ప్రపంచ సాహిత్యానికి భారత దేశం అందించిన గొప్ప రచనలలో ఎన్నదగినది పంచతంత్రం . 

క్రీ. శ. 5 వ శతాబ్దంలో విష్ణుశర్మ అనే గురువర్యుడు సంస్కృత భాషలో రచించిన ఈ గ్రంధం ఎన్నో ప్రపంచ భాషలలోకి అనువదింపబడి, ఎంతో ప్రాచుర్యం పొందింది. 

తన వద్ద నేర్చుకోదలచిన విద్యార్ధులకు పాఠ్యగ్రంధంగా ఈ పుస్తకాన్ని ఆయన రచించాడు.

ఐదు భాగాలుగా విభజించిన ఈ పుస్తకం అనేక చిన్న చిన్న కథల సమాహారం. 

మానవ జీవితంలో అవసరమైన ఎన్నో ధర్మాలను, నీతి సూత్రాలను చక్కటి కథల రూపంలో, ఆసక్తికరమైన కథనంతో విష్ణుశర్మ బోధించాడు.పంచతంత్ర నేపథ్యం

        దక్షిణ భారతాన మిహిలారోప్యము అనే రాజ్యానికి అమరశక్తి రాజు. 

ఆతనికి బహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి అని ముగ్గురు కొడుకులు. 

ఆ ముగ్గురు చదువు సంధ్యలు లేక మూర్ఖుల వలె తయారయ్యారు. 

ఎంత ప్రయత్నించినప్పటికీ వారికి చదువుపై శ్రద్ధ కలుగలేదు. 

మనోవేదన చెందిన రాజు తన బాధను మంత్రుల వద్ద వ్యక్తపరచి తరుణోపాయం సూచింపుమన్నాడు. 

ఒక మంత్రి విష్ణుశర్మ అనే గురువు గురించి చెప్పి అతనికి రాకుమారులను అప్పగింపుమని సలహా ఇచ్చాడు.


రాజు విష్ణుశర్మను పిలిపించి, రాకుమారుల చదువు విషయమై తన వేదనను వివరించి, ‘నా బిడ్డలకు విద్యా బుద్ధులు నేర్పండి, మీకు తగిన పారితోషికం ఇస్తాను’ అని అన్నాడు. 

విష్ణుశర్మ బదులిస్తూ ‘నేను విద్యను అమ్ముకోను, నీ బిడ్డలను నీతిశాస్త్ర కోవిదులను చేస్తాను, నాకే విధమైన పారితోషికం అవసరం లేదు’ అని చెప్పి రాకుమారులను తీసుకొని వెళ్ళాడు.

వారికి బోధించదలచిన పాఠ్య ప్రణాళిక ప్రకారం కొన్ని కథలను స్వయంగా రచించి, బృహత్కథ నుండి కొన్ని కథలను గ్రహించి, పంచతంత్రమును రచించాడు. 

ఆ కథలను వారికి చెప్పి, నీతిని బోధించి ఆరు నెలలలో వారిని నీతిశాస్త్ర కోవిదులను చేసి, రాజుకిచ్చిన మాటను చెల్లించుకున్నాడు.


పంచతంత్ర విశిష్టత 

                        విషయ పరిజ్ఞానం, బోధనా సామర్థ్యం, చక్కని పాఠ్య ప్రణాళిక ఉంటే, చదువంటే ఇష్టము, ఆసక్తి లేని వారికి కూడా బోధించి విద్యావంతులను చెయ్యవచ్చని 5 వ శతాబ్దం లోనే విష్ణుశర్మ నిరూపించాడు.

 1500 సంవత్సరాల నాటి ఈ రచన ఈ నాటికీ ప్రతి సమాజానికీ అనుసరణీయమే, ఆమోదయోగ్యమే! అదే పంచతంత్రం యొక్క విశిష్టత.

          పంచతంత్రం 5 విభాగాల, 69 కథల సంపుటి. 

కథలలోని పాత్రలు ఎక్కువగా జంతువులే

పాత్రల పేర్లు వాటి మనస్తత్వాన్ని, సహజ ప్రవృత్తినీ, నడతను సూచిస్తూ ఉంటాయి. 

కథనం సరళంగా ఉంటూ, సామెతలు, ఉపమానాలను గుప్పిస్తూ, ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. 

సమాజం గురించి, వ్యవస్థ, మనుష్య ధర్మం గురించిన ఎన్నో విషయాలు కథలలో మిళితమై వస్తాయి. 

పంచతంత్రం ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం.
తెలుగు అనువాదాలుపంచతంత్రం 5 విభాగాలుగా ఉన్న చక్కని ఆకృతి గల రచన.


ప్రతీ విభాగానికి ఒక విశిష్టమైన, విలక్షణమైన లక్ష్యం కనపడుతుంది.


విభాగాల పేర్లు, ఒక్కొక్క దానిలోని కథల సంఖ్య ఈ విధంగా ఉన్నాయిమిత్ర లాభము - ( మిత్రుల వలన లాభములు )


మిత్ర భేదము  - ( మిత్రుల మధ్య భేదములు )


అపరిక్షితకరకం -( అనాలోచితంగా వచ్చే నష్టాలు )


లబ్ద ప్రణాసం - ( ఏ నష్టమూ లేకుండా ప్రమాదాల్లోంచి బయట పడటం )


కాకోలు కీయం - ( యుద్ధము - శాంతి, బలమైన శత్రువుని ఓడించే పథకాలు )


మొదటి నాలుగు భాగాలలో జంతువులు, పక్షులు ప్రధాన పాత్రలు కాగా, ఐదవ దానిలో మనుషులు ప్రధాన పాత్రలు.


ఒక చిన్న పరిచయం మినహా. - ఈ కథ రచయిత విష్ణుశర్మ రాకుమారులకు వివరిస్తున్నట్లు నడుస్తుంది.


దీనిలో ప్రతీ భాగం ఒక ప్రధాన కథని కలిగి ఉంటుంది.


దీనిలో ఒక పాత్ర , మరొక పాత్రతో కథ చెబుతున్నట్లు పలు పిట్ట కథలు ఉంటాయి.


తెలుగులో అయిదు అనువాదాల వరకు వచ్చిన్నట్లు తెలుస్తుంది.వాటి రచయితలు


బైచరాజు వేంకటనాథుడు

దూభగుంట నారాయణ కవి

పరవస్తు చిన్నయసూరి

వేములపల్లి ఉమామహేశ్వరరావు

కందుకూరి వీరేశలింగం పంతులుచిన్నయసూరి తన అనువాదనికి నీతి చంద్రిక అనే పేరు పెట్టారు. 


తెలుగు లో ప్రసిద్ధి చెందిన అనువాదం ఇదే.


కానీ ఈ అనువాదం పంచతంత్రాన్ని కాక నారాయణుడి హితోపదేశాన్ని అనువాదించినట్లుగా ఉంటుంది.


పరవస్తు చిన్నయసూరి నీతి చంద్రికను రెండు భాగాలను మాత్రమే రచించగా, మిగిలిన భాగములను కందుకూరి వీరేశలింగం పంతులు గారు రచించారు.


తెలుగు సాంప్రదాయంగా విరామ చిహ్నాలు లేకుండా సాగిన వేములపల్లి ఉమామహేశ్వరావు గారి అనువాదం కూడా చదవదగ్గది.ప్రపంచ దేశాల్లో అనువాదాలు 

ఈ రోజుకి మనకి తెలిసినంతవరకు, క్రీ.శ. ఆరవ శతాబ్దం నుంచి మొదలుపెట్టి మన పంచతంత్రం కనీసం యాభై ప్రపంచ భాషల్లోకి అనువదించబడిందట. 

పంచతంత్ర కథలు అనేక దేశాల సంస్కృతుల్లోనూ, కథా సాహిత్యంలోనూ కలిసిపోయి, ఆయా దేశాల సామాన్య ప్రజల నోళ్ళలో నాని, వాళ్ళ ప్రాంతీయమైన రంగు, రూపు, వాసనల్ని పొంది, చివరికి ఆ ప్రాంతాల కథలుగానే ఇప్పటికీ చెలామణీ అవుతున్నాయట

              పాశ్చాత్య కథా సాహిత్యం మీద పంచతంత్రం ప్రభావం అపారమని చాలామంది పండితులు అభిప్రాయ పడుతుంటారు.

పంచతంత్రం క్రీ.శ. ఆరవ శతాబ్దంలో పహ్లవీ (పర్షియా) భాషలోకి అనువదించబడిందనీ, అదే తర్వాత సిరియన్ భాషలోకి, సిరియన్ అనువాదం ఖలీల్ వదిమ్న అన్న పేరుతో అరబ్బీ భాషలోకి అనువదించబడిందని తెలుస్తోంది. 

అరబిక్ పంచతంత్రం తర్వాత శతాబ్దాల్లో గ్రీకు, లాటిన్, హిబ్రూ ల్లోకి అనువాదం చెయ్యబడింది. 

ఆ తర్వాత క్రమంగా అనేక యూరోపియన్ భాషల్లోకి కూడా అనువాదాలు వచ్చాయట.

 ఏషియా, యూరోపు, ఆఫ్రికాలో కూడా పంచతంత్ర కథలు వ్యాపించాయని ప్రతీతి.

గ్రీకుభాషలోని ఈసప్ కథల్లోనూ, అరేబియన్ నైట్సులోనూ కూడా పంచతంత్ర కథలు కలిసిపోయాయని రచయితలు అభిప్రాయపడ్డారు.

 అయితే పంచతంత్ర కథలకి మూలం గ్రీకు కథలని కూడా వాదాలు ఉన్నాయి.

 భారత, గ్రీకు సంస్కృతుల మధ్య జరిగిన ఆదాన, ప్రదానాల్లో ఇక్కడి కథలు అక్కడికీ, అక్కడి కథలు ఇక్కడికీ వెళ్ళి ఉండచ్చని కూడా ఒక ఊహ.


పంచతంత్రం ధారావాహిక

         పంచతంత్రం ధారావాహికగా తెలుగులో ప్రచురించిన ఘనత చందమామ పత్రికకు దక్కింది. సరళమైన తెలుగులో, ఆకర్షణీయమైన బొమ్మలతో కొన్ని సంవత్సరాల పాటు, పంచతంత్రం ధారావాహికగా ప్రచురించారు.ఇంతకు ముందే ప్రస్తావించినట్లుగా… ఒక ప్రాంతానికి, ఒక కాలానికి పరిమితం కాని, చిరస్థాయిగా నిలిచిపోయే సార్వత్రిక విజ్ఞానం పంచతంత్ర కథలు..

ఆద్యంతం జంతువుల పాత్రలతో సమాజం గురించి, వ్యవస్థ, మనుష్య ధర్మం గురించిన ఎన్నో విషయాలను మానవజాతికి సుబోధకం చేసిన ఇప్పటికీ చేస్తున్న అపూర్వ కథా సాగరం పంచతంత్ర కథలు.మానవాళికి నా విన్నపం తల్లిదండ్రులారా!  


            పంచతంత్ర కథలను మీ పిల్లలకు తప్పక పరిచయం చేయండి. 


ఓ అరగంటైనా వారితో కూర్చుని పంచతంత్ర కథలను చదివించండి.. 


చదివి వినిపించండి.- రామ్ కర్రి