము. 

                   తరువాత తను చేసే పనులు, మాట్లాడే మాటలు ఆలోచించే ఆలోచనలు అర్థవంతముగా, విశ్లేషణాత్మకంగా, సానుకులముగా, పదిమందికి మంచిచేసేవిగా ఉంటాయి.



◆◆◆ 

                  తను చేసిన ప్రమాణము, తను చేయదలుచు కొన్న కార్యక్రమం తను సాధించదలుచుకొన్న లక్ష్యమునకు కట్టుబడి ఉండటము అనేవి నాయకునికి ఉండే అటువంటి లక్షణాలు. 

                        అవి లేకుండా ఎంతటి అధికారంలో ఉన్న వ్యక్తి అయిన, ఎంతటి ధనవంతుడైన అతనిని నాయకుడిగా పరిగణించలేము.



◆◆◆ 

నాయకుడు చేసే పనులు పదిమందికి ఆదర్శముగా మారతాయి. అసంకల్పితంగా అందరూ అతని పనులను ప్రశంసిస్తారు అనుసరిస్తారు తను చేసే పనులను బాధ్యతాయుతంగా నిర్వహిస్తాడు. 

అనేక సమస్యలకు సమాధానాన్ని ఆచరించి చూపుతాడు.




◆◆◆ 


           నాయకుడు క్లిష్టమైన పనులను చేయడానికి దైర్యముగా ముందుకు వెళతాడు. 

తను విజయము సాదించగలను అనే నమ్మకముతో నియమబద్దుడై, బాధ్యతకు కట్టుబడి విలువలతో జీవితాన్ని గడుపుతాడు. 

తనది కాని సొమ్మును ఆశించడు. 

తన స్వార్థానికి అతీతంగా ఆలోచిస్తాడు.

తన బలహీనతలను జయిస్తాడు.

క్రమక్రమముగా తన జీవిత లక్షాలను సాధించి నూతన విధానాలను సమాజానికి పరిచయం చేస్తాడు.



◆◆◆ 

నాయకత్వ లక్షణాలున్న ప్రతి వ్యక్తీ నాయకుడే. 

అంటే నాయకులు కొంతమందే ఉండనక్కర్లేదు. 

భారత పౌరులందరూ నాయకులుగా జీవించవచ్చును. 

ఎప్పుడైతే అధికశాతం పౌరులు నాయకత్వ లక్షణాలు కలిగిఉంటారో, ఎప్పుడైతే ఎక్కువమంది దేశ సమస్యలను తమ సమస్యలుగా భావించి నిరంతరము వాటి పరిష్కార దిశగా ఆలోచిస్తారో తనంతట తానే దేశం నాయకత్వదేశంగా మారుతుంది.



◆◆◆  

                          ఏ దేశములో అయితే నాయకత్వ లక్షణాలున్న పౌరులు ఎక్కువగా ఉంటారో ఆ దేశం దిన దిన అభివృద్ధి చెందుతుంది, ధర్మము నాలుగు పాదాల నడుస్తుంది. 

ప్రజలు సుఖశాంతులతో నిర్భయముగా స్వతంత్ర భావాలతో సంతృప్తికరమైన, ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు.



◆◆◆ 

                                   తన మీద నిఘా ఉన్నప్పుడు చట్టాలకు భయపడి ఇతరులు ద్వేషిస్తారని ఎవరైనా గమనిస్తున్నారనిమంచిగా నడవటం అనేది నాయకుని లక్షణం కాదు. 

నాయకునికి ఎవరి భయము ఉండదు. 

తనే స్వచ్చందంగా ఆదర్శవంతమైన జీవితాన్ని మనసా, వాచా, కర్మణా పాటించి నడుస్తాడు. 

అతని ఆత్మ నిగ్రహానికి, ఆత్మ బలానికి, ఆత్మధైర్యానికి ఎన్నో సంక్లిష్టమైన సమస్యలు లొంగిపోతాయి. 

అసాధ్యాలు సుసాద్యాలుగా మారతాయి.



◆◆◆ 

                           నాయకుడు తనకు ప్రకృతి, దైవము యిచ్చిన అన్ని రకాల శక్తులను పరిపూర్ణమైన విశ్వాసముతో వినియోగించుకుంటాడు, గౌరవిస్తాడు, ఆరాధిస్తాడు. 

అందులోని అద్భుతాలను అనునిత్యము ఆస్వాదిస్తూ నిత్య సంతుష్టుడై, దురాశలేనివాడై, తన సమాజ ఉన్నతిని ఆశిస్తూ అందులోని చెడు లక్షణాలను తగ్గించే దిశగా సంఘటిత శక్తిని ప్రోత్సహిస్తూ పక్షపాత రహితుడై, అందరిని ప్రోత్సహిస్తూ, ప్రేమను పంచుతూ ముందుకు కదులుతాడు. 

ఆ ప్రయాణములో తనకే తెలియని దైవిక శక్తులను మేల్కొలుపుతాడు.



◆◆◆ 

                    భారతదేశానికి నాయకత్వము వహించటం అంటే భారతజాతి అనేక సంవత్సరాల నుండి అనుభవిస్తున్న జాతీయ సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించటం

                                      భారతీయులందరినీ అక్షరాస్యులుగా, తెలివితేటలున్నవారిగా, విజ్ఞానవంతులుగా, అదర్శపౌరులుగా, ఆరోగ్యవంతులుగా, నాయకులుగా మార్చే ప్రక్రియలో పాలుపంచుకోవటము. 

ఈ దిశగా రెండొవ జాతీయ ఉద్యమాన్ని ప్రభావితం చేసి నడిపించటము. అదే భారత నాయకత్వము.



శారీరక శక్తిని నిజమైన నాయకుడు ఎలా ఉపయోగిస్తాడు?


◆◆◆

                           మనిషి శరీరంలో అనంతశక్తి దాగి ఉంది. కాని అది ధైర్యవంతులకు, ప్రతిభావంతులకు, త్యాగధనులకు, యోగమూర్తులకు నిజమైన నాయకులకు మాత్రమే లభిస్తుంది. 

ఎవరి మనసైతే తాను సాధించవలసిన కార్యములపై, తాను నిర్వర్తించవలసిన భాధ్యతలపై లగ్నమౌతుందో అతనిని శారీరక బాధలు ఆపలేవు, ఆతను నిర్విరామంగా తన లక్ష్యం వైపు పయనిస్తాడు, శరీరం సహకరిస్తుంది.


◆◆◆ 

                   శారీరక సుఖాలకు బానిసైన వ్యక్తి, బలహీనతలకు చెడు అలవాట్లకు బానిసైన వ్యక్తి నిర్వీర్యుడై శారీరక శక్తి క్రమక్రమముగా నశించి, నిస్సారమైన జీవిగా మరణిస్తాడు. 

వందల కొద్ది వైద్యులు, వేల కొద్ది రూపాయలు అతనిని కాపాడలేవు. అటువంటి వ్యక్తి నిజమైన నాయకుడు కాజాలడు, ప్రక్రుతి కోపానికి గురై అధోలోకానికి జారతాడు.




◆◆◆


నిజమైన నాయకునికి తన శారీరక శక్తులను వశపరచుకోవటము, వాటిని క్రమశిక్షణతో దృడపర్చుకోవటము, వాటిని భగవంతుడు తనకిచ్చిన కానుకగా చూడటము అనే లక్షణాలుంటాయి. 

వాటిని ఆతను తన కార్యసాధనలో అర్ధవంతంగా ఉపయోగించి అజేయుడౌతాడు.



◆◆◆

                   మనముందు అనేక అబద్దపు వ్యాపార ప్రకటనలు, మనుషులను నిర్వీర్యము చేసే ఉత్పత్తులు, తాత్కాలిక ఉల్లాసాన్ని దీర్ఘకాలంలో జబ్బులను కలిగించే తినుభండారాలు చలామణి అవుతున్నాయి.

మనము బలహీనులమని, ఏ పనిని చేయలేమని మనలను మనమే తప్పు ద్రోవలో నడుపుకొంటున్నాము. 

మన నిజమైన శక్తిని మనము అంగీకరించగలిగితే ఆ దిశగా మనము ప్రయత్నము చేస్తే మన ఆత్మ చైతన్యమై అనేక విధాలుగా అభివృద్ది ఆనందము, సంతృప్తి శక్తి సామర్ధ్యాలు వస్తాయి.



◆◆◆

           మన నిజమైన శక్తిని మనము గుర్తించలేక పోతున్నాము, అభివృద్ధి చేసుకోలేక పోతున్నాము, మనలను మనము తక్కువగా అంచనా వేస్తున్నాము. 

పిరికిపందలుగా జీవించే మనుషులు, సమస్యలను అవకాశవాద ధోరణితో చూసే మనుషులు, బాధ్యతలను వదిలి వేసే మనుషులు అధికారాన్ని దుర్వినియోగం చేసే మనుషులు, తమ శారీరక దృడత్వాన్ని తెలుసుకోలేక తమకు తాము నచ్చచెప్పుకొంటూ తమ జీవిత అంతరార్థాన్ని గ్రహించలేక చరిత్రహీనులవుతారు.



◆◆◆ 

మనము ఏ విధముగా మనలను భావిస్తామో మనము అలా మారతాము. 

మన ఆత్మతో మనము మన శక్తి గురించి మనము భావించే భావనలు మన శారీరక శక్తిని ప్రేరేపిస్తాయి. 

ప్రతికూలముగా మనము భావించినపుడు అటువంటి మార్పులు సంభవిస్తాయి. 

అందుకే మన మనస్సు ఎప్పుడు పవిత్రముగా, నిస్వార్ధముగా నిభద్దతతో ఉంటే మన శారీరక శక్తులు వృద్ది పొందుతాయి.



◆◆◆

సమస్యలను వదిలి వేసేవాడు, సుఖాలు తప్ప కష్టాలను భరించలేని వాడు, దగ్గరి దారిలో అతిగా ఆస్తులను కూడబెట్టాలనుకొనేవాడు నాయకునిగా జీవించలేడు. 

నాయకుడు అవసరమైన కష్టాలు చూసి వెరవడు. 

అవసరమైన చోట తన స్వంత సుఖాలను త్యాగం చేసి మరీ తానూ చేయవలసిన ధర్మాన్ని నేరవేరుస్తాడు.



◆◆◆

                     తర్కరహితమైన నమ్మకాలు, సమాజానికి ఇబ్బందికలిగించే అలవాట్లు తెలియని ఆపదల గురించి ఆందోళన వంటి లక్షణాలు మనిషికి శాస్త్రబద్దమైన అభివృద్దికి ఆటంకము. 

నాయకుడు నమ్మకాలకు అతీతంగా ఎదిగి, అంచనాలకు అందని రీతిలో విషయాలను త్యజించి సమయస్పూర్తి కలిగిన పరిపూర్ణమైన వ్యక్తిగా జీవించి పది మందికి మార్గదర్శిగా మారి తన శారీరక ద్రుడత్వాన్ని ఇనుమడింప చేసుకొంటాడు.


◆◆◆

 సమతుల్యములేని విధానాలు, అనాలోచిత వెర్రి చేష్టలు, గర్వపూరిత ధనవంతులు, వ్యతిరేక పరిస్థితులు నాయకుని తన కర్తవ్య నిర్వహణ నుండి బయటకు తీసుకొని వెళ్ళలేవు. 

సరియైన నాయకుడు సత్కార్య నిర్వహణలో తన శరీరానికి జరిగే లేక రాబోయే ఆపదలను లక్ష్యపెట్టడు.



◆◆◆

 మన దేశాన్ని స్వతంత్ర భారత్ గా నిలబెట్టడానికి ఎంతోమంది త్యాగదనులు తమ శారీర సుఖాలను త్యాగం చేసి అసాధారణమైన శక్తిని ఆవిష్కరించారు. 

వారిలో ఉన్న ఆ బలమైన కోరిక, తాము ఒక పవిత్ర దేశాన్ని స్వేచ్చగా మార్చాలనే నిబద్దత వారిని నాయకులుగా తీర్చిదిద్దాయి. 

                 ఎంతో మంది శాస్త్రజ్ఞులు, పారిశ్రామికవేత్తలు, సంఘసంస్కర్తలు, కళాకారులు తమ జీవితంలో ఎన్నో త్యాగాలు చేయటం అనేది మనం గమనించవచ్చును. 

ఆ ఆవిష్కరణ వారిలో శారీరక శక్తి ఉత్తేజము అవటం వలన ఉద్బవించింది.



 నైతిక శక్తి నాయకుని ఎలా నడిపిస్తుంది?


◆◆◆ 

శారీరక శక్తి కన్నా నైతిక శక్తి గొప్పది. 

నైతిక శక్తి నుండి శారీరక శక్తి ఉద్బవిస్తుంది. 

తను నమ్మిన నైతిక విలువలపై అపారమైన నమ్మకమున్న మనిషి సరియైన దారిలో నడిచి అందరికి ఆదర్శంగా నిలుస్తాడు. 

అతను చేసే పనులను, సమాజ శ్రేయస్సు కోసం ఆతను చేసే ధర్మబద్దమైన పోరాటాన్ని ఆపటం ఎవరి తరము కాదు. 

అతనికి అదృశ్య శక్తులు సహకరిస్తాయి.



◆◆◆


                                స్వామి వివేకానంద చెప్పినట్లు సత్యము, పవిత్రత, నిస్వార్ధం అను మూడు సుగుణములు కలిగిన వ్యక్తి తనకు ఈ ప్రపంచం అంతా వ్యతిరేకంగా ఉన్నను తను చేసే మంచి పనులను కొనసాగించగలడు.

 అతనిలో ఉన్న నైతిక బలము అతనికి ధైర్య సాహసాలను, మానశిక శక్తిని ఇచ్చి ప్రోశ్చాహించి నడుపుతుంది.



◆◆◆ 


                         మనలో చాలామంది మంచి తనానికి రోజులు కావని, నీతికి నిజాయితీకి కాలం చెల్లిందని, నియమాలు త్యజిస్తే మనము ధనవంతులము కాగలమని అవినీతి అక్రమ సంపాదన మోసపూరిత వ్యపారాల ద్వారా అస్తులు కూడబెట్టాలని భావించి ఈ సమాజంలో సహజ న్యాయాన్ని మానవత్వ పునాదులను కదిలించ టానికి ప్రయత్నిస్తున్నారు కాని అది తాత్కాలికము. 

ఈ సృష్టికి ఉన్న ప్రాదమిక సూత్రాలు అటువంటి భావనలను పద్దతులను సమర్ధించదు అటువంటివారికి పురోగతి ఉండదు. 

కాలక్రమం లో వారు చేసిన పనికి ఫలితం చెల్లిస్తారు



◆◆◆


                                       ఎక్కడా ఏ దేశంలో లేనంతగా గొప్ప నైతిక సంపద ఉన్న పవిత్ర దేశం మనది ఈ దేశంలో ఎంతో మంది త్యాగ దనులు, నిస్వార్ధ పరులు నీతికి కట్టుబడి ఉండే నాయకులూ జన్మించి ఆచరించి ఆదర్శంగా నిలిచారు. 

అటువంటి మనదేశంలో యువత కొంతమంది పక్కదారి వైపు చూస్తున్నారు కానీ మనముందు పరిష్కరించవలసిన అనేక జాతీయ సమస్యలున్నాయి. 

ఇనుప కండరాలు ఉక్కు నరాలు, అనంతమైన పట్టుదల ఉన్న యువకులు సింహాలవలె ఈ దేశ పవిత్రతను, స్వతంత్రతను, నాయకత్వాన్ని నిలబెట్టాలి.



◆◆◆


          నిస్వార్ధమైన విలువలు మానవత్వ సిద్ధాంతాలు, తనమీద తనకు అపారమైన నమ్మకం, చేయదలచుకొన్న పనికి అంకితభావం అన్నీ కలిస్తే నైతిక శక్తి గా ఉద్భవిస్తాయి. 

అటువంటి నైతిక బలాన్ని పెంచుకొన్న వ్యక్తి, గొప్పవాడుగా ఎదిగి ఈ దేశ గమనాన్ని మార్చగలడు. 

ఈ సమాజాన్ని ఉన్నత స్థానానికి నడిపించగలడు.




◆◆◆


                                            మన ప్రజలలో కొంతమంది అనేక రకాల మూడ నమ్మకాలూ, అనాధరిత భావనలు, గొర్రెల మంద ధోరణి, అనవసర విభేదాలు, అనైక్యత, వర్గపోరాటాలు, స్వార్థ పరమైన ఆలోచనలు, మోసపూరితమైన కార్యక్రమాలు ఇలా అనేక అవలక్షణాలలో దారిద్ర్యం లోనికి తాము వెళ్లి దేశాన్ని అబివ్రుద్దికి దూరంగా నడుపుతున్నారు. 

దీనిని మార్చటానికి ప్రతిమనిషి నైతిక శక్తి, విలువలు నిస్వార్థత యొక్క దీర్ఘ కాలిక ఫలాలను వివరించి, ఆచరింప చేసి ప్రతి ఒక్కరిని నాయకునిగా మార్చవచ్చు.



◆◆◆

 నైతిక శక్తి ఉన్న వ్యక్తికి ప్రపంచంలో ప్రతి వ్యక్తి తన సోదరునిగా సోదరి లాగా అనిపిస్తుంది. 

వారియొక్క సంక్షేమమానికి గాని, మనస్సుకి గాని నష్టము కలిగే పని చేయలేడు, 

ఆవిధంగా అతను సర్వత్రా ఆమోదయోగ్యంగా మారతాడు. 

తన మనసులో ఎటువంటి విభేదాలు ఉండవు 

దుటివారు తనకంటే తక్కువ అనే ఆలోచనలు ఉండవు. 

ముందుకు నడుస్తూనే ఉంటాడు. 

ఈ సృష్టి లో సకల జీవరాసులు అతనికి సమంగా కనిపిస్తాయి. 

అపుడు అతనికి ఈ ప్రక్రుతి తన అద్వితీయ శక్తులను అందిస్తుంది.

 ఆ బలముతో అతను గొప్ప నాయకునిగా మారతాడు, కొనియాడబడతాడు.



◆◆◆


                      తమకు ఎదురైన కష్టాలను, తమను వ్యతిరేకించే వారితో, అనుకోని ఆపదలలో, తమ ఆస్తులకు, దనానికి పొంచివున్న ప్రమాదములో కూడా నైతిక విలువలున్న వ్యక్తి అత్యున్నతమైన స్పందన చూపిస్తాడు.

 ఎపుడైతే అటువంటి స్పందన అతనిలో కనబడుతుందో ఆతను నిజమైన నాయకునిగా ఎదుగుతాడు. 

నైతిక శక్తి అతనిని క్రుంగి పోనీయదు, పారిపోనియదు, దగ్గరిదారులలోనికి వెళ్ళనీయదు. 

తనకు మార్గదర్శకముగా నిలిచి ముందుకు నడిపి సమస్యలను దైర్యముగా ఎదుర్కొనే విదముగా చేస్తుంది. 

ఆ ప్రయాణములో అతని వ్యక్తిత్వం గుర్తించబడుతుంది.



◆◆◆


          నైతిక విలువలను స్వచందంగా, నియమబద్ధంగా పాటించ వలసి ఉంటుంది. 

అవి ఎవరూ మన మీద బలవంతముగా రుద్దలేరు . 

మనిసి తనకు తాను ఆహ్వానించి పాటించ వలసినవి. 

అవి ఇతరులకు కనిపించవు. 

మన మనస్సు వాటి ఎడల అపార విశ్వాసము కలిగి వుండాలి. 

మనల్ని మనమే నియంత్రించు కోవాలి. 

కొంతకాలము ఆచరణ తరువాత మనిషి వాటిలోని అధ్బుత ఫలితాలను చూడటము మొదలు పెడతాడు. 

అయాచితంగా తనకు లబించే కీర్తి ప్రతిష్టలను చూసి అది తను పాటించిన నీతి నియమాల పలితమని గుర్తిస్తాడు.

ఈ విధంగా ముందుకు కదిలినప్పుడు వ్యక్తి నాయకునిగా ఎదుగుతాడు.


◆◆◆


                మనము ఎన్ని పోలీసు స్టేషన్లు పెట్టినా, ఎన్ని చట్టాలు చేసినా , ఎంతమంది అధికారులను నియమించినా, మనుషులు నైతికంగా వుండాలని అనుకోకపోతే నేరాలను ఆపలేము.

అందుకే నైతిక శక్తి విలువ,అది ఏవిదంగా తన జీవితాన్ని స్వర్ణమయం చేస్తుందో , దాని వలన జీవితములో నాయకత్వాన్ని ఎలా సాదించవచ్చో వివరించి స్పూర్తి కలుగ జేసి , ఆచరించే విధంగా ప్రోత్సహించాలి. 

అటువంటి గుణాలను సర్వత్ర వ్యాపింప చేయాలి.

అప్పుడు గొప్ప నాయకులు తయారౌతారు.




 మానసిక ఉత్తేజము ద్వారా మార్పు సాధించి నాయకునిగా ఎదగటం ఎలా?




◆◆◆ 


మనిషి శక్తులు అన్నింటిలోనికి అత్యంత శక్తివంతమైనది మానశిక శక్తి. 

మానశిక శక్తిని ఉత్తేజము చేయటము ద్వారా తమలో పేరుకొనిఉన్న బలహీనతలను మనిషి జయించగలడు. 

మార్పు చెందటము అనేది మనలో ఉన్న అద్వితీయ ఆత్మశక్తిని మేల్కొల్పటం ద్వారా సాధ్యం.




◆◆◆

ఎటువంటి విపత్కర పరిస్తితులనైనా, మన దేహములో ఎటువంటి సమస్యలనైనా మన చుట్టూ పేర్కొని ఉన్న ఎన్ని విధివిపరీతాలనైనా ఎదుర్కొని, ఎదిగి సాధించి నిలబడగల శక్తి మనిషికి మానశిక శక్తి ద్వారా వస్తుంది.

ప్రతికూల ధోరణి, పగ, ప్రతీకారము, అసూయలను గొప్ప మానశిక శక్తి కలవారు జయించి సమస్యల పరిష్కారము వైపు పయనిస్తారు. 

నాయకులుగా ఎదుగుతారు.



◆◆◆

పనికిరాని పాతబడ్డ అలవాట్లను, 
మనకు హాని చేసే మన ప్రవర్తనను వదిలి

 క్రొత్త వ్యక్తిత్వాన్ని సాధించటానికి చెందే మార్పుతో, 

మన ముందున్న పరిస్థితులను ఆహ్వానిస్తూ,

విశ్లేషనాత్మక ధోరణితో ముందుకు సాగటము ఎదురుగా ఉన్న అవకాశాలను అనుకూలముగా మార్చుకుని

తన సమాజానికి మేలు చేసే దిశగా ప్రయత్నించే వ్యక్తికి మానశిక శక్తి తోడ్పడుతుంది.



◆◆◆

              మన మెదడు అనంతమైన ఆలోచనలకు, భావనలకు, పట్టుదలకు, ఆత్మవిశ్వాసమునకు, ఊహలకు, పరిష్కారాలకు, నూతన మార్గాలకు నిలయము. 

మానశిక ఉత్తేజము అంటే మన మెదడుని స్వాదీనములోనికి తీసుకుని దానిలో సంభవించే, ఉద్భవించే ప్రక్రియను నియంత్రించటము.

 అలా చేయగలిగిన మనిషి తను అనుకున్నది సాధించగలడు,.

తన దేహసంపదను సక్రమంగా వినియోగించగలడు.

 ఇతరులకు కూడా మేలు చేయగలడు.



◆◆◆

                         మనకి ఎవరో సహాయము చేయాలి, మనలను ఎవరో కాపాడాలి, మనలను ఎవరో మార్చాలి అని భావిస్తూ నడవటము వ్యర్ధజీవుల లక్షణము. 

సహాయము ఎక్కడనుంచో రాదు. 

అది మనలోనుండే ఉద్భవించాలి. 

మనకు మనమే నిజమైన సహాయము చేసుకోగలము. 

మనకు మనము సహాయము చేసుకోలేనపుడు వేరెవరూ సహాయము చేయలేరు. 

మనము మన మానశిక శక్తిని ఉపయోగించగలిగినపుడు అనుకున్నది సాధించగలుగుతాము. 

అందరూ మెచ్చుకునే నాయకునిగా ఎదుగుతాము. 

మనము నడిచే బాట ఆదర్శముగా మారుతుంది.



◆◆◆

 మనిసి ఉన్నతికి అతని పనులే కారణం.

 అతని అభివృద్దికి తను తీసుకున్న నిర్ణయాలే కారణం.మన నిర్ణయాల నాణ్యత మన మానసిక శక్తి మీద ఆధారపడి ఉంటుంది. 

మన గమ్యానికి మనమే భాద్యులము.ఈ విషయాన్ని గుర్తించి నిరంతరమూ మనల్ని మనం ఉత్తేజపరచుకుంటూ, ప్రేరణ పొందుతూ, ప్రోత్సహ పరచుకుంటూ మన ముందున్న అనేక సమస్యలను జయించ వచ్చును, గొప్ప విషయాలను సాదించ వచ్చును.


◆◆◆

        అర్ధము లేని భయాలతో , ఆందోళనలతో, ఏమీ చేయలేమనే నిరాశతో అనేక అవసరమైన పనులను మనము చేయకుండా అదృష్టాన్ని నిందిస్తూ పరిస్థితులను దూషిస్తూ, నిరర్ధకమైన సంభాషణలతో జీవితాన్ని గడుపుతారు కొందరు. 

సోమరితనము, నిరాశ ,నిస్పృహ,పిరికితనము మొదలైన గుణాలు వారి వ్యక్తిత్వంలో కలిసిపోయి ఇంక ఎమీ చేయలేమని భావిస్తూ జీవిస్తారు.

కానీ తమలోనే దాగి ఉన్నపరిష్కారాన్ని ,మానసిక ఉత్తేజాన్ని తెలుసుకోలేరు.ఆ అమృత ప్రవాహాన్ని గుర్తించినప్పుడు వారు నాయకత్వ లక్షణాల్ని పొందుతారు.



◆◆◆

                          మనిషికి అలవాట్లు , ఆలోచన సరళి, ప్రవర్తన తన జీవిత అనుభావాలనుండి, తను స్పందించిన విధానమునుండి వస్తుంది.

తను తెలుసుకోలేనంతగా అందులో కూరుకు పోతాడు.

జీవితములో సంభవించే కష్టాలను అతి పెద్దగా తీసుకొని తనే స్వయముగా తన సమస్యలను పరిష్కరించు కోవచ్చునని, తన మానసిక శక్తిని ఉపయోగించు కోవచ్చునని తెలుసుకోనలేక తనను తాను భాలహీనునిగా భావిస్తూ జీవితాన్ని గడుపుతాడు. 

మానసికంగా ఎదిగే వ్యక్తి ఈ శక్తిని నిరంతరము ఉత్తేజము చేసుకుంటాడు.

తనకున్న అనేక రకమైన సమస్యలను క్రమబద్దమైన కృషితో అధిగమిస్తాడు.


◆◆◆


                             మానసిక శక్తి వున్న వ్యక్తి దాని ఉత్టేజముతో నిరంతరము ప్రేరణ పొందుతూ తనకు జరిగే అవమానాలను సైతం పొగడ్తలుగా మార్చుకోగలడు. 

తనను అవమానించాలని ప్రయత్నించే మనుషులు సైతం పరివర్తన చెందే విధంగా తన ఓర్పు , నిబ్బరం, ప్రవర్తన, సమాధానము వుంటాయి.

అతనిని వ్యతిరేక శక్తులు జయించలేవు.తన ఉన్నత మైన ఆలోచనలతో మళినము అంటని వజ్రములా మెరుస్తాడు.


◆◆◆

               నాయకునిగా ఎదగాలనుకున్న వ్యక్తికి బలహీనతలు , దురలవాట్లు , అత్మ న్యూనత, అధైర్యము ఉండరాదు.

వాటిని జయించటానికి తాను కష్టమైన మార్పు పొందే ప్రక్రియను చేపట్టాలి.

ఆ మార్పును పొందటానికి తాను నిరంతరం మానసిక శక్తిని ఉత్తేజ పరచుకోవాలి.

తనకు ఎదురైన కష్టాలను, విమర్శలను తాను పైకి ఎక్కటానికి ఉపయోగపడే నిచ్చెనగా మార్చుకొని ఎదుగుతూ సాగాలి.

అనుక్షణం తనతో తాను పోరాడాలి, బలపడాలి, సాధించాలి.





- రామ్ కర్రి


- స్వస్తీ...


__ ____ ____ ___ __ ___ ___ ___ ___ ___ __ __ ___ ___ ___ 

ఓం
మీ యొక్క విరాళం ధర్మ కార్యానికి శ్రీకారం

మీ యొక్క అమూల్యమైన  విరాళాలను Google Pay, Phone Pay, Amazon, Paytm ద్వారా 8096339900 కి పంపించండీ.
 మీ యొక్క అమూల్య మైన విరాళాన్ని అందించడం ద్వారా ఈ ధర్మ కార్యం మధ్యలో ఆగకుండా చూడండీ...

విరాళం అందించాలనే సమయంలో ఏవయినా సమస్యలు తలెత్తితే ఈ నెంబర్ 8096339900 పైన నొక్కి వాట్సాప్ కి సందేశం పంపండీ...



__ ___ ___ ___ ___ ధర్మో రక్షతి రక్షితః __ __ ___ ___ ___