పుస్తకం తరాల మధ్య వారధీ.

జ్ఞానాన్ని పంచే నిధీ.

అక్షరాలను తనలో అందంగా దాచుకున్న తరగని గని.

‘పుస్తకం’.. తోడు నిలిచే నేస్తం.

పదాలతో పలుకరించే నేస్తం.

సకల విద్యలను నేర్పే గురువు,

స్ఫూర్తినిచ్చే వ్యక్తి,

పుస్తకం ఆనందాన్నిస్తుంది.

అలవాట్లను మారుస్తుంది.

వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది.

జీవితానికి మార్గనిర్దేశం చేస్తుంది.

జీవితం చీకట్లు కమ్మేసినప్పుడు దీపమై దారి చూపుతుంది.

అందుకే..

‘మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు..

సొంత పుస్తకం మంచి మనిషికి మరో తోడు..’

పుస్తకం మనిషి జీవితంలో విడదీయరాని భాగం.

ఒక్క సిరా చుక్కతో కోటిమందిని ఆలోచింపచేస్తుంది.

ప్రపంచాన్ని మన ముందు నిలబెడుతుంది.

పుస్తక పఠనంతో మనిషి మేధస్సు పెరుగుతుంది.

వీసా లేకుండా ప్రపంచాన్ని చుట్టి రావాలంటే అది కేవలం పుస్తకంతోనే సాధ్యం.

పుస్తకం చరిత్రను చెపుతూ భవిష్యత్‌ను గుర్తుచేస్తుంది.

పుస్తక పఠనం వల్ల విజ్ఞానం పొందటమే కాకుండా.

మానసిక ఉల్లాసం కూడా పెరుగుతుంది.

మనిషిని మనిషిలా వుంచుతుంది.

కోపం వచ్చినప్పుడు పుస్తకం చదివితే మనకు తెలియకుండానే కోపం పోతుంది ఇది నిజం.

మనసునున్న బరువును తొలగిస్తుంది.

అజ్ఞానాంధకారాన్ని నిర్దాక్షిణ్యంగా నిర్జిస్తుంది.

ఒంటరి వేళ జంటగనుండి సమయ సద్వినియోగము చేయిస్తుంది.

మస్తిష్కాలను మధించి శోధించి మేధను నిశిత పరుస్తుంది.

మానవ ప్రజ్ఞా పాటవాలకు నిలువెత్తు సాక్ష్యంగా భావి తరాల ఎదుట నిలస్తుంది.

భగవంతుని తనలో పవిత్ర గ్రంథరూపాలలో నిక్షేపిస్తుంది.

చందమామ కథలను తనలో ప్రకటించుకొని బుజ్జి పాపాయిని నిద్రపుచ్చుతుంది.

బ్రతకడం కంటే జీవించడమంటే ఏమిటో నేర్పిస్తుంది.

ప్రశ్నించడమెందుకో నేర్పిస్తుంది.

చివరి గడియలలో గీతను దగ్గర చేసి దివిసీమలో మన తలరాతల మార్చుతుంది.

ఆస్తులు కరిగిపోవచ్చు.

ధనం దొంగలపాలు కావచ్చు.

అనుబంధాలు చెరిగిపోవచ్చు...

కానీ, విజ్ఞానం అలా కాదు...

ఒక్కసారి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే...

తనువు అంతమయ్యేవరకు అది జీవితాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది.

అంతేకాదు...

చోరులకు దొరకనిది.

అగ్నికి అంటనిది.

నీట మునికి కనుమరుగు కానిది విజ్ఞానం ఒక్కటే...

అంతటి మహోన్నత విజ్ఞానాన్ని పళ్లెంలో పెట్టి అందించేదే ‘పుస్తకం’...

అందుకే " పుస్తకం హస్తభూషణం " అంటారు పెద్దలు...


మంచితనాన్నీ మానవత్వాన్నీ మనసులో నింపే నిజమైన నేస్తం లాంటి పుస్తకాల్ని చదవాలని అందరికీ ఉంటుంది. 

కానీ ఆర్థిక స్తోమత కొందరికే అనుకూలిస్తుంది. 

మిగిలినవారు ఆ అదృష్టానికి నోచుకోలేదని బాధపడకుండా పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తేవడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఆ క్రమంలో తెలుగు గ్రంథాలయాన్ని స్థాపించి మంచి మంచి పుస్తకాలను , విలువయిన పుస్తకాలను పిడిఎఫ్ రూపంలో కొన్ని వేల మందికి పుస్తక రూపంలో అందించడం జరుగుతుంది.

మీకు ఏదయినా పుస్తకం పిడిఎఫ్ రూపంలో కావాలి అనుకుంటే 8096339900 లో సంప్రదించండి.

                    ఆటలలో గెలుపొందిన వారికి మరియు కొన్ని ముఖ్య దినోత్సవాలలో అనగా పుట్టిన రోజు , పెళ్ళి రోజు ఇలాంటి రోజులలో అనవసరపు బహుమతులకు బదులుగా మంచి పుస్తకాలను బహుమతి గా ఇస్తే చాలా బాగుంటుంది.  

అప్పుడు వాళ్ళు కూడా చాలా ఆనందించి,  మీ గుర్తుగా ఉంచుకోవడమే కాకుండా వాళ్ళకు చదవాలనే అభిప్రాయం కలుగుతుంది, తద్వారా వాళ్ళకి కూడా మంచి భావనలను కలిగించిన వాళ్ళము అవుతాము మరియు వాళ్ళ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళము అవుతాము.


- రామ్ కర్రి





- స్వస్తీ...